దేనికీ బాద్యత వహించని మంత్రులు

 

 

హోం మంత్రి సబితా రెడ్డి పై సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసియగానే, కాంగ్రెస్ పార్టీ మొదట కొంచెం భయపడినా, 24గంటలు గడవక మునుపే పూర్తిగా కోలుకొని ప్రతిపక్షాలను నిలదీయగల శక్తి సమకూర్చుకోగలిగింది. అదేవిధంగా సీబీఐ తన చార్జ్ షీటులోచాలా స్పష్టమయిన ఆరోపణలు చేసినప్పటికీ, “నేనేమి తప్పు చేశానో సీబీఐయే చెప్పాలి, నాపై సెక్షన్ 420 క్రింద కేసు నమోదు చేయడం నాకు చాల బాధ కలిగించింది” అని సబితా రెడ్డి కూడా ప్రశ్నించగలుగుతున్నారు.

 

ప్రభుత్వం అంటే ప్రజా ధనానికి ఒక ట్రస్టీ మాత్రమే తప్ప యజమాని కాదనే సంగతి ఆమెకు తెలియని విషయమేమీ కాదు. పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నపుడు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తి స్తానని ప్రతీ ఒక్క మంత్రి చేత అందుకే ప్రమాణం చేయిస్తారు. అటువంటి కీలక బాధ్యత గల పదవిని చేప్పటి, నేను అధికారుల మీద నమ్మకంతో గుడ్డిగా ఫైల్స్ మీద సంతాకాలు చేసానని చెప్పడం బాధ్యతారాహిత్యమేనని చెప్పక తప్పదు.

 

కేబినేట్ తీసుకొన్న నిర్ణయాలకి ఏ మంత్రీ బాధ్యతా వహించనప్పుడు మరిక ఆ నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? తెర ముందు జరిగిన కేబినేట్ నిర్ణయాలతో కానీ, తెర వెనుక జరిగిన కధలతో గానీ తనకు సంబంధం లేదని చెపుతున్న హోంమంత్రి మరి దేనికి బాద్యత వహిస్తారు?

 

ఆమె స్వయంగా ఏ ప్రయోజనం పొందకపోయినప్పటికీ, ఈ అవినీతి కధలో ఆమె కూడా ఒక ప్రాధాన పాత్ర పోషించారనేది స్పష్టం. పాత్ర పోషించినప్పటికీ సూత్రదారుల నడిపినట్లే నడుచుకోవలసి వచ్చిందనేది ఆమె సంజాయిషీలు కూడా ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. గనుల శాఖలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేని ఆమె కీలకమయిన హోంశాఖను ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఏవిధంగా నిర్వహించగలరు?

 

తానూ ఏ తప్పు చేయలేదని ఆమె గట్టిగా నమ్ముతున్నారు గనుక, ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం కంటే, హుందాగా పదవిలోంచి తప్పుకొని న్యాయ పోరాటం చేసుకొని తన నిజాయితీని నిరూపించుకొంటే బాగుండేది. కానీ కాంగ్రెస్ సంస్కృతిలో అటువంటి హుందాతనానికి ఇప్పుడు తావు లేదు. కాంగ్రెస్ లోనే కాదు బహుశః ఏ రాజకీయ పార్టీలోను లేదనే చెప్పవచ్చును.

 

ఇక ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ మంత్రులందరూ కూడా ఆమెను నిసిగ్గుగా సమర్దించడంద్వారా మరో కొత్త తప్పు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ధర్మాన ప్రసాదరావును వెనకేసుకు వస్తూ ప్రజలలో తానూ, తన పార్టీ చాలా చులకన అయ్యేరు. ఇప్పుడు హోం మంత్రి సబితా రెడ్డిని కూడా వెనకేసుకు వస్తే ఇది కూడా ఒక సరికొత్త సంప్రదాయంగా మారడం తధ్యం. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే సంప్రదాయం కొనసాగిస్తుంది.

 

అదృష్టవశాత్తు మనకు బలమయిన న్యాయ వ్యవస్థ ఉంది గనుక ఇంతవరకు ఎవరికీ శిక్షలు పడకపోయినా కనీసం ఇంకా అభియోగాల నమోదు, కోర్టులు, విచారణ, బెయిలు వరకు మాత్రం వీలు ఉంది. కానీ, ఆ వ్యవస్థలోనూ ఉన్న లొసుగులను ఉపయోగించుకొని శిక్షలను తప్పించుకొనే వెసులు బాటు కూడా ఉండటమే మన దురదృష్టం.