మూడోరోజుకు అన్నాహజారే దీక్ష
posted on Apr 7, 2011 @ 10:26AM
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా ప్రముఖ సంఘసంస్కర్త అన్నాహజారే ప్రారంభించిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. దీక్ష స్థలికి జనం భారీగా తరలివస్తున్నారు. మరోవైపు అన్నాహజారే దీక్షకు దేశవ్యాప్తంగా పలు పార్టీలు, స్వచ్చంద సేవ సంస్థలు మద్దతు పలికాయి. పశ్చిమ బెంగాల్ లోని ఐఐటీ విద్యార్థులు హజారేకు మద్దతుగా దీక్షలకు దిగారు. నిన్న దీక్షకు మద్దతు పలకడానికి వచ్చిన హర్యానా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఓం ప్రకాష్ చౌతాలా, ఉమాభారతిలకు చేదు అనుభవం ఎదురైంది. వీరిని వేదిక వద్దకు రాకుండా ఉద్యమకారులు అడ్డుకున్నారు.
తనను చంపేస్తామన్న బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తనకు దేశం, ప్రజలు ముఖ్యమని చెప్పారు. దేశాన్ని ఏలుతున్న ప్రభుత్వాలు అవినీతితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. అవినీతి తదితర అంశాలపై కేంద్రంతో తాను చర్చలకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ప్రజలు తనకు ఇచ్చిన మద్దతు శక్తిని ఇచ్చిందని అన్నారు. అవినీతి నిర్మూలనకే తాను నడుం బిగించానని చెప్పారు. అవినీతి నిర్మూలనకు ఏమైనా ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వారం రోజుల పాటు తనకు ఏమీ కాదని చెప్పారు. తాను కొంత నీరసంగా ఉన్నప్పటికీ దీక్షను మాత్రం ఆపే ప్రసక్తి లేదన్నారు. దీక్షను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నానని చెప్పారు. లోక్‌జన్‌పాల్ బిల్లుపై కేంద్రం దిగి వచ్చే వరకు దీక్షను కొనసాగిస్తానని చెప్పారు.