వివేకాను నిలదీస్తున్న ఓటర్లు
posted on Apr 7, 2011 @ 2:17PM
కడప: పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి గతంలో ఎన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కక్ష కట్టిన కాంగ్రెస్ అధిష్టానంతో చేతులు కలపి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తల్లిలాంటి వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయలక్ష్మీపై ఉప ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని ప్రకటించి స్థానికంగా పట్టుకోల్పోయారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అబ్బాయ్ ఛాన్స్ ఇచ్చినా కాదనీ తన అనుచరుడిని పోటీకి దింపి అభాసుపాలయ్యారు. ఇలా వరుస సంఘటనల నేపథ్యంలో పులివెందుల ప్రచారానికి వెళ్లిన ఆయనకు వింత పరిస్థితులే ఎదురవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఒక దొరలా పూజించి గౌరవ మర్యాదలు ఇచ్చిన పులివెందుల నియోజకవర్గ ప్రజలే ఇపుడు ప్రశ్నల వర్షం కురిపిస్తుండటంతో ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. అంతేకాకుండా, చివరకు తన కుటుంబ సభ్యులు కూడా ఆయన వెన్నంటి రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆయన వెంట ఆయన సతీమణి, కుమార్తె మాత్రమే ఉండగా, మిగిలిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా జగన్ కే మద్దతు పలుకుతున్నారు. పైపెచ్చు.. నియోజకవర్గ ప్రజలు కూడా తల్లిలాంటి విజయమ్మపై పోటీ చేయడం తగునా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి ఏమని సమాధానం చెప్పాలో వివేకాకు తెలియటంలేదు.