అధికార లాంఛనాలతో బాబాకు అంత్యక్రియలు
posted on Apr 24, 2011 @ 2:05PM
పుట్టపర్తి: భగవాన్ సత్యసాయి బాబా భౌతిక కాయానికి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. భగవాన్ సత్యసాయి బాబా పార్దీవానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు అంజలి ఘంటించారు. మానవసేవే మాధవసేవని సందేశమిచ్చిన బాబా నిర్దేశించిన మార్గంలో అందరూ నడవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళని ఆయన పేర్కొన్నారు. బుధవారం వరకు సంతాపదినాలుగా ప్రకటించామన్నారు. బుధవారం అనంతపురం జిల్లాకు సెలవు ప్రకటించారు. ఆరోగ్యం, విద్య, దుర్భిక్ష ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు బాబా ఎంతో చేయూతనిచ్చారని ముఖ్యమంత్రి తన సంతాప సందేశంలో తెలిపారు. సమాజ సర్వతోముఖాభివృద్ధికై బాబా ఎంతగానో కృషి చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా పుట్టపర్తికి కావాల్సినన్ని బస్సులు నడపాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.