కాంగ్రెస్ కు కడప లో అభ్యర్థులు కరవు
posted on Apr 7, 2011 @ 9:58AM
హైదరాబాద్: రాష్ట్రంలో పదిహేడున్నర సంవత్సరాలు మినహా అధికారాన్ని ఏకబిగిన అనుభవించిన పార్టీ అది. రాష్ట్ర, జాతీయ స్ధాయి నాయకులకు కొదువ లేదు. మంత్రుల డాంబికాలకు, మాటల రాయుళ్లకు కరవు అసలే లేదు. అయినా.. ఒక జిల్లా.. ఒకే ఒక్క జిల్లా. ఆ జిల్లా నుంచి టికెట్ ఇస్తామంటే తీసుకునే దమ్మున్న నాయకులకే కరవొచ్చి పడింది. కడపకు.. పరాయి పార్టీ నాయకుడే దిక్కయిన దుస్థితి. ఇది రాష్ట్ర-కేంద్రంలో తిష్ఠవేసిన అధికార కాంగ్రెస్ పార్టీ స్థితి. కడపలో నెలకొన్న దుస్థితి. కడప పార్లమెంటుకు అభ్యర్ధి దొరకక కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. కడప జిల్లాలో ప్రతిపక్షమనేది లేకుండా ఎదురులేకుండా పాలించిన ఆ జిల్లాకు ఇప్పుడు జగన్‌పై పోటీ చేసే దమ్మున్న నేత భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. జగన్‌ను ఢీ కొడతారన్న అంచనాతో మూడు శాఖలను ఒకటి చేసి డీఎల్ రవీంద్రారెడ్డికి కట్టబెట్టినా ఆయన తాను కడప బరిలో దిగనని వెనక్కితగ్గారు.
ఒకసారి అసెంబ్లీ, మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన తాను మూడోసారి ఓడేందుకు సిద్ధంగా లేనని వరదరాజులురెడ్డి కూడా చేతులెత్తేశారు. ఇక గత్యంతరం లేని కాంగ్రెస్ నాయకత్వం.. బుధవారం వరకూ తెలుగుదేశంలోనే కొనసాగిన కందుల రాజమోహన్‌రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. 1994 ఎన్నికల్లో వైఎస్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించి, అత్యల్ప ఓట్ల తేడాతో ఓడిన కందుల ఒక్కడే జగన్‌పై పోటీకి మొనగాడని కాంగ్రెస్ నాయకులు కూడా తేల్చేశారు. అయితే, కందుల బుధవారం కూడా కాంగ్రెస్‌లో చేరలేదు. పైగా..తనను అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ రెండూ అడుగుతున్నాయని తన ప్రాధాన్యత, తనకున్న గిరాకీని చెప్పకనే చెప్పుకుంటున్నారు. కడప ఎంపీ అభ్యర్ధి ఎంపికపై చర్చకు కూర్చున్న సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు డీఎస్, మంత్రులు, అగ్రనేతలంతా కందుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. కానీ కందుల జాడ మాత్రం కనిపించలేదు.