సైలెంట్ సెన్సేషన్ వైఎస్ వివేకా బయోపిక్!

ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తొలుత వైసీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి సహా ఆ పార్టీ ముఖ్యులంతా వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారంటూ ప్రకటనలు గుప్పించారు. ఆ తరువాత వైఎస్ వివేకా మరణానికి గుండెపోటు కాదు గొడ్డలిపోటు కారణమని తేలింది.   తొలుత వైసీపీ అధినేత జగన్ , ఆ పార్టీ నేతలు ఈ హత్య వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ స్థానిక నేతలూ ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే దర్యాప్తులో ఈ హత్యతో తెలుగుదేశం అధినేతకు కానీ, ఆ పార్టీ నేతలకు కానీ ఎటువంటి సంబంధం లేదని రుజువు కావడమే కాకుండా, వివేకాను హత్య చేసింది అయినవాళ్లే అని తేలింది.  దారుణ హత్య వెనుక అయినవాళ్లే ఉన్నారంటూ వివేకా కుమార్తె సునీత కూడా చెబుతున్నారు. తన తండ్రి హంతకులకు శిక్ష పడాలంటూ ఆమె అలుపెరుగని న్యాయపోరాటం చేస్తున్నారు.  వివేకా  హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదు. ఈ క్రమంలో వైఎస్ వివేకా బయోపిక్ తెరమీదకు రావడం సంచలనంగా మారింది. 'వివేకం' పేరుతో వైఎస్ వివేకా బయోపిక్ రూపొందింది. ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఎవరనే విషయం రివీల్ కాలేదు కానీ.. 'వివేకా బయోపిక్' అనే యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్ ను విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ కింద డిస్క్రిప్షన్ లో పేర్కొన్నారు. వివేకా హత్యకు ముందు తర్వాత జరిగిన సంఘటనలను చూపిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. అంతేకాదు ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు.  అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడంలేదు. 'www.vivekabiopic.com' అనే వెబ్ సైట్ ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.  అత్యంత సెలెంట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న వివేకా బయోపిక్ ఎలాంటి పొలిటికల్ సెన్సేషన్ క్రియోట్ చేస్తుందన్నది చూడాలి.  

జగన్ కు ఫ్యామిలీ స్ట్రోక్!?

