తెలంగాణా రాజముద్ర అమరవీరుల త్యాగాల్ని గుర్తుచేస్తోంది!
తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం స్ఫూరించేలా కొత్త చిహ్నం...తెలంగాణా రాజముద్ర రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా రూపొందించిన రాష్ట్రప్రభుత్వ లోగో, అమరవీరుల త్యాగాలను నిరంతరం అందరికీ గుర్తుచేస్తుంది. అమరవీరుల స్థూపం, దానికి ఇరువైపులా ప్రగతికి, అభివృద్ధికి, సమృద్ధికి, సంపూర్ణతకు చిహ్నమైన రెండు వరి, గోధుమ కంకులతో, పైన మూడు తలల సింహం అశోకుని ధర్మచక్రంతో, క్రింద పద్మంతో చాలా అర్థవంతంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా, అందరినీ, అన్నివర్గాలనూ ఆకట్టుకునే విధంగా ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే కొత్త లోగో తీసుకువచ్చారు. అమరవీరులు, రైతాంగానికి కాంగ్రెస్ మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది అనే సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లేలా రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఈ మార్పులు చేశారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయింది. ఈ రాజముద్రకు సంబంధించి సోషల్ మీడియాలో పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ లోగోలో అమరవీరుల స్థూపం, వరి కంకులతో పాటు దేశానికి గర్వకారణమైన అశోక చక్రం ఉన్నాయి.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆవిష్కరించిన రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి, కొత్త లోగోలో అమరవీరుల స్థూపం, వరి కంకులకు రేవంత్ సర్కార్ చోటు కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని పదేళ్లుగా బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే కేసీఆర్ ను చెక్ పెట్టడానికే రేవంత్ ఈ మార్పులు చేస్తున్నారు. కేవలం కేసీఆర్ ఒక్కరితోనే, స్వరాష్ట్రం ఏర్పడలేదు… అనేక మంది అమరుల త్యాగఫలితమే తెలంగాణ అని నిత్యం గుర్తుచేసేలా అమరవీరుల స్థూపానికి ఎంబ్లమ్ లో రేవంత్ చోటు కల్పించారు. అదే సమయంలో రైతాంగం, కేసీఆర్ కంటే కాంగ్రెస్ పార్టీనే అభిమానించేలా లోగోలో చోటు కల్పించారు. దీంతో కేసీఆర్ ను మించి వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రజల జీవనాధారం పాడి పంటలు అయినందున చిహ్నంలో రైతాంగం ప్రతిబింబించేలా ఉండాలని ఈ మార్పులను రేవంత్ చేశారు.
-ఎం.కె. ఫజల్