మచిలీపట్నం జనసేన నేత కర్రి మహేశ్ కారును దహనం చేసిన వైసీపీ గూండాలు 

ఎపిలో త్రి కూటమి అభ్యర్థులు విజయపథంలో దూసుకెళ్లనున్నారు. పోలింగ్ తర్వాత ఈ అంచనాలు రావడంతో వైసీపీ నాయకత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.  ఓటమి భయంతోనే జనసేన శ్రేణులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వైసీపీ నేతలకు సహనం పూర్తిగా చచ్చిపోయిందనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం.  మచిలీపట్నం లోకసభ  జనసేన  అభ్యర్థి బాలశౌరి తరపున పని చేస్తున్న జనసేననేత కర్రి మహేష్ కారును  వైసీపీ గూండాలు పెట్రోల్ పోసి దహనం చేశారు. . ఎన్నికల ప్రచార సమయంలో బహిరంగంగా కర్రి మహేష్ ఇంట్లో దూసుకెళ్లి వైసీపీ గూండాలు  దాడులు చేశారు. ఈ దాడిలో కర్రి మహేష్ ప్రాణాలతో బయట పడినప్పటికీ ఇవ్వాళ మాత్రం చేదు అనుభవం నుంచి తప్పించుకోలేకపోయారు. . వైసీపీ గూండాలు అర్దరాత్రి  కర్రి మహేశ్ కారుపై పెట్రోల్ పోసి  పూర్తిగా దహనం చేశారు.  ఎన్నికల ఫలితాలకు వారం రోజుల ముందు  వైసీపీ గూండాలు పూర్తిగా బరి తెగించారని మచిలీపట్నం జనసేన నేత వాడ వీరప్రతాప్ ఆరోపించారు. కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న భోగిరెడ్డి పల్లిలో కూడా వైసీపీ గూండాలు భౌతికదాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో పవన్ కళ్యాణ్ అభిమానులు గంపగుత్తగా బాలశౌరి అభ్యర్థిత్వాన్ని బలపరిచారన్నారు.   

విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం.. వెర్రితలలు వేస్తున్న వైసీపీ అతి!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఫలితం వచ్చే నెల 4న వెలువడనుంది. అయితే అంచనాలు, విశ్లేషణలూ అన్ని కూడా ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని తేల్చేస్తున్నాయి. వైసీపీ లీడర్లు, క్యాడర్ లో కూడా ఓటమి కళ కనిపిస్తోంది. వారి భాషలోనూ, బాడీ లాంగ్వేజ్ లోనూ కూడా ఓటమిని అంగీకరించేసిన తీరు వినిపిస్తోంది. కనిపిస్తోంది. అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం విజయంపై ధీమా పేరుతో చేస్తున్న అతి నవ్వుల పాలౌతోంది.  మంత్రి బొత్స సత్యనారాయణ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ విశాఖపట్నంలో జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా ప్రకటించేశారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఇంకా ఫలితాలు వెలువడ లేదు.. రాబోయేది వైసీపీ సర్కారే.. జూన్ 4 తరువాత చుక్కలు చూపిస్తాం జాగ్రత్త అంటూ అధికారులకు హెచ్చరికలు చేసేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే.. ఫలితాలు మరో 9 రోజుల్లో వెలువడనున్నాయి. కచ్చతమైన అంచనాలకు రావడానికి జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.   ఈ తరుణంలో విజయంపై నమ్మకం ఉన్న వారెవరైనా కామ్ గా ఉంటారు. సంచలన ఆరోపణలు, ప్రకటనల జోలికి వెళ్లరు. తెలుగుదేశం కూటమి నేతలు అదే చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెకేషన్ లో ఉన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విదేశీ పర్యటనలో సేదతీరుతున్నారు. జగన్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆక్కడ ఆయన చేస్తున్న అతి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఆయన లోని ఓటమి భయాన్ని కూడా ఎత్తి చూపుతోంది. ఆ విషయం పక్కన పెడితే  మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న కూటమి నేతల మాటల్లో విశ్వాసం కనిపిస్తోంది. వారు ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా మాట్లాడుతున్నారు. పోలింగ్ సరళిని హేతుబద్ధంగా వివరిస్తున్నారు. వారిలో ఎలాంటి ఆందోళనా కనిపించడం లేదు. అదే సమయంలో వైసీపీ నేతల్లో మాత్రం గాభరా, భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒక వైపు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూనే మరో వైపు ఈ ఎన్నికల్లో తమకు ఘోర అన్యాయం జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులు, అధికారయంత్రాంగాం, ఎన్నికల సంఘం అన్నీ తెలుగుదేశంతో కుమ్మక్కైపోయాయని ఆరోపిస్తే ఓటమి భయాన్ని బయటపెట్టుకుంటున్నారు. అధికారులకు, పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తున్నామనీ, రాగానే మీ సంగతి చూస్తామంటూ పరోక్షంగా బెదరిస్తున్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార వైసీపీ ఆడమన్నట్లల్లా ఆడింది. అడుగులకు మడుగులొత్తింది. అటువంటి పోలీసు వ్యవస్థ నిజంగా మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చీమ తలకాయంత ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తుందని భావించజాలం. ఇదే పోలీసు వ్యవస్థ గత ఐదేళ్లుగా వైసీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించింది. శుక్రవారం అరెస్టులతో వైసీపీ వ్యతిరేకులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆధారాలు, ఫిర్యాదులతో సంబంధం లేకుండానే కేవలం ఆరోపణలతో అర్ధరాత్రి అరెస్టులకు తెగబడింది. ఇవన్నీ వైసీపీ ఆదేశాల మేరకే చేసిందన్నది బహిరంగ రహస్యం.  మరో పక్క విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ బొత్స హడావుడి చేస్తుంటే కొందరు అతి రాయుళ్లు విశాఖలో హోటల్ రూమ్స్ అధిక ధరలకు ముందుగానే రిజర్వ్ చేసి పారేస్తున్నారు. విపక్ష నేతలకు వ్యతిరేకంగా ఈ ఐదేళ్ల కాలంలో నమోదైన ఏ కేసూ కూడా న్యాయస్థానంలో నిలబడిన దాఖలాలు లేవు. ఇంత అడ్డగోలుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసు వ్యవస్థ ఇప్పుడు వారి ఆదేశాలకు తలవంచడం లేదంటేనే ఆ పార్టీకి విజయావకాశాలు లేవని మెడమీద తలకాయ ఉన్న ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది.  కానీ వైసీపీలో కొందరు నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం కనీసం ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లుగా నిలబడటానికైనా ఎవరైనా మిగలాలి, అప్పటి వరకూ కార్యకర్తలలో ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో సూడో ప్రచారానికి తెరలేపారు. అదేమిటంటే వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు కోసం రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు విశాఖకు తరలి రానున్నారు. అందుకోసం ఇప్పటికే  విశాఖలోని హోటళ్లలో రూములన్నీ ముందుగానే రిజర్వ్ అయిపోయాయి అంటూ అందుకు ఆధారంగా ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తున్నారు. హోటళ్ల రూంల ధరలు పెరిగిపోయాయన్నది వాస్తవం. ఎందుకంటే పండుగలు, పబ్బాల సమయంలో పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు టికెట్ ధరలను ఆకాశమే హద్దుగా పెంచేయడం కద్దు. అదే విధంగా హోటల్ రూం చార్జీలను కూడా పెంచేస్తారు. ప్రస్తుతం విశాఖ  హోటళ్లలో రూమ్ లన్నీ రిజర్వ్ అయిపోయిన మాట వాస్తవం. వాస్తవ రేట్ల కంటే అధికంగా చెల్లించేందుకు అంగీకరిచేసి మరీ వైసీపీ నేతలు హోటల్ రూంలను బుక్ చేసేసుకున్నారు. అయితే వారు చెప్పిన తేదీకి తండోపతండాలుగా విశాఖ రావడానికి బస్సులలో కూడా ముందస్తు రిజర్వేషన్లు ఉండాలి కదా.. కానీ అటువంటి పరిస్థితి ఏదీ లేదు.  మరీ ముఖ్యంగా కడప నుంచి విశాఖకు రోజూ రెండు బస్సులు తిరుగుతాయి. ఆ బస్సుల్లో జగన్ ప్రమాణ స్వీకారం రోజున కనీసం ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా ముందుగా బుక్ కాలేదు. ఇది వాస్తవం. విశాఖ రావడానికి ఎవరూ ముందస్తు రిజర్వేషన్లు చేయించుకోకుండానే విశాఖ హోటళ్ల రూములన్నీ ఖాళీ లేకుండా ఎలా?  అక్కడికే వస్తున్నాం. హోటళ్లలో రూంలు ముందుగా బుక్ చేసుకుని ఆ తరువాత వాటిని క్యాన్సిల్ చేసుకున్నా క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. అయితే బస్సుల విషయంలో అలా కాదు. బుక్ చేసుకున్న తరువాత క్యాన్సిల్ చేసుకుంటే చచ్చినట్లు క్యాన్సిలేషన్ చార్జీలు కట్టాల్సిందే. అందుకే వైసీపీ ప్రచారం కోసం హోటళ్లు పెద్ద ఎత్తున బుక్ చేసేసింది. క్యాన్సిల్ చేసేసినా వచ్చే నష్టం ఉం లేదు కనుక. కానీ క్యాన్సిలేషన్ చార్జీలు భరించాల్సి వస్తుంది కనుక బస్సులలో సీట్లు బుక్ చేయలేదు. అదీ సంగతి. లేని హైప్ క్రియేట్ చేసి, నిజంగా అంత సీన్ ఉందని కనీసం క్యాడర్ నైనా నమ్మించాలన్న ప్రయాసతోనే జగన్ ప్రమాణ స్వీకారం రోజున విశాఖలో హోటల్ రూంలు ఖాళీలేకుండా బుక్ అయిపోయాయని జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. 

