ర్యాగింగ్‌పై పోలీసుల మంచి ప్రయత్నం!
posted on Jul 17, 2012 @ 12:16PM
జూనియర్ విద్యార్థులను వేధిస్తున్న ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ సమస్యల పరిష్కారానికి పోలీసులు ఓ మంచి ప్రయత్నం చేశారు.ఈ ప్రయత్నానికి కరీంనగర్ జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంత పరిథిలోని గోదావరిఖని ప్రైవేటు జూనియర్, డిగ్రీకళాశాలలు వేదికయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎవరూ చేయని ఈ ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుందని విద్యార్థులూ నమ్ముతున్నారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ చేస్తే అమలయ్యే శిక్షల వివరాలను అమ్మాయిలకు పోలీసులే ఉపాథ్యాయుల తరహాలో విశదీకరించారు. వారి చేత ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేయటంతో పాటు చట్టపరంగా తీసుకునే చర్యల గురించి విద్యార్థినులకు వివరించారు.
ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌పై పోలీసులు రూపొందించిన ఫ్లెక్సీలను చూపుతూ విద్యార్థినులకు చట్టపరమైన అవగాహన కల్పించారు. విద్యార్థినుల సందేహాలకు ఓర్పుగా సమాధాన మిచ్చి వారిని బాధించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే తమకు తెలియజేయాలని తమ ఫోను నెంబర్లు కూడా పోలీసులు ఇచ్చారు. ఈవ్‌టీజింగ్ చేసేవారిని చూసి భయపడకుండా ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన ఇతర చర్యలనూ తెలియ జేశారు. అంతటితో ఆగకుండా పోలీసులు తాము రూపొందించిన ఫ్లెక్సీలను బస్టాండు, ప్రధానసెంటర్లలో ఏర్పాటు చేశారు. పోలీసులు చేసిన ఈ మంచి ప్రయత్నం తప్పకుండా ఫలితాలను ఇస్తుందని కళాశాలల నిర్వాహకులు, విద్యార్థినులు భావిస్తున్నారు.