సీఎస్ జవహర్ రెడ్డి.. ఎటేపమ్మ ఒంటరి నడక!?

సీఎస్ జవహర్ రెడ్డి నిబంధనలకు నిలువుపాతరేసి.. అడ్డగోలుగా జగన్ తో అంటకాగిన జవహర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు ఎవరకూ కూడా ఆయనకు మద్దతుగా నోరు మెదపడం లేదు. విశాఖలో భూ దందాకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఇప్పుడు అండగా నిలిచి మాట్లాడే వారే కరవయ్యారు. వైసీపీ అనుకూల అధికారిగా ముద్రపడిన ఆయనపై వచ్చిన ఆరోపణలకు ఖండించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆయనకు కూడా తనపై ఆరోపణలను ఖండించి ఊరుకోవడమే కానీ, ఆరోపణలు చేసిన వారిపై పోలీసు కేసు పెట్టడం కానీ, కోర్టుకు వెళ్లడం కానీ చేయడానికి రెడీగా లేనట్లు కనిపిస్తున్నది. తొలుత జనసేన నాయకుడు ఒకరు భూ దందా వ్యవహారాన్ని బయటపెట్టగానే జవహర్ రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ ఓ లేఖ రాశారు. తక్షణం ఆరోపణలను ఉపసంహరించుకోకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే తన ఆరోపణలకు ఆధారాలున్నాయనీ, తగ్గేదే లేదనీ సదరు జనసేన నేత మీడియా ముఖంగా ప్రకటించడంతో జవహర్ రెడ్డి మౌనం దాల్చారు.  సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కూడా జవహర్ రెడ్డికి అన్ డ్యూ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. జవహర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, కరోనా సమయంలో హెల్త్ సెక్రటరీగా కీలక పదవులను అనుభవించిన జవహర్ రెడ్డిని సీఎం జగన్ సీనియర్లను సైతం తోసి రాజని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.  ఇక ఆ క్షణం నుంచీ జవహర్ రెడ్డి జగన్ ఆడమన్నట్లల్లా ఆడారన్న విమర్శలు ఉన్నాయి. జవహర్ రెడ్డి నిర్ణయాలన్నీ జగన్ ను మెప్పించడం కోసమే అన్నట్లుగా ఉన్నయని తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తోంది.  ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలో ఎస్సీ భూములను బినామీల పేరిట కొనుగోలు చేశారన్న ఆరోపణలకు ఆయన ఇటీవల విశాఖ ప్రైవేటు పర్యటన బలం చేకూర్చింది.  కాగా భూముల దందాలో వైసీపీ నేతల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఖండించడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదు.  సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలను ఖండించడానికి ఇంత వరకూ జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నారు.   తన అధికారాలను దుర్వినియోగం చేసి మరీ వైసీపీకి పూర్తి మద్దతుగా నిలిచిన జవహర్ రెడ్డి ఇప్పుడు ఎటువైపు నుంచీ మద్దతూ అండా లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు. జవహర్‌రెడ్డి చీఫ్‌ సెక్రటరీ కాదు..చీప్‌ సెక్రటరీ అంటూ  సోమిరెడ్డి చంద్రమేహన్ రెడ్డి వంటి వారు విమర్శలు గుప్పిస్తున్నా వైపీపీ నుంచి  ఎక్కడా సౌండ్ వినిపించడం లేదు.  మొత్తం మీద ఎవరి ప్రాపకం కోసం జవహర్ రెడ్డి తన హోదాను, ప్రతిష్టను ఫణంగా పెట్టి పని చేశారో వారే వదిలేయడంతో ఆయన పూర్తిగా ఒంటరి అయిపోయారు.

ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు

హైదరాబాద్ మహా నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్.. ప్రస్తుత ప్రజాభవన్‌లోనే బాంబు పెట్టామని అగంతకులు హెచ్చరించారు. మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు హుటాహుటీన చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలంగాణ డిప్యూటీ భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. బాంబు బెదిరంపుతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సిబ్బంది సహా అందరినీ భవన్ నుంచి ఖాళీ చేయించి బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు జరుపుతోంది.  మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ చేసిన ఆగంతకుడిని ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

లిక్కర్ స్కాంలో సుప్రీంలో కేజ్రీవాల్ కు చుక్కెదురు 

మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. బెయిల్ పొడిగింపు పిటిషన్ పై తక్షణ విచారణ కోరుతూ ఆయన తరపు లాయర్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. ఈ పిటిషన్ గురించి గత వారం ప్రధాన బెంచ్‌ ముందుకు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పు రిజర్వ్ లో ఉన్నందుకు పిటిషన్‌ లిస్టింగ్ పై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్ 1 వరకూ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది.  అయితే, వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన బరువు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేర తగ్గిందన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. పీఈటీ-సీటీ స్కాన్ సహా పలు ఇతర వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగా బెయిల్ పొడిగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్టు తెలిపారు. మే 10 న ఆయన తీహాడ్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. 

సార్వత్రిక ఫలితాల తరువాత కింగ్ మేకర్ చంద్రబాబే!

సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. వచ్చే నెల 1న జరిగే తుదివిడత పోలింగ్ తరువాత  జూన్ 4న ఫలితాలు వెలువడటమే తరువాయి. ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ తరువాత పరిశీలకులు, రాజకీయపండితులు ఒక అంచనాకు అయితే వచ్చేశారు. గత రెండు ఎన్నికల తరహాలో ఈ సారి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అసవరమైనన్ని స్థానాలు సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని గట్టిగా వినిపిస్తున్నది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నాటక, బీహార్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలలో బీజేపీ బాగా వెనుకబడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అంటే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలలో విజయం లభించే అవకాశాలు అంతగా లేవని చెబుతున్నారు. దీంతో బీజేపీ అనివార్యంగా ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదు. ఇక బీజేపీకి అత్యంత నమ్మకమైన మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, జేడీఎస్, షిండే వర్గం శివసేనలు కూడా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అవి కూడా చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   దీంతో  బీజేపీకి  ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతుగా చెప్పుకోదగ్గ స్థానాలతో నిలిచే పార్టీ ఏదన్న ప్రశ్నకు సెఫాలజిస్టులు తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెబుతున్నారు.  ఔను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీయేలో చేరిన సంగతి తెలిసిందే. సో.. మరో సారి మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొలువుదీరేందుకు ఆ పార్టీకి తెలుగుదేశం అండ గట్టిగా అవసరమౌతుందని చెబుతున్నారు. సెఫాలజిస్టుల అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి 15కు పైగా లోక్ సభస్థానాలలో విజయం సాధిస్తుంది. అప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీదే కీ రోల్ అవుతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కింగ్ మేకర్ గా మారుతారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కు కచ్చితంగా మేలు జరుగుతుంది. 

‘ఐరన్‌లెగ్’ వేణు స్వామి పరార్!

చేతికి దొరికినన్ని ‘భవిష్యత్తు జాతకాల’ రాళ్ళు విసిరి, ఆ రాళ్ళలో ఒక రాయి ఎక్కడో తగిలితే, ‘చూశారా నా గురి’ అని ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసే వేణు స్వామి గత కొద్ది రోజులుగా పరారీలో వున్నట్టు తెలుస్తోంది. గతంలో అనేకమంది సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద, ఆఖరికి వాళ్ళ ఆరోగ్యం, ప్రాణాల మీద కూడా తన ‘భవిష్యత్తు రాళ్ళు’ విసిరిన వేణు స్వామి ఈమధ్యకాలంలో రాజకీయ నాయకుల మీద కూడా ఆస్ట్రాలజీ రాళ్ళు విసురుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ తప్పకుండా గెలుస్తారని చెప్పిన వేణు స్వామి, కేసీఆర్ ఓడిపోవడంతో కొంతకాలం కిక్కురుమనలేదు. మళ్ళీ కొన్ని రాళ్ళు సమీకరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఈసారి కూడా గెలుస్తారని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అలాగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని తేల్చేశారు. అయితే మే 13న పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కి అంత సీన్ లేదని అర్థమైపోయింది. అలాగే ఐపీఎల్‌లో వేణుస్వామి ఏ జట్టు అయితే గెలుస్తుందని చెప్పారో అదే సన్ రైజర్స్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో వేణు స్వామి మీద సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. వేణు స్వామిని చాలామంది మరో ‘ఐరన్‌లెగ్’ శాస్త్రి-2 అని అభివర్ణిస్తున్నారు. ఇది ఇలా వుంటే, వేణు స్వామి ఎవరు గెలుస్తారని చెబితే వాళ్ళు వరసబెట్టి ఓడిపోతున్నారు. జగన్ కూడా గెలుస్తారని వేణు స్వామి చెప్పినప్పుడు మొదట్లో వైసీపీ వర్గాలు భలే అనుకున్నారు. కానీ, ఇప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్.తోపాటు వేణు స్వామి జోస్యం ఫ్యాక్టర్ కూడా వౌైసీపీ వర్గాలకు వణుకు పుట్టిస్తోంది. ఆయన ఎవరు గెలుస్తారంటే వాళ్ళు ఓడిపోతూ వుండటంతో ఈ ‘ఐరన్ లెగ్’ ప్రభావం తమ పార్టీ మీద వుంటుందోమోనని మూఢనమ్మకాలతో భయపడిపోతున్నారు. మొత్తమ్మీద ‘జ్యోతిషం’ అనే శాస్త్రాన్ని తన పబ్లిసిటీ కోసం సక్సెస్‌ఫుల్‌గా ఉపయోగించుకున్న వేణు స్వామి కేసీఆర్, సన్ రైజర్స్ ఓటమి తర్వాత జనానికి, బుచికీ యూట్యూబ్ ఛానళ్ళకి అందుబాటులో లేకుండా పరార్ అయిపోయనట్టు తెలుస్తోంది. వైసీపీ వర్గాలు కూడా వేణు స్వామి మీద గుర్రుగా వుండటంతో, ముఖ్యంగా వాళ్ళకి దొరక్కుండా వుండాలని వేణు స్వామి అబ్ స్కాండ్ అయినట్టు  తెలుస్తోంది. 

సిక్కోలు జిల్లాలో తొలి ఫలితం.. తమ్మినేని ఫేట్ డిసైడ్ చేస్తుంది!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఫలితాలు వచ్చే నెల 4న వెలువడతాయి. ఈ ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టబోయేది ఎవరు? పరాజయం పాలై ఇంటికి చేరేదెవరు అన్నది తేలడానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ లోగా గెలుపు ఓటములపై పలు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఒక వరుస ప్రకారం జరుగుతుంది. ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తొలుత వెలువడుతుంది. చివరిగా పాతపట్నం నియోజకవర్గ ఫలితం వెలువడుతుంది. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకూ ఈ నెల 13న రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పాటే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక సిక్కోలు జిల్లా నుంచి మొదటిగా వెలువడబోయే ఫలితం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేసిన ఆముదాలవలస నియోజకవర్గానిదే. ఈవీఎంలు ఎచ్చర్లలోని శివాని ఇంజినీరింగ్ కళాశాల స్టోర్ రూంలో భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. నిబంధనల ప్రకారం తక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజ కవర్గ ఫలితాలను ముందుగా ప్రకటిస్తారు. ఆ ప్రకారం చూసుకుంటే ముందుగా వెలువడే ఫలితం ఆముదాలవలస. ఎందుకంటే ఈ నియోజకవర్గ కౌంటింగ్ 19 రౌండ్లలో పూర్తి అవుతుంది. అంటే జిల్లాలో తొలి ఫలితం ఏపీ అసెంబ్లీ స్పీకర్ పోటీ చేసిన ఆముదాలవలస నియోజకవర్గానిదే ఔతుంది. ఇప్పటికే ఇక్కడి ఫలితం ఏమిటన్నదానిపై పరిశీలకులు, స్ట్రాటజిస్టులు ఒక అంచనాకు వచ్చేశారు. వైసీపీ శ్రేణులు కూడా ఇక్కడ పరాజయాన్ని అంగీకరించేసి చేతులెత్తేసిన  పరిస్థితి.  సో తొలి ఫలితం స్పీకర్ తమ్మినేని భవితవ్యాన్ని తేల్చేస్తుందన్న మాట. ఇక ఆతరువాత వరుసగా పలాస, ఇచ్చాపురం, నరసరావుపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల ఫలితాలు వెలువడుతాయి. 323కు పైగా పోలింగ్ కేంద్రాలున్న పాతపట్నం నియోజకవర్గ ఫలితం చివరిగా వెలువడుతుంది. ఇక శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గ ఫలితం వెలువడేసరికి మధ్య రాత్రి అవుతుందని అంటున్నారు.   

