వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. దేశ రాజకీయాల్లో మలుపు ?
అనుకున్నదే జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లు-2024ను, 24 గంటల తేడాతో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. అర్థరాత్రి ఆమోదం పొందిన బిల్లుల జాబితాలో, వక్ఫ్ సవరణ బిల్లు-2024- (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవల్‌పమెంట్- యూఎంఈఈడీ-ఉమీద్) బిల్లు కూడా చేరింది. అవును. సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం (ఏప్రిల్ 2) అర్ధరాత్రి దాటాక లోక్‌సభ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు, గురువారం (ఏప్రిల్3) అర్థరాత్రి దాటిన తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలుంది. ఆ ఒక్క గడప దాటేస్తే.. బిల్లు చట్టమవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దేశ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఇప్పడు దేశం ముందున్న పెద్ద ప్రశ్నగా రాజకీయ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక విషయంలోకి వస్తే.. పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక బిల్లు పై ఇంత సుదీర్ఘ చర్చ జరగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రప్రథమం కావచ్చు. బిల్లుకు అనుకూలంగా అధికార ఎన్డీఎ కూటమి, వ్యతిరేకంగా విపక్ష, ఇండియా కూటమి గట్టిగా నిలబడ్డాయి. పటిష్ట వాదనలు వినిపించాయి. ఉభయ సభల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనాయకులు అందరూ, చర్చలో పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు బలంగా వినిపించారు. అయితే ఇంత సుదీర్ఘంగా జరిగిన చర్చలో లోక్ సభలో సభా నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెదవి విప్పలేదు. ప్రధానమంత్రి మోదీ అయితే అసలు సభలోనే అడుగు పెట్ట లేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చర్చ ప్రారంభంలో కొంత సేపు సభలో ఉన్నారు. మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ ఓటింగ్ సమయానికి వచ్చారు. అంతే కాదు సభలో ఉన్న సమయంలోనూ రాహుల్ గాంధీ ముభావంగానే ఉన్నారు. ఎదుకనో ఏమో కానీ ప్రధాన చర్చలో పాల్గొనలేదు. లోక్ సభలో గొగొయ్ ప్రధాన ప్రసంగం చేశారు. చివరకు, అర్థరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ సమయానికి వచ్చిన సమయంలోనూ అయన నైట్ డ్రెస్ లో మొక్కుబడిగా సభకు వచ్చారనీ. ఇది ఆయన నిరాసక్తతకు మరో నిదర్శనంగా కొందరు పేర్కొన్నారు. అలాగే ఇటు చర్చ జరుగుతుంటే.. ఆయన అటు తిరిగి ఫోన్ చూసుకోవడం గురించి కూడా కొందరు ప్రస్తావించారు. చివరకు మీడియా బ్రీఫ్ లోనూ రాహుల్ గాంధీ కనిపించక పోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నాయి.
అయితే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరాసక్తంగా ఉన్నా.. విపక్ష ఇండియా కూటమి ఐక్యంగా వుంది. ఏక తాటిపై నడిచింది. ఉభయ సభల్లోనూ ఒక్క ఓటు బీర పోకుండా కాపాడుకుంది. ఆవిధంగా, బిల్లు పాస్ అయినా.. ఒక విధంగా విపక్ష ఇండియా కూటమి, విజయం సాధించింది. కూటమి మనుగడ పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, కూటమి ఎంపీలు, ముక్త కంఠంతో హమ్ ఏక్’ హై అని నినదించారు. నిరూపించారు.
నిజం, నిజంగా, ఇదొక అనూహ్య పరిణామం. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బయట పడిన విభేదాల నేపధ్యంలో ఇండియా కూటమి ఉన్నట్లా లేనట్లా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న సమయంలో ఇండియా కూటమి ఏక తాటిపైకి రావడం సామాన్య విషయం కాదు. నిజానికి ఇటీవల కాలంలో ఇండియా కూటమిలో విభేదాలు తార స్థాయికి చేరిన విషయం కాదన లేనిది. చివరకు కొందరు కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా లోక్ సభ ఎన్నికలతోనే ఇండియా కూటమి కథ ముగిసిందనే అభిప్రాయం వ్యక్త పరిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ- కశ్మీర్ ముఖ్యమంత్రి, ఒమర్ అబ్దుల్లా ,సిపిఎం నేత ప్రకాష్ కరత్, ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమి మనుగడ పై అనుమనాలు వ్యక్త పరిచారు. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా, కొందరు ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ లాంటి సూచన చేశారు.
అంతే కాదు కొందరు కూటమి నాయకులు,మీడియా విశ్లేషకులు, ఇండియా కూటమికి శ్రద్ధాంజలి ఘటించారు. అలా మనుగడ కోల్పోయిందని కొందరు, అసలు పోనే పోయిందని,ఇంకొందరు అనుకున్న ఇండియా కూటమికి వక్ఫ్ సవరణ బిల్లు సంజీవనిలా ప్రాణం పోసిందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈ ఐక్యత ఇలాగే, నిలుస్తుందా? నిలబడుతుందా? పార్లమెంట్ లోపలి సఖ్యత వెలుపలా కొనసాగుతుందా? ముఖ్యంగా ఎన్నికల రణ క్షేత్రంలో ఎన్డీఎని ఎదురొడ్డి ఐక్యంగా నిలబడుతుందా? అంటే, మాత్రం అనుమానమే అంటున్నారు. అయినా, ప్రస్తుతానికి అది అనవసర చర్చగానూ పరిశీలకులు భావిస్తున్నారు.
అదొకటి అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయలు, వినవచ్చిన వాస్తవాలు ఆశ్చర్యం గొలిపే విధంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నమ్మసక్యం కాకుండా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా, పార్లమెంట్ భవనంతో సహా, ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (సీజీవో) సైతం ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసిందని, స్వయంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రికార్డుల అదారంగా చెప్పిన విషయం,ఆశ్చర్య పరిచే విధంగా ఉందని అంటున్నారు. అంతే కాదు.. వక్ఫ్ పేరిట జరుగతున్న దురాక్రమణలు, దుర్వినియోగం గురించి సభ్యులు చేసిన ఆరోపణ లలోని నిజానిజాలు బయట పడాలంటే,అందుకుమరి కొంత సమయం పడుతుందిని అంటు న్నారు.అందుకే, చట్ట రూపం దాలుస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాలలో ఒక మలు పుకు దారి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.