వైసీపీ ఊహలు... పిచ్చి పీక్స్!

పోలింగ్ జరగడానికి ముందు వైసీపీ ‘వైనాట్ 175’ అని ఊగారుగానీ, పోలింగ్ అయిపోయిన తర్వాత ఓటర్ల రెస్పాన్స్ చూసి వాళ్ళకు పరిస్థితి అర్థమైపోయింది. అంతకుముందు ‘బుస్’ అన్నవాళ్ళు ఇప్పుడు ‘తుస్’ అని కూడా అనడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యాలు, ఉత్తుత్తి బిల్డప్పులు ప్రదర్శిస్తున్నప్పటికీ, వైసీపీ నాయకులు - కార్యకర్తలు అందరి మనసులలో ‘జూన్ 4 తర్వాత నా పరిస్థితి ఏమిటి దేవుడా’ అన్న ఆలోచనే మెదులుతోంది. అయితే మొన్నామధ్య వరకు జగన్ ఈసారి కూడా గెలుస్తాడు అని వేణుస్వామి చెప్పడం చూసి వైసీపీ వర్గాలు నిజమే అనుకున్నాయి. అయితే కేసీఆర్ గెలుస్తాడని వేణుస్వామి చెప్పాడు. కేసీఆర్ తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. అప్పటి నుంచి వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. లేటస్ట్.గా ఐపీఎల్‌లో గెలుస్తారని వేణు స్వామి చెప్పిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఫైనల్స్.లో దఢేల్‌మనడంతో మరోసారి వైసీపీ వర్గాల గుండెల్లో బాంబులు పేలాయి. మొదట్లో జగన్ గెలుస్తాడని వేణుస్వామి చెప్పగానే మురిసి ముద్దయిపోయిన ఈ బ్యాచ్, వేణుస్వామి జగన్ గెలుస్తాడని కాకుండా చంద్రబాబు గెలుస్తాడని చెప్పినట్లయితే ఎంత బాగుండేదో అనుకుంటున్నారు. వేణుస్వామి చెప్పిన మాటల మీద నమ్మకం పోయింది గానీ, ఇప్పుడు వైసీపీ నాయకులు తాము గెలవబోతున్నామనే దానికి మరికొన్ని‘ఆధారాలను’ చూపిస్తూ ఆనందపడిపోతున్నారు. ఆ ‘ఆధారాలు’ ఏమిటో చూస్తే, కొంతమంది వైసీపీ నాయకుల మెంటల్ కండీషన్ ఏ స్థాయిలో వుంది అర్థమవుతుంది. ఆధారం-1: జూన్ 3వ తేదీ నుంచి దాదాపు పదీ పదిహేను రోజులపాటు వైజాగ్‌లో వున్న హోటళ్ళన్నిటిలోనూ రూమ్స్ మొత్తం బుక్కయిపోయాయి. అంటే అర్థం ఏమిటి.. ఈ ఎన్నికలలో జగన్ గెలవబోతున్నాడు. దాంతో వైజాగ్‌లో రాజధాని హడావిడి మొదలైపోతుంది. పైగా ప్రమాణ స్వీకారం కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి రూమ్స్ బుక్ అయిపోయాయి. వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం లేకపోతే వైజాగ్‌లో ఈ స్థాయిలో హోటల్ రూమ్స్ ఎందుకు బుక్ అవుతాయి? ఆధారం-2: సాధారణంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుంటే వర్షాలు కురవవు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నా, జగన్ ముఖ్యమంత్రిగా వున్నా వర్షాలు బాగా కురుస్తాయి. మామూలు మేఘాలు మాత్రమే కాకుండా ‘క్యుములోనింబస్’ మేఘాలు కూడా ఏర్పడుతూ వుంటాయి. జూన్ నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం వాళ్ళు చెబుతున్నారు. అంటే, వర్షాలు బాగా కురవబోతున్నాయి కాబట్టి, జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆధారం-3:  సాక్షి మీడియా వాళ్ళు ఏపీలో జనం ముందు మైకులు పెట్టి ఎవరు గెలుస్తారు అని అడిగితే, జగనే గెలుస్తాడు అని చెబుతున్నారు. అంటే అర్థమేంటి? జగనే గెలుస్తాడు. ఆధారం-4: పోలింగ్‌కి కొద్ది రోజుల ముందు జగన్ తన నివాసంలో రాజశ్యామల యాగం చేయించాడు కాబట్టి కంపల్సరీ జగన్ గెలుస్తాడు. ఇవే కాక, ఇలాంటి వింత వింత ఆధారాలను నమ్ముకుని, వైసీపీ వర్గాలు ఊహల్లో బతికేస్తున్నాయి.

