English | Telugu

బాలయ్య ముందు నాన్సెన్స్ చేసిన న్యూసెన్స్ వెబ్ సిరీస్ టీం!

ఆహాలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్-2 రోజు రోజుకి క్రేజ్ ని సంపాదించుకుంటుంది. ఈ షో గతవారం జరిగిన ఎపిసోడ్ లో రౌండ్ లో లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ ఒకరు ఎలిమినేట్ అవగా.. ఈ వారం సరికొత్తగా ప్రారంభమైంది.

సింగర్ హేమచంద్ర యాంకరింగ్ చేస్తూ తమన్, సింగర్ కార్తిక్, గీతా మాధురి జడ్జెస్ గా చేస్తున్నారు. కొత్త ట్యాలెంట్ ని వెతికితీస్తూ పాటలకు ప్రాణం పోస్తున్న ఈ షో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మొన్న జరిగిన ఎలిమినేషన్ కి అయిదు లక్షల ఓట్లు వచ్చాయని హేమచంద్ర చెప్పాడు. దీంతో ఈ షోకి విశేష స్పందన లభిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతవారం మ్యూజిక్ మాంత్రికుడు కోటి గెస్ట్ గా రాగా.. ‌ఈ వారం నట సింహం నందమూరి బాలకృష్ణ వచ్చాడు. దీంతో సింగింగ్ షో కాస్త అన్‌స్టాపబుల్ గా మారింది.

అయితే ఈ‌ షోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని హేమచంద్ర చెప్పడంతో.. మరి ఇంకెందుకు లేటు పిలవండని బాలకృష్ణ చెప్పడంతో.. హీరో నవదీప్, హీరోయిన్ ‌బిందుమాధవి ఇద్దరు కలిసి వచ్చారు. వీళ్ళా పాడేదని బాలకృష్ణ ఆశ్చర్యపోయి.. సరే పాడండని చెప్పగా.. శృతి తప్పిన రాగంతో పాడాడు నవదీప్.. ఆ తర్వాత అలా కాదు పాడటమని బిందుమాధవి మైక్ తీసుకొని.. ఏదో పాడగా.. ఏ‌ ఏంటయ్యా ఈ నాన్ సెన్స్ అని బాలకృష్ణ అనగా..‌ "సర్ ఇది నాన్ సెన్స్ కాదు సర్ న్యూసెన్స్ వెబ్ సిరీస్" అని బిందు మాధవి చెప్పింది. అవునా దేనిమీద అనగా.. జర్నలిజం అని నవదీప్ చెప్పాడు. "జర్నలిజమా.. ఆదివారం పొద్దున్నే టీవి పెడితే.. శనివారం సాయంత్రం నవదీప్ ఎక్కడో దొరికిపోయాడు.. అర్థరాత్రి కార్ వొదిలి పారిపోయాడు. డ్రంక్ డ్రైవ్ లో‌ క్యాచ్.. ఇప్పుడు ఇవే కదా న్యూస్" అని బాలకృష్ణ అనగానే షో అంతా నవ్వేస్తారు. ఆ తర్వాత ఏంటి రివెంజా అని బాలకృష్ణ అనగా.. మీడియా వాళ్ళతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని చాలా చిన్నవయసులో తెలుసుకున్నాను సర్ అని నవదీప్ చెప్పాడు. "నీకు పాపులారిటీ వచ్చిందే వాళ్ళ వల్ల కదా, నువ్వు కావాలని చేసావ్ కదా" అని బాలకృష్ణ అనగా..  "కొన్ని నేను చేసాను‌ సర్.. కొన్ని నా చేత చేపించారు సర్.. కొన్ని జరగకుండానే చెప్పేసారు సర్" అని నవదీప్ చెప్పాడు. ఆ తర్వాత న్యూసెన్స్ వెబ్ సిరీస్ టీజర్ ని బాలకృష్ణతో పాటు షో లోని అందరూ చూసారు. అందరూ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు.