కృష్ణా జిల్లా కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించనున్న సీఈవో
posted on May 30, 2024 @ 9:38AM
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కృష్ణా జిల్లాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం (మే 30) సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం (మే29) ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన కృష్ణా యూనివర్సిటీలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మీడియా సెంటర్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి గందరగోళం లేకుండా రౌండ్ ల వారీగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను మీడియా వారికి చేరవేసే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని అదేశించారు.
కౌంటింగ్ రోజున తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. స్ట్రాంగ్ రూముల సీసీటీవీలను పరిశీలించి, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం కౌంటింగ్ హాళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి వెంట జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీలు జి వెంకటేశ్వరరావు, ఎస్వీడీ ప్రసాద్, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.