రేవంత్ టీజింగ్ మామూలుగా లేదుగా?
posted on May 30, 2024 @ 11:05AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాలతో బీఆర్ఎస్ ను విపరీతంగా టీజ్ చేస్తున్నారు. ఉక్రోషంతో వారు అవాకులూ, చవాకులూ మాట్లాడి ప్రజలలో మరింత చులకన కావడానికి రేవంత్ తీరు దోహదం చేస్తోందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఆవిర్భావ పదో వార్షికోత్సవాన్ని ఘనంగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆ దశాబ్ది ఆవిష్కరణోత్సవాల సందర్భంగానే రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం ఆవిష్కరించాలనీ నిర్ణయించింది. అక్కడే రేవంత్ బీఆర్ఎస్ ను ఇరుకున పడేశారు. అందేశ్రీ రాసిన జయజయహే గీతాన్ని ప్రసిద్ధ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి చేత ట్యూన్ కట్టించారు.
దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి బాణీ కట్టడమేంటి? ఇది తెంగాణ ద్రోహం, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం అంటూ గగ్గోలు పెట్టడం మొదలెట్టింది. దీనికి ఏ మాత్రం ఖాతరు చేయని రేవంత్.. తెలంగాణ రాష్ట్ర గీత రచయత అందెశ్రీ స్వయంగా ఆ గీతానికి కీరవాణి మాత్రమే ట్యూన్ చేయగలరని స్వయంగా తనను కోరారని గీత రచయత మాటకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. దీంతో ఈ విషయాన్ని తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు ఉపయోగించుకుని రేవంత్ ను ఇరుకున పెట్టాలని భావించిన బీఆర్ఎస్ వ్యూహం బూమరాంగ్ అయ్యింది. ఎదురు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. కాళేశ్వరం, యాదాద్రి..ఇలా ఎన్నో ప్రతిష్ఠాత్మక నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఆంధ్రావారికే కట్టబెట్టారు కదా? అన్న చర్చ తెరపైకి వచ్చి బీఆర్ఎస్ ప్రతిష్ట మరింత మసకబారింది.
ఇక రాష్ట్ర చిహ్నం విషయంలో కూడా బీఆర్ఎస్ గగ్గోలు పెట్టింది. కాకతీయ కళాతోరణాన్ని తీసేయడమేంటంటూ ఊరూవాడా ఏకమయ్యేలా గోడవగొడవ చేసింది. అయితే రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులను తొలగించాలని రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరాలను సర్కార్ పట్టించుకోదని తేటతెల్లమైపోయింది. అయితే రాచరికపు గుర్తులను తొలగించాలన్న సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వినా మరే రాజకీయ పార్టీ వ్యతిరేకించడం లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర గీతంపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరం లాగే రాష్ట్ర చిహ్నం విషయంలో అభ్యంతరాలు కూడా కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే పరిమితం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెట్టేలా రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం (మే30) సాయంత్రం రాజకీయనేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలనూ ఆహ్వానించారు. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాల ఈ భేటీలో వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.
దీంతో ఈ భేటీకి బీఆర్ఎస్ హాజరౌతుందా? గైర్హాజరౌతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒక వేళ హాజరైతే ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఇతర పార్టీల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉండదు. దీంతో అఖిలపక్ష భేటీలో ఆమోదం పొందిన నిర్ణయంపై ఆ తరువాత గళమెత్తడానికి బీఆర్ఎస్ కు అవకాశం ఉండదు. గైర్హాజరైతే బీఆర్ఎస్ అభ్యంతరాలు రిజిస్టర్ కావు. దీంతో రేవంత్ నిర్ణయం బీఆర్ఎస్ కు ముందు గొయ్యి, వెనుక నుయ్యిలా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.