రేవంత్ రెడ్డిని కల్సిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 

నటుడు, రచయిత, సంగీతం, దర్శకత్వం ఇలా చిత్ర రంగంలో  పలు క్రాప్ట్ లలో పరిచయం ఉన్న వ్యక్తి  అంటే ఠక్కున గుర్తొచ్చేది ఎస్ వి కృష్ణారెడ్డి. చిత్రరంగంలో వేషాలకోసం మద్రాసు వెళ్లిన అతనికి అవకాశాలు రాకపోవడంతో స్నేహితుడైన అచ్చిరెడ్డి నిర్మాతగా  మారిపోయారు. ఆయన నిర్మాతగా ఉన్న సినిమాలకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడై విజయవంత చిత్రాలను అందించారు.  ప్రముఖ సినీ నిర్మాత అచ్చిరెడ్డి, టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిలు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలుస్తున్నారు. గతంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, నిర్మాత దిల్ రాజు తదితరులు కలిశారు.

కవితకు మూడు రోజుల కస్టడీ పొడగింపు 

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఏడు రోజుల ఈడీ క‌స్ట‌డీ ముగియడంతో ఎమ్మెల్సీ క‌విత‌ను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ను మ‌రో 5 రోజుల క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని ఈడీ కోరింది. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం క‌విత క‌స్ట‌డీని మూడు రోజులు పొడిగించింది. అంత‌కుముందు త‌మ విచార‌ణ‌కు క‌విత స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఈడీ ఆరోపించింది. స‌మీర్ మ‌హీంద్ర‌తో క‌లిపి క‌విత‌ను ప్ర‌శ్నించాల‌ని తెలిపింది. లిక్క‌ర్ స్కామ్ లో రూ. కోట్ల‌లో కిక్ బ్యాక్‌లు అందాయ‌ని ఈడీ పేర్కొంది.  సౌత్‌గ్రూప్‌కు రూ.100కోట్లు చేరాయ‌ని ఆరోపించింది. క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని ఈడీ కోర్టుకు తెలియ‌జేసింది. అలాగే ఆమె కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను ఇవ్వ‌డం లేద‌ని ఈడీ త‌రఫు లాయ‌ర్ అన్నారు. క‌విత మేన‌ల్లుడి వ్యాపారానికి సంబంధించిన వివ‌రాలు అడిగిన‌ట్లు ఈడీ తెలిపింది. ప్ర‌స్తుతం క‌విత మేన‌ల్లుడి ఇంట్లో సోదాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది.  క‌విత‌ను ఆమె మొబైల్ ఫోన్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక‌తో విచారిస్తున్నామ‌ని ఈడీ త‌ర‌ఫు లాయ‌ర్ తెలియ‌జేశారు. సోదాల్లో మేన‌ల్లుడి ఫోన్ స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపింది. మ‌రోవైపు క‌విత త‌న అరెస్టు అక్ర‌మం అని పేర్కొన్నారు. కావాల‌నే త‌న‌ను ఈ కేసులో ఇరికించార‌ని చెప్పారు. కోర్టులో హాజ‌ర‌యిన త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చే క్ర‌మంలో మీడియాతో క‌విత ఈ వ్యాఖ్య‌లు చేశారు.

 వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు 

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక సీఈవో ముఖేశ్ కుమార్ మీనా నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాతంగా  వ్యవహరిస్తోందన్న ఆరోపణలు మిన్నంటాయి. వీటిని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. తాజాగా, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కేసు నమోదైంది. అన్నా రాంబాబు, మరికొందరు వైసీపీ నేతలు ఈ నెల 18న షాదీఖాన్ శ్లాబ్ పనుల్లో పాల్గొన్నారని, ఇది కోడ్ ఉల్లంఘించడమేనని రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తన నివేదికలో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు నోటీసులు పంపారు.  ఇటీవల, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిపైనా కేసు నమోదైంది. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు రాచమల్లుపై కేసు నమోదు చేశారు.

కవిత అరెస్టుపై స్పందించని తెలంగాణ !.. అందరిలో స్వయంకృతమేనన్న భావన!

కల్వకుంట్ల కవిత అలియాస్,  డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారకరామారావు. తెలంగాణకే కాదు.. కాస్త రాజకీయ పరిజ్ణానం ఉన్న ఎవరికీ కూడా  పరిచయం అక్కరలేని పేరు.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు తరువాత ఆమె పేరు దేశ వ్యాప్తంగా అందరికీ చిరపరిచితమై పోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమెదే కీలక పాత్ర అని  ఈడీగా అందరూ పిలిచే ఎన్‌ఫోర్స్‌మెంట్ చాలా చాలా గట్టిగా చెబుతోంది. కవిత కంప్యూటర్ సైన్స్ లో బీటెక్‌ ఆ తరువాత  ఎంఎస్‌  చేసి, అమెరికాలో ఉద్యోగం కూడా చేశారు. భర్త దేవనపల్లి అనిల్‌కుమార్‌తో అక్కడే స్థిరపడ్డ ఆమె  తండ్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమనేతగా ఉన్న సమయంలో అంటే 2006లో తిరిగి భారత్ కు వచ్చారు. ఉన్నత విద్యావంతురాలు, యుక్తాయుక్త విచక్షణ తెలిసిన కవిత ఉద్యమంలో చురుకుగా వ్యవహరించడాన్ని అంతా స్వాగతించారు. దీంతో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.  తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థ ద్వారా తెలంగాణ సంస్కృతికి, ఆచారాలకు, పండుగలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చేలా కృషి చేశారు. దేశ విదేశాల్లో జాగృతి శాఖలను ఏర్పాటు చేసి తెలంగాణకు, తద్వారా తెలంగాణ ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పించారు. మొత్తంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు కవిత ఐకాన్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. తెలంగాణ ఉద్యమం మహోధృత స్థాయికి చురుకున్న సమయంలో కవిత తెలంగాణ సంస్కృతి, భాష, యాసల విషయంలో చాలా సీరియస్ రోల్ ప్లే చేశారు. వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని సినిమాలను లక్ష్యంగా చేసుకుని  పెద్దఎత్తున వసూళ్లు చేశారని పరిశ్రమ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. అలాగే   రియల్ ఎస్టేట్‌లో సెటిల్‌మెంట్ల ద్వారా కూడా కవిత బాగా గడించారని అంటారు.  ఇక నిజామాబాద్ నుండి ఎంపీగా ఎన్నికై, ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత కవిత  అక్కడ కూడా పాపులర్ అయ్యారు. ఇంగ్లిష్‌ భాషపై పట్టు కవితకు బాగా ప్లస్ అయ్యిందంటారు.  పార్లమెంట్ కమిటీల్లో స్థానం దక్కి, ఎంపీ హోదాలో పలుదేశాల్లో పర్యటించే అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తండ్రి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో తండ్రి అధికారమే అలంబనగా ఆమె సంపాదనా మార్గం పట్టారని పార్టీ వర్గేలే ఇప్పుడు చెప్పుకుంటున్నాయి.  అప్పట్లో తండ్రి కేసీఆర్ హెచ్చరికలను కూడా ఆమె పట్టించుకునేవారు కారని అంటారు.  ఇక ప్రస్తుతానికి వస్తే.. ఎక్కడో ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానాన్ని రూపొందించాలని భావిస్తే.. ఆ విషయం తెలుసుకున్న కవిత  ఆప్ ప్రభుత్వ పెద్దలను కలిసి, రకరకాలుగా ప్రలోభపెట్టి, పాలసీని అవినీతికి అనుకూలంగా ఉండేట్టు తయారుచేయించారనేది ఆమెను అరెస్టు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అభియోగం.  ఈ కుంభకోణంలో  ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌, బోయినపల్లి అభిషేక్‌, అరబిందో ఫార్మా శరత్‌చంద్ర, అరుణ్‌ పిళ్లై, ఢిల్లీకి చెందిన సుఖేశ్ చంద్రశేఖర్‌, గురుగ్రామ్‌కు చెందిన అమిత్ ఆరోరాలు ముఖ్య భూమికలు పోషించారు. ఇందులో దక్షిణాది చెందిన వారిని సౌత్ గ్రూప్ లాబీగా ఈడీ పేర్కొంది.   పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయానికి సొమ్ములు అన్న ప్రలోభానికి లొంగి కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియా కవిత ప్రతిపాదనలకు అంగీకరించారనీ ఈడీ ఆరోపిస్తోంది. వారు ఇలా మద్యం పాలసీకి అంగీకరించారో లేదో అలా  100 కోట్ల రూపాయలు వారికి అందాయనీ అంటున్నారు. ఇక అక్కన్నుంచి మద్యం పాలసీ ద్వారా మద్యం కొనుగోలు, పంపిణీ, డీలర్ల కమీషన్‌, ఎంఆర్‌పీ అన్నీ మారిపోయాయి. విచ్చలవిడి అమ్మకాల ద్వారా డీలర్ల కమీషన్ పెంచడం ద్వారా, 200 కోట్లకు పైగా ఇప్పటివరకు అక్రమ సంపాదన జరిగి ఉంటుందన్నది ఈడీ ఆరోపణ.  ఇందులో డబ్బులను పెద్దయెత్తున అటూ-ఇటూ తరలించిన మోసగాడు సుఖేశ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. సుఖేష్ ను అప్రూవర్ గా మార్చుకుని  అందరి జాతకాలు వెల్లడించారని అంటున్నారు. దీంతో ఆప్ కు చెందిన సీనియర్ నాయకులు అరెస్టయ్యేనాటికి మంత్రి అయిన సత్యేంద్రజైన్‌, అప్పటికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా జైలుపాలయ్యారు. ఇదే కేసులో  కవితను సీబీఐ, ఈడీ పలుమార్లు విచారించారు. ఈ కుంభకోణంలో  కవితకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు.  ఇందుకు అప్రూవర్ గా మారిన సుఖేష్ కీలక సమాచారాన్ని అందించారు.  బీఆర్ఎస్‌కు, బీజేపీకి లోపాయికారీ సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపణలను జనం నమ్మడంతోనే అసెంబ్లీ ఎన్నికలలో అనుకున్న స్థాయిలో విజయాలు నమోదు చేయలేకపోయామని భావిస్తున్న బీజేపీ  లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈడీ కవితను అరెస్టు చేయడం వెనుక ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.  మొత్తం మీద కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయంగా బీఆర్ఎస్ కు తేరుకోలేని దెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ఏ మేరకు లబ్ధి పొందుతుందన్నది లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో ఆ పార్టీ గెలుచుకునే ఎంపీ స్థానాల సంఖ్య తేలుస్తుంది. అయితే కవిత అరెస్టు ఎపిసోడ్ కచ్చితంగా సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏడాదిన్నరగా తీహార్ జైలులోనే ఉన్న సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించక పోవడం, కవితకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలుండటంతో కవితకు కూడా  ఇప్పట్లో  బెయిలు లభించే అవకాశాలు లేవని చెబుతున్నారు. కవిత అరెస్టు రోజు నుంచీ బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ ఢిల్లీలోనే మకాం వేశారు. కేసీఆర్ పూర్తిగా మౌనం వహిస్తున్నారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నాహకాలు పెద్దగా లేవనే చెప్పాలి.   ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. తెలంగాణ ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ పితగా నిన్నటి వరకూ ప్రజల మన్ననలు అందుకున్న కేసీఆర్ తనయను ఈడీ అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదు. రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగలేదు. చాలా ఉదాశీనంగా వ్యవహరించారు. ఇక కవిత పట్ల ప్రజల నుంచే కాదు, పార్టీ శ్రేణుల నుంచి కూడా ఏ మంత సానుభూతి లభించలేదు. పైపెచ్చు అవినీతికి పాల్పడితే అనుభవించక తప్పదుకదా అన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అధికారంలో ఉండగా అహం తలకెక్కి ఇష్టారీతిగా వ్యవహరించిన నేతలకు కవిత ఎపిసోడ్ ఒక గుణపాఠం కావాలని జనం అంటున్నారు. మొత్తంగా కవిత అరెస్టు కావడానికి కారణం ఆమె స్వయంకృతాపరాధమే తప్ప రాజకీయ కారణాలేవీ కావని తెలంగాణ ప్రజ నమ్ముతోంది. అందుకే ఎటువైపు నుంచీ కూడా ఆమెకు కానీ, కేసీఆర్ కు కానీ సానుభూతి లభించడం లేదు. అదే ఇదే కేసులో కేజ్రీవాల్ అరెస్టైతే ఆప్ నేతలు, శ్రేణులే కాదు, దేశ వ్యాప్తంగా బీజేపీ ఏతర పార్టీలన్నీ ముక్తకంఠంతో ఆయన అరెస్టును ఖండిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడంలో భాగంగానే బీజేపీ ఈడీని ప్రయోగించి కేజ్రీవాిల్ ను అరెస్టు చేయించిందని అంటున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రం ప్రజల నుంచి కానీ, ఇతర రాజకీయ పార్టీల నుంచి కానీ సహాయ సహకారాలు అందడం లేదు. 

15మంది కార్పొరేటర్లతో కలిసి కారు దిగి చేయందుకున్న మేయర్ విజయలక్ష్మి

గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు తిరగి కోలుకోలేనంత గట్టి దెబ్బ తగలనుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పదిహేను కార్పొరేటర్లతో కలిసి కారు దిగి చేయి అందుకోవడానికి రెడీ అయిపోయారు. శనివారం (మార్చి 23) సాయంత్రం ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గాంధీభవన్ ఇందుకు వేదిక కానుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల విజయలక్ష్మి 15 మంది కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరారు. ఆయన కాంగ్రెస్ తరఫున లోక్ సభ అభ్యర్థిగా ఫిక్స్ అయిపోయారు కూడా. అలాగే మాజీ మేయర్, గ్రేటర్ పరిధిలో గట్టి పట్టున్న బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పంచన చేరారు. ఇప్పుడు తాజాగా మేయర్ విజయలక్ష్మి సైతం కారు దిగిపోయి చేయందుకోవడానికి రెడీ అయిపోయారు.  నిజానికి శుక్రవారం (మార్చి 22) సాయంత్రమే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ చేరిక లాంఛనం పూర్తైపోతుందని అంతా భావించారు.  కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ స్వయంగా ఆమెను కలిశారు. ఈ భేటీలో గద్వాల విజయలక్ష్మి తండ్రి కేకే కూడా ఉన్నారు. ఈ భేటీ కేకే నివాసంలోనే దాదాపు గంట సేపు జరిగింది.  ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా   దీపాదాస్‌ మున్షీ.. వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  కేకే పలు ప్రతిపాదనలు దీపాదాస్ మున్షీ ముందు ఉంచగా, వాటిపై పార్టీలో చర్చించిన అధిష్ఠానం వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విజయలక్ష్మి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.  

కేజ్రీవాల్ అరెస్ట్ పై ‘ఆప్’ తీవ్ర మండిపాటు 

ఢిల్లీ లిక్కర్ స్కాంపై వివిధ రాజకీయ పార్టీలు ఒక్కో రకంగా స్పందిస్తున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ హాయంలో ఈ కుంభకోణం జరిగింది. తొమ్మిది సార్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు న్యాయస్థానం సమన్లు పంపితే ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాకపోవడంతో కేజ్రీవాల్ అరెస్ట్ అనివార్యమైంది.  ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆప్ నేతలకు అందినట్లు చెబుతున్న రూ.100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను అధికారులు చూపలేదన్నారు. నిజానికి ఈ మనీ ట్రయల్ మొత్తం బీజేపీ చుట్టే తిరుగుతోందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో గతంలో అరెస్టయి ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బీజేపీకి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడని తెలిపారు. అదికూడా ఈ కేసులో అరెస్టులు జరుగుతున్న సమయంలోనే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడాన్ని అతిషి ప్రస్తావించారు. శరత్ చంద్రారెడ్డి అరెస్టు, బెయిల్ కూడా నాటకీయంగా జరిగిందని మంత్రి అతిషి ఆరోపించారు. కేజ్రీవాల్ తో తనకు పరిచయమే లేదన్న మరుసటి రోజే ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేశారని, నెలల తరబడి జైలులో ఉన్న శరత్ చంద్రారెడ్డి తన స్టేట్ మెంట్ మార్చారని చెప్పారు. లిక్కర్ పాలసీ విషయంలో కేజ్రీవాల్ ను కలిసి మాట్లాడానని స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాతే ఆయనకు బెయిల్ మంజూరైందని చెప్పారు. శరత్ చంద్రా రెడ్డికి 2022 నవంబర్ 9న ఈడీ సమన్లు పంపిందని, కేజ్రీవాల్ తో కానీ, ఆప్ తో కానీ తనకెలాంటి సంబంధంలేదని ఆయన స్పష్టంగా చెప్పారని అతిషి తెలిపారు. దీంతో ఆ మరుసటి రోజే శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారన్నారు. తన స్టేట్ మెంట్ మార్చుకున్న వెంటనే ఆయనకు బెయిల్ వచ్చిందని గుర్తుచేశారు. 2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య కాలంలో అరబిందో ఫార్మా కంపెనీ సుమారు రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిందని మంత్రి అతిషి వివరించారు. ఇందులో సింహభాగం.. అంటే 66 శాతం నిధులు బీజేపీకే అందాయని ఎలక్టోరల్ బాండ్స్ వివరాల ద్వారా బయటపడిందని అతిషి పేర్కొన్నారు.

కవితకు అధిక రక్తపోటు కోర్టులో మరో పిటిషన్ 

 సాధారణంగా ఈ డీ కేసులంటే రాజకీయనాయకులు భయపడుతుంటారు.ఈడీ కేసుల్లో  ముఖ్యంగా మూడు విషయాలు వారిని భయకంపితులను చేస్తాయి.  నెంబర్ వన్ ప్రజాప్రాతినిద్య చట్టం ప్రకారం కోర్టు పర్మిషన్ లేకుండానే ఎంతటి వారినైనా అరెస్ట్ చేయవచ్చు. ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు. నెంబర్ టూ  ఈడీ కేసుల్లో ప్రజాప్రాతినిద్య చట్టం ప్రకారం సాక్ష్యుల వాంగ్మూలాలు సేకరించి అరెస్ట్ చేయవచ్చు. ఒక వేళ తప్పు జరిగితే మాత్రం ఈడీ అధికారుల మీద ఎటువంటి చర్య ఉండదు.నెంబర్ త్రీ   ఈడీ కేసుల్లో నిందితులను కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే నిందితులను చూసినట్టే చూస్తారు కానీ అరెస్ట్ చేసే ముందు  నిబంధనలు పెద్దగా పాటించరు. వి ఐపి కర్టెసీ లేకుండానే కటకటాల్లో తోసేస్తారు. ఈ మూడు కారణాలే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవిత బీపీ పెంచేలా చేసింది. కవితకు మునుపెన్నడూ లేని బీపీ రికార్డ్ నమోదైంది. సాధారణంగా 120 బై 80 ఉంటే నార్మల్ గా భావించాలి. కవిత అరెస్ట్ తర్వాత హై బీపీ వచ్చినట్లు కవిత న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కవిత అరెస్ట్ తర్వాత దిక్కులేని మనిషయ్యింది. వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న తన తండ్రి కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడం కవిత బీపీ పెరగడానికి కారణమని పరిశీలకులు చెబుతున్నారు.  కవిత కొడుకు ఆర్యను చూడగానే ఎమోషనల్ అయి గట్టిగా పట్టుకుని ఏడ్చినట్టు కుటుంబసహ్యులు పేర్కొన్నారు. హైబీపీ కారణంగా  జైలులో కవిత ఆధ్యాత్మిక పుస్తకమైన భగవద్గీత  చదవడం ,సాత్వికాహారం, పండ్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైబీపీతో బాధపడుతున్నారని ఆమె కుటుంబసభ్యులు  పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. దీనిపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ గడువు ముగియడంతో ఈడీ ఆమెను మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది.కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. అయితే, కస్టడీ కొనసాగింపును కవిత తరఫు లాయర్లు అడ్డుకోనున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆమె హైబీపీతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కస్టడీ కొనసాగింపునకు ఈడీ దాఖలు చేయనున్న పిటిషన్ ను కవిత లాయర్లు ఛాలెంజ్ చేయనున్నారని సమాచారం.