హైదరాబాద్ బిల్డర్ కర్ణాటకలో మర్డర్ 

హైదరాబాద్ బిల్డర్ ఒకరు కర్ణాటకలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన కుప్పాల మధు (48) బిల్డర్. ట్రావెల్స్ వ్యాపారం కూడా నిర్వర్తిస్తున్నారు. వ్యాపారం కోసం తరచూ బీదర్ వెళ్లేవారు. ఎప్పట్లానే ఈ నెల 24న కుటుంబ సభ్యులకు చెప్పి బీదర్  బయలుదేరాడు. ఈ క్రమంలో డ్రైవింగ్ కోసం చింతల్‌కు చెందిన రేణుక ప్రసాద్ (32), వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని వెంట తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి పది గంటల సమయంలో మధుకు భార్య వెంకటలక్ష్మి ఫోన్ చేయగా హైదరాబాద్‌ వస్తున్నట్టు చెప్పారు. గంట తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ అయింది. తెల్లవారినా మధు ఇంటికి చేరలేదు. మరోవైపు, తర్వాతి రోజున బీదర్ జిల్లాలోని (25న) మన్నేకెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు.. పక్కనే మృతదేహం లభ్యమైంది. కారు నంబర్ ఆధారంగా చనిపోయింది మధు అని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధును దుండగులు కత్తులతో పొడిచి, బండరాయితో తలపై మోది హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధు ఒంటిపై రూ. 6 లక్షల విలువైన బంగారు నగలు, పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వాటి కోసమే నిందితులు ఆయనను హత్య చేసినట్టు భావిస్తున్నారు. మధుతో పాటు బీదర్ వెళ్లిన రేణుక ప్రసాద్, వరుణ్, లిఖిత్ సిద్దార్థ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మోడీ మాటల మర్మం.. స్థానాలు తగ్గుతాయన్న భయమేనా?

సార్వత్రిక ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. ఏడు దశల్లో భాగంగా ఇక చివరి దశ మాత్రమే మిగిలింది. చివరి దశ పోలింగ్ వచ్చే నెల 1న జరగనుంది. స్వతంత్ర్య భారత చరిత్రలో ఎటువంటి ట్రెండ్ లేకుండా జరుగుతున్న సాధారణ ఎన్నికలు ఇవేనని అంటున్నారు. ప్రచారంలో మాటల తూటాలు పేల్చుకున్న, పేల్చుకుంటున్న పార్టీల హడావుడి తప్ప ఈ సాధారణ ఎన్నికలపై జనం పెద్దగా ఆసక్తిగా లేరని అంటున్నారు. పదేళ్ల పాలనలో  మోడీ వైఫల్యాలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఆ వ్యతిరేకత విపక్ష కాంగ్రెస్ కూటమికి పెద్దగా సానుకూలత ఏర్పరచలేదనీ అంటున్నారు.  అయితే ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ విపక్షాలపై మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శలు ఆయనలోని ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలనే ప్రస్తావిస్తూ ఆ తప్పిదాల వల్లే దేశం తీవ్రంగా నష్టపోయిందనడం దేనికి సంకేతమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఆరువిడతల పోలింగ్ లో 486 లోక్ సభ స్థానాలలో ప్రజల తీర్పు ఏమిటన్నది ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈ ఆరు విడతలలోనూ కూడా బీజేపీ పెర్ఫార్మెన్స్ ను బట్టి చూస్తే ఆ పార్టీ ఆశిస్తున్న భారీ విజయం అనుమానమేనన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా బెంగాల్, పంజాబ్, హర్యానా, ఒడిశా, తమిళనాడు, కర్నాటకలలో ఆ పార్టీకి తీవ్ర ఆశాభంగం తప్పదని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  ఇక జూన్ 1వతేదీ చివరి విడత పోలింగ్ జరుగనుంది.మొదటి,రెండో విడత పోలింగ్ లో బీజేపీ 100 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నది.మొదటి రెండు విడతల్లో దక్షిణాదిలో ఎక్కువ స్థానాల్లో పోలింగ్ జరిగింది.ఈ సారి దక్షిణాది లో 50-60సీట్లు వస్తాయని బీజేపీ భావిస్తున్నది. ఉత్తరాదిలో కొన్ని స్థానాలు కోల్పోతున్నామన్న అంచానకు వచ్చింది. ఉత్తరాదిలో కోల్పోయిన స్థానాలు దక్షిణాదిలో భర్తీ అవుతాయన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.   తొలి విడత పోలింగ్ ముసిసిన క్షణం నుంచీ మోడీ ప్రచార శైలిలో మార్పు వచ్చింది. ఆయన మతం ప్రాతిపదికన ఓట్లు రాబట్టుకుని మరో సారి అధికారంలోకి రావాలన్న ప్రయత్నానికి తెరలేపారన్నది ప్రస్ఫుటంగా అర్ధం అవుతోంది.  పంజాబ్ లో ఎన్నికల సభలో మోడీ  సిక్కు ల పవిత్ర స్థలం కర్తార్ పూర్ షాహెబ్ గురుద్వారా పాకిస్తాన్ నుంచి భారత్ లో కలుపుకునే మంచి అవకాశాన్ని 1971 బంగ్లావిమోచన యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిర పోగొట్టారని విమర్శించారు. తానై తే అప్పుడు భారత్ ఆధీనంలో ఉన్న 90 వేల మంది పాక్ సైనికులు కర్తార్పూర్ ఇస్తే వదులుతామని షరతుపెట్టేవాడినని పేర్కొన్నారు. ఇది నిస్సందేహంగా సిక్కు ఓటర్లకు గాలం వేసే వ్యూహంగానే భావించాల్సి ఉటుంది.  

ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి...ఘాట్ కు చేరుకుని నివాళులర్పించిన అభిమానులు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతి వేడుకలను  రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. . ఈ సందర్భంగా  వేడుకలకు తెలుగు తమ్ముళ్లు, అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మబంధువు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. వేడుకల్లో టీడీపీ శ్రేణులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు.మరోవైపు ఇవాళ ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకొని..   ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన కుటుంబసభ్యులు నివాళుర్పిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో  జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తాతయ్య ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఇవాళ ఉదయాన్ని ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకున్న సోదరులు ఎన్టీఆర్ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు.