గతంలో ఎమర్జెన్సీ తరువాత లోక్ సభ ఎన్నికలలో శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పట్లో ఇందిరాగాంధీకి సన్ స్ట్రోక్ (son stroke) తగిలి పరాజయం పాలయ్యారని విస్తృతంగా చర్చ జరిగింది. ఆ తరవాత తమ వారసులకు సింహాసనం కట్టబెట్టేందుకు నేతలు ప్రయత్నించి విఫలమైన ప్రతిసారీ సన్   స్ట్రోక్ అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో సెటైర్లు పేలేవి.   ఇక ఇప్పుడు జగన్ పరిస్థితి చూస్తే ఆయనకు ఫ్యామిలీ స్ట్రోక్ గట్టిగానే తగులుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సొంత అడ్డా కడపలోనే ఆయనకు దిమ్మతిరిగేలా ఫ్యామిలీ స్ట్రోక్ తగలక తప్పదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  సరిగ్గా ఎన్నికల వేళ వైఎస్ అడ్డాగా చెప్పుకునే కడపలో ఆయన కుటుంబీకులే ప్రత్యర్థులుగా తలపడే పరిస్థితులు ఉన్నాయి.  కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో  వైఎస్ కుటుంబీకులే పరస్పరం తలపడే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి.  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు  వైసీపీ అధినేత సీఎం జగన్‌పై  ఆయన సొంత ఫ్యామిలీయే తలపడేందుకు సమాయత్తమౌతోంది. ఈ పరిస్థితి జగన్ కు తలనొప్పే అనడంలో సందేహం లేదు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రంలో బలపడటమే లక్ష్యంగా కాంగ్రెస్ వేస్తున్న అడుగులు ముందుగా కడప జిల్లాలో పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ తో నడిచిన, వైఎస్ ఇలాకాలో ముందుగా బలోపేతం అయ్యే ఉద్దేశంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు.   అందుకే తొలుత కడప లోక్ సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలలో సత్తా చాటాలని, అలా చాటాలంటే అక్కడ జగన్  దాష్టీకాన్నీ, ఆధిపత్యాన్ని గట్టిగా అడ్డుకోగలిగే బలమైన అభ్యర్థులు రంగంలో ఉండాలనీ నిర్ణయించింది.   ఇప్పటికే కడప జిల్లాల్లో జగన్ తీరు పట్ల ఒకింత వ్యతిరేకత బలంగా వ్యక్తమౌతోంది. ముఖ్యంగా గత ఎన్నికల ముందు జగన్ సొంత చిన్నాన్న హత్య వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్న విషయంలో జిల్లా ప్రజలలో స్పష్టత వచ్చిన తరువాత జగన్ కు జిల్లాలో గతంలోలా ప్రజామద్దతు లభించడంలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత వైఎస్ కుటుంబం అంతా ఒక్కటిగా నిలిచింది. కాంగ్రెస్ తో జగన్ విభేదించి సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తొలుత వైఎస్ వివేకా వద్దని వారించి తాను కాంగ్రెస్ లోనే ఉండిపోయి విజయమ్మకు ప్రత్యర్థిగా రంగంలోకి దిగినా ఆ తరువాత జగన్ ను సీఎంను చేయడమే ధ్యేయంగా అన్న కుమారుడి పక్కన గట్టిగా నిలబడ్డారు. 2019 ఎన్నికల సమయంలో అయితే వైఎస్ కుటుంబం సమైక్యంగా జగన్ కు అండగా నిలిచింది. అయితే ఆ ఎన్నికలలో జగన్ పార్టీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కొక్కరుగా జగన్ కు దూరం అయ్యారు. అలా దూరం కావడానికి ప్రధాన కారణం మాత్రం గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలే కారణమని చెప్పవచ్చు. గత ఎన్నికలలో జగన్ అన్న సీఎం కావడం కోసం చెప్పులరిగేలా, గొంతు చిరిగేలా ప్రచారం చేసిన షర్మిలను తాను సీఎం అయిన తరువాత జగన్ దూరం పెట్టారు. పార్టీలో ఆమెకు ఎలాంటి హోదా కల్పించకుండా.. వేధించి చివరకు ఆమె రాష్ట్ర విడిచి వెళ్లి పొరుగు రాష్ట్రంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అదే విధంగా బాబాయ్ వైఎస్ వివేకా కుమార్తె సునీత విషయంలో కూడా తండ్రి హత్య కేసు నిందితులకు అండగా నిలబడి ఆమెపైనే ఆరోపణలు చేయించారు. దీంతో ఆమె కూడా అన్నకు దూరం జరిగారు. ఇప్పుడు జగన్ కు ఓటు వేయవద్దని షర్మిల, సునీతలు ఇరువురూ ముక్త కంఠంతో ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా వైఎస్ ఫ్యామిలీ కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగడానికి నిర్ణయించుకుంది.  పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్ పై పోటీకి సొంత చిన్నమ్మ అంటే బాబాయ్ వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగడం దాదాఫు ఖరారైందని చెబుతున్నారు.  తొలి నుంచీ కడప లోక్ సభ అభ్యర్ధిగా వైఎస్ అవినాష్ రెడ్డిపై సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే కడప లోక్ సభ బరిలో దిగితే ఆమె మొత్తం నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలుగుతారా, ఆమె కడప లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ మేరకు ప్రభావం చూపగలుగుతారు అన్నదానిపై కాంగ్రెస్ లో విస్తృతంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. ఆ చర్చ అనంతరం కాంగ్రెస్ వ్యూహం మార్చిందని చెబుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప లోక్ సభ అభ్యర్థిగా పోటీలోకి దిగితే.. కడప లోక్ సభ నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నిట్లోనూ కాంగ్రెస్ బలోపేతం అవుతుందని భావించి ఆమెను కడప నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించిందనీ, అందుకు షర్మిల కూడా సుముఖత వ్యక్తం చేశారనీ అంటున్నారు.  ఇక పులివెందుల నుంచి వివేకా భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగితే అక్కడ కూడా కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తుందనీ, దీంతో మొత్తంగా కడప జిల్లాలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు మెరుగౌతాయని కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు.  వాస్తవానికి కాంగ్రెస్ వ్యూహం ఆ పార్టీకే కాక తెలుగుదేశం పార్టీకి కూడా మేలు చేసే విధంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించి జగన్ సానుభూతిని ప్రోది చేసుకున్నారు. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి వివేకా హత్యతో  తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎటువంటి సంబంధంలేదని నిర్ద్వంద్వంగా తేలిపోవడమే కాకుండా, ఆ హత్య వెనుక ఉన్నది కుటుంబ కుట్రేననీ, ఆ కుట్రలో జగన్ కు కూడా భాగముందన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.    పైగా తన ఇంటిమనుషులే తండ్రిని హత్య చేశారని వివేకా కుమార్తె  సునీత,   హంతకులు తమ పక్కనే ఉంటారని ఊహించలేదని సౌభాగ్యమ్మ వెల్లడించారు. అంతే కాదు తన తండ్రి హత్యలో తీవ్ర ఆరోపణలకు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి అరెస్టు కాకుండా తన అన్న జగన్ రక్షిస్తున్నారని మీడియా మీట్ లో కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించిన సునీత హత్యలు చేసే వైసీపీకి ఓటు వేయవద్దని పిలుపు కూడా ఇచ్చారు.  ఇప్పుడు కడప లోక్ సభ నుంచి వైఎస్ షర్మిల, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ సౌభాగ్యమ్మ కాంగ్రెస్ అభ్యర్థులకుగా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో  జగన్ కు సొంత జిల్లాలో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా మారినట్లైంది. దీంతో ఈ సారి జగన్ కు ఫ్యామిలీ స్ట్రోక్ గట్టిగా తగలడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మళ్లీ బిజెపిలో చేరిన తమిళ సై 

