రాష్ట్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనా
posted on Apr 4, 2013 @ 12:20PM
నిన్న కేసీఆర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రంలో కొనసాగుతున్నట్లే రాబోయే ఎన్నికల తరువాత రాష్ట్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. ఆయన తెలంగాణాలో తమ తెరాస పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తుందనే నమ్మకంతో ఆవిధంగా చెప్పినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో నెలకొన్న అనిశ్చితత పరిస్థితి గమనిస్తే అదే జరగనున్నదని అర్ధం అవుతుంది.
తెలంగాణ విషయానికి వస్తే, అక్కడ ఇతర రాజకీయ పార్టీలు తమ గెలుపు గురించి ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నపటికీ శాసనసభ స్థానాలలో మాత్రం తెరాస ఆధిక్యత కనబరచడం తద్యం. కేవలం తెలంగాణ లో పలుకుబడి, కార్యకర్తల బలం కలిగిన ఇతరపార్టీల నేతలు మాత్రమే అక్కడ విజయం సాదించవచ్చును. ఆ విధంగా చూస్తే తెరాస కనీసం 50 స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉంది.
రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా చెప్పవచ్చును. 9సం.లుగా ప్రతిపక్షానికే పరిమితమయిపోయిన తెదేపా తప్పని సరిగా గెలవాలి. లేకుంటే, ఆ పార్టీలో చీలికలు లేదా పార్టీ నుండి వలసలు మొదలయిపోతాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి కష్టాలు తీరాలంటే తప్పనిసరిగా రాబోయే ఎన్నికలలో పూర్తి మెజారిటీతో గెలవక తప్పదు. లేదంటే ఆయన రాజకీయ జీవితం అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. అంతే గాక, ఆ పార్టీ మనుగడ కూడా కష్టమే అవుతుంది గనుక ఆ పార్టీ తన విజయం కోసం చాలా పట్టుదలగా ప్రయత్నించవచ్చును.
ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఎంత వ్యతిరేఖత ఉన్నపటికీ, ఆ పార్టీకి చెందిన ఘనాపాటీలు తమ పలుకుబడితో, ఆర్ధిక శక్తితో అవలీలగా గెలవగలరు. అందువల్ల రాబోయే ఎన్నికలలో ఈ 3 పార్టీలు ఓట్లను చీల్చి సమానంగా లేదా కొంచెం హెచ్చు తగ్గులతో శాసన సభ సీట్లను దక్కించుకోవడం ఖాయం.
పోలింగ్ జరిగే సమయానికి ఏ పార్టీకయినా అనుకూలంగా రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు ఏర్పడితే తప్ప, ప్రస్తుత పరిస్థితులలో ఏ పార్టీకూడా పూర్తి ఆధిక్యం పొందలేకపోవచ్చును. అదే జరిగితే, రాష్ట్రంలో కూడా ఇక సంకీర్ణ ప్రభుత్వం తప్పకపోవచ్చును. గత 4 సం.లుగా కేంద్రంలో సంకీర్ణంతో క్షణమొక గండం దినమొక గండం అన్నట్లు అతి కష్టం మీద నెట్టుకొస్తున్నయుపీయే ప్రభుత్వ పాలనలో దేశం ఏవిధంగా ఇబ్బందులు పడుతోందో, రేపు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర పరిస్థితి అంత కంటే దయనీయంగా మారుతుంది.
మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనలోనే రాష్ట్ర పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నపుడు, ఇక నిత్యం కీచులాడుకొంటూ సాగే సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తలుచుకొంటేనే భయం కలుగుతుంది.
దీనికి పరిష్కారం ప్రజల చేతులోనే ఉంది. పార్టీలు చూపే తాత్కాలిక ప్రలోభాలకు తలొగ్గక, కులం, మతం, ప్రాంతం అనే మూడు అంశాలను పక్కన బెట్టి, ఏపార్టీకి ఓటేస్తే రాష్ట్రానికి చక్కటి పాలన అందించగలదో ఆలోచించుకొని దానికే ఓటేయడం ద్వారానే ఇటువంటి సంకీర్ణ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చును. లేకుంటే, ప్రజలకి దేరీజే క్రోకడయిల్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ అనుకోక తప్పదు.