సీఎస్ జవహర్ రెడ్డిని మార్చాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల లేఖ

సీఎస్ జవహర్ రెడ్డి పక్షపాత వైఖరి కారణంగా జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమాలకు పాల్పడటమే కాకుండా, జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల వ్యవస్థనే  ఏపీ సీఎష్ జవహర్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన  కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు. ఆ లేఖలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి  ప్రభుత్వ అసైన్డ్ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని పేర్కొన్నారు. జవహర్ రెడ్డి కుమారుడు, బినామీల పేరిట సీఎస్ 800 ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారని కనకమేడల ఆరోపించారు. సీఎస్ అధికార యంత్రాంగాన్ని, తన అధికారాలను దుర్వినియోగం చేశారని ,ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని తెలిపారు.   ఈ నేపథ్యంలో, కౌంటింగ్ సజావుగా సాగడంపై ప్రతిపక్షాలకు అనుమానం ఉందని కనకమేడల వెల్లడించారు. సీఎస్ వ్యవహార శైలి ఓట్ల లెక్కింపుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎస్ ని తొలగించి సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఈసీని కోరారు. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా విపక్ష నేతలందరూ జవహర్ రెడ్డి ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. అలాగే సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో  ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా అమలు చేయకుండా వృద్ధుల మరణాలకు కారకులయ్యారన్న విమర్శలు ఉన్నాయి.  ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన పలువురు అధికారులపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగానూ, ఆ తరువాత జరిగిన హింసాకాండతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటే.. సీఎస్ బాధ్యతారహితంగా భోగాపురం పర్యటనకు ఎందుకు వెళ్లారంటూ విపక్ష నేతలు నిలదీస్తున్నారు. తాజాగా కనకమేడల లేఖతోనైనా ఎన్నికల సంఘంలో కదలిక వస్తుందేమో చూడాలి. 

జయహో ఎన్టీఆర్..

తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల స్వ‌ల్ప కాలానికే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసి, ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయ‌కుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒకే ఒక్క‌డు.. శకపురుషుడు.. నంద‌మూరి తార‌క‌రామారావు. 1982 మార్చి నెలాఖ‌రులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రి తొలి వారంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌య దుందుభి మోగించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించారు.  ఈ రోజు మంగళవారం మే 28 ఆయన 101 జయంతి. అటు సినిమాల్లోనూ, ఇటు రాజ‌కీయాల్లోనూ మ‌హానాయ‌కుడిగా రాణించిన అరుదైన వ్య‌క్తి ఎన్టీఆర్‌. ఆ మహాపురుషుడి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందాం.. 1923 మే 28న కృష్ణా జిల్లా పామ‌ర్రు తాలూకా నిమ్మ‌కూరులో ఎన్టీ రామారావు జ‌న్మించారు. త‌ల్లితండ్రులు వెంక‌ట్రామ‌మ్మ‌, లక్ష్మ‌య్య చౌద‌రి. 1933లో విజ‌య‌వాడ మునిసిప‌ల్ హైస్కూల్‌లో చేరి, 1940లో స్కూల్ ఫైన‌ల్ పాస‌య్యారు. విజ‌య‌వాడ‌లోని ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో ఇంట‌ర్మీడియేట్ పాస‌యి, గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. 19వ ఏట బ‌స‌వ‌రామ తార‌కంను  వివాహం చేసుకున్నారు. ఆయ‌న‌కు మొత్తం 11 మంది సంతానం. వారిలో ఏడుగురు కొడుకులు, న‌లుగురు కుమార్తెలు. ఇంట‌ర్మీడియేట్ చ‌దువుతున్న రోజుల నుంచే ఎన్టీఆర్ నాట‌కాల్లో వేషాలు వేస్తూ వ‌చ్చారు. ఆశ్చ‌ర్య‌మేమంటే నాట‌కాల్లో ఆయ‌న మొద‌ట‌గా ధ‌రించింది ఒక స్త్రీ పాత్ర‌. అది 'ప‌ల‌నాటి యుద్ధం' నాట‌కంలో నాయ‌కురాలు నాగ‌మ్మ పాత్ర‌. బీఏ చివరి సంవ‌త్స‌రం చ‌దువుతున్న రోజుల్లోనే అప్ప‌టి అగ్ర సినీ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన చిత్తజల్లు పుల్ల‌య్య నుంచి 'కీలుగుర్రం', 'వింధ్య‌రాణి' సినిమాల్లో న‌టించేందుకు క‌బురు వ‌చ్చింది. చ‌దువు మ‌ధ్య‌లో ఆగిపోతుంద‌నే ఉద్దేశంతో ఆ ఆఫ‌ర్ల‌ను ఎన్టీఆర్ వ‌ద్దనేశారు. 