హక్కుల కమిషన్ హక్కులనే హరించిన జగన్ కోడ్ పట్టించుకుంటారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో ప్రజలకు హక్కులు అనేవి లేకుండా పోయాయి. అలాంటి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఎందుకు అనుకున్నారో ఏమో సీఎం జగన్ రెడ్డి మానవ హక్కుల కమిషన్ న్యాయమూర్తికి కనీసం స్టెనోగ్రాఫర్ ను కూడా కేటాయించలేదు. ఎలాంటి సౌకర్యాలూ, హక్కులూ లేకుండానే ఏపీలోని మానవ హక్కుల కమిషన్ పదవీ కాలం ముగిసింది. అసలు తొలి నుంచీ కూడా ఏపీ సీఎంకు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ అటువంటి ఒక కమిషన్ ఉండాలి కనుక ఇద్దరు సభ్యులతో ఉన్న కమిషన్ రాష్ట్రంలో పని చేసింది. మామూలు ప్రొసీజర్ ప్రకారం హక్కుల కమిషన్ సభ్యుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కోడ్ పుణ్యమా అని ఎన్నికలు పూర్తై కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ రాష్ట్రంలో  హక్కుల కమిషన్ పని చేసే పరిస్థితి లేదు. ఏదో తప్పక కానీ జగన్ రూలింగ్ లో హక్కులే లేనప్పుడు ఇక హక్కుల కమిషన్ ఏమిటని పరిశీలకులు గతంలో పలు సందర్భాలలో సెటైర్లతో విరుచుకుపడ్డారు. సరే అసలు విషయానికి వస్తే  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో హక్కుల కమిషన్ ఏర్పాటుకు ఆయన పెద్దగా  ఆసక్తి చూపలేదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలని హైకోర్టులో  పిటిషన్లు దాఖలు కావడం, వాటిని విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు రాష్ట్రంలో  మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. కానీ కోర్టులు, కోర్టు తీర్పుల పట్ల పెద్దగా పట్టింపు లేని జగన్ ఆ ఆదేశాలకు ఖాతరు చేయలేదు. దీంతో  ప్రభుత్వంపై కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు కావడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత జగన్ సర్కార్ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటుచేసింది. జస్టిస్ మాంధాత సీతారామమూర్తి చైర్మన్‌గా, దండె సుబ్రమణ్యం, డాక్టర్ జి.శ్రీనివాసరావు జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా   కమిషన్ ఏర్పడింది. కానీ హైదరాబాద్‌లో ఉమ్మడి హక్కుల కమిషన్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర హక్కుల కమిషన్ స్వాధీనం చేసుకోవడంతో  ఏపీ హక్కుల కమిషన్‌కు నిలువనీడ లేకుండా పోయింది. అయితే మూడేళ్ల పదవీ కాలంలో హక్కుల కమిషన్ చైర్మన్ మాంధాత సీతారామమూర్తి   కారు,  డ్రైవర్, స్టెనోగ్రాఫర్, ఫోను కూడా లేకుండానే లేకుండా   పని చేశారు. దీనిపై  మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు రావడంతో  స్పందించిన ప్రభుత్వం, ఎట్టకేలకు ఆయనకు కారు, డ్రైవర్‌ను ఏర్పాటుచేసింది. అరకొర సౌకర్యాలతోనే కమిషన్ కొనసాగింది. అయితే జగన్ పాలనలో అరాచకాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే అరకొర వసతులు, కనీసం కార్యాలయం కూడా లేని దుస్థితి, చాలీచాలని సిబ్బంది కారణంగా కమిషన్ ఫిర్యాదుల పరిష్కారంలో ఇబ్బందులు ఎదుర్కొంది. దీనిపై కూడా మీడియా కథనాల కారణంగానే కోర్టు జోక్యం చేసుకుంది.   కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఏపీ కమిషన్ కార్యాలయం ఏపీలో ఏర్పాటైంది.  పరిమిత సిబ్బందితో స్టేట్ గెస్ట్ హౌస్‌లో కొద్దికాలం కోర్టు నడిచింది. ఆ తరువాత  కర్నూలుకు తరలింది. అయితే కమిషన్ కు కనీస సౌకర్యాలు, వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది.  కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి  తన పదవీ కాలం అంతా తన తీర్పులు తానే టైప్ చేసుకున్నారంటే పరిస్థితి ఏమిటో అవగతమౌతుంది.  రిజర్వు చేసిన తీర్పు ఆలస్యం కావడానికి తనకు స్టెనోగ్రాఫర్ లేకపోవడమే కారణమని స్వయంగా చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి  ప్రొసీడింగ్స్‌లో రాసుకున్నారంటే హక్కుల కమిషన్ విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం అర్థం చేసుకోవచ్చు.  సరే ఇప్పుడు పదవీ కాలం ముగిసింది కనుక ఏపీలో హక్కుల కమిషన్ లేదు. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది కదా. అయినా  జగన్ పార్టీ ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం అరకొరగా స్పందించి కొందరిపై చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా జరిగే పరిస్థితులు కానరావడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ఇక్కడ పరిస్థితులు చక్కబడే అవకాశాలు లేవంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కేవలం ప్రతిపక్షాల కోసం మాత్రమే ఉందా అన్నట్లుగా పరిస్థితి ఉందన్న ఆరోపణలకు వెల్లువెత్తుతున్నాయి. మానవహక్కుల కమిషన్ హక్కులనే హరించేసిన జగన్ ప్రతిపక్షాలు హక్కులను ఎందుకు  పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గన్నవరంలో శుక్రవారం (మార్చి 22) కడప అసెంబ్లీ నియోజవకర్గ తెలుగుదేశం అభ్యర్థి రెడ్డప్పగారి మాధవిపై వైసీపీ గూండాలు దాడి చేసిన సందర్భంగా పోలీసుల వ్యవహార శైలిని ఉదాహరణగా చూపుతున్నారు. దాడికి పాల్పడిన వైసీపీ వర్గీయులను వదిలేసి కారు నిలిపి ట్రాఫిక్ జాంకు కారణమయ్యారంటూ మాధవిని పోలీసు స్టేషన్ కు రావాలని పోలీసులు కోరడమే  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎంత దివ్యంగా అమలు  అవుతోందనడానికి నిరదర్శనంగా పరిశీలకులు చూపుతున్నారు. ఏపీలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే కోడ్ ఉల్లంఘనలపై సీ విజిల్ యాప్ లో ఫొటోలు తీయడానికి కూడా అవకాశం లేకుండా వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

కవిత బంధువుల నివాసాలలో ఈడీ సోదాలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత బంధువుల నివాసాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శనివారం (మార్చి 23) ఉదయం నుంచి కవిత బంధువుల నివాసాలే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నాయి.  కవిత ఆడపడుచు అఖిల నివాసంలో , కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.   గత శుక్రవారం(మార్చి 15న) లిక్కర్  కుంభకోణంలో  తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న కవిత ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆ సందర్భంగా ఆమె  మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం నేరుగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు తరలిచారు. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. పది రోజుల కస్టడీ విధించింది. కవిత తన అరెస్టు అక్రమం అంటూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు తీసుకున్న సుప్రీం విచారణ వాయిదా వేసింది. ఇక ఆమె బెయిలు పిటిషన్ ను కూడా సుప్రీం తిరస్కరించింది. బెయిలు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. స్థొమత ఉన్నందున బెయిల్ కోసం సుప్రీం ను ఆశ్రయించినంత మాత్రాన ఆ పిటిషన్ ను తాము విచారించజాలమని పేర్కొంది. దీంతో కవిత మరి కొంత కాలం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు ఢిల్లీలో తమ కస్టడీలో ఉన్న కవితను విచారిస్తున్నఈడీ ఆ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ లోని కవిత బంధువుల నివాసాలలో విస్తృత సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఏపీ బీజేపీ పోటీ చేసే సీట్లపై అయోమయం!?

బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయమైతే తీసేసుకుంది కానీ, పొత్తులో భాగంగా తాము పట్టుబట్టి మరీ తీసుకున్న స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.  ఈ సీటు.. కాదు కాదు ఆ సీటు అంటూ ఏపీ బీజేపీ నేతలు ఎక్కడా తమకు లేని విజయావకాశాలను పొత్తులో భాగంగా తమకు వచ్చిన నియోజకవర్గాలలో వెతుకులాటలో తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు. పొత్తులో భాగంగా ఇప్పటి వరకూ బీజేపీ పోటీ చేస్తుందని అంతా భావిస్తూ వచ్చిన రాజంపేట లోక్ సభ నియోజకవర్గం తిరిగి తెలుగుదేశం కోటాకు బదలీ అయ్యింది. అందుకు బదులుగా బీజేపీ కడపలో పోటీకి దిగాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో దివంగత వైఎస్  కుటుంబ సభ్యులు పరస్పరం పోటీ పడుతున్న నేపథ్యంలో  అక్కడ పోటీ చేస్తే విజయావకాశాలు ఉంటాయని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  కడప లోక్ సభ స్థానం నుంచి  వైసీపీ  అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా వైఎస్ షర్మిలారెడ్డి పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో   వైఎస్ అభిమానుల ఓట్లు భారీ స్థాయిలో చీలిపోయే పరిస్థితి ఉందని భావిస్తున్న బీజేపీ అక్కడ తమ అభ్యర్థిని నిలబెడితే విజయం సునాయాసమని ఆశిస్తోంది.   ఆ స్థానం నుంచి సీఎం రమేష్, లేదా ఆదినారాయణరెడ్డిలను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.   కాగా ఇప్పటివరకూ బీజేపీకి వెళ్లిందని భావిస్తున్న రాజంపేట ఎంపీ సీటు, తాజాగా తిరిగి టీడీపీ కోటాకు బదిలీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాజంపేట లోక్ సభ నియోజకవర్గ  పరిథిలో ముస్లింల సంఖ్య గణనీయంగా ఉన్నందున  ఆ స్థానంలో బీజేపీ పోటీకి నిలిస్తే  ఓట్లు పడే అవకాశాలు తక్కువ అన్న భావనతో రాజంపేటను వదులుకుని విజయనగరం ఇవ్వాలని కమలం పార్టీ కోరుతున్నట్లుగా చెబుతున్నారు.  హిందూపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించడంతో బీజేపీ   అనంతపురం లోక్ సభ స్థానం కోరుతోంది.   అదే విధంగా అసెంబ్లీ నియోజవకరగాల విషయంలో  బీజేపీ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒక వేళ కడప ఎంపీ సీటు తీసుకుంటే, టీడీపీ ఇచ్చిన ఒకటి, జనసేన ఇచ్చిన 3 అసెంబ్లీ స్థానాలను టీడీపీకి వదిలేసే అవకాశాలున్నాయని బీజేపీకి చెందిన  ఓ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. అప్పుడు అసెంబ్లీ బరిలో  బీజేపీ బలమైన కొద్ది మంది అభ్యర్ధులను మాత్రమే బరిలోకి దింపుతుందని అంటున్నారు. వాస్తవ బలాన్ని మించి పొత్తు చర్చల్లో పట్టుబట్టి మరీ ఎక్కవ స్థానాలను దక్కించుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ స్థానాలలో  నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకక ఇబ్బందులు పడుతున్నది.  పొత్తులో భాగంగా దక్కించుకున్న స్థానాలలో ఇప్పటి వరకూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన నేతలను నిలబెట్టడం సరికాదనీ, అలా జరిగితే ఓట్లు బదలీ అయ్యే అవకాశాలు ఉండవనీ చర్చల సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా చెప్పిన నేపథ్యంలో బీజేపీ ఇంత కాలం వైసీపీతో అంటకాగిన కొందరు నేతలను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పొత్తులో భాగంగా వచ్చిన స్థానాలలో నిలబెట్టే అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోందని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ పార్టీ అభ్యర్థులుగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి,  అలాగే రఘురామకృష్ణం రాజు. కొత్తపల్లి గీత, సీఎం రమేష్  పేర్లు మాత్రమే ఖరారయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా శనివారం సాయంత్రానికల్లా బీజేపీ తరఫున ఏపీలో పోటీ చేయనున్న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  బీజేపీలో అభ్యర్థుల ప్రకటనలో జరుగుతున్న జాప్యం కారణంగా పొత్తు ప్రమాదంలో పడిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో పార్టీ అగ్రనాయకత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో ఎలాంటి పొరపొచ్చాలూ లేవనీ, మిత్ర ధర్మానికి అనుగుణంగానే తమ అడుగులు పడుతున్నాయనీ స్పష్టం చేసింది. అదే విధంగా జనసేన, తెలుగుదేశం పార్టీలూ చెబుతున్నాయి.  

డ్ర‌గ్స్ రాకెట్.. వైసీపీ నేత‌లకు బిగుస్తున్న ఉచ్చు!

