తప్పుకున్న పవార్
posted on Apr 7, 2011 @ 9:39AM
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకుడు అన్నా హజారే తనపై తీవ్రమైన విమర్శలు చేపట్టిన నేపథ్యంలో అవినీతిపై ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూపునుంచి తనను తప్పిస్తే ఎంతో సంతోషిస్తానని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. తనని మంత్రుల బృందం నుంచి తప్పించాలని ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్'ని శరద్ పవార్ కోరారు. హజారే మీపై చేసిన విమర్శలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు పవార్ ఈ విమర్శలను తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే అవినీతిపై ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూపుతో సహా అన్ని మంత్రుల గ్రూపులనుంచి తనను తప్పిస్తే ఎంతో సంతోషిస్తానని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా లోక్‌పాల్ బిల్లును రూపొందించడంలో సభ్య సమాజానికి వారికి కూడా పాత్ర కల్పించాలని హజారే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. లోక్‌పాల్ బిల్లుపై ఏర్పాటు చేసిన మంత్రుల గ్రూపులోని కొంతమంది సభ్యులపై తనకు నమ్మకం లేదన్న హజారే, మహారాష్ట్రలో పలు భూకుంభకోణాలతో సంబంధం ఉన్న శరద్ పవార్, బలహీనమైన లోక్‌పాల్ ముసాయిదా బిల్లును రూపొందించిన వీరప్ప మొయిలీ, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఎలాంటి అవినీతీ జరగలేదని చెప్తున్న కపిల్ సిబల్ లాంటి వాళ్లు ఈ మంత్రుల గ్రూపులో సభ్యులుగా ఉన్నారని, అలాంటప్పుడు వాళ్లను ఎలా నమ్మాలని ప్రశ్నించారు.