కన్ఫమ్.. పెనమలూరు విజేత... బోడె ప్రసాద్!

కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి బోడె ప్రసాద్ విక్టరీ ఖాయమైంది. పెడన నుంచి పారిపోయి వచ్చి, ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి, ఇంతకాలం రౌడీరాజ్యం నడిపించారు. అక్కడ నుంచి ప్రజలు తరిమిన నేపథ్యంలో పెనమలూరు స్థానం నుంచి రంగంలోకి దిగారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బోడె ప్రసాద్‌ని రంగంలో నిలపడంతోనే ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఒక పర్యాయం ఎమ్మెల్యేగా సేవలు చేసి, ఆ తర్వాతి కాలంలో ఓడిపోయినా నియోజకవర్గ ప్రజల సేవలోనే వున్న బోడె ప్రసాద్ మరోసారి టీడీపీ నుంచి పోటీ చేయడం నియోజకవర్గ ఓటర్లకు సంతోషాన్ని కలిగించింది. ఎక్కడి నుంచో పారిపోయి తమ నియోజకవర్గానికి వచ్చిన దుష్టగ్రహాన్ని వదిలించుకునే మార్గం దొరికిందని సంతోషించారు. మే పదమూడున తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిని గమనించిన రాజకీయ పరిశీలకులు ఈ స్థానం నుంచి బోడె ప్రసాద్ విక్టరి కన్ఫమ్ అని క్లియర్‌గా చెబుతున్నారు. తెలుగుదేశం నాయకత్వం పెనమలూరు స్థానం నుంచి బోడె ప్రసాద్‌ని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జోగి రమేష్ మైండ్ గేమ్ ప్రదర్శించారు. ఇక తన విజయం ఫిక్సయిపోయిందని బిల్డప్పు ఇస్తూ బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. అయితే అదంతా వాపే తప్ప బలుపు కాదని ఆ తర్వాత జోగి రమేష్‌కి అర్థమైంది. జనంలో తనకు బలం లేదని ప్రచారం సందర్బంగా పూర్తిగా అర్థం చేసుకున్న ఆయన జనబలం ఎలాగూ లేదు కాబట్టి, ధనబలం, అధికార బలం, రౌడీల బలంతో అయినా విజయం సాధించాలని ఫిక్సయ్యారు. జనాన్ని ప్రలోభాలకు గురిచేయడం, అధికార దుర్వినియోగం చేయడం దగ్గర్నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరపడం వరకు జోగి రమేష్ చేయని అడ్డదారి ప్రయత్నాలు లేవు.  గత 20 ఏళ్ళ చరిత్రలో పెనమలూరు నియోజకవర్గంలో ఏనాడూ ఘర్షణలు జరగలేదు. పెడన నుంచి పారిపోయి వచ్చిన జోగి రమేష్ పుణ్యమా అని ఇక్కడ కూడా ఘర్షణల సంస్కృతి ప్రవేశించింది.  జోగి రమేష్ తరహాలో అడ్డుగోలు వ్యవహారాల్లో తలదూర్చకుండా, స్ట్రెయిట్ ఫార్వర్డ్.గా వుండే బోడె ప్రసాద్ వైపు పెనమలూరు ప్రజలు నిలిచారు. ఆయన ప్రచారం చేస్తున్న సమయంలోనే ఆయన ఏ స్థాయి విజయం సాధించబోతున్నారనేది స్పష్టంగా అర్థమైంది. అది చూసి ఓర్చుకోలేని జోగి రమేష్ టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద భౌతిక దాడులకు తన గూండాలను ప్రోత్సహించారు. ఆ దాడులను కూడా టీడీపీ కేడర్ విజయవంతంగా తిప్పికొట్టారు. మాటకు మాట, చేతకు చేత అన్నట్టుగా బోడె ప్రసాద్ బలంగా నిలవడంతో జోగి రమేష్‌కి తోక ముడవక తప్పలేదు. నియోజకవర్గంలో పోలింగ్ సరళిని గమనించిన జోగి రమేష్ తన ఓటమి ఖాయమని ఫిక్సయ్యారు. అందుకే అప్పటి నుంచి అయ్యగారి నోటి నుంచి వాయిస్ లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత నియోజకవర్గం నుంచి పెట్టేబేడా సర్దుకుని నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయే ఆలోచనలో జోగి రమేష్ ఉన్నట్టు తెలుస్తోంది.

వేణుస్వామి లెక్క తప్పుతుందా? హైదరాబాద్ టీం కూడా పాయే!

తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు, జోతిష్యం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపించే స్వామి వేణుస్వామి.  సినీ తారల జీవితాలను టార్గెట్ చేసుకొని ఆయన చెప్పే జోతిష్యం ట్రెండింగ్, ట్రోలింగ్‌ అవుతుంటాయి.  జాతకాల పేరుతో తనకు ఇష్టం లేని వాళ్లపై పిచ్చికూతలు కూసే వేణుస్వామి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. ఆ హీరో చనిపోతాడని.. ఈ హీరోయిన్ చనిపోతుందని ఇలా చావు జోస్యాలు చెప్పిన చ‌రిత్ర కూడా ఈ స్వామిది.  అయితే ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలపై కూడా ఆయ‌న నోటి దూల తీర్చుకుంటున్నారు.  డబ్బుల కోసం ఎలా కావాలంటే అలా జాతకాలు చెబుతాడని పేరు తెచ్చుకున్న ఆయన,  వైసీపీ పెయిడ్ చానల్స్ లో జగన్ గెలుస్తాడని జోస్యాలు చెబుతూ హడావుడి చేస్తున్నారు. ఏపీకి మళ్లీ జగనే సీఎం అవుతారంటూ,  పేరు మోసిన జ్యోతిష్యుడు వేణుస్వామి ప‌లు ఇంటర్వ్యూలో చెబుతూనే వున్నారు.  నేను రోజుకో మాట మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకుడిని కాదు, జ్యోతిష్యుడిన‌నే ద‌బాయిస్తుంటారాయ‌న‌. ఒక్కసారి చెప్పిన మాట మీదే నేను నిలబడతాను. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైంద‌నేది ఆయ‌న జోస్యం.  ఇటీవ‌ల స్వామి చెప్పిన జోస్యం క‌నీసం ఒక్క‌టైనా నిజ‌మైందా అంటే.....వేణుస్వామి కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. ఏం అయింది.... కేసీఆర్ ఓడిపోయారు. వేణుస్వామీ హైదరాబాద్ టీం, ఐపీఎల్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.. కానీ కనీస పోటీ ఇవ్వలేదు. ఇదే వేణుస్వామి గత మూడు నెలలుగా జగన్ గెలుస్తాడని చెబుతున్నారు.. అది విష‌యం... ఇప్పుడీ స్వామి ప‌రిస్థితి ఎలా వుందంటే ఆ స్వామివి, పిచ్చికూత‌ల‌ని వైసీపీ ఫ్యాన్స్ కూడా కొట్టి ప‌డేస్తున్నారు. స్వామి మాట‌లు న‌మ్మి ఎవ‌రూ బెట్టింగ్ పెట్ట‌వ‌ద్ద‌ని జ‌గ‌న్ అభిమానులే చెబుతున్నారు.  సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయాల వరకూ ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయ్యాన‌ని చెబుతుంటారు ఈ స్వామి.  వాస్తవానికి ఆయన చెప్పినవాటిల్లో జరిగినవి ఏమైనా ఉన్నాయా అంటే వాటిని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. జరగనవైతే లెక్కబెట్టలేనంత ఉంటాయి. వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి రాజకీయ నేతల జాతకాలు నా వద్ద ఉన్నాయి. అయితే ఆయన జాతకం ప్రకారం వైఎస్ జగన్‌కు తిరుగు ఉండదు. చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు. కాబట్టి ఆయనకు ఎలాంటి రాజయోగం లేదు. పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి రాలేడు. కానీ ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు అంటూ వేణుస్వామి జోస్యం పేరుతో ఇలా త‌న నోటి దూల తీర్చుకుంటున్నాడు.   అయితే ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో అభిప్రాయలు విభిన్నంగా కనిపిస్తున్నాయి. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

తెలంగాణపై రెమాల్ తుఫాన్ ప్రభావం...13 మంది మృత్యువాత 

రెమాల్ తుపాను ప్రభావం తెలంగాణపైనా పడింది. అకాల వర్షం అన్నదాతలకు నష్టం మిగల్చడమే కాదు, పలుచోట్ల అమాయకుల ప్రాణాలు బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానతో జనజీవనం స్తంభించింది. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే వర్షబీభత్సానికి వేర్వేరు చోట్ల ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాడూరు శివారు ఇంద్రకల్‌ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి నలుగురు మృతి చెందారు. ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. తెలకపల్లి మండల శివారులో పిడుగు పడి లక్ష్మణ్ అనే 13 ఏండ్ల బాలుడు చనిపోయాడు. తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులు చేస్తున్న కుమ్మరి వెంకటయ్య అనే రైతు మృతి చెందాడు. రేకుల షెడ్డు ఇటుక పడి మరో వ్యక్తి విగతజీవిగా మారాడు. గాయపడ్డవారితో పాటు మృతదేహాలను నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రభుత్వాసుత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో వేసవి విడిది కోసం ఇంటికొచ్చిన ఇద్దరి ఉసురు తీసింది గాలివాన. వ్యవసాయ పొలం వద్దకెళ్లి సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు కోళ్ల ఫామ్‌ గోడకూలి ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చెట్టు విరిగి ద్విచక్రవాహనంపై పడటంతో, దానిపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి వద్ద ట్రాక్టర్‌పై చెట్టుపడి 5 మందికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లాలో ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. రేకుల ఇళ్లపైన కప్పులు గాలికి కొట్టుకుపోయాయి. పానగల్ రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లి సైదులు అనే యువకుడు గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లాలో చెట్లు కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్‌ను సైతం అకాలవర్షం అతలాకుతలం చేసింది. ఎండ తాకిడి నుంచి వాహనదారులకు ఉపశమనం కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన, గ్రీన్ మ్యాట్ షెడ్ కూలిపోయి ఓ బస్సు, ఇన్నోవాపై పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మల్కాజిగిరి, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి.

 యెర్నేని సీతాదేవి ఇక లేరు 

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన యెర్నేని సీతాదేవి ఈ ఉదయం కన్నమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ముదినేపల్లి నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీతాదేవి విజయ డెయిరీ డైరెక్టర్‌ గానూ పనిచేశారు. ఆమె స్వస్థలం కైకలూరు మండలంలోని కోడూరు. 2013లో సీతాదేవి బీజేపీలో చేరారు. సీతాదేవి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త నాగేంద్రనాథ్ (చిట్టి) ఏపీ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. నిరుడు ఆయన కన్నుమూశారు. నాగేంద్రనాథ్-సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కైకలూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీతాదేవి మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

వైసీపీకి సీన్ రివర్స్!