గ‌త ఐదేళ్ల కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దేశ‌ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.  ఆ గుర్తింపు అభివృద్ధిలో అనుకొని ప‌ప్పులో కాలేయ‌కండి!  అభివృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో  ప్ర‌పంచవ్యాప్తంగా పేరుగాంచిన ప‌రిశ్ర‌మ‌లను రాష్ట్రానికి తీసుకురావ‌డంలో వ‌చ్చిన గుర్తింపుకాదు.  అరాచ‌క రాజ‌కీయాల‌కు, గంజాయి అక్ర‌మ ర‌వాణా, విక్ర‌యాలకు కేరాఫ్ అడ్ర‌స్సుగా మారడంతో వచ్చిన గుర్తింపు అది.  గంజాయి అడ్డాగా, డ్రగ్స్ హబ్ గా జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చింది.  జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధికారం చేప‌ట్టిన నాటినుంచి గంజాయి విక్ర‌యాలు రాష్ట్రంలో విచ‌ల‌విడిగా పెరిగిపోయాయి. దానికి బానిస‌లుగా మారుతున్న‌వారు రోజురోజుకు పెరుగుతున్నారు. దీనికితోడు అరాచ‌క రాజ‌కీయాలు పెచ్చురెల్లుతున్నాయి. ఇవి చాల‌వ‌న్న‌ట్లు.. తాజాగా డ్ర‌గ్స్ మాఫియాకూడా ఏపీకి అడ్డాగా మారిన‌ట్లు క‌నిపిస్తోంది. విశాఖ ప‌ట్టణం స‌ముద్ర‌ తీరంలో అధికారులు భారీ ఎత్తున డ్ర‌గ్స్ ను ప‌ట్టుకున్నారు. ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. రాష్ట్ర ఆర్థిక రాజ‌ధానిగాఉన్న, వైకాపా ప్ర‌భుత్వం త‌మ క‌ల‌ల రాజ‌ధానిగా చెప్ప‌కొంటున్న విశాఖ‌లో దేశ‌మంతా ఉలిక్కిప‌డేంత‌గా ఎన్నిక‌ల త‌రుణంలో రూ. ల‌క్ష‌ల కోట్ల విలువైన వేల కిలోల మాద్ర‌కద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డ‌టం తీవ్ర ఆందోళ‌న రేకెత్తిస్తోంది. బ్రెజిల్‌ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో సుమారు 25వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నట్లు సీబీఐ, నార్కోటిక్స్‌ అధికారులు గుర్తించారు. ఈనెల 19న నార్కోటిక్స్‌ సామగ్రి, నిపుణులతో వచ్చిన సీబీఐ అధికారులు ఆ కంటైనర్​లో భారీ మెత్తంలో డ్రగ్స్‌ ఉన్నట్టు నిర్ధరించుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారులు వాటిని సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్‌ మీదుగా ఈ నెల 16న కంటైనర్‌ విశాఖకు వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ డ్ర‌గ్స్  సంధ్యా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ వైసీపీ నేత‌దిగా అధికారులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. దీని మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ కోనం వీర‌భ‌ద్ర‌రావుగా తెలుస్తోంది. వీరు న‌లుగురు సోద‌రులు, వీరిలో ఇద్ద‌రు అమెరికాలో సెటిల్ కాగా.. మ‌రో ఇద్ద‌రు ఇక్క‌డ ఉంటున్నారు. వీర‌భ‌ద్ర‌రావు, అత‌ని సోద‌రుడికి వైసీపీతో, ముఖ్యంగా విజ‌య‌సాయిరెడ్డితో సంబంధాలు  ఉన్నాయి. సంక్రాంతి సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌, విజ‌య‌సాయి రెడ్డి, ఇత‌ర వైసీపీ పెద్ద‌ల ఫొటోల‌తో  వీర‌భ‌ద్ర‌రావు, అత‌ని సోద‌రుడు ప్లెక్సీలు సైతం వేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతున్నాయి. వైసీపీ నేత‌ల‌తో సంబంధం ఉన్న‌టువంటి కోనం వీర‌భ‌ద్రరావు కంపెనీకి  డ్ర‌గ్స్ ఆర్డ‌ర్ వ‌చ్చింద‌నేది అతిపెద్ద చ‌ర్చ‌గా మారింది. దీంతో ఈ డ్ర‌గ్స్ మాఫియా వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉన్న‌ట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక్క‌డి నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లించి దీన్ని క్యాష్ రూపంలో మార్చాలని ప్లాన్ గా తెలుస్తోంది. కానీ, కేవ‌లం మేము రొయ్య‌ల మేత‌ కోస‌మే తెప్పించామ‌ని, అందులో కొకైన క‌లిసి ఉంద‌ని మాకు తెలియ‌ద‌ని వారు చెబుతున్న‌ప్ప‌టికీ.. అసలు ఇది ఎక్క‌డి నుంచి వ‌చ్చింది.. గ‌తంలో వీళ్ల‌కు ఏమైనా స‌రుకు ర‌వాణా అయిందా అనే విష‌యాల‌పై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.        విశాఖ పోర్టుకు ఈనెల 16న చేరిన కంటెయిన‌ర్ ను తెరిపించేందుకు సీబీఐ అధికారులు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో.. వైసీపీకి చెందిన కొంద‌రు బ‌డా నేత‌లు ఈ కంటెయిన‌ర్ తెర‌వ‌కుండా అడ్డుకునేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందుకోసం వారు తమకు వత్తాసుగా కొందరు ప్రభుత్వాధికారులను కూడా వినియోగించడంతో వైసీపీ అండదండలతోనే డ్రగ్స్ వ్యవహారం నడుస్తోందని తేటతెల్లమౌతోంది. రూ. ల‌క్ష‌ల కోట్ల విలువైన డ్ర‌గ్స్ గ‌ట్టుర‌ట్టు కాకుండా వైసీపీ పెద్ద‌ల కోరిక మేర‌కు ప‌లువురు రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు త‌మ వ్య‌క్తిగ‌త హోదాల‌ను ఉప‌యోగించి కంటెయిన‌ర్ ను తెర‌వ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు సీబీఐ అధికారులు   చెబుతున్నారు. ఎలాంటి ఒత్తిడులకు లొంగకుంటా సీబీఐ అధికారులు కంటెయిన‌ర్ సీల్ తీశారు.  సీల్ తీసిన స‌మ‌యం నుంచి నాట్కో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, ఫ‌లితాలు, మ‌ళ్లీ తిరిగి సీల్ చేయ‌డం వ‌ర‌కు అన్నీ వీడియో తీయించారు.  ఇదిలా ఉంటే.. తాజా ప‌రిణామాల‌పై టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పందించారు..  రెండేళ్ల క్రిత‌మే బ్రెజిల్ లో వైసీపీ నేత‌ల‌కు ఉన్న‌ చీకటి వ్యాపారాల గురించి తాను చెప్పాననీ,   ఇప్పుడు అదే నిజం అయ్యిందంటూ రెండేళ్ల క్రితం తాను మాట్లాడిన వీడియోను లోకేశ్ ఎక్స్ లో షేర్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోంద‌ని, అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి గడియల్లో వైసీపీ చీకటి మాఫియాలతో జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయ‌ని లోకేశ్ విమ‌ర్శించారు. విశాఖలోని వైసీపీ నేత‌ల‌కు చెందిన ఓ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్ అంటూ లోకేశ్ విమ‌ర్శించారు.  విశాఖ‌లో దొరికిన భారీ డ్ర‌గ్స్ వెనుక వైసీపీ నేత‌లు ఉన్న‌ట్లు ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు అవుతున్న క్ర‌మంలో ఆ పార్టీ పెద్ద‌లు కొత్త ప్లాన్ కు తెర‌లేపారు. ఎప్ప‌టిలాగే.. ప్రభఉత్వ ముఖ్య  సలహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి మా ప్ర‌మేయం లేదంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేశాడు. అంతేకాదు..  టీడీపీ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, వారు ఆధారాలు లేకుండా   అబాండాలు వేస్తే మేము వాటికి స‌మాధానం చెప్పాలా? అంటూ స‌జ్జ‌ల‌ ప్ర‌శ్నించాడు. అంతే కాదు.. కంపెనీ ప్ర‌తినిధులు వైసీపీ పార్టీ నేత‌ల‌ని సోష‌ల్ మీడియాలో ప్లెక్సీలు రుజువు చేస్తున్నా.. స‌జ్జ‌ల మాత్రం కంపెనీ వాళ్లు పురందేశ్వ‌రి, చంద్ర‌బాబు బంధువులు అంటూ.. ఇదంతా ఓ సామాజిక వ‌ర్గం వాళ్ల‌ప‌నే అన్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేయ‌డం ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు.. ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చిందంటే టీడీపీ ఏదో ఒక అభాండం వేసి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించాల‌ని చూస్తుందంటూ స‌జ్జ‌ల చాలా అమాయ‌కంగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేశాడు.  దీంతో.. గ‌త ఎన్నిక‌ల్లో బాబాయ్‌ను హ‌త్య‌చేసి అధికారంలోకి వ‌చ్చింది ఎవ‌రు?  ప్ర‌జ‌ల సానుభూతి పొందేందుకు కోడిక‌త్తి డ్రామా ఆడింది ఎవ‌రు స‌జ్జ‌లా? అంటూ ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అధికారంకోసం ఎంత‌టి ప‌నికైనా తెగించే వైసీపీ నేత‌లు.. ఇప్పుడు త‌మ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాల‌కు తెర‌లేపుతుండ‌టంతో ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల తీరునే ఏవగించుకుంటున్నారు.

