జగనన్న తిరిగొస్తే అదరగొట్టేద్దాం!
posted on May 30, 2024 @ 12:48PM
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వుంది వైసీపీ నాయకుల వ్యవహారం. పోలింగ్ తర్వాత వైసీపీ ఓటమి కన్ఫమ్ అయిపోయినప్పటి నుంచి వీళ్ళ బుర్రలు తిరిగిపోయాయి. అందుకే అప్పట్నుంచి ఏం చేయాలో అర్థంకాక గెలుపు బాటలోవున్న టీడీపీని ఫాలో అయిపోతే సరిపోతుంది కదా అని ఫిక్సయినట్టున్నారు. అందుకే, టీడీపీ గెలవబోతోందని చాలా సర్వేలు చెబుతూ వుంటే, ఆ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా తమ స్పాన్సర్డ్ సొంత సర్వేలు రిలీజ్ చేసి మాదే విజయం అని గంతులు వేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత తెలుగుదేశం నాయకులు విజయోత్సాహంతో మాట్లాడారు. ఓటమి అర్థమైన వైసీపీ నాయకులు ఎప్పటికో తేరుకుని, మీడియా ముందుకు వచ్చి మేమే గెలుస్తాం అంటూ వాడిపోయిన ముఖాలతో చెప్పారు. ఇప్పుడు మరోసారి టీడీపీని అనుకరించడానికి వైసీపీ నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు.
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోలింగ్ ముగిసిన తర్వాత ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్ళొచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం నాయకులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. విజయోత్సాహంతో సీఎం సీఎం అని నినాదాలు చేశారు. ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళకి కూడా ఒక పాయింట్ దొరికినట్టు అయింది. చంద్రబాబు నాయుడికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది కాబట్టి, లండన్ వెళ్ళిన జగనన్న తిరిగి వస్తే కనుక భారీ స్థాయిలో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జగనన్న ఎలాగూ లాండ్ అయ్యేది గన్నవరం ఎయిర్‌పోర్టులోనే కాబట్టి అక్కడ వేలాదిమందితో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదరగొట్టేయాలని వైసీపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. జగనన్న తిరిగి వచ్చిన సందర్భంగా చేసే సందడి చూసి ‘ఇక విజయం వీళ్ళదే’ అని దేశమంతా అనుకోవాలని భావిస్తున్నారు. వీళ్ళు ఇలాగే భ్రమల్లో బతకాలని కోరుకుందాం.