జగన్ కు ఏ విషయమైనా సరే రివర్స్ లో జరిగితేనే ఇష్టం. ఆయన 2019లో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రివర్స్ లోనే పాలన సాగించారు. అంత వరకూ అభివృద్ధిలో అగ్రస్థానం వైపు దూసుకు వెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆపోజిట్ గా పరుగులు పెట్టించారు. వేగంగా నిర్మాణం అవుతున్న అమరావతిని నిర్వీర్యం చేసేశారు. ఠాఠ్ అమరావతి ఒక్కటే రాజధాని ఏమిటి?  ఏపీకి మూడు రాజధానులు కావాలి అంటూ కొత్త నినాదం తీసుకుని పాలనను రివర్స్ గేర్ లో  నడిపారు. ఆంధ్ర ప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం పురోగతిని స్తంభింప చేసేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ తిరోగమనానికి శ్రీకారం చుట్టారు.  ఐదేళ్ల పాలన తరువాత ఆయనకు ఇప్పుడు 2019 ఫలితం రివర్స్ లో రావడం ఖాయమైపోయిందని పరిశీలకులే కాదు, ప్రజలూ ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ రివర్స్ ఫలితం ఆయన కోరుకున్నదేనంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.  ఔను మే 13న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ట్రెండ్ చూసిన తరువాత వైసీపీయే ఈ సారి  తమకు 2019నాటి ఎన్నికలకు పూర్తి రివర్స్ గా రానున్నాయని అంగీకరించేస్తున్నారు.  అంతే కాదు ఇప్పుడు వైసీపీ మాటలు కూడా 2019 ఫలితాల సమయంలో మాట్లాడిన మాటలకు పూర్తి రివర్స్ గా ఉన్నాయి. అదే ఇంకా అర్ధం కాని వారెవరైనా ఉంటే వారికి కూడా ఫలితం అర్ధమయ్యేలా చేస్తున్నది.  అప్పట్లో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు ఆ పాత్ర అధికార పార్టీగా ఉన్న వైసీపీ పోషిస్తోంది. ఎన్నికలకు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం తనకు ఏ కోశానా లేదని పోలింగ్ కు ముందు వైసీపీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. పోలింగ్ ముగిసిన క్షణం నుంచీ వైసీపీ నేతలు అదే పాట పాడుతున్నారు.   

మార్పు కనిపించేస్తోందిగా? వైసీపీకి సీన్ అర్ధం అయిపోయిందా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారుతోందన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఇంత కాలం వైసీపీ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు ఇప్పుడు తటస్థంగా ఉంటున్నారు. అంతే కాదు ఎన్నికల సంఘం పలువురు పోలీసు అధికారులపై వేటు వేసింది. అలా వేటు పడిన స్థానంలో వచ్చిన వారు.. మరింత మందిని కీలక విధులకు దూరం చేశారు. మరింత మందిపై నిఘా పెట్టారు. ఈ మార్పు ఒక్క సారిగా పోలీసు వ్యవస్థలో కింది నుంచి పై దాకా ఉలిక్కిపడేలా చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో, ఒక పార్టీతో అంటకాగితే జరిగే పరిణామాలేమిటో తేటతెల్లం చేసింది. దీంతో ఏపీ పోలీసుల తీరు ఒక్కసారిగా మారిపోయింది. గత ఐదేళ్లూ ఒక తీరు.. గత కొద్ది రోజులుగా మారో తీరుగా మారిపోయింది.   వైసీపీ హయాంలో అంటే గత ఐదేళ్లుగా పోలీసు అధికారులకు పదోన్నతులు, కీలక పోస్టింగులకు వారిపై ఉన్న అభియోగాలూ, అధికార పార్టీకి అనుకూలంగా పని చేయడానికి సై అనడమే అర్హతలుగా మారాయి. ఇప్పుడు అలా కీలక  పోస్టింగులలో వచ్చి తిష్ట వేసిన వారికి ఇప్పుడు స్థాన చలనం కలిగింది.  ఇక మిగిలిన వారిలో భయం మొదలైంది. దీంతో మొత్తం పరిస్థితి వైసీపీకి రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని చెప్పడానికి  వైసీపీ పెద్దల మాటలను కింది స్థాయి పోలీసులే ఖాతరు చేయకపోవడాన్ని ఉదాహరణగా పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ బాధితులపైనే కేసుల నమోదుకు పరిమితమైన పోలీసులు ఇప్పుడు వైసీపీ కేడర్, నాయకులపై కూడా యాక్షన్ తీసుకోవడానికి, కేసులు నమోదు చేయడానికి వెనుకాడటం లేదు.   రాష్ట్రంలో మారిన  ఈ పరిస్థితే జూన్ 4న ఫలితం ఎలా ఉండబోతోందో చెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ప్రజల నాడి ఎలా ఉందో, ప్రజల మొగ్గు ఎటువైపు ఉందో అందరి కంటే నిక్కచ్చిగా, కచ్చితంగా అంచనా వేయగలిగేది క్షేత్ర స్థాయిలో పోలింగ్ విధులు నిర్వహించిన పోలీసులే అని అంటున్నారు. 

స్వోత్కర్ష.. పరనింద.. పేర్నినానికి ఇదే పనా?

పేర్ని నాని.. వైసీపీలో అందరూ మాటలు ఆపేసిన వేళ పేర్ని నాని మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ  సొంత నియోజకవర్గ ప్రజలకు మాంఛి వినోదం అందిస్తున్నారు. ఓటమి భయం కప్పిపుచ్చుకోవడానికి మాటలను కోటలు దాటిస్తున్నారు. బందరులో తన కుమారుడు విజయం సాధిస్తారో లేదో చెప్పడానికి ఆయన దగ్గర సరైన గణాంకాలు లేవు కానీ మాచర్లలో మాత్రం పిన్నెల్లి విజయం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి కంచుకోట అని చెబుతూ అందుకు ఉదాహరణలు చెబుతున్నారు. ఒక వైపు పిన్నెల్లి సోదరుల దౌర్జన్యం, దుర్మార్గాలను ప్రపంచం అంతా వీక్షిస్తున్న సమయంలో పేర్ని నాని పిన్నెల్లికి వత్తాసు పలుకుతూ, అసలు సినిమా జూన్ 4 తరువాత చూస్తారని బెదరిస్తున్నారు.  ఇప్పుడు కాదు.. 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే వైసీపీలో మేధో శూన్యత ఉందనీ, స్వోత్కర్ష, పర నిందే ఆ పార్టీ సిద్ధాంతమనీ అందరికీ అర్ధమైపోయింది. నిస్సిగ్గుగా తమ తప్పులను సమర్ధించుకోవడమే కాకుండా.. తమ వైఫల్యాలను కూడా విపక్షంపై నెట్టివేసి చప్పట్లు కొట్టే విద్యలో  వైసీపీ ఆరితేరిపోయింది. ఇప్పుడు అదే ఆరితేరిన విద్యను కొత్తగా పేర్ని నాని మరోసారి మొదలెట్టేశారు.  ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నేల్లినే బాధితుడిగా అభివర్ణించడానికి పేర్ని నాని ఎక్కడా సంకోచించడం లేదు. మీడియా ముందుకు వచ్చి పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్రపన్నిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ కుట్రకు ఎన్నికల సంఘంన, పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ గగ్గోలు పెట్టేశారు.   ఇంత కాలం ఎవరి అండ చూసుకునైతే వైసీపీ నేతలూ, మూకలూ రెచ్చిపోయాయో అదే పోలీసులు పాపం వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మారిపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఓటమికి సాకులు వెతుక్కునే వారే ఇటువంటి బేల మాటలు మాట్లాడతారు. ఇంత బేలగా, ఇంత దిగజారి ఆరోపణలు గుప్పిస్తున్న పేర్ని నాని అదే నోటితో పిన్నెల్లి విజయం ఖాయమంటూ జోస్యం చెబుతున్నారు. విజయం ఖాయం అయితే ఈవీఎం ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, దాడులకు, దౌర్జన్యాలకు దిగి, ఓటర్లను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాల్సి వచ్చింది అన్న దానికి మాత్రం పేర్ని సమాధానం చెప్పరు. అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమిటి? మేం చెబుతాం మీరు వినండి అన్నట్లుగా సాగింది పేర్ని ధోరణి.   ఇంతకీ పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్ర అంటూ ఆరోపణలు చేసిన పేర్ని మాటల సారాంశం.. జూన్ 4 వరకూ ఎదురు చూడటం ఎందుకు.. మేం ఓడిపోయాం.. మా ప్రాణాలకు భద్రత కల్పిస్తే చాలు అని వేడుకోవడంలాగే  ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వాస్తవానికి  ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పిన్నెల్లి కోర్టు షరతులను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నరసరావు పేటలోనే ఉండాలి. కానీ ఆయన నరసరావు పేటలో ఉండటం లేదు. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి అజ్ణాతంలోనే ఉన్నారు.  ఈ విషయాన్ని దాచిపెట్టి ఎదురు ఆయన హత్యకు తెలుగుదేశం కుట్ర పన్నిందనీ, ఆ కుట్రకు పోలీసులు సహకరిస్తున్నారనీ ఆరోపణలు మొదలెట్టేసింది. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వైసీపీ తీరు ఉందన్న మాట. పేర్ని నాని ఎంతగా గొంతు చించుకున్నా పిన్నెల్లి విధ్వంస, దౌర్జన్య కాండ గురించి తెలిసిన ఏ ఒక్కరూ పిన్నెల్లిని కానీ, ఆయనకు వత్తాసుగా గొంతుచించుకు గగ్గోలు పెడుతున్న పేర్ని నానిని కానీ ఇసుమంతైనా నమ్మడం లేదు. అజ్ణాతంలో ఉన్న పిన్నెల్లి కౌంటింగ్ రోజున మరింత విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఆదివారం పల్నాడులో జరిగిన దాడే నిదర్శనంగా నిలుస్తుంది. 