మాస్కోలో ఉగ్రదాడి.. 70 మంది మృతి

రష్యాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం 70 మంది మరణించారు. వంద మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తం అవుతున్నది.   మాస్కో  శివారులోని క్రాస్నోగోర్స్క్‌లోని క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై ఉగ్రవాదులు బాంబులుతో విరుచుకుపడ్డారు. అనంతరం కాల్పులు జరిపారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో  కనీసం 70 మంది మృత్యువాతపడినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మరో 100 మందికిపైగా గాయపడ్డారని సమాచారం. కాగా ఉగ్రవాదులు భద్రతా బలగాల యూనిఫారం ధరించి కన్సర్ట్ హాలులోకి ప్రవేశించి ఈ దారుణానికి తెగబడ్డారని తెలుస్తోంది.  హాలులోకి ప్రవేశిస్తూనే గ్రనేడ్లు విసిరి కాల్పులు జరిపారని,  కన్సర్ట్ హాలులో మంటలు వ్యాపించాయని దర్యాప్తులో తే లింది.  సంఘటన సమాచారం అందగానే ఆ ప్రాంతానికి చేరిన  భద్రతా బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ప్రతిగా ఉగ్రవాదులూ ఎదురు కాల్పులు జరిపారు.   ఇలా ఉండగా దాడికి బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్) ఒక ప్రకటన విడుదల చచేసింది.  రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తిరిగి ఎన్నికైన రోజుల వ్యవధిలోనే ఉగ్రదాడి జగరడం గమనార్హం. షో స్టార్ట్‌ అవుతుండగా మిలటరీ దుస్తుల్లో చొరబడ్డ టెర్రరిస్టులు

900 ఏళ్ల నాటి శాసనాన్ని కాపాడుకోవాలి

 చాళుక్య సోమేశ్వరుని క్రీ.శ. 1134 నాటి శాసనం పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనున్న గంగాపురం శివారులోని చౌడమ్మ ఆలయ చెరువు కట్టపై 900 ఏళ్ల నాటి కన్నడ శాసనం ఆలనా పాలన లేక నిరాదరణకు గురైందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా  సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ సంపదను పరిరక్షించి, భవిష్యత్ తరాలకు అందించటం పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ శాసనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గంగాపురం చౌడమ్మ ఆలయ సమీపంలో  ఆ శాసనంలో  క్రీ.శ. 1134వ సంవత్సరం, జూన్ 8వ తేదీ శుక్రవారం నాడు  కళ్యాణ చాళుక్య చక్రవర్తి 'భూలోకమల్ల' మూడో సోమేశ్వరుడు, కళ్యాణనగరం నుంచి పాలిస్తుండగా, అతని కుమారుడైన మూడో తైలాపుని సుంకాధికారులు, స్థానిక సోమనాథ దేవుని గంధ, ధూప, అఖండ దీపాల కోసం 'వడ్డరావుళ, హెజ్జంక' అనే పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని కానుకగా  ఇచ్చిన వివరాలు  ఉన్నాయని శివనాగిరెడ్డి తెలిపారు.  గతంలో పురావస్తు శాఖ ప్రచురించిన చారిత్రక ప్రాధాన్యత గల ఈ శాసనాన్ని భద్రపరిచి కాపాడుకోవాలని చౌడమ్మ ఆలయ ధర్మకర్తలు కటికల మల్లికార్జున్, గిరి ప్రసాద్, చెన్నయ్య శ్రీను, శంకర్ శ్రీనివాస్, సత్తయ్యలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగాపురం కేశవప్రసాద్, మరికొందరు గంగాపురం గ్రామస్తులు పాల్గొని ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.

బిజెపి నుంచి ఎన్నికల బరిలో రాధిక

సీనియ‌ర్ న‌టి రాధిక లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌నున్నారు.. త‌మిళ‌నాడులోని విరుద్ న‌గ‌ర్ నుంచి బిజెపి అభ్య‌ర్ధిగా రంగంలోకి దిగుతున్నారు.. ఈ మేర‌కు బిజెపి త‌న నాలుగో జాబితాలో ఆమె పేరును ప్ర‌క‌టించింది. లోక్‌సభ అభ్యర్థుల కోసం బీజేపీ నాలుగో జాబితా శుక్రవారం విడుదల చేసింది. తమిళనాడు నుంచి 15 స్థానాలకు, అలాగే.. పుదుచ్చేరి నుంచి ఒక స్థానానికి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఈ జాబితాలో చిదంబరం(ఎస్సీ నియోజకవర్గం) నుంచి పీ కార్తికేయిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. కార్తికేయిని 2017లో అన్నాడీఎంకే నుంచి బీజేపీలో చేరారు. నటి నుంచి పొలిటీషియన్‌గా మారిన రాధిక భర్త శరత్‌ కుమార్ త‌న పార్టీఅఖిల ఇండియా సమతువ మక్కల్‌ కల్చి ను ఈమధ్యే బీజేపీలో విలీనం చేశారు. దీనికి బ‌హమ‌తిగా రాధిక‌కు బిజెపి విరుద్ న‌గ‌ర్ సీటు కేటాయించింది..