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ బుధవారం బీజేపీలో చేరారు. ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. తమిళిసై అంతకుముందు బీజేపీ నాయకురాలు. ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. ఆ తర్వాత 2019లో తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ఆమె తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తిరిగి బీజేపీలో చేరడంపై వామపక్ష పార్టీలు, డీఎంకే విమర్శలు గుప్పించాయి. వారి విమర్శలకు అన్నామలై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉన్నత పదవులలో ఉండి... పదవీ విరమణ తర్వాత సాధారణ పౌరుడిలా ప్రజాసేవలో తరించడం కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యమని చురక అంటించారు. ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నత పదవులు అస్సలు వదులుకోరని... ఎందుకంటే వారికి రాజకీయాలు అంటే కేవలం ఉన్నత పదవులు మాత్రమేనని విమర్శించారు. కానీ బీజేపీలో మాత్రం ప్రజాసేవ అన్నారు. తమిళిసై సౌందర్యరాజన్ గవర్నర్‌గా బాగా పని చేశారని... ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనుకోవడం ఆమెకు ప్రజల మీద ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. అదే సమయంలో ఆమె మళ్లీ బీజేపీలో చేరడం ద్వారా పార్టీ పట్ల ఆమె నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా అయ్యేందుకు దోహదపడాలని ఆమె భావిస్తున్నారన్నారు. రాజకీయ కుటుంబంలో  పుట్టి పెరిగిన సౌందర్యరాజన్‌కు బాల్యం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉంది.  ఆమె మద్రాసు మెడికల్ కాలేజీలో చదువుతున్న సమయంలో విద్యార్థి నాయకురాలిగా ఎన్నికయ్యారు . ఆమె తమిళనాడు రాష్ట్ర బిజెపి రాష్ట్ర శాఖకు  సేవలందించారు. 2019న తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2019 సెప్టెంబర్ 9న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ గవర్నర్ నరసింహాన్ తర్వాత సౌందర్య రాజన్  బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తీవ్ర అవమానాలకు గురయ్యారు. కెసీఆర్ ప్రభుత్వానికి  తమిళసైకి మధ్య ఒక దశలో విభేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి.   సౌందర్యరాజన్ ఇప్పటి వరకు ఎంపీ లేదా ఎమ్మెల్యే కావడానికి చేసిన అన్ని ప్రయత్నాలలో ఓడిపోయారు , రెండు అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంటు ఎన్నికలలో విఫలమయ్యారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుక్కుడి నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమార్తె కనిమొళి కరుణానిధిపై ఆమె ఓడిపోయారు . తాజాగా సౌందర్య రాజన్ మళ్లీ బిజెపిలో చేరి వార్తలలోకెక్కారు. 

అల్లు అర్జున్ మామ చంద్ర శేఖరరెడ్డి భువనగిరి నుంచి?

తెలంగాణలో మొత్తం 17 స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే 12 స్థానాలు కన్ఫర్మ్ అయ్యాయి. మరో ఐదు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఐదు స్థానాలకు విపరీత పోటీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మల్కాజ్ గిరి కాంగ్రెస్  టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తనకు మల్కాజ్‌గిరి లేదా భువనగిరి టిక్కెట్ ఇచ్చిన పర్వాలేదని... ఆ సమయంలో అవసరమైతే అల్లు అర్జున్ తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని స్టైలిష్ స్టార్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఒక  ఛానల్ మీడియా ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. అల్లు అర్జున్ మీకు మద్దతుగా ప్రచారం చేస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ... ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, అదే సమయంలో అల్లు అర్జున్ సహా తన కుటుంబం తనకు మద్దతుగా ఉంటుందన్నారు. ప్రజలే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారన్నారు. ఆ సమయంలో (టిక్కెట్ ఇచ్చాక) పరిస్థితిని బట్టి అల్లు అర్జున్ ప్రచారానికి వచ్చే అవకాశముంటుందన్నారు. అయినప్పటికీ ఈ రోజు ఎవరు వచ్చినా... ఎవరు రాకపోయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీ ఇంతకుముందు రాజకీయాల్లో ఉందని, పవన్ కల్యాణ్ పార్టీని నడిపిస్తున్నారని, కాబట్టి తాము కలిసినప్పుడు రాజకీయాలపై చర్చ సాగుతుందన్నారు. రాజకీయాలు అందరికీ అవసరమే అన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై సినిమా పరిశ్రమ కూడా ప్రశంసలు కురిపిస్తోందన్నారు.  భువనగిరి ఇచ్చినా పోటీ చేస్తాను తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో మల్కాజ్‌గిరి టిక్కెట్ ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని, అందుకే అక్కడ కొన్నిరోజులుగా పలు కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఒకవేళ భువనగిరి ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మల్కాజ్‌గిరి... భువనగిరిలో ఏ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పారు. తనకు భువనగిరి టిక్కెట్ ఇస్తే కోమటిరెడ్డి సోదరుల సహకారం తనకు ఉంటుందన్నారు. మల్కాజ్‌గిరి టిక్కెట్ సునీతా మహేందర్ రెడ్డికి వస్తుందనే ప్రచారం జరగడంతో తాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలను కలిశానన్నారు. అందుకే భువనగిరి టిక్కెట్ తనకు ఇస్తే కోమటిరెడ్డి సోదరులతో పాటు ఇతర ఎమ్మెల్యేల సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు రెండింట్లో ఏ నియోజకవర్గాన్ని కేటాయించినా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు

కోడ్ దారి కోడ్ దే.. ఉల్లంఘనల దారి ఉల్లంఘనలదే.. ఏపీలో జగన్మాయ!

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. ఏపీలో మాత్రం ఆ సామెతను సీఎం జగన్ తలచుకుంటే తప్పులకు కొదవా అని మార్చుకోవాలి. జగన్ పై ప్రేమతో అధికారులు తప్పులు చేయడానికి వెరవని విచత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఔను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉంది అంటే ఉంది. అంతే అది అమలు కాదు. ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతాయి. ఫిర్యాదులను అధికారులు పట్టించుకోరు. కోడ్ అమలుకు ఉపక్రమించరు. అది అంతే. ఎందుకలా అంటే అంతా జగన్మాయ అంటారు.  ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజా కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా చాటారు. కోడ్ ఉల్లంఘన 60 అడుగుల కటౌట్ రూపంలో  దర్శన మిస్తోందంటూ సెల్ఫీ దిగి మరీ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.  ఇంతకీ విషయమేమిటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వంతెన వద్ద రాజమండ్రీ వెళ్లే ప్రధాన రహదారిపై ఎపీ సీఎం జగన్ 60అడుగుల కటౌట్ దర్జాగా దర్శనమిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజుల తరువాత కూడా అత్యంత ప్రధానమైన రహదారిలో అందరి దృష్టినీ ప్రముఖంగా ఆకర్షించేలా ఏర్పాటు చేసిన కటౌట్ తొలగించలేదంటే ఏపీలో ఎన్నికల కోడ్ ఎంత దివ్యంగా అమలౌతోందన్నది అర్ధమౌతుంది. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. అధికారులు పని చేయడం లేదా అంటే బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. అదే జొన్నాడ వద్ద వచ్చీ పోయే వాహనాలన్నిటినీ ఎండను కూడా లెక్క చేయకుండా క్షుణ్ణంగా తనఖీలు చేసి పంపిస్తున్నారు. చిన్న చిన్న పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు గోడల మీద రాతలను తొలగించేస్తున్నారు. తుడిచేస్తున్నారు. అయితే ఘనత వహించిన అధికారులకు అంత ఘనంగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేసిన సీఎం జగన్ గారి కటౌట్ మాత్రం ఆనలేదు.  ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికార మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కనుక సీఎం సహా రాజకీయ నాయకుల ఫొటోలేవీ కనపడకూడదనీ, అలాగే వాలంటీర్లు ఎవరూ విధుల్లో పాల్గొనకూడదనీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలా ఇచ్చేసి ఊరుకోలేదు.  ఎక్కడైన నేతల ఫొటోలు కనిపించినా, వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నా వెంటనే ఫొటోలు తీసి పంపించమని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నా, అందుకు సంబంధించిన ఆధారాలు సమాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నా.. అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు.  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దారి ఎన్నికల కోడ్ దే ఉల్లంఘనల దారి ఉల్లంఘనలదేగా ఉందనడానికి సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ కార్యదర్శి, రాష్ట ఎన్నికల సంఘం మాజీ కమిషనర్   నిమ్మగడ్డ రమేష్  సీఎం 60 అడుగుల కటౌట్ ముందు ముందు నిలబడి దిగిన సెల్ఫీయే నిదర్శనం. అయినా మన పిచ్చి కానీ  రాష్ట్రంలో పౌరపంపిణీ వాహనాలపైనా , ఈసేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలపైనా షిక్కటి షిరునవ్వుతో ఇప్పటికీ ముఖ్యమంత్రి ఫోటోలు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులు ఎక్కడో రోడ్డుపై ఉన్న 60 అడుగుల కటౌట్ ను ఎందుకు పట్టించుకుంటారు. ఎన్నికల కోడ్ కు ఏపీ సీఎం జగన్ అతీతులని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారా అన్న అనుమాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.   ఇప్పటికైనా ఎన్నికల సంఘం కళ్లు తెరిచి ఏపీలో కోడ్ ఉల్లంఘనలపై కొరడా ఝుళిపించాలని కోరుతున్నారు. 

