మీడియాపై బాబా మేనల్లుడు సీరియస్
posted on Apr 7, 2011 9:24AM
అనంతపురం: మీడియాపై భగవాన్ సత్యసాయిబాబా మేనల్లుడు శ్రవణ్ కుమార్ బుధవారం చిందులు తొక్కారు. మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తుందంటూ సీరియస్ అయ్యారు. సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్టులో వివాదాలు ఉన్నాయంటూ మీడియా అనవసర రాద్దాంతం చేస్తుందన్నారు. బాబా ఆరోగ్యం బాగానే ఉందన్నారు. మీడియాకు విజువల్సు ఎందుకు విడుదల చేయడం లేదో డాక్టర్లనే అడగమని ఆయన చెప్పారు. కాగా మీడియా ప్రతినిధులతో డాక్టర్లు సఫయా, రవిరాజ్‌లు మాట్లాడారు. బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ రవిరాజ్ చెప్పారు. బాబా ప్రస్తుతం పేస్ మేకర్‌పై ఉన్నారన్నారు. వెంటిలెటర్ల వల్ల బాబా ఊపిరితిత్తుల ద్వారా ఇతర అవయవాలకు నీరు చేరిందని అన్నారు. చికిత్సకు బాబా స్పందిస్తున్నారని అన్నారు. బాబాలో యూరిన్ అవుట్ తక్కువగా ఉందన్నారు. ఆయన గుండె నిమిషానికి 80 సార్లు కొట్టుకుంటుందని చెప్పారు. సోడియం సాధారణ స్థితిలో ఉందన్నారు. బాబాకు పెట్టిన అన్ని వైద్య పరికరాలు ఇప్పుడు తొలగించే పరిస్థితి లేదన్నారు. అన్నీ ప్రస్తుతానికి ఉపయోగపడేవే అని చెప్పారు. బాబా ఆరోగ్యం ఇప్పుడు బావుందని డాక్టర్ సఫయా అన్నారు. బాబా స్థాపించిన సత్యసాయి వైద్యశాలలో ఆయనే చేరుతారని ఊహించలేదని ఆవేదనతో చెప్పారు. బాబాకు అన్ని రకాల వైద్యసేవలు, పరీక్షలు నిర్వహించామని చెప్పారు. బిపి తగ్గి సామాన్య స్థితికి వస్తుందన్నారు. బెంగుళూరుకు చెందిన వైద్యులతే చికిత్స చేయిస్తున్నామని అన్నారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకిందని అన్నారు. బాబా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.