బంతి గంటా కోర్టులోనే.. తేల్చుకోవల్సింది ఆయనే!

చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ  చేయి, లేకుంటే పార్టీ కోసం పని చేయి.. ఇదీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన సంకేతం. వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా శుక్రవారం (మార్చి 22) విడుదల చేసిన చంద్రబాబు ఈ జాబితాలో గంటా పోటీ చేయాలని భావిస్తున్న భీమిలీ నియోజకవర్గానికీ, అలాగే గంటాను తాను పోటీ చేయమని చెబుతున్న చీపురుపల్లి నియోజకవర్గానికీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచారు. తద్వారా చంద్రబాబు తన ఉద్దేశమేమిటన్నది స్పష్టంగా చాటారు.  చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి, ఆ పార్టీ సీనియర్, కీలక నేత బొత్స సత్యాన్నారాయణపై గంటాను పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన   నియోజకవర్గ ఇప్పటికే విస్పష్టంగా గంటాకు తెలియజేశారు. అయితే గంటా మాత్రం తాను విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననీ, చీపురుపల్లిలో అయితే విజయావకాశాలపై నమ్మకం లేదనీ అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం  సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి, గంటా అయితే అక్కడ కచ్చితంగా విజయం సాధిస్తారని అంటున్నారు. ఈ విషయంలో గంటా ఇంకా ఏమీ తేల్చుకోకపోవడంతో తాజాగా విడుదల చేసిన జాబితాలో భీమిలి, చీపురుపల్లి నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచిన చంద్రబాబు నాయుడు ఇక బంతిని గంటా కోర్టులోనే వేశారు. ఒక వేళ చీపురుపల్లి నుంచి పోటీకి గంటా సంసిద్ధత వ్యక్తం చేయకుంటే ఆయన సేవలను పూర్తిగా పార్టీకి వినియోగించుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.  భీమిలీ, చీపురుపల్లి మాత్రమే కాకుండా చంద్రబాబు మూడో జాబితాలో ఇంకా ఎచ్చర్ల, ధర్మవరం కూడా పెండింగ్ లో ఉంచారు. ఆ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు కళావెంకటరావు, పరిటాల శ్రీరామ్ లు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాలూ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.  

హైదరాబాద్ లో   డ్రగ్స్ ముఠా గుట్టురట్టు 

మాదక ద్రవ్యాలకు తెలంగాణ రాజధాని అడ్డాగా మారింది. హైద‌రాబాద్‌లో మ‌రోసారి భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ్డాయి. ఇంట‌ర్ పోల్ సాయంతో న‌గ‌ర శివారులోని ఐడీఏ బొల్లారంలో డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు మాద‌క‌ద్ర‌వ్యాల ముఠా గుట్టుర‌ట్టు చేశారు. ఇంట‌ర్ పోల్ స‌మాచారంతో స్టేట్‌ డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు శుక్ర‌వారం బొల్లారంలో సోదాలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో భాగంగా బొల్లారంలోని ఓ కంపెనీలో 90 కిలోల మెపిడ్రిన్‌ను అధికారులు సీజ్ చేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డ్ర‌గ్ విలువ మార్కెట్‌లో దాదాపు రూ.9 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.  బొల్లారం ప‌రిధిలో క‌స్తూరిరెడ్డి ప‌దేళ్లుగా డ్ర‌గ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించామ‌ని తెలిపారు. సిగ‌రెట్ ప్యాకెట్ల మాటున విదేశాల‌కు డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లోనూ మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు అనుమానిస్తున్నారు. డ్ర‌గ్ కంట్రోల్ అధికారుల స‌మాచారం మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఎన్టీఆర్ రాజును సత్కరించిన నారా లోకేష్

స్వర్గీయ నందమూరి తారకరామారావు వీరాభిమాని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు ఎన్టీఆర్ రాజును తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సత్కరించారు.  నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, ఆ తరువాత ఎన్టీఆర్ రాజును కలిసి ఆయనను శాలువతో సత్కరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.   ఈ సందర్భంగా నారా భువనేశ్వరి  తన తండ్రి  అభిమానిగా ఎన్టీఆర్ రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులకు వివరించారు. నారా లోకేష్, బ్రహ్మణి  ఎన్టీఆర్ రాజుతో  తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ  సందర్భంగా నారా దేవాన్ష్ కు ఎన్టీఆర్ రాజు శుభాశీస్సులు అందించారు.

తెలుగుదేశం మూడో జాబితా..13 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు

సుదీర్ఘ కసరత్తు తరువాత తెలుగుదేశం తరఫున పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు11 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలలో  పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ శుక్రవారం (మార్చి 23)మూడో జాబితాను విడుదల చేశారు.   దీంతో  తెలుగుదేశం పార్టీ ఐదు అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ జాబితాలో తెలుగుదేశం కొన్ని కీలక స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటి వరకూ పెండింగ్ లో ఉంచిన బోడె ప్రసాద్ కు తెలుగుదేశం అధినేత టికెట్ ఖరారు చేశారు. ఆయనకు పెనమలూరు స్థానాన్ని కేటాయించారు. అలాగే తొలి రెండు జాబితాలలోనూ పెండింగ్ లో పెట్టిన సర్వేపల్లి స్థానాన్ని సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.   అలాగే మైలవరం అసెంబ్లీ నియోజవకర్గం విషయంలో కూడా కూడా ఊగిసలాటకు తావివ్వకుండా ఆ స్థానానికి వసంత కృష్ణ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ గత ఎన్నికలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే.  అలాగే పలాస నియోజకవర్గం నుంచి గౌతు శిరీష, కాకినాడ సిటీ నియోజవవర్గం నుంచి వనమాడి వెంకటేశ్వరరావులకు అభ్యర్థులుగా ప్రకటించారు.  ఇక నరసరావు పేట స్థానాన్ని చదలవాడ అరవింద్ బాబుకు కేటాయించారు.  ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే విశాఖపట్నం లోక్ సభ స్థానాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కు కేటాయించారు. అలాగే విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని చిన్నిని అభ్యర్థిగా ప్రకటించారు.  అలాగే హిందుపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ పోటీ చేస్తుందని గట్టిగా వినిపించినప్పటికీ ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థగా బీకే పార్థ సారధిని నిలబెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.  ఇక ఏలూరు లోక్ సభ స్థానాన్ని యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కు కేటాయించారు.   గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకాకుళం లోక్ సభ స్థానం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తారు.  అదే విధంగా నరసరావు పేట నుంచి వైసీపీకి రాజీనామా చేసిన వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయులు,  నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల నుంచి బైరెడ్డి శబరిలు తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేస్తారు.  అమలాపురం లోక్ సభ స్థానం నుంచి దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ ను చంద్రబాబు ఎంపిక చేశారు.