ఢిల్లీ హైకోర్టునాశ్రయించిన  కేజ్రీవాల్ 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  జైలు శిక్షఅనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా  మాదిరిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా జైలు పాలయ్యే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పదే పదే నోటీసులు పంపడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ వైపు ఈ సమన్లపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఈడీ తొమ్మిదో సారి సమన్లు పంపింది. దీనిపై కేజ్రీవాల్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టగా.. కేజ్రీవాల్‌ తరఫున ప్రముఖ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. వివరణ ఇవ్వాలంటూ ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన విషయంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు సహా పలు ఇతరత్రా అంశాలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించాలని పేర్కొంటూ ఈడీ తొమ్మిదోసారి సమన్లు పంపింది. ఈ నెల 21న విచారణకు రమ్మని కేజ్రీవాల్ ను పిలిచింది. దీంతో కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ ఆరోపణలకు ఈడీ సమాధానం చెప్పాలని ఆదేశించింది.  

కవిత అరెస్టు.. కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతిందా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఇప్పుడు సమస్యలు చుట్టుముట్టేశాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు.. తెలంగాణ పిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారు. ముఖ్యంగా తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు కావడం ఆయన నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇటీవలి  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి, పార్టీ నుంచి నేతల వలసలు, పార్టీ అగ్రనాయకత్వంపై అవినీతి ఆరోపణలు.. వంటివి ఎదుర్కొనే ధైర్యం, స్థైర్యం ఆయనలో పుష్కలంగా ఉన్నప్పటికీ, సొంత కుమార్తె కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణంలో ఇరుక్కోవడం మాత్రం ఆయన ప్రతిష్టను ప్రజలలో బాగా పలుచన చేసిందని అంటున్నారు. ఆ కారణంగానే కేసీఆర్ పార్టీ నుంచి వలసల విషయంలో కానీ, పార్టీ అగ్రనేతలు, మాజీ మంత్రులపై అవినీతి ఆరోపనలు వెల్లువెత్తుతున్నా గట్టిగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంటున్నారు.  వాస్తవానికి  అవినీతి ఆరోపణలు ఆయనపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, మద్యం  కుంభకోణంలో కుమార్తె ప్రమేయం ఆయన వ్యక్తిత్వంపైనే పెద్ద దెబ్బపడేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలంగాణలో బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్‌గా , తెలంగాణ సంస్కృతికి ఐకాన్ గా పేరొందిన కవిత ప్రతిష్టను, ఇమేజ్ ను మద్యం కుంభకోణం తేరుకోలేనంతగా దెబ్బతీశాయనడంలో సందేహం లేదు.   అంతే కాదు కవిత అరెస్టు, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులు రాున్న లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయావకాశాలపై తీవ్రంగా ప్రభావం చూపనున్నాయి.  ఇప్పుడు కేసీఆర్ దృష్టి అంతా తన కుమార్తె కవితకు బెయిలు అంశంపైనే కేంద్రీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీలో ట్రబుల్ మేకర్ గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా కవితకు బెయిలు తదితర అంశాలపై న్యాయనిపుణులతో చర్చించడం వంటి కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో  పార్టీలో వలసన నిరోధానికి వీసమెత్తు ప్రయత్నం చేసేందుకు కూడా నాయకులు కరవయ్యారు. కౌషిక్ రెడ్డి వంటి వారు మీడియా ముందుకు వచ్చి ఫిరాయింపులపై ఏదో మాట్లాడినా ఆ ప్రభావం వలసకు రెడీ అయిన బీఆర్ఎస్ నేతలను ఏ మాత్రం కట్టడి చేయలేకపోతోంది. అలాగే పార్టీ క్యాడర్ లో స్థైర్యాన్ని నింపలేకపోతున్నది.   వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చినా సిట్టింగ్ ఎంపీల నిష్క్రమణ  కేసీఆర్ పరిస్థితి పార్టీలో ఎంత నిస్సహాయంగా మారింతో తేటతెల్లం చేస్తున్నది. లోక్ సభ ఎన్నికలలో లోపు ఆయన కుదురుకుని పార్టీ వ్యవహారాలపై సీరియస్ గా దృష్టి సారించగలిగే పరిస్థితులు కనిపించడం లేదు. ముందుగా కవితకు బెయిలు రావడంపైనే ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఒక వేళ బెయిలు వస్తే ఆ తరువాత ఆయన పార్టీ వ్యవహారాలపై కాన్ సన్ ట్రేట్ చేసే అవకాశం ఉంది. బెయిలు రావడంలో జాప్యం జరిగితే మాత్రం బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలలో  బీఆర్ఎస్ సారథి లేని సైన్యం మాదిరి కకావికలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

తెలంగాణలో మరో 8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సుమారు మూడు గంటల పాటు సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణలో మరో ఎనిమిది లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ఖరారు చేయగా, నేటి సమావేశంలో మరో ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేశారు. దీంతో మొత్తం 12 మంది అభ్యర్థులను ఖరారు చేయగా మరో ఐదు స్థానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పెండింగ్ సీట్లలో స్థానాల అభ్యర్థుల ఖరారుపై ఈ నెల 21న మరోసారి సమావేశం కానున్నారు. ఈరోజు 8 రాష్ట్రాలకు 50 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ అభ్యర్థులపై చర్చించారు. ఇందులో తెలంగాణ నుంచి ఎనిమిది మందిని ఖరారు చేశారు.

