కోట తోట వశం అవుతుందా?
posted on Jun 9, 2012 @ 2:27PM
తూర్పుగోదావరి జిల్లా కోట రామచంద్రాపురం కొత్త శాసనసభ్యుడు ఎవరు? అన్న అంశంపై జిల్లాలో ఆసక్తి నెలకొంది. ఏ ముగ్గురు కలిసినా ఈ విషయంపైనే చర్చకు తెరలేపుతున్నారు. చారత్రక కోట రామచంద్రాపురం నియోజకవర్గంలో రామచంద్రాపురం అర్బన్, రామచంద్రాపురం రూరల్, కె.గంగవరం, కాజులూరు మండలాలున్నాయి. రామచంద్రాపురం అర్బన్ లో 27వార్డులు. రూరల్ లో 24 గ్రామాలు, కె.గంగవరంలో 26 గ్రామాలు, కాజులూరు మండలంలో 22 గ్రామాలున్నాయి. ఇటీవల విభజన తరువాత కాజులూరు మండలం నియోజకవర్గంలో కలిసింది. ఈ మండలమే గత ఎన్నికల్లో తాజామాజీ ఎమ్మెల్యే బోసు విజయానికి కారణమైంది. రామచంద్రాపురం అర్బన్ నియోజకవర్గంలో 30,267, రూరల్ లో 48,369, కె.గంగవరం మండలంలో 45,206, కాజులూరు మండలంలో 47,701 మంది ఓటర్లున్నారు. ఎక్కువ ఓటింగ్ శాతం కూడా కాజులూరులోనే నమోదవుతుంది. అందువల్ల గెలిచే అభ్యర్థి మోజార్తీకి ఈ మండలం కీలకమవుతోంది. ఇక్కడ తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిక్కాల రామచంద్రరావు గతంలో తాళ్ళరేవు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటప్పుడు ఈ మండలంలో సత్సంబంధాలు నడిపేవారు. అయితే కాజులూరు మండల ప్రజలకు చిక్కాల తమకు ఏమీ చేయలేదని కోపం. ఐదుసార్లు కోరి గెలిపించుకుంటే తమకు అన్యాయం చేశారని ఆయనను దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆయన గెలుపుదాదాపు అసాధ్యమని తేలుతోంది. మంత్రిగా ఉన్నప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాజులూరు ప్రజలతో సంబంధాలు నెరిపారు. కానీ, ఆయన చివర్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కి మారి ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అరెస్టు నేపథ్యంలో ఈయనకూ ఇక్కడ పెద్దగా స్పందన లభించటం లేదు. రామచంద్రాపురం నియోజకవర్గానికి పాతకాపే అయినా కాపు సామాజికవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఈ మండలంలో కొత్తగా కనిపిస్తున్నారు. విభజనకు పూర్వం ఈ మండలం తాళ్ళరేవులో ఉండేది. అందుకని కాంగ్రెస్ అభ్యర్థి తోటను కాజులూరు నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. వీరి ఆదరణ ఈయన గెలుపునకు బాట వేస్తుందని భావిస్తున్నారు. కాజులూరు ఓటర్లు పోటీలో ఉన్న ముగ్గురిలో తోటకు ఆకర్షితులవుతున్నారు.