వైసీపీకి జనం రాసిన మరణశాసనం?

జూనియర్ ఎన్టీఆర్  నటించిన అదుర్స్ అనే సినిమాలో  కొవ్వు ఎక్కువై తెలియలేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపైంది అని ఓ డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆ డైలాగ్ వైసీపీకి అతికినట్లుగా సరిపోతుంది. అధికార మదం తలకెక్కి అర్ధం కావడం లేదు కానీ.. వైసీపీ ఓటమి ఖరారై చాలా కాలమైంది.  నిజమే.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేది ఎవరో అధికారికంగా తేలడానికి ఇక ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తై ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే జనం తీర్పు ఏమిటన్నది వైసీపీతో సహా అందరికీ పోలింగ్ రోజునే అవగతమైపోయింది.  అధికారమదం తలకెక్కి అర్ధం కాలేదు కానీ.. వైసీపీ ఓటమి కోసం జనం ఎప్పుడో తమ ఆయుధానికి పదును పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా జగన్ కు మరో చాన్స్ ఇచ్చేది లేదని డిసైడైపోయారు. తమ ఓటు భద్రంగా ఉందో లేదో అనుక్షణం వెరిఫై చేసుకుంటూ వచ్చారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఇదంతా జనం నిశ్శబ్దంగా చేశారు. ఈ నిశ్శబ్దం వెనుక ప్రభుత్వ వ్యతిరేకత వారిలో నివురుగప్పిన నిప్పులా ఉంది. గడప గడపకు నుంచి వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలినా.. ఆ ఏముందిలే అనుకున్నారు. వైనాట్ 175 ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమా వెనుక ప్రజలు వ్యతిరేకించినా, అవినీతికి అలవాటుపడ్డ కొందరు ఉన్నతాధికారులు, పోలీసుల సహకారంతో వారిణి భయపెట్టి పబ్బం గడిపేసుకోగలమని భావించారు.  అయితే అది సాధ్యం కాదు.   రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరన్న సంకేతాలు ఏడాది ముందు నుంచే స్పష్టంగా కనిపించాయి. ఎన్నికలలో జగన్ రెడ్డి  బొక్కబోర్లా పడడం ఘయమని ఎప్పుడో తేలిపోయింది.  సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్ప కుండా ప్రజల ఖాతాల్లో . పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు చచ్చుకుంటూ మళ్ళీ  తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని వైసీపీ నేతలు పగటి కలలు కన్నారు. గాలిలో మేడలు కట్టుకున్నారు. ఆశల పల్లకిలో ఊరేగారు.   ప్రజలు సంక్షేమం అంటూ జగన్ సర్కార్ ఇచ్చిందేదో పుచ్చుకున్నారు. అయితే జగన్ కు మరో చాన్స్ ఇచ్చే ప్రశక్తే లేదన్న నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నారు. విధ్వంసం తప్ప విజన్ లేని పాలకుడు ఇక వద్దే వద్దని నిర్ణయానికి వచ్చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఏమిటో అనుకున్నామనీ, జగన్ అధికారంలోకి వచ్చి రివర్స్ పాలన ప్రారంభించిన తరువాత కానీ    జగన్ రెడ్డి మాటలను కూడా రివర్స్ గానే అర్ధం చేసుకోవాలని అర్ధం కాలేదని వాపోయారు. అప్పులు చేయడం సంక్షేమం అంటూ చిల్లర విసరడం తప్ప జగన్ హయాంలో రాష్ట్రంలో వీసమొత్తు అభివృద్ధి జరగలేదు.   చేసిన పనులకు కాంట్రాక్టర్లు బిల్లులు అందలేదు. దీంతో   రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులకు టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.  కాంట్రాక్టర్లకే కాదు పార్టీ క్యాడర్ కు మేలు చేయడం కోసం అంటూ కేటాయించిన నామినేషన్ పనులకు కూడా పార్టీ క్యాడర్, నేతలు ముందుకు రావడం మానేశారు. అంటే పార్టీ క్యాడర్ లోనే   జగన్ రెడ్డి విశ్వాస స్థాయి  దిగజారింది. అంతెందుకు  ప్రభుత్వ భూములు  ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాథుడే లేకుండా పోయారు.   ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్  వైజాగ్ లో   జగనన్నస్మార్ట్ టౌన్ షిప్ లో  సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెడితే ప్రజల నుంచి స్పందన లేదు.  వాస్తవానికి   ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది అన్న నమ్మకంతో జనం ముందుకు రావాలి.  చంద్రబాబు హయాంలో   అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. అదీ విశ్వాసం అంటే. కానీ జగన్ సర్కార్ కు ప్రజలలో విశ్వసనీయత లేదనడానికి జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్ లు కొనడానికి ఎవరూ రాకపోవడమే నిదర్శనం అని అప్పుడే తేలిపోయింది. ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలూ, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేమని చెప్పకనే చెప్పేశారు. అయినా వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు ఆ విశ్వాసంతో తమకే ఓటు వేస్తారని నమ్మింది. మే 13న పోలింగ్ సరళి చూసిన తరువాత కానీ వైసీపీ నేతలకు అర్ధం కాలేదు. వాస్తవం బోధపడలేదు. హింస, దౌర్జన్యం, దుర్మార్గాలతో జనాలను భయపెట్టి ఓట్లేయించుకోలేమని. ప్రజలు తమ పార్టీని తిరస్కరించారని.  అందుకే వైసీపీలో ఇంత కాలం నోరెట్టుకు పడిపోయిన ఏ నాయకుడూ కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. వైసీపీ ఓటమి ఖాయమని చెప్పడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

