చిరంజీవికి కాంగ్రెస్ బాష వచ్చేసినట్లే
posted on Apr 7, 2013 @ 9:58PM
పార్టీ పెట్టడమే తరువాయి ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయం అనే ఆలోచనతో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి, పైకి మాత్రం ‘సామాజిక న్యాయం’ అంటూ అంతవరకు ఎవరూ పాడని ఒక కొత్త పాట అందుకొని, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తానంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసి చివరికి తానే వెళ్లి ఆ కాంగ్రెస్-బంగాళాఖాతంలో కలిసిపోయి కేంద్రమంత్రి పదవి పుచ్చుకొన్న సంగతి రాష్ట్రంలో చంటి పిల్లాడికి కూడా తెలుసు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం నాడు జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, తను కేవలం సామాజిక న్యాయం కోసమే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీలినం చేశానని, అందువల్లే నేడు యస్.సి. యస్టీ. సబ్ ప్లాన్ బిల్లు అమలుకు నోచుకొందని ఆయన ప్రజలకు గుర్తు చేసారు. తనకి సామాజిక న్యాయం మీద తప్ప పదవుల మీద ఏనాడు వ్యామోహం లేదని అన్నారు. త్యాగాల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో తానూ సభ్యుడినయినందుకు చాల గర్విస్తున్నాని ఆయన అన్నారు. అదేవిధంగా కరెంటు చార్జీలు పెంచగానే తనే మొట్ట మొదట స్పందించానని, తత్ఫలితంగా ముఖ్యమంత్రి కూడా వెంటనే సానుకూలంగా స్పందించి కరెంటు చార్జీలు తగ్గించారని చిరంజీవి తెలిపారు.
ఇక, ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోచుకొని జైల్లో ఉన్నపటికీ కొందరు ప్రతిపక్ష నేతలు నీతులు వల్లించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. రాజకీయపార్టీల విగ్రహాలు పెట్టడానికి లేని అభ్యంతరం తణుకులో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు.
చిరంజీవి వల్లెవేస్తున్న సామాజిక న్యాయం సంగతి ఎలా ఉన్నపటికీ, తనకి తానూ మాత్రం చాల చక్కగా న్యాయం చేసుకొన్నారని ప్రజలకి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ విలీనానికి మంత్రి పదవులు ఇవ్వడమే ప్రప్రధమ షరతులని ప్రజలందరికీ తెలిసిన విషయాన్నీ తనకు తెలియనట్లు మాట్లాడిన చిరంజీవి వాలకం చూస్తే కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి తనను ఎవ్వరూ చూడట్లేదని అనుకొన్నట్లుంది. ఆయన ఇంత నిర్భీతిగా ఈ రోజు మాట్లడగలుగుతున్నారంటే కాంగ్రెస్ నీరు బాగా వంట బట్టించుకొన్నారని అర్ధం అవుతోంది.
యస్.సి. యస్టీ. సబ్ ప్లాన్ బిల్లు ప్రసక్తి, కరెంటు చార్జీలపై తానూ ముఖ్యమంత్రిని లొంగదీసిన ప్రసక్తి తేవడం అందుకు చక్కటి ఉదాహరణలు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరి గట్టిగా ఏడాది తిరక్కుండానే చిరంజీవి కాంగ్రెస్-మార్క్ రాజకీయ లక్షణాలను బాగా వంటబట్టించుకొని ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా లొంగదీయగలగడం విశేషమే.
ఇక, ఆయన వంది మాగధులలో ఒకరయిన దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో చిరంజీవే చక్రం తిప్పబోతున్నట్లు కూడా ప్రకటించేశారు. అంటే, వచ్చే సాధారణ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అవుదామని చిరంజీవి మళ్ళీ కలలు కంటున్నట్లున్నారు. మరటువంటప్పుడు పదవీ వ్యామోహం లేదని ఈ డప్పు ఎందుకో?