ఎర్రబెల్లీ కారు దిగేస్తున్నారా? కమలం గూటికా.. హస్తం నీడకా?

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా కారు దిగేందుకు సిద్ధమైపోయారా? ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు తన శైలిలో తాను ఏర్పాట్లు చేసుకుంటున్నారా అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు.  అయితే ఆయన ప్రయత్నాలు రివర్స్ గేర్ లో ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ లోకి తనను ఆహ్వానించండంటూ ఆయన రివర్స్ లో సంకేతాలు పంపుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారు. పార్టీ మారడం లేదనీ, నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి తదితర అంశాలపై ఆయనతో చర్చించేందుకు మాత్రమే రేవంత్ ను కలిశామని చెబుతున్నారు. బయటకు ఏం చెప్పినా వారంతా కాంగ్రెస్ పంచన చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారనే బీఆర్ఎస్ హై కమాండ్ సహా అందరూ భావిస్తున్నారు. అయితే ఎర్రిబెల్లి స్టైల్ మాత్రం వారందిరికీ భిన్నంగా ఉందంటున్నారు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడా ఎర్రబెల్లి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి చేయి అందుకోవడానికి రెడీగా ఉన్నారంటూ వార్తలు రాలేదు. ఎర్రబెల్లి కూడా ఇప్పటి వరకూ కాంగ్రెస్ లీడర్లు ఎవరితోనూ భేటీ అయిన దాఖలాలు లేవు. అయితే ఎర్రిబెల్లి మాత్రం తాను కాంగ్రెస్ గూటికి చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ ఖండనలు చేస్తున్నారు. ఆ ఖండనలను చూసే రాజకీయవర్గాలు, పరిశీలకులు విస్తుపోతున్నారు. ఎవరూ అనకుండానే తాను ముందుగా తన కాంగ్రెస్ చేరిక వార్తలు అవాస్తవమంటూ ఎలుగెత్తడం వెనుక ఆయన ఏం చెప్పదలుచుకున్నారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం ఎర్రబెల్లి హస్తం గూటికి చేరతాననీ, తనను ఆహ్వానించాలనీ కాంగ్రెస్ పెద్దలకు, లేదా ముఖ్యులకు సంకేతాలు ఇస్తున్నట్లుగానే ఆయన ఖండనలు ఉన్నాయని అంటున్నారు.  ఇంతకీ  ఎర్రబెల్లి తనంతట తానుగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాననీ, తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను నమ్మవద్దనీ ప్రజలను కోరుతూ మీడియా సమావేశం ఎందుకు పెట్టడంపై  బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఆయన ఉరుములేని పిడుగులా తన పార్టీ మార్పు విషయంపై ఎందుకు మాట్లాడుతున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.  తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో  ఎర్రబెల్లి పేరు కూడా వినిపించింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో భాగంగా ఎర్రబెల్లి ప్రమేయం కూడా ఉందని తేలినట్లు వార్తలు వినవస్తున్నాయి.  ఎర్రబెల్లి దయాకరరావు తన సొంత గ్రామంలో  ఫోన్ ట్యాపింగ్ ల కోసం ఒక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. దీనిపై విస్తృతంగా చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే  ఎర్రబెల్లి తాను పార్టీ మారడం లేదంటూ మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించడాన్ని పరిశీలకులు ఆయన తనను తాను కాంగ్రెస్ కు సరెండర్ చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి బయటపడాలని భావిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ చెప్పడం ద్వారా కాంగ్రెస్ ను తాను చేయి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలిచ్చారని అంటున్నారు.   అయితే కొందరు మాత్రం ఎర్రబెల్లి కాంగ్రెస్ గూటికి కాదు, బీజేపీ పంచన చేరుతారని అంటున్నారు. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ద్వారా ఈ కేసు నుంచి బయటపడాలని ఆయన భావిస్తున్నారంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకు రాజకీయంగా బద్ధ విరోధులైన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు కాంగ్రెస్ లో ఉన్నారు. పైగా కొండా సురేఖ రేవంత్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో తాను చేరదామని ప్రయత్నించినా వారు అందుకు అంగీకరించే పరిస్థితి ఉండదు. మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ప్రమేయం ఆధారాలతో బయటపడితే ముఖ్యమంత్రి రేవంత్ ఏ మాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎర్రబెల్లి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించగలిగేది బీజేపీయే అని ఆయన నమ్ముతున్నారని పరిశీలకులు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే తనక పార్టీ మారే ఉద్దేశం లేదని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పడం ద్వారా బీజేపీకి ఆయన  తన చేరికపై సూచనప్రాయంగా సమాచారం ఇచ్చారని అంటున్నారు. 