‘జయ జయహే తెలంగాణ’ గీతం వరస మారుతున్నది!

‘జయ జయహే తెలంగాణ’ అంటూ సాగే తెలంగాణ రాష్ట్ర గీతంలో సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో స్పల్ప మార్పులు, చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాయదుర్గంలో వున్న కీరవాణి మ్యూజిక్ స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గీతంలో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో చర్చించారు. తెలంగాణ గీతంలో జిల్లాల ప్రస్తావన, మరికొన్ని మార్చాల్సిన అంశాలు వున్నాయి. ఆయా అంశాలను మార్చి, వాటి స్థానంలో ఏయే అంశాలను ప్రస్తావించాలన్న పాయింట్ మీద వీరి మధ్య డిస్కషన్ జరిగింది. కీరవాణి బాణీ కట్టిన పాటను సీఎం రేవంత్ రెడ్డి రెండు మూడుసార్లు విని, ఆ పాటలోని అంశాలను చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు వున్నాయి. అందెశ్రీ రాసిన పాటలో పది జిల్లాలు అని వుంటుంది. ఆ పదాన్ని తొలగించి, ఆ స్థానంలో పద.. పద.. అనే పదాన్ని చేర్చినట్టు తెలుస్తోంది.

2 వేల మంది సజీవ సమాధి: విరిగి పడిన కొండ చరియలు!

పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలోని ఎన్గా ప్రావిన్స్‌.లో కొండ చరియలు విరిగిపడి 2 వేల మంది మరణించారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘అంతర్జాతీయ వలస సంస్థ’ ప్రకటించింది. ప్రమాద సమయంలో తొలుత కొండ చరియల కింద 60 ఇళ్ళు కూరుకుపోయాయని భావించారు. కానీ, మొత్తం 150 ఇళ్ళు శిథిలాల కింద కూరుకుపోయాయని ఆ తర్వాత తెలిసింది. శిథిలాల కింద 2 వేల మందికి పైగా జీవ సమాధి అయిపోయారని భావిస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తున వున్న బురదలో కూరుకుపోయిన వారు బతికే అవకాశం లేదని తెలుస్తోంది. ఆదివారం నాటికి కేవలం 5 మృతదేహాలను మాత్రమే బయటకి తీయగలిగారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుఝామున అందరూ గాఢ నిద్రలో వున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో వున్న ప్రజలు పారిపోయే అవకాశం కూడా లేకుండా సజీవ సమాధి అయ్యారు.

బీభత్సం సృష్టించనున్న రెమాల్‌ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను,  తీవ్ర తుఫానుగా మారి బీభత్సం సృష్టించనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ సాగర్ ఐలాండ్స్క 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రెమాల్ ఉత్తర దిశగా కదులుతూ  మరింత బలపడుతున్నది. ఆదివారం ( మే 26)  అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా, వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య   తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో  గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ గాలుల తీవ్రత   135 కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.  తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్‌ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ   అప్రమత్తం చేసింది.  ఈ క్రమంలో సోమవారం వరకూ మత్స్యకారులు ఎవరూ సముద్రంలో   వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ మీదుగ ఆవర్తనం.. కేరళ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో  పశ్చిమ దిశ నుంచి ఏపీ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల చెదురు మొదురు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.  తుఫాను ప్రభావం వల్ల శనివారం (మే 25) ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అనంతపురంలో శుక్రవారం రాత్రి భారీవర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 86.4, కణేకల్లులో 70, ఉరవకొండలో 62 మి.మీ.లు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలో 72.2 మి.మీ.లు, కనగానపల్లి మండలంలో 63 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో చేతికి వచ్చిన పంట వర్షం పాలు కావడంతో రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచిఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం శిలాతోరణం వరకూ   ఉచిత బస్సులను అందుబాటులో ఉంచింది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక శనివారం శ్రీవారిని మొత్తం 83 వేల 866 మంది దర్శించుకున్నారు. వారిలో 44 వేల 479 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది. 

ఏపీ సీఎస్ కుమారుడి భూభాగోతం..? ధ‌ర్మాన హెచ్చ‌రిక‌లు అందుకేనా?