1948లో స‌బ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరి, కొద్ది రోజులే ప‌నిచేశారు. ఆ ఉద్యోగం మానేసి సినిమా రంగంలో అడుగుపెట్టారు. దర్శకుడు ఎల్వీ ప్ర‌సాద్ రూపొందించిన 'మ‌న‌దేశం' మూవీలో పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా సినిమాల్లో త‌న తొలి పాత్ర‌ను సునాయాసంగా పోషించారు. త‌ర్వాత టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌గా ఏక‌ఛ‌త్రాధిప‌త్యం వ‌హించి ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యం, పంచ‌పాత్రాభిన‌యం చేసి అనిత‌ర‌సాధ్యుడిగా ఎన్టీఆర్ తనను తాను నిరూపించుకున్నారు.  1953లో సొంత నిర్మాణ సంస్థ నేష‌న‌ల్ ఆర్ట్ థియేట‌ర్స్ (ఎన్‌.ఎ.టి.) స్థాపించి,   'పిచ్చి పుల్ల‌య్య' మూవీని నిర్మించారు. 1961లో రూపొందించిన పౌరాణిక చిత్రం 'సీతారామ క‌ల్యాణం'తో ద‌ర్శ‌కుడిగా మారారు ఎన్టీఆర్‌. అందులో ప్ర‌తినాయ‌కుడైన రావ‌ణుడి పాత్ర‌ను ధ‌రించారు. 1976లో హైద‌రాబాద్‌లో రామ‌కృష్ణా స్టూడియోస్ నిర్మించారు. కేవ‌లం సినీ జీవితానికే ప‌రిమితం కాకుండా ప్ర‌జా జీవితంతోనూ అనుబంధం ఏర్ప‌ర‌చుకున్నారు ఎన్టీఆర్‌. 1952లో రాయ‌ల‌సీమ క్షామ‌నిధి, 1964లో ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి, 1965లో జ‌వానుల సంక్షేమ‌నిధి, దేశ‌ర‌క్ష‌ణ నిధి, 1969లో కోస్తా ప్రాంత తుఫాను నిధికి భారీ విరాళాలు ఇచ్చిన ఆయ‌న‌, 1977లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో క‌లిసి భిక్షాట‌న చేసి దివిసీమ ఉప్పెన బాధితుల స‌హాయ‌నిధికి విరాళాలిచ్చారు. 1964లోనే ఎన్టీఆర్ ధ‌ర్మ‌నిధిని ఆయ‌న ఏర్పాటు చేశారు. నిజానికి తెలుగు భాష‌కూ, తెలుగువాడికీ దేశీయంగా గుర్తింపు తీసుకురావ‌డ‌మే కాకుండా కాంగ్రెసేత‌ర పార్టీల‌తో క‌లిసి కేంద్రంలో ఎన్టీఏ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డంలో కీల‌క పాత్ర వ‌హించారు. 1982 మార్చి 29న సినీ రంగం నుంచి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయ‌న 1983 జ‌న‌వ‌రిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అఖండ విజయం సాధించి, స్వాతంత్రానంతరం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసిన తొలి నాయ‌కుడిగా స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన చ‌రిత్ర  తెలిసిందే. నాదెండ్ల భాస్క‌ర‌రావు వెన్నుపోటు పొడిచి, త‌న‌ను ప‌ద‌వీచ్యుతుడిని చేస్తే, ప్ర‌జాబ‌లంతో తిరిగి ఎలా ముఖ్య‌మంత్రి అయ్యిందీ తెలిసిందే.   1996 జ‌న‌వ‌రి18న 72 ఏళ్ల వ‌య‌సులో త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు.   అటు సినిమా స్టార్‌గా, ఇటు పొలిటిక‌ల్ స్టార్‌గా ప్ర‌జ‌ల‌ను స‌మ్మోహితుల‌ను చేసి, ఆయ‌న‌లా వారిని ప్ర‌భావితం చేసిన మ‌రో నాయ‌కుడిని తెలుగువాళ్లు ఆయ‌న‌కు ముందు చూడ‌లేదు, ఆయ‌న త‌ర్వాతా చూడ‌లేదు. ఇక చూసే అవ‌కాశం కూడా లేదు.   సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావుది జగదేక సుందర రూపం, నవ నవోన్మేష చైతన్య స్వరూపం తారకరామనామధేయం. ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ రాణకెక్కిన ప్రతిభా భాస్వంతం. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి, నిజజీవిత నాటకరంగంలోనూ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా.. ఇన్ని పాత్రలు గొప్పగా పోషించిన అనితరసాధ్యుడు  మహామనీషి ఎన్టీఆర్. నటునిగా అశేష తెలుగు ప్రేక్షకుల అభిమానానికి పాత్రుడైనందుకు తిరిగి వారికి ఏమైనా ఇవ్వాలనుకున్నారు ఎన్టీఆర్. అదే సమయంలో స్వీయానుభావంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రం కించపరుస్తున్నదని గ్రహించి, తెలుగువాడి సత్తా ఏమిటో తెలియజెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలకే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్న కీర్తిని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. జాతీయ స్థాయిలో తాము మద్రాసీయులం కాదనీ, తెలుగువారమనీ ఘనంగా చాటిచెప్పి ఢిల్లీ పీఠాన్ని వణికించారు ఎన్టీఆర్. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు.  చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల కోసం, మహిళల కోసం అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ రంగంలో ధృవతారగా వెలిగి, 1996 జనవరి 18న మహాభినిష్క్రమణం చేశారు ఎన్టీఆర్. తెలుగువారు ఈ నేలమీద ఉన్నంతవరకూ ఒక శకపురుషునిగా నందమూరి తారకరామారావు పేరు నిలిచే ఉంటుంది. ఇది సత్యం, ఇది తథ్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా...

జ‌గ‌న్ జైలుకే.. పొన్నవోలు కంటతడి సంకేతమదేనా?

ఏపీలో కూట‌మి అధికారంలోకి రాబోతోందా.. వైసీపీ అంత‌ర్గ‌త స‌ర్వేల్లో ఆ విష‌యం స్ప‌ష్ట‌మైందా.. కూట‌మి అధికారంలోకి రాగానే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా.. జ‌గ‌న్ ప్ర‌మాదంలో ప‌డ‌బోతున్నారా..? ఐదేళ్ల కాలంలో   చేసిన త‌ప్పిదాల‌తో జగన్ కు కొత్త చిక్కులు చుట్టుముట్టబోతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. ఇలాంటి సందేహాల‌ను తెర‌పైకి తెచ్చింది ఎవ‌రో కాదు.. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి న‌మ్మినబంటుగా ఉన్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.  జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న‌ కేసుల విష‌యంలో న్యాయ స‌ల‌హాలో జ‌గ‌న్ ప‌క్షాన పొన్న‌వోలు ఉన్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన ఆరు రోజుల్లోనే ఏపీ అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ గా పొన్న‌వోలును జ‌గ‌న్ నియ‌మించారు. ఈ ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో పొన్న‌వోలు చేసిన అరాచ‌కాలు అన్నీఇన్నీ కావు.  మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై అక్ర‌మ కేసులు పెట్టి జైలుకు పంపించ‌డంలో పొన్న‌వోలుదే కీల‌క పాత్ర‌.. అయితే, చంద్ర‌బాబు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు నిర్దార‌ణ‌ చేయ‌లేక పోయారు. కేవ‌లం కావాల‌నే జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు చంద్ర‌బాబును దాదాపు మూడు నెల‌లు రాజ‌మండ్రి జైలులో ఉంచారు.  పొన్న‌వోలు తీరుపై తెలుగుదేశం శ్రేణుల‌తోపాటు కొంద‌రు వైసీపీ నేత‌ల్లోనూ ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్ర‌బాబుపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం ద్వారా జ‌గ‌న్ ఓట‌మికి పొన్న‌వోలు బీజం వేశారంటూ కొంద‌రు వైసీపీ నేత‌లు ఆవేద‌న  వ్య‌క్తం చేశారు. వారి అనుమాన‌మే ఇప్పుడు నిజం కాబోతుంది. కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌న్న ఓ స్ప‌ష్ట‌త రావ‌డంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక పొన్న‌వోలు క‌న్నీరు పెట్టుకున్నారు.   ఏపీలో మే 13న అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌రిగింది. ఇత‌ర దేశాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఏపీకి త‌ర‌లి వ‌చ్చి మరీ తమ ఓటు హ‌క్కు  వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతాన్ని త‌గ్గించేందుకు వైసీపీ నేత‌లు పోలింగ్ రోజు పెద్ద ఎత్తున అల్ల‌ర్ల‌కు పాల్ప‌డ్డారు. ఓట‌ర్ల‌ను బెదిరించ‌డంతోపాటు.. టీడీపీ ఏజెంట్ల‌పై దాడులు సైతం చేశారు. అయినా, జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు అర్థ‌రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు  కూలైన్ల‌లో వేచి ఉండి మరీ తమ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. వైసీపీ కుట్ర‌ల‌ను ఛేదించుకొని ప్ర‌జ‌లు ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌టంతో గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ఏపీలో 81శాతానికి పైగా  పోలింగ్ న‌మోదైంది. దీంతో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని ప్ర‌తిఒక్క‌రికి అర్ధ‌మైంది. వైసీపీ అధిష్టానం నిర్వ‌హించిన అంత‌ర్గ‌త స‌ర్వేల్లోనూ కూట‌మి భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్ట‌మైంద‌ని తెలుస్తోంది. అదే విష‌యాన్ని జ‌గ‌న్ కు న‌మ్మిన‌బంటు పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి చెప్ప‌క‌నే చెప్పారు. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న అక్క‌డి వైసీపీ సానుభూతి ప‌రుల‌తో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో వైసీపీ ఓడిపోతోందనీ, జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌బోతున్నార‌ని చెప్ప‌క‌నే చెప్పారు.  ఎన్నిక‌ల త‌రువాత సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోర్టు అనుమ‌తితో లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. లండ‌న్ లోని ప‌లు ప్ర‌దేశాల్లో ఆయ‌న ప‌ర్య‌టిస్తున్న ఫొటోలు తాజాగా విడుద‌ల‌య్యాయి. మ‌రో వైపు ఏపీ అద‌న‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డిసైతం లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. స్థానికంగా వైసీపీ సానుభూతి ప‌రుల‌తో పొన్న‌వోలు స‌మావేశం అయ్యారు. జ‌గ‌న్ తో స‌మావేశ‌మై మాట్లాడాల‌ని ఉంద‌ని, ఓ సారి స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని స్థానిక వైసీపీ సానుభూతి ప‌రులు పొన్న‌వోలును కోరారు. దీంతో పొన్న‌వోలు మాట్లాడుతూ.. భావోద్వేగానికి గుర‌య్యారు. ఓ ద‌శ‌లో క‌న్నీరు పెట్టుకున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒంట‌రిగా పోరాటం చేస్తున్నారు.. ఆయ‌న క‌ష్టం నాకు తెలుసు.. ఎంత ప్ర‌మాదంలో ఉన్నారో  తెలుసు. ఎవ‌రు మ‌నోడో తెలియ‌దు.. ఎవ‌రు ప‌రాయోడో తెలియ‌దు.. ఇప్ప‌టికీ జ‌గ‌న్ లెక్క‌చేయ‌డం లేదు.. ఏమైతే అది ఔతుందన్న ధీమాతో ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న ఎవ‌రితో మాట్లాడే ప‌రిస్థితిలో కూడా లేరు అంటూ జ‌గ‌న్ గురించి పొన్న‌వోలు చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో వైసీపీ నాయ‌కుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నది. వైసీపీ అనుకూల మీడియాలో మ‌రోసారి మ‌నమే అధికారంలోకి రాబోతున్నామ‌ని పోలింగ్ పూర్త‌యిన రోజునుంచి డంకా మోగిస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌మాదంలో ఉన్నారని తాజాగా పొన్న‌వోలు మాట్లాడ‌టంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లోనూ ఓడిపోతున్నామ‌ని క్లారిటీ వ‌చ్చిన‌ట్ల‌యింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.  పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. జ‌గ‌న్ ప‌క్క‌న ఉన్న‌వారు ఎవ‌రు మ‌న‌వాళ్లో.. ఎవ‌రు ప‌రాయివాళ్లో తెలియ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ష‌ర్మిల‌ను ఉద్దేశించి ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు కొంద‌రు భావిస్తున్నారు. అయితే, ష‌ర్మిల‌ను దూరం చేసుకున్నది కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ఇంట్లో త‌ల్లి, చెల్లిని, ఆయ‌న, వైసీపీ నేత‌లు  మ‌నుషుల్లా చూడ‌లేదు.  అవ‌మానించి దూరం చేసుకున్నాడు. జ‌గ‌న్ చెప్పిన‌ట్లు న‌డుచుకున్న నేత‌లు మాత్ర‌మే వైసీపీలో మిగిలారు. ఇదిలాఉంటే, పొన్న‌వోలు వ్యాఖ్య‌ల్లో మ‌రో ఆందోళ‌న‌కూడా స్ప‌ష్టంగా క‌నిపించింది. జూన్‌ 4న ఫ‌లితాల్లో క‌చ్చితంగా కూట‌మి అధికారంలోకి రాబోతుంద‌ని ఆయ‌న‌కు తెలుసు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంది. ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ అరాచ‌క పాల‌న కార‌ణంగా మ‌రికొన్ని కేసులు న‌మోద‌య్యే అవ‌కాశ‌మూ ఉంది. దీనికి తోడు వైసీపీ ఓడిపోతే ఆ పార్టీని వీడేందుకు నేత‌లు సిద్ధంగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లు బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లారు. జ‌గ‌న్ జైలుకెళితే వైసీపీ పూర్తిగా క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. వీట‌న్నింటిని గుర్తుచేసుకొని పొన్న‌వోలు క‌న్నీరు పెట్టుకున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

కొడాలి నాని పరిస్థితి డౌటే?!

వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యం దెబ్బతిందన్న వార్తలు నాలుగు రోజుల క్రితం వచ్చిన సంగతి తెలిసిందే. నాన్‌స్టాప్ మద్యం తీర్థం, గుట్కా ప్రసాదం కారణంగా నాని ఆరోగ్యం చాలా టూమచ్‌గా డ్యామేజ్ అయిపోయిందన్న వార్తలు వచ్చాయి. అనుచరులతో మాట్లాడుతున్న నాని అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ఆయనకు ఇంటిదగ్గరే చికిత్స జరుగుతోందని ఆ వార్తల సారాశం. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్యం రాయిలాగా వుందని, ఆయన ఉక్కుముక్కలా, టేకు చెక్కలా, చింతపిక్కలా వున్నారని ఆయన అనుచరులు చెబుతూ వచ్చారు. ‘నానికి అనారోగ్యం’ అనే వార్తలను వారు ఖండించారు. అలాగే కొడాలి నాని ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో ఒక వీడియో పోస్టు అయింది. ఒక కుర్చీలో అడ్డదిడ్డంగా కూలబడి వున్న కొడాలి నాని ఫోన్ చూసుకుంటున్నట్టుగా ఆ ఎనిమిది క్షణాల వీడియో వుంది. ‘తనపై వచ్చిన అనారోగ్య వార్తలకు వీడియోతో చెక్ పెట్టిన కొడాలి నాని’ అనే వార్తలను జగన్ అనుకూల మీడియా భారీ స్థాయిలో వ్యాప్తి చేసింది. సరేలే.. మనిషి ఆరోగ్యంగానే వున్నాడుగా అని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా తెలుస్తున్న విషయం ఏమిటంటే, అది పాత వీడియో! ఎప్పటిలో పాత వీడియో ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసి నాని ఇప్పుడు ఆరోగ్యంగానే వున్నాడు అనే కలరింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని వున్న సైజుకి, ఆ వీడియోలో వున్న సంబంధం లేదు. తన ఆరోగ్యం బాగాలేదని వార్తలు భారీ స్థాయిలో వస్తే, ‘అయ్యా నేను బాగానే వున్నాను. నా ఆరోగ్యం మీద వస్తున్న పుకార్లని నమ్మొద్దు’ అని నాలుగు ముక్కలు చెప్తే సరిపోతుంది కదా.. అలా చెప్పకుండా ఒక అడ్డదిడ్డంగా కూర్చున్న ఎనిమిది క్షణాల నిడివి వున్న వీడియో పోస్టు చేశారంటే అర్థమేంటి? ఏదో సమ్‌థింగ్ రాంగ్ వుందని! అయినా ప్రజలకు తన నుంచి ఒక వీడియో మెసేజ్ పంపుతున్నామంటే ఎంత పద్ధతిగా వుండాలి? కొడాలి నాని ఎక్స్ అకౌంట్లో పెట్టిన ఆ వీడియోలో పద్ధతీ పాడూ లాంటివేవైనా వున్నాయా? కొడాలి నాని ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. గుడివాడ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎన్నికల ప్రచారంలో ముక్కుతూనో, మూలుగుతూనో నియోజకవర్గం అంతా తిరిగాడు. ఎన్నికల ముగిసిన తర్వాత ప్రజల్లో తిరగడం గానీ, పోనీ బయటకి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది వుంటే, తన ఇంట్లోనే ప్రజలతో, కార్యకర్తలతో కలసి మాట్లాడ్డం అంటూ జరగాలిగా.. అలాంటిదేమీ జరగడం లేదు. ఈయన బయటకి వెళ్ళడం లేదు.. ఇంట్లోకి ఎవరినీ రానివ్వడం లేదు.  విశ్వసనీయ సమాచారం ప్రకారం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి డౌట్‌గానే వున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిస్తే భారీ స్థాయిలో ప్రచారం, ట్రోలింగ్ మొదలైపోతుంది కాబట్టి, ఇంట్లోనే ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కౌంటింగ్ జరిగే జూన్ నాలుగో తేదీ నాటికి కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళి కాసేపు కూర్చునే స్థాయి ఆరోగ్యాన్ని అయినా తిరిగి అందించడానికి డాక్టర్లు తంటాలు పడుతున్నట్టు సమాచారం. కొడాలి నాని ఆరోగ్యం పాడైపోతే పాడైపోయి వుండొచ్చుగానీ, ప్రాణానికేం ప్రమాదం వుండకపోవచ్చు.. ఎందుకంటే, ఆయన కోలుకోవాలని, ప్రాణాలతో వుండాలని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నాయి మరి!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది!

వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారు.  రెండు వారాల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. పోటీ హోరాహోరీగా జరుగుతుందని అంతా భావించినా పోలింగ్ తరువాత సీన్ అందరికీ అర్ధమైపోయింది.   తెలుగుదేశం కూటమిలో  ఉత్సాహం ఉరకలేస్తుంటే... వైసీపీ శిబిరంలో నైరాశ్యం తాండవిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కొందరు వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి గెలుపు ధీమా ఒలక పోస్తున్నా వారి ముఖాల్లో మాత్రం ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, పెనమలూరు, మైలవరంలలో అభ్యర్థుల గెలుపు ఓటములపై సాగుతున్న బెట్టింగుల తీరు ను బట్టి వైసీపీ అభ్యర్థుల దయనీయ స్థితి ఇట్టే అర్ధమైపోతుంది. ఈ నియోజకవర్గాలలో వైసీపీ విజయంపై బెట్టింగులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. అదే సమయంలో కూటమి అభ్యర్థుల గెలుపు మీద కంటే వారి మెజారిటీల మీద పెద్ద ఎత్తున బెట్టింగులు కాయడానికి పందెం రాయుళ్లు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా గన్నవరంలో అయితే వల్లభనేని వంశీపై తెలుగుదేశం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పది వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని లక్షల రూపాయలు బెట్టింగులు కడుతున్నారు. అదే సమయంలో యార్లగడ్డకు అంత మెజారిటీ రాదని వైసీపీ వారు బెట్టింగులకు దిగుతున్నారంటే ఓటమి అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా గుడివాడలో కొడాలి నాని పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము విజయం సాధిస్తారంటూ పెద్ద ఎత్తున పందేలు ఒడ్డుతున్నారు. వెనిగండ్ల రాము విజయంపై నూజివీడుకు చెందిన కొందరు 20 లక్షల రూపాయలు పందెం ఒడ్డినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నాని విజయంపై పందెం కాయడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే వైసీపీ నేతలు ఈ రెండు నియోజకవర్గాలలోనూ పరాజయాన్ని అంగీకరిచేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

లాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెడుతూ...

చెన్సైలో లేడీస్ హాస్టల్లో లాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెడుతూ శరణిత (32) అనే మహిళ మరణించారు. ఎంబీబీఎస్ చదివిన శరణిత కోయంబత్తూరులో డాక్టర్‌గా ప్రాక్టీస్ట్ చేస్తున్నారు. ఆమె భర్త కూడా డాక్టరే. శరణిత ప్రస్తుతం పీజీ చదువుతున్నారు. దానికి సంబంధించిన ఒక పరీక్ష రాయడం కోసం ఆమె చెన్నైకి వచ్చి లేడీస్ హాస్టల్లో వుంటున్నారు. సోమవారం నాడు ఆమెకు భర్త ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఆయన లేడీస్ హాస్టల్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు. వారు తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్ళి చూశారు. లోపల చేతుల్లో లాప్‌టాప్, లాప్‌టాప్ ఛార్జర్ పట్టుకుని వున్న శరణిత కుప్పకూలిపోయి కనిపించారు. ఆమె అప్పటికే చనిపోయారు. లాప్‌టాప్ ఛార్జర్ కేబుల్ డ్యామేజ్ అవడం వల్ల కరెంట్ షాక్ కొట్టి ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది.

