బాబా జీవితం ఆదర్శప్రాయం: సబిత
posted on Apr 24, 2011 @ 3:28PM
హైదరాబాద్: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రపంచం ఓ గొప్ప సేవకుడిని కోల్పోయిందని సబిత అన్నారు. ప్రతి వ్యక్తి ఆయన బాటలో నడవాలని ఆమె సూచించారు. విదేశాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పారు. కాగా హోంమంత్రి సోమవారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మరణం తనను ఎంతో కలచి వేసింది అని ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. సత్యసాయిబాబాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బాబా సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తమయ్యారని చెప్పారు. బాబా చాలా గ్రామాలకు తాగునీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చారని గుర్తు చేసుకున్నారు. కాగా కడప జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హుటాహుటినా పుట్టపర్తికి ఉదయం బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆయన బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాబా సేవలు అమోఘమని చెప్పారు. బాబా మరణంతో కేవలం పుట్టపర్తి, అనంతపురం జిల్లా మాత్రమే కాదని అందరూ విషాదంలో మునిగిపోయారని చెప్పారు.