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలవాల్సిన‌ ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి భూబ‌కాసురుడిలా మారారా? విశాఖలో దళితుల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అప్ప‌నంగా మింగేయాలని ప్రయత్నించాడా?    2వేల కోట్ల రూపాయల భూముల‌ను కాజేసేందుకు స్కెచ్ వేశారా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. జ‌వ‌హ‌ర్ రెడ్డి మ‌రో నెల‌రోజుల్లో సీఎస్ ప‌ద‌వి నుంచి రిటైర్డ్ కానున్నారు.. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హాయ‌ స‌హ‌కారాల‌తో జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడు, ప‌లువురు వైసీపీ ముఖ్య‌నేత‌లు అసైన్డ్ భుముల‌ను కాజేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ఏకంగా 800 ఎక‌రాల‌ను అప్ప‌నంగా కొట్టేసేందుకు కుమారుడికి జ‌వ‌హ‌ర్ రెడ్డి స‌హ‌క‌రించారని జ‌న‌సేన నేత పీత‌ల మూర్తి యాద‌వ్ ఆరోపించారు. జ‌వ‌హ‌ర్ రెడ్డి  అధికారిక కార్య‌క్ర‌మాలు లేకుండా అనేక ప‌ర్యాయాలు దొంగ‌చాటున విశాఖ న‌గ‌రానికి ఎందుకు వెళ్తున్నారు? అంత‌ గోప్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను ఉంచాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏముంద‌ని జ‌న‌సేన నేత ప్ర‌శ్నించారు. పేద‌లు అసైన్డ్ భూములు, డీ ప‌ట్టా భూములు అమ్ముకునేందుకు వైసీపీ ప్ర‌భుత్వం ఓ చ‌ట్టాన్ని చేసింద‌నీ, ఈ చ‌ట్టాన్ని అడ్డుపెట్టుకొని భోగాపురం చుట్టుప‌క్క‌ల ఉన్న‌టువంటి ప్ర‌ధాన ప్రాంతాల్లో 800 ఎక‌రాలు జ‌వ‌హ‌ర్ రెడ్డి నేతృత్వంలో ఆయ‌న‌ కుమారుడు పేద రైతుల ద‌గ్గ‌ర నుంచి అక్ర‌మంగా దొడ్డిదారిన రాయించుకున్న‌ట్లు జ‌నసేన నేత ఆరోప‌ణ‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వానికి కాలం చెల్లింద‌ని గ‌మ‌నించి రాత్రికి రాత్రే ప‌ట్టాల‌ను త‌మ పేర్ల‌పై రిజిస్ల్రేఫన్లు చేయించుకుంటున్నార‌ని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.  సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడిపై జ‌న‌సేన నేత చేసిన ఆరోప‌ణ‌ల్లో ఎంత వ‌ర‌కు వాస్త‌వం ఉంద‌నే విష‌యం ప‌క్క‌న పెడితే.. గ‌తంలో వైసీపీ నేత‌, మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావు చేసిన హెచ్చ‌రిక‌లు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఎన్నికల‌కు ముందు ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌డ‌ప నుంచి ఎవ‌రో వ‌చ్చి శ్రీకాకుళం జిల్లా, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో భూదందాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళంలో కడప రెడ్లు పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోను.. అది ఏ పార్టీ వారు అయినా స‌రే అంటూ ధ‌ర్మాన హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అప్ప‌ట్లో ధ‌ర్మాన చేసిన వ్యాఖ్య‌లు జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడి భూదందాను ఉద్దేశించి చేసిన‌వేన‌ని ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతున్నది. అప్ప‌టి నుంచే జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడు భారీ ఎత్తున భోగాపురం ప‌రిస‌ర ప్రాంతాల్లో భూదందాకు తెర‌ లేపార‌ని, సీఎస్ స‌హ‌కారం, ప్ర‌భుత్వ పెద్ద‌ల అండదండలు కూడా పుష్క‌లంగా ఉండ‌టంతో ధ‌ర్మాన అప్పట్లో హెచ్చ‌రిక‌లు చేశార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.  ఏపీ సీఎస్‌ జ‌వ‌హ‌ర్ రెడ్డి స‌హ‌కారంతో ఆయ‌న కుమారుడు భూదందాకు పాల్ప‌డిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై తెలుగుదేశం నేత‌లు స్పందించారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ  సీఎస్ జవహర్ రెడ్డి ఈరోజు నుండి ఏ ఫైల్ చూడకుండా, ముఖ్యంగా భూ వ్యవహారాలకు చెందిన ఫైల్స్ చూడకుండా ఎన్నికల సంఘం కట్టడి చేయాల‌ని కోరారు. విశాఖకు చెందిన ఏ అధికారి కూడా ఆయనను కలవకుండా నిరోధించాలన్నారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేసి సీఎస్ జవహర్ రెడ్డి విదేశాలకు పోకుండా పాస్ పోర్ట్‌ను స్వాధీన పరుచుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన కదలికలపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎస్‌, ఆయ‌న కుమారుడి భూభాగోతంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని,  జవహర్ రెడ్డి పదవీవిరమణ చేయకముందే  ఆయనను విచారించి, ఆయన భూభాగోతాలను ప్రజలకు తెలియజేయాల‌ని వ‌ర్ల రామ‌య్య సీఈసీని కోరారు.  సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడి భూదందాకు ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంద‌ని అన‌డంలో ఎలాంటి అతిశయోక్తి లేద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏపీ సీఎస్ గా జ‌వ‌హ‌ర్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ప్ర‌భుత్వ అధికారిలా కాకుండా వైసీపీ కార్య‌క‌ర్త‌లా ప‌నిచేస్తున్నారని విప‌క్ష పార్టీల నేత‌లు మొత్తుకుంటున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏది చెబితే అది చేయ‌డంతో పాటు,  ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌రువాత‌కూడా ఆయ‌న వైసీపీ కార్య‌క‌ర్త‌గానే ప్ర‌వ‌ర్తించార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇందులో భాగంగా పెన్ష‌న్లు పంపిణీ విష‌యంలో, వాలంటీర్ల విష‌యంలో జ‌వ‌హ‌ర్ రెడ్డి తీరు వైసీపీ ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉంద‌ని తెలుగుదేశం నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు.  సీఎస్ ప‌ద‌వి నుంచి జ‌వ‌హ‌ర్ రెడ్డిని తొల‌గించాల‌ని ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నాటి నుంచి విప‌క్ష పార్టీల నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరుతూ వ‌స్తున్నారు. జ‌గ‌న్ చెప్పింద‌ల్లా సీఎస్ చేయ‌డంతో అత‌ని కుమారుడు భూదందాకు ప్ర‌భుత్వ పెద్ద‌లు స‌హ‌క‌రించార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  త‌న‌పై, త‌న కుమారుడిపై వ‌స్తున్న భూదందా ఆరోప‌ణ‌ల‌పై సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి స్పందించారు. విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు గత ఐదేళ్లలో విశాఖలో గాని, ఉత్తరాంధ్రలో గాని ఏ జిల్లాకు వెళ్లలేదు. తన కుమారుడిని అడ్డం పెట్టుకుని బినామీల పేరిట భూములు చేజిక్కించుకున్నట్లు చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మరో 400 ఎకరాలపైగా భూములను పెద్ద ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అధికారులను పరుగులు పెట్టించినట్లు చేసిన ఆరోపణ ఏమాత్రం వాస్తవం కాదు. ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి మీద రెండు నెలలుగా ఒక పథకం ప్రకారం వ్యక్తిత్వ ఖననం చేసే తీవ్ర కుట్రలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కార్పొరేటర్ మూర్తి యాదవ్ తనపై నాపై చేసిన తప్పుడు ఆరోపణలను వెనక్కి తీసుకుని మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని జ‌వ‌హ‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు. ఏది ఏమైనా సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడి భూదందా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించడం పక్కన పెడితే..ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలనీ, అంత వరకూ సీఎస్ ను విధులకు దూరంగా ఉంచాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల సంఘం వెంటనే ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి.