చంద్రబాబుకు రాష్ట్ర ప్రగతే శ్వాస.. పార్టీ పురోగతిపైనే ధ్యాస
posted on May 30, 2024 @ 12:44PM
పనిలోనే ఆయన విశ్రాంతి. ప్రజా జీవితాన్ని మెరుగుపరచడం ఎలా, పేదలను సంపన్నులు చేయడం ఎలా అన్న ఆలోచనలే ఆయనకు విరామం. ఆయన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. నాలుగున్నర దశాబ్దాలుగా నిత్యం ప్రజల మధ్య నిత్య చైతన్య శీలిగా ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. నెలల తరబడి ఎన్నికల ప్రచారం కోసం నిత్యం పర్యటనలలో గడిపిన చంద్రబాబు పోలింగ్ పూర్తయిన తరువాత కొద్ది విరామం తీసుకున్నారు. ఆ విరామం తీసుకోవడానికి ముందు కూడా అంటే పోలంగ్ పూర్తియన తరువాత, ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడానికి మధ్య ఉన్న కొద్ది రోజులలో కూడా ఆయన నిత్యం రాష్ట్రంలో పరిస్థితులపైనే దృష్టి పెట్టారు.
పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసా కాండ, నెలకొన్న ఉద్రిక్తతలపై నిరంతర సమీక్షలతో ఆయన బిజీగా గడిపారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకోవలసిన చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. సంయమనం పాటించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అదే సమయంలో ఇలా పోలింగ్ పూర్తి కాగానే, కోర్టు అనుమతి తీసుకుని అలా విదేశీ పర్యటనకు చెక్కేసిన జగన్ మాత్రం ఇప్పటి వరకూ రాష్ట్రంలో పరిస్థితులపై ఒక్క సమీక్ష నిర్వహించలేదు. ఒక్క ప్రకటన చేయలేదు. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్థిదారులకు చెల్లించాల్సిన నిధులను దారి మళ్లించి అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖతో అదే విధంగా ఈ-ఆఫీస్ అప్‌గ్రేడేషన్ కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.
సరే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. అదీ వైద్య పరీక్షల నిమిత్తం. కానీ అక్కడ నుంచీ కూడా ఆయన నిత్యం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై నిత్యం స్పందిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా తన ధ్యాస, శ్వాస అంతా ఏపీ ప్రయోజనాలేనని చాటకనే చాటారు. అటువంటి చంద్రబాబు బుధవారం (మే 29) విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న ఆయన వెంటనే పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి వారికి కీలక సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు సందర్భంగా జాగరూకతతో ఉండాల్సిందిగా సూచించారు.
గురువారం (మే30)న అమరావతి చేరుకున్నారు. శుక్రవారం (మే31)ఆయన రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, పాతిక పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కౌంటింగ్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చిస్తారు. ఇక జూన్ 1వ తేదీన అంటే శనివారం జోన్ల వారీగా పార్టీ పోలింగ్ ఎజెంట్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అలాగే చంద్రబాబు శుక్రవారం (మే30) జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగిన తీరు, పోలింగ్ అనంతర పరిణామాలపై చర్చిస్తారు. అదే రోజు ఆయన బీజేపీ నేతలతో కూడా భేటీ అవుతారు.