బీఆర్ఎస్ వ్యూహం బెడిసి కొడుతోందా?
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొదలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి వరకు ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ కు ముందు సీబీఐ, ఈడీ ప్రతి ఒక్కరినీ అనేక మార్లు విచారించాయి. అవసరం అనుకున్న సందర్భాలో వారు సాక్షులు అయినా అనుమానితులు అయినా, చార్జి షీట్లో పేరున్నా లేకున్నా విచారణ తేదీలను మార్చి వారికి అనుకూలమైన తేదీలలో విచారణ జరిపారు. అయినా, సిసోడియా సహా ఎవరు కూడా ఈడీ సమన్లను ధిక్కరించలేదు. విచారణ సంస్థలకు వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేయలేదు. కానీ ఇదే కేసులో అనుమనితురాలిగా విచారణ ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఎవరి సూచనలు, సలహా మేరకు బీఆర్ఎస్ నాయకత్వం ఈ దోరణి ఎంచుకుందో కానీ ఇది ఒక విధంగా చిక్కులు కొని తెచ్చుకోవడమే అవుతుందని చట్టాల లోతులు తెలిసిన న్యాయ కోవిదులు, మాజీ పోలీసు,సివిల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.మరో వంక కవితను బలి పశువును చేసి రాజకీయ లబ్ధి పొందే కుట్ర జరుగుతోందనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి.
ఇదే కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (ప్రస్తుత మాజీ) మనీష్ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 27న అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత బెయిల్ మంజూరు కాకముందే మనీ లాండరింగ్ కేసులో ఈడీ కూడా ఆయన్ని అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఉన్న సిసోడియాను జైల్లోనే అరెస్టు చేశారు. ఆ తర్వాత సీబీఐ కేసులో బెయిల్ వచ్చినా ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 4 తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత ఈడీ అభ్యర్ధన మేరకు సీబీఐ కోర్టు ఆయన కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. తాజాగా శుక్రవారం (మార్చి 17) ఆయన కస్టడీని మరో ఐదు రోజులపాటు పొడిగించింది.
సిసోడియా అరెస్ట్కు ముందు నెలల తరబడి సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన్ని అనేక మార్లు విచారించాయి. ఒక దశలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేసును ఎందుకు సాగదీస్తున్నారు. ఈ నాటకాలు ఎందుకు ఇటో అటో తెల్చేయండి, తప్పు చేస్తే, సిసోడియాను, నన్నూ జైలుకు పంపడని, ఏజెన్సీలను డిమాండ్ చేశారు. అలాగే, అరెస్ట్ కు ముందు సిసోడియా, నేను ఈ రోజు సీబీఐ విచారణకు ఇంకోసారి వెళ్తున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అయితే.. ఈ విచారణ తర్వతా కొన్ని నెలలు జైలులో ఉండాల్సి వచ్చినా.. రావచ్చును. లెక్కచేయను. నేను భగత్‌సింగ్ ఆశయాలను అనుసరించే వ్యక్తిని అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.
నిజానికి ఒక్క సిసోడియానే కాదు ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టయ్యారు. అందులో రాజకీయ నాయకులున్నారు. ఇతర రంగాల ప్రముఖులున్నారు. వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి ఉన్నారు. శ్రీనివాస రెడ్డికి కూడా శనివారం (మార్చి 18) వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
ఎవరి దాకానో ఎందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కుడా ఈడీ పిలిస్తే, విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టమైన సంకేతాలే ఇస్తున్నారు. అలాగని వీరంతా నేరాన్ని అంగీకరిస్తున్నారా? అంటే లేదు. ఇదే కేసులో అనుమానితురాలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత చేస్తున్న వాదననే వారు చేస్తున్నారు. ఈ కేసును రాజకీయ కుట్రగానే ఆరోపిస్తున్నారు. రాజకీయంగానే ఎదుర్కుంటామని అంటున్నారు. కానీ కవిత, ఆమె తరపున రంగంలోకి దిగిన రాష్ట్ర మంత్రులు, ఇతర పెద్దలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని రాజకీయంగా విమర్శిస్తున్నారు. అంతవరకూ ఓకే కానీ, చట్టాన్ని రాజ్యాంగ సంస్థ ( ఈడీ)ని ధిక్కరించే సాహసం చేస్తున్నారు.
నిజానికి మార్చి 11న ఈడీ కవితను ప్రశ్నించింది. అయితే తిరిగి మార్చి 16 మరోమారు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయినా కవిత మర్చి 16న విచారణకు హాజరు కాలేదు. గైర్హాజరయ్యారు. దీంతో మార్చి 20వ తేదీన హాజరుకావాలంటూ తాజా సమన్లను ఈడీ జారీ చేసింది. తాను మహిళను అయినందున నిబంధనల ప్రకారం ఈడీ కార్యాలయంలో ప్రశ్నించేందుకు సమన్లు పంపరాదని తన నివాసంలో విచారణ జరవచ్చునని ఆమె పేర్కొంటూ తక్షణం దీనిపై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఆ కేసు మార్చి 24 న విచారణకు వస్తుంది. అంతవరకు, ఈడీ విచారణ జరపరాదని అవసరం అనుకుంటే తమ న్యాయవాదిని లేదా తనను ఈ మెయిల్ ద్వారా సంప్రదించ వచ్చని తమ న్యాయవాది ద్వారా ఈడీకి లేఖను పంపారు. దీంతో మార్చి 20వ తేదీన ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో కవిత వ్యహరిస్తున్నతీరు పలు అనుమానాలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆమె అనవసరంగా చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగే, ఈడీ విచారణ విషయంలో బీఆర్ఎస్ వ్యూహకర్తలు తీసుకుంటున్న నిర్ణయాలు కవిత మెడకు చుట్టుకునే ప్రమాదముందని అంటున్నారు. నిజానికి సీబీఐ విచారణ సమయంలో చివరకు ఈడీ సమన్లు అందుకుని ఆమె ఢిల్లీ చేరే వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ మంత్రులు పార్టీ ముఖ్యనాయకులు ఎవరూ కేసు విషయంలో ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. ఆమె ఢిల్లీ వెళ్ళిన తర్వాత, ముందు కేటీఆర్ ఆయన వెంట హరీష్ రావు ఇతర మంత్రులు, నాయకులు ఢిల్లీ చేరారు.
మార్చి 11 న ఆమె విచారణ సమయంలో ఢిల్లీలో ఒక విధంగా హల్ చల్ సృష్టించారు. అలాగే మళ్ళీ మార్చి 16 న కేటీఆర్, హరీష్ సహా అరడజను మందికి పైగా మంత్రులు ఇతర నేతలు ఢిల్లీ వెళ్ళారు. మళ్ళీ రేపు మార్చి 20 న కూడా అదే, సీన్ రిపీట్ అయ్యే అవకాసం లేక పోలేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే బీఆర్ఎస్ వ్యూహం మారడం వెనక ‘ఎదో’ ఉందని అంటున్నారు. అలాగే, కవితను బాలి పశువును చేసి, సానుభూతి రాజకీయం చేసే కుట్ర జరుగుతోందా అనే సందేహాలు కూడా వినవస్తున్నాయి.ఒక విధంగా కవిత కేసు, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా మారిందని అంటున్నారు.