అవును.. గాంధీజీ పాపులర్ కాదు...!
posted on May 30, 2024 @ 11:46AM
‘‘ఈ అంశంలో నన్ను క్షమించండి..! 1982 సంవత్సరంలో రిచర్డ్ అటెన్‌బరో రూపొందించిన చలనచిత్రం ‘గాంధీ’ విడుదలయ్యే వరకు కూడా ప్రపంచానికి మహాత్మా గాంధీ గురించి తెలియదు. మహాత్మా గాంధీజీ ఒక గొప్ప వ్యక్తి. మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండేలా వంటి మహానుభావుల కంటే గాంధీజీ తక్కువేం కాదు. 75 ఏళ్లుగా అలాంటి వ్యక్తిని ప్రపంచం గుర్తించేలా చేయడం మనందరి బాధ్యత కాదా?’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన అమూల్యమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. జనరల్ ఎలక్షన్స్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఏబీపీ న్యూస్ నెట్‌వర్క్ ప్రతినిధులకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మోడీ గారు చెప్పింది కరెక్టే... గాంధీ సినిమా వచ్చే వరకు మోడీ పాపులర్ కాదు.. ప్రపంచానికి తెలియదు.. ఎందుకంటే, ఆయన జనం సొమ్ముతో పని లేకపోయినా ప్రపంచ యాత్రలు చేయలేదు. ఆయన జనం సొమ్ముతో మీడియా క్రూలను ఏర్పాటు చేసుకోలేదు. ఆయన జనం సొమ్ముతో మీడియా మేనేజ్‌మెంట్ చేయలేదు. జనం సొమ్ముతో సోషల్ మీడియాలో తనను తాను ప్రమోట్ చేసుకోలేదు.. పైగా అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా నేనున్నాను అంటూ దూరిపోలేదు. దేశాలుపట్టి తిరిగి, ఏ దేశం వెళ్ళినా ఆ దేశ నాయకులను నవ్వుకుంటూ కౌగిలించుకునే తెలివితేటలు ప్రదర్శించలేకపోయారు. తన వెంట ఫొటోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకుని తన గొప్పతనాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసేలా చేసుకోలేదు. ఇరుగు పొరుగు దేశాలతో శత్రుత్వం పెరిగేలా చేసి, తద్వారా తాను లాభపడే అవకాశం ఆయనకు లేదు. ఇతర పార్టీలన్నిటినీ అణగదొక్కేసి తానే ఈ దేశానికి దిక్కు అని ప్రచారం చేసుకోలేదు.... ఇంకా ఇలాంటి ఎన్నో అతి తెలివితేటలు ప్రదర్శించలేదు కాబట్టే.. మోడీ గారు చెబుతున్నట్టు 1982కి ముందు గాంధీజీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కాలేదు. అంతే కదా విశ్వగురు గారూ!