కవిత బెయిల్ పిటిషన్  విచారణ మంగళవారానికి వాయిదా 

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో క‌విత బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణను ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ రేపు తదుపరి విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. కాగా, త‌న పిటిష‌న్ల‌లో క‌విత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె స‌వాల్ చేశారు.  క‌విత త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాది విక్ర‌మ్ చౌద‌రి ఆమె అరెస్టులో ద‌ర్యాప్తు సంస్థ‌లు చ‌ట్టాన్ని ఉల్లంఘించాయ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈడీ, సీబీఐలు కౌంట‌ర్ అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు చేశాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తదుపరి విచార‌ణ జ‌ర‌గ‌నుంది.  కాగా, ఫ‌లితం ఎలా ఉన్నా వాద‌న‌లు చాలా బాగా ఉన్నాయ‌ని విక్ర‌మ్ చౌద‌రిని జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా క‌విత త‌ర‌ఫు న్యాయ‌వాది ప‌లు కీల‌క విష‌యాల‌ను న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండ‌ర్ టేకింగ్ ఇచ్చింద‌ని.. క‌విత వేసిన రిట్ పిటిష‌న్ సుప్రీంలో పెండింగులో ఉండ‌డంతో విచార‌ణ ముందుకు సాగ‌డం లేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసింద‌ని తెలిపారు. తాము ఇచ్చిన అండ‌ర్ టేకింగ్ త‌దుప‌రి వాయిదా వ‌ర‌కే అని అందులో స్పష్టం చేశారని చెప్పారు.  సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండ‌గానే 41 (ఏ) ప్ర‌కారం స‌మ‌న్లు జారీ చేశార‌ని విక్ర‌మ్ చౌద‌రి గుర్తు చేశారు. సీఆర్‌పీసీ 161 ప్ర‌కారం మొద‌ట నోటీసులు ఇచ్చిన‌వారు,  ఆ త‌ర్వాత 41 (ఏ)కు ఎందుకు మారారో తెలియ‌ద‌న్నారు. సుప్రీంలో విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ఈడీ బృందం క‌విత ఇంట్లో ఉంద‌ని చెప్పారు. అదే రోజు ఆమెను అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింద‌ని తెలిపారు.  అలాగే జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండ‌గానే క‌విత‌ను ప్ర‌శ్నించాలంటూ సీబీఐ పిటిష‌న్ వేసింది. ఆ పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం అంగీక‌రించింది. కానీ, దీని గురించి ఆమెకు మాత్రం ఎలాంటి స‌మాచారం లేద‌ని చెప్పుకొచ్చారు. సీఆర్‌పీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం సీబీఐ ప్ర‌శ్నించాలంటే క‌విత వాద‌న కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత క‌నీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సీబీఐ అరెస్టు చేసింద‌న్నారు. రేపు మ‌ధ్యాహ్నం కౌంట‌ర్ వాద‌న‌లు వినిపిస్తామ‌ని న్యాయ‌స్థానానికి ఈడీ తెలిపింది

తిరుగుబాటు మొదలయ్యింది! ఇప్పుడు భారతి సిమెంట్! 4 త‌రువాత తాడేప‌ల్లి ప్యాలెస్‌!

భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీపై ప్రజలు తిరుగుబాటు చేశారు. కడప జిల్లాలో యర్రగుంట్ల వద్ద ఉన్న ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చి ఆ కంపెనీ లారీలను అడ్డుకున్నారు. భార‌తి సిమెంట్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.  కాలుష్యం కారణాలతో … పలు గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతి సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చే వాహనాల కారణంగా దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ వాహనాలను ఆపివేసి వారు త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.  ప్రభుత్వం జోక్యం చేసుకొని భారతీ సిమెంట్  కాలుష్యం నుంచి కాపాడాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతి సిమెంట్స్‌గా చలామణిలో ఉన్న రఘురాం సిమెంట్స్‌.. క్విడ్‌ ప్రోకో ద్వారా జ‌గ‌న్ ఆస్థి అయింది.  వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జమానాలో మేళ్లు పొందినవాళ్లు ముడుపులు సమర్పించేసుకోగా.. విజయసాయిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న బ్యాంకు... ఇంటికే వచ్చి రుణం ఇచ్చేసింది.  అప్ప‌ట్లో జ‌గ‌న్ చేతిలో చిల్లిగవ్వ లేకుండానే   సిమెంట్ ఫ్యాక్ట‌రీ పెట్టేశారు. భార‌తి సిమెంట్స్ విష‌యంలో సీబీఐ అభియోగాలు రుజువైతే.. నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది.   అలా... భారతి సిమెంట్ పరిశ్రమను సీఎం జగన్ తన భార్య భారతి పేరు మీద ఏర్పాటు చేశారు. ఇది ఉత్పత్తి ప్రారంభించక ముందే పదిహేనేళ్ల కిందటే… 51 శాతం వాటాను ఫ్రాన్స్ కు చెందిన వికాట్ అనే కంపెనీకి రూ. రెండు వేల కోట్లకు అమ్మేశారు. అయితే విచిత్రంగా  రెండు వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చిన వికాట్.. పేర్లలోనే కనిపిస్తుంది. మొత్తం పరిశ్రమను జగన్ కుటుంబసభ్యులే నిర్వహిస్తూంటారు. ఏపీలో వైసీపీ వచ్చాక భారతి సిమెంట్స్ మాత్రమే అత్యధికంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఫ్యాక్టరీ కనీస కాలుష్య ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు గతంలో పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. అప్పట్లో ఫ్యాక్టరీ యాజమాన్యం ఏవేవో హామీలు ఇచ్చి సర్దుబాటు చేసింది. కానీ అమలు చేయలేదు. ఇప్పుడు ప్రజలు తెరపైకి వస్తున్నారు.  ఇప్పుడు భారతి సిమెంట్స్ పై ప్ర‌జ‌లు తిరుగుబాటు చేశారు. నాలుగో తేదీ తర్వాత తాడేప‌ల్లి ప్యాలెస్‌పై దాడి జ‌ర‌గ‌వ‌చ్చు.  ఏమైనా జరగొచ్చన్న సెటైర్లు ఏపీలో వినిపిస్తున్నాయి.  - ఎం.కె. ఫ‌జ‌ల్‌