మోడీ కంటే అద్వానీయే బెటరా
posted on Apr 15, 2013 8:55AM
బీజేపీకి ఆపద్భాంధవుడిలా కనబడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి జనతాదళ్ (యు) నేతలకి మాత్రం రక్త పిపాసిలా కనబడుతున్నాడు. ఈ విషయంలో మోడీ కంటే అద్వానీయే చాలా బెటర్ అని తీర్మానించారు కూడా. నరేంద్ర మోడీ గనుక బీజేపీ ప్రధాని మంత్రి అభ్యర్ధి అయితే గనుక ఇక ఎన్డీయే కూటమికి తమ మద్దతు గురించి ఆలోచించనవసరం లేదని స్పష్టంగా చెప్పింది. అయితే, అదే సమయంలో ఈ కారణంగా తాము కాంగ్రెస్ హస్తం అందుకోబోమని కూడా స్పష్టం చేయడంతో బీజేపీకి కొంచెం ఊరట లబించింది.
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోరినప్పుడు తక్షణం సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానయినా ఆయనను తన బుట్టలో వేసుకొని ఆయన జేడీ(యు) పార్టీని ఎన్డీయే కూటమి లోంచి బయటకు లాగాలని చూసింది. కానీ, ఇప్పుడు జేడీ(యు) తాజా ప్రకటనతో కాంగ్రెస్ చాలా నిరాశ పడింది. అదిగాక జేడీ(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్, మోడీ విషయంలో తమ పార్టీ నాయకులను కాస్త సున్నితంగా వ్యవహరించమని కోరడం గమనిస్తే, వ్యక్తిగతంగా ఆయనకీ మోడీని సమర్దించాలని ఉన్నపటికీ, పార్టీ అభీష్టం మేరకు వెనక్కి తగ్గక తప్పట్లేదని అర్ధం అవుతోంది. అందువల్ల రానున్నరోజుల్లో బీజేపీ గనుక ఆయన ద్వారా నితీష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చి, ఆయనను మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు ఒప్పించగలిగితే , ఇక కాంగ్రెస్ కి గడ్డు కాలం దాపురించినట్లేనని చెప్పవచ్చును.
నరేంద్ర మోడీకి ఇంత సానుకూలమయిన పరిస్థితులు కనిపిస్తున్న ఈ తరుణంలో, ఆయనను ఉపయోగించుకొని కేంద్రంలో అధికారం చెప్పట్టగలిగే సువర్ణావకాశం కళ్ళెదుట కనిపిస్తుంటే, జేడీ (యు) ఈ విధంగా పానకంలో పుడకలాగా గొంతులో అడ్డంపడటం బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది. పైగా, ఆ పార్టీ తమ పార్టీఎవరిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే బాగుంటుందో చూచాయగా చెప్పడం మరింత ఇబ్బందికరంగా మారింది.
తన జీవితంలో కనీసం ఒక్కసారయినా ప్రధాని పీఠం మీద కూర్చోవాలని కలలు గంటున్న అద్వానీకి జేడీ(యు) జారి చేసిన ఈ సర్టిఫికేట్ నిజంగా సంతోషించదగినదే. కానీ ఆయన అద్వర్యంలో పార్టీ ఎన్నికలకు వెళ్లి విజయం సాదించగలదా అంటే అనుమానమే. మోడీకి గోద్రా మారణఖాండ మాయని మచ్చయితే, అద్వానికి బాబ్లీ మసీదు కూల్చివేత మచ్చగా మిగిలి ఉంది. కనుక వారిరువురిలో ఎవరు బీజేపీకి సారద్యం వహించినా వారిని విమర్శించేందుకు కాంగ్రెస్ వద్ద అవసరమయిన అస్త్ర శస్త్రాలన్నీ ఉన్నాయి. అటువంటప్పుడు, పార్టీకి విజయం సాదించిపెట్టగల నరేంద్ర మోడీ కాదనుకొని వృద్దుడయిన అద్వానీని నమ్ముకోవడం బీజేపీకి ఎంతమాత్రం ఇష్టంలేదు. అందుకే ఆ పార్టీ నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపుతోంది.
కానీ, జేడీ(యు) ఈ విధంగా అడ్డుపడటం బీజేపీకి చాలా కష్టంగానే ఉంది. ఇప్పుడు అందివస్తున్న ఈ సువర్ణావకాశాన్ని వదులుకొంటే మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షబెంచీలకే పరిమితమవ్వకతప్పదనే సంగతి గ్రహించిన బీజేపీ, అదే విషయాన్నీ తన ఎన్డీయే మిత్రుడు నితీష్ కుమార్ కి నచ్చజెప్పుకోక తప్పదు. ఒకవేళ అప్పటికీ, ఆయన అభ్యంతరాలు చెప్పినట్లయితే, బీజేపీ ఇక జేడీ(యు)నే వదులుకోవచ్చును తప్ప మోడీని వదులుకోదని చెప్పవచ్చును. కానీ, ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది గనుక, ఈ లోపుగా అన్ని పార్టీల ఆలోచనలలో చాలా మార్పులు రావచ్చును.