కంటోన్మెంట్ బిజెపికి షాక్... కాంగ్రెస్ లో చేరిన శ్రీ గణేష్ నారాయణ్ 

ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌ నారాయణన్‌ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ప్రజాయుద్ద నౌక, దివంగత గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేసిన  సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా వెన్నెల  ఓటమి పాలైంది. ఆమెపై బీఆరెస్ అభ్యర్థి లాస్య నందిత విజయం సాధించారు. ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని రోజుల ముందే గద్దర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన పట్ల ఉన్న అభిమానం, సానుభూతి నేపధ్యంలో వెన్నెల విజయం సాధిస్తారన్న అంచనాలకు భిన్నంగా నందిత విజయం సాధించారు. కంటోన్మెంట్ సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న ఆకస్మిక మృతితో ఆయన పెద్ద కూతురు లాస్యకు బిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కెసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ  కంటోన్మెంట్ స్థానంలో  సెలబ్రిటీ హోదా ఉన్న గద్దర్ కూతురు ఓడిపోవడాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. తొలుత అధిష్టానం వెన్నెలకు కాంగ్రెస్ టికెట్  ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ స్థానాన్ని పెండింగ్ లో పెట్టడంతో వెన్నెల ప్రెస్ మీట్ పెట్టి మరీ అధిష్టానాన్ని కోరారు.గద్దర్ బిఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దత్తు ఇచ్చిన సంగతి తెలిసిందే. గద్దర్ అపాయింట్ మెంట్ కోసం గత ముఖ్యమంత్రి కెసీఆర్ దర్గరికి వెళితే ప్రగతిభవన్ గేటు వద్ద ఎండలో పడి గాపులు గాసిన వీడియోను   ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ దక్కించుకోలేకపోయింది. వెన్నెల ఓటమితో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి కోసం అధిష్టానం అన్వేషిస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆయన  శ్రీగణే ష్ నారాయణ్ హస్తం పార్టీ గూటికి చేరారు. టికెట్ హామీ ఇవ్వడంతో పార్టీ మారారు.  టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్ కుమార్‌ నివాసంలో ఆ పార్టీ ఇతర నేతలు మైనంపల్లి హనుమంతరావు, మహేందర్‌రెడ్డి సమక్షంలో గణేశ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో కాంగ్రెస్‌ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి గణేశ్‌తో చర్చలు జరిపారు.  కాంగ్రెస్ పార్టీలో చేరికపై శ్రీగణేశ్ మాట్లాడుతూ, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని అన్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్‌ సత్తాచాటుతుందని శ్రీగణేశ్‌ నారాయణన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా పార్టీ అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుతో చర్చలు జరిపానని, సంప్రదింపులు సఫలీకృతమవడంతో కాంగ్రెస్‌లో చేరినట్లు వివరించారు. కాగా మంగళవారం మధ్యాహ్నం వరకు బీజేపీ తరపున ఆయన ప్రచారం చేశారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనూహ్యంగా గంటల వ్యవధిలోనే ఆయన పార్టీ మారడంపై బీజేపీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి.

తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో ఏడు దశలలోఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చింది. ఇప్పుడు ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ( మార్చి 20) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మేరకు దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ నియోజకవర్గాలలో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులోని మొత్తం 39  లోక్ సభ స్థానాలకు, రాజస్థాన్ లో 12 లోక్ సభ స్థానాలు, యూపీలో ఎనిమిది, మధ్యప్రదేశ్ లో ఆరు, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఐదేసి స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. అలాగే బీహార్ లో నాలుగు, పశ్చిమ బెంగాల్ లో మూడు లోక్ సభ స్ధానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లో రెండేసి లోక్ సభ స్థానాలకూ తొలి దశలో పోలింగ్ జరగనుంది. ఇక ఇదే దశలో ఛత్తీస్‌గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్ విడుదలైన స్థానాలకు నామినేషన్ల స్వీకరణ బుధవారం (మార్చి 20)నుంచే మొదలైంది.నామినేషన్ల స్వీకరణకు 27 తుది గడువు. 28న నామినేషన్ల పరశీలన, ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 30. పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతుంది.  

జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధా.. నియోజకవర్గం ఏదంటే?

