‘అవినీతి చక్రవర్తి నరేంద్ర మోడీ’
posted on May 30, 2024 @ 10:57AM
తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు. ఇప్పుడు ఇద్దరు ప్రముఖులు పరకాల ప్రభాకర్, వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆ బాటలోనే పయనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రముఖ రాజనీతి కోవిదుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ఇప్పుడు ఈ నీతి సూత్రాన్నే అనుసరిస్తున్నారు. ఆ సూత్రానికి అనుగుణంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ‘అవినీతి చక్రవర్తి నరేంద్ర మోడీ - ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ అందులో కొద్ది భాగమే’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని పరకాల ప్రభాకర్ ఆవిష్కరించనున్నారు. జూన్ 2, 2024వ తేదీ ఆదివారం నాడు విజయవాడ గాంధీనగర్‌లో వున్న ప్రెస్‌క్లబ్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య ఎన్నికల పొత్తు వుంది. తెలుగుదేశం నాయకుడు అయిన వడ్డే శోభనాద్రీశ్వరరావు మన పార్టీతో బీజేపీకి ఫ్రెండ్‌షిప్ వుంది కాబట్టి మోడీని అవినీతిపరుడు అనకూడదు కదా అని ఈ పుస్తకం రాయకుండా ఆగలేదు. అదేవిధంగా, పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ మోడీ మంత్రివర్గంలో టాప్ మంత్రుల్లో ఒకరు. నా భార్య మోడీ మంత్రివర్గంలో వుంది కాబట్టి నేను ఈ పుస్తకాన్ని ఆవిష్కరించకూడదు కదా అని పరకాల ప్రభాకర్ ఆగలేదు. దీనినే తమ్ముడు మనవాడైనా న్యాయం చెప్పడం అంటారు. తమ వెనుక ఎలాంటి నేపథ్యం వున్నా, ఆ నేపథ్యానికి వ్యతిరేకంగా వుండే పని చేయడానికి వెనుకాడని వీరిద్దరూ అభినందనీయుడు. వీరి ఆలోచన కరెక్ట్ కావచ్చు.. కాకపోవచ్చు.. కానీ తమ ఆలోచనని సమాజానికి తెలియజేసే విషయంలో ఎలాంటి ప్రభావాలకూ లొంగకుండా ముందుకు వెళ్ళడం అందరీకి స్ఫూర్తిదాయకమే.