రెబెల్ కాంగ్రెస్ నేతలకు వైకాపాలో చుక్కెదురు

కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన జగన్ అనుచరులు, మొన్న అవిశ్వాస తీర్మానం తరువాత కాంగ్రెస్ నుండి బయటపడి వైకాపాలో చేరిన తరువాత అక్కడ వారు ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో చాల కాలంగా పనిచేస్తూ రాబోయే ఎన్నికలలో పార్టీ టికెట్లు ఆశిస్తున్న అనేక మందికి వీరిరాకతో భయాలు మొదలయ్యాయి. పాతవారి మద్యనే టికెట్స్ కోసం తీవ్రమయిన పోటీ ఉండగా ఇప్పుడు తానూ దూరకంత లేదు మెడకో డోలన్నట్లు కొత్తగా వచ్చిపడిన 9మంది కాంగ్రెస్ శాసన సభ్యులు పాతవారికి పోటీగా తయారవడంతో వైకాపాలో కుమ్ములాటలు కూడా మొదలయ్యాయి.

 

కొద్ది రోజుల క్రితం వైకాపా కు చెందిన కొందరు నాయకులు మచిలీ పట్నంలో పార్లమెంటరీ నియోజక వర్గం సమావేశం నిర్వహించినప్పుడు కొత్తగా జేరిన పేర్ని నాని ప్రసక్తి రావడంతో ఉద్రిక్తతలు సమావేశంలో చోటుచేసుకొన్నట్లు సమాచారం. నాని వచ్చిన తరువాత పార్టీ తమను చిన్న చూపు చూస్తోందని వారు అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టుగానే, పేర్నినాని లేకుండా వారు సమావేశం నిర్వహించినందుకు పార్టీ వారికి చివాట్లు కూడా పెట్టినట్లు సమాచారం.

 

అదేవిధంగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మైసూరా రెడ్డి నిర్వహించిన ఒక సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరావు తదితరులు పార్టీలో ఎన్నాళ్ళగానో పనిచేస్తున్న తమను కాదని నిన్న గాక మొన్నపార్టీలోకి వచ్చిన మద్దాల రాజేష్ కు అధిక ప్రాదాన్యం ఇవ్వడమేమిటని నిలదీసినప్పుడు రెండు వర్గాల మద్య పెద్ద గొడవ జరగడంతో మైసూరా సమావేశం అర్ధంతరంగా ముగించక తప్పలేదు. ఇక నిడదవోలులో ను దాదాపు అదే కధ పునారావృతమయింది. అక్కడ ఆళ్ళ నానికి వ్యతిరేఖంగా బుద్ధాని, జక్కం శెట్టి, మరియు సంజయ్ లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

 

ఇంకా ఎన్నికలకి ఏడాది సమయం ఉన్నప్పుడే పరిస్థితులు ఈవిధంగా ఉంటే, రేపు పార్టీ టికెట్స్ కేటాయించే సమయంలో ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. పైగా నేటికీ బయట పార్టీలనుండి జనాలు చంచల్ గూడా జైలులోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైకాపాలో చేరుతున్నవారందరూ కూడా రాబోయే ఎన్నికలలో ఆ పార్టీ తమకు తప్పనిసరిగా టికెట్స్ కేటాయిస్తుందనే భరోసా దొరికిన తరువాతనే ఆ పార్టీలోచేరుతున్నారని భావించవచ్చును. అటువంటప్పుడు పార్టీలో ఉన్నపాత నాయకులకి, కొత్తగా వచ్చే వారికి మద్య ఇటువంటి ఘర్షణ వాతావరణం తప్పక పోవచ్చును.

 

ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తప్ప పార్టీలో నెలకొన్న ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దేవారు మరొకరు లేకపోవడం ఆ పార్టీకి చాలా పెద్ద సమస్యేనని చెప్పవచ్చును., ఒకవేళ ఉన్నపటికీ, ఎవరూ ఎవరి మాటను ఖాతరు చేయని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని మైసూరా రెడ్డి నిర్వహించిన సమావేశం నిరూపించింది.

 

ఇక, ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి త్వరలో విడుదల కాకపోతే ఆ పార్టీ భాద్యతలను షర్మిల చెప్పడితే తప్ప ఇటువంటి సమస్యలను, అసమ్మతిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఏమయినప్పటికీ, అధినేతలేని లోటు ఆ పార్టీని వెంటాడుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.

 

అందువల్ల ఆ పార్టీ అధిష్టానం పాదయాత్రలు, బహిరంగ సభలపై దృష్టి పెట్టి జనాల్ని ఆకర్షించే ప్రయత్నం చేసే బదులు పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసుకోవడం మేలు. తద్వారా ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అవడం ఆలస్యమయినా పార్టీ వ్యవహారాలు సజావుగా సాగుతుంటే దైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలవుతుంది. లేదంటే, 2009 ఎన్నికల మధ్యలోనే ప్రజారాజ్యం పార్టీ కుప్ప కూలిపోయినట్లు వైకాపా కూడా కూలిపోయే ప్రమాదం ఉంది.