ఆ ఐదు నియోజకవర్గాలపైనే అందరి దృష్టీ!
posted on May 30, 2024 @ 10:45AM
ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 111 నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తవుతుందన్న మీనా 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలున్నాయన్నారు. ఇలా ఉండగా ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఒట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు.
అదలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో దాదాపు 82శాతం ఓటింగ్ జరిగింది. ఇది 2019 ఎన్నికల కంటే రెండు శాతం కంటే ఎక్కువ. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలు వెల్లడౌతాయి. కుప్పం, పులివెందుల, పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాలలో అయితే రాష్ట్ర సగటు కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గాలలో పోటీలో ఉన్న వారందరూ సెలబ్రిటీలే కావడం గమనార్హం. కుప్పం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోటీ చేశారు. అలాగే పులివెందుల నుంచి వైసీపీ అధినేత జగన్, పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయగా, మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేశారు. ఈ అన్ని నియోజకవర్గాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ నియోజకవర్గాలలో గెలుపు ఓటముల కంటే ఆయా స్థానాలలో అభ్యర్థుల మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఆ ఉత్కంఠ ఉంది. అయితే ఆశ్చర్యకరంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గంలో మాత్రం ఈ సారి ఓటింగ్ గతంతో పొలిస్తే తగ్గింది. అది పక్కన పెడితే ఈ సెలబ్రిటీల నియోజకవర్గాలలో అన్నిటి కంటే ముందుగా కుప్పం, లేదా పిఠాపురం నియోజకవర్గ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలలో కౌంటింగ్ 18 రౌండ్లలో పూర్తి అవతుంది. ఈ రెండింటి తరువాత హిందుపురం ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. ఎందుకంటే హిందూపురంలో 19 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుంది.
ఇక నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో కౌంటింగ్ 22 రౌండ్లు ఉంటుంది. అదే విధంగా జగన్ పోటీ చేసిన పులివెందులలో కూడా 22 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. దీంతో ఈ సెలబ్రిటీలు పోటీ చేసిన నియోజకవర్గాల ఫలితాలు అదే వరుసలో వెలువడే అవకాశం ఉంది. అంటే ఈ నియోజకవర్గాలలో మొదట కుప్పం లేదా పిఠాపురం ఫలితం వెలువడుతుందన్న మాట. అయితే కౌంటింగ్ ఎన్ని రౌండ్లలో పూర్తి అవుతుంది అన్నది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈ అన్ని నియోజకవర్గాలలోనూ ఓట్ల లెక్కింపు ఆరంభంతోనే ట్రెండ్ ను బట్టి విజేత ఎవరన్నది తేలిపోతుంది. పోటీ హోరాహోరీగా జరిగితే తప్ప గెలుపు ఓటముల విషయం తెలియడానికి పెద్ద సమయం పట్టదు.
కానీ కచ్చితమైన మెజారిటీ ఎంత అన్నది తేలడానికి మాత్రం కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఆగాల్సి ఉంటుంది. ఈ సెలబ్రిటీలు పోటీ చేసిన నియోజకవర్గాలలో ఒక్క పులివెందులలోనే పోటీ హోరాహోరీగా జరిగిందని పరిశీలకులు అంటున్నారు. అది వినా కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురంలలో కూటమి అభ్యర్థుల విజయం నల్లేరు మీద బండినడకేనని పోలింగ్ సరళిని ఉటం కిస్తూ సెఫాలజిస్టులు చెబుతున్నారు. పులివెందులలో షర్మిల ఫ్యాక్టర్ జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయంటున్నారు. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ నియో జకవర్గంలో జగన్ మెజారిటీ తగ్గడం అంటే కడప లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి విజయంపై తీవ్ర ప్రభావం పడటమేనని అంటున్నారు.