వంగ‌వీటి రాధా కృష్ణ‌ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. దివంగ‌త వంగ‌వీటి  రంగా కుమారుడిగా ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో  ఆయనకు ఒక ప్రత్యేక ముద్ర, గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వంగవీటి ఇంటి పేరుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంగవీటి రంగా హత్య తరువాత ఆ కుటుంబ ప్రాధాన్యత రాజకీయాలలో కీలకంగా మారింది. ఇక విషయానికి వస్తే వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా  పాతికేళ్ల పిన్న వయస్సులోనే  (2004 ) ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైయ్యారు.  విజ‌యవాడ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా ఎదిగారు. ఆయనకు అభిమానుల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువే. వంగవీటి  రంగా రాజకీయ వారసుడిగా ఆయన నిత్యం తన అనుచరులకు, అభిమానులకు అందుబాటులో ఉంటారన్న గుర్తింపు తెచ్చుకున్నారు.  ఇటీవలి కాలంలో ఆయన ఉద్దేశపూర్వకంగా రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం అధిష్ఠానం ఆయనను ఎన్నికలలో పోటీ చేయాలని కోరినప్పటికీ పెద్దగా ఆసక్తి  చూపలేదు. దీంతో ఆయన వైసీపీ గూటికి చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కూడా.  ప్రజలిచ్చిన ఒక్క చాన్స్ ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. ఎలాగైనా మరో సారి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో  ఉన్న జగన్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయగల వంగవీటి రాధాను వైసీపీలోకి రావాల్సిందిగా కోరారు. ఇందు కోసం ఆయన వంగవీటి రాధాకు సన్నిహితంగా మెలిగే చనువు ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఆయన వద్దకు పంపారు. వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేర్చగలిగితే కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడం, అదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు దూరం చేయడం చిటికెలో పని అని భావించారు.  కాపు ఉద్యమ నుత ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరినా ఆయన ప్రవేశం పార్టీకి ఏమాత్రం మైలేజీ ఇవ్వలేదని అర్ధం కావడంతో ఆయన చూపు వంగవీటి రాధాపైకి మళ్లింది.  వాస్తవానికి గత రెండేళ్లు జగన్ వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ రాధా ఎలాంటి పదవులూ ఆశించలేదు. అయితే వంగవీటి రాధా తెలుగుదేశంలో అసంతృప్తితోనే కొనసాగుతున్నరని భావించిన జగన్  రాధా వైసీపీలోకి వస్తే ఆయనకు విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారు.  కొడాలి నాని, వల్లభనేని వంశి, మిథున్ రెడ్డి, పేర్ని నాని వంటి వారు జగన్ దూతలుగా రాధాను కలిశారు. ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు. రాధాతో వైసీపీ నేతలు ఎంతగా అంటకాగి తిరిగారంటే.. తాము రాధాకు దగ్గరగా మెసిలితే.. ఆయన వైసీపీ గూటికి చేరుతున్నారన్న సంకేతం ఆయన అనుచరులకు వెడుతుందనీ, అదే విధంగా తెలుగుదేశం ఆయనను దూరం పెడుతుందన్న దూరాలోచనతో  రాధా   త‌న తండ్రి రంగా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని  పిండ ప్ర‌దానం చేసేందుకు కాశీ వెడితే ఆయన వెంట కొడాలి నాని   వెళ్లారు.  ఎన్ని ప్రయత్నాలు చేసినా వంగవీటి రాధా జగన్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. అంతే కాకుండా విజయవాడ వైసీపీ ఇన్ చార్జ్ బొప్పన భవకుమార్ ను తెలుగుదేశంలోకి రావాల్సిందిగా ఆహ్వానించి వంగవీటి రాథా జగన్ కు భారీ షాక్ ఇచ్చారు. తద్వారా తాను పార్టీ మారే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో జగన్ కాపు సామాజికవర్గ మద్దతు కోసం వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు పూర్తిగా బెడిసికొట్టాయి.   అయితే వంగవీటి రాధా తెలుగుదేశం కార్యక్రమాలలో పెద్దగా చురుగ్గా పాల్గొనడం లేదన్నది వాస్తవం. అలాగే ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని హైకమాండ్ స్వయంగా కోరినా సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. అటువంటి వంగవీటి రాథా ఇప్పుడు జనసేన నేతలతో వరుస భేటీలతో యాక్టివ్ గా మారడంతో తెలుగుదేశం, జనసేనల పొత్తుతో ఆయన ఎన్నికల బరిలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. తెనాలిలో జనసేన  సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో, ఆ తరువాత బాలశౌరితో భేటీ అయ్యారు. ఈ భేటీల వెనుక కారణం ఏమిటన్నది తెలియరాలేదు. అయితే ఆయన జనసేన తరఫున ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో  జనసేనకు కేటాయించిన స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వంగవీటి రాధా అనుచరులు కూడా చెబుతున్నారు.  వంగవీటి రాధ ఎన్నికల బరిలో దిగడం, దిగకపోవడం అటుంచితే ఆయన మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున యాక్టివ్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మాత్రం గ్యారంటీ అని ఆయన అనుచరులు చెబుతున్నారు.  గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరిన రాథా ఆ ఎన్నికలలో పోటీ చేయలేదనీ, అయితే తెలుగుదేశం తరఫున విస్తృతంగా ప్రచారం చేశారనీ వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

కడప గడపలోనూ వైసీపీకి ఎదురీతేనా?

 ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తోందనే చెప్పాలి. 2019 ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి జిల్లాలోని ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం సాధించారు. అంత‌టి విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం  ఎన్నిక‌ల స‌మ‌యంలో మాజీ మంత్రి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌. చంద్ర‌బాబు, స్థానిక టీడీపీ నేత‌లు వివేకాను హ‌త్య‌చేశార‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సక్సెస్ అయ్యారు.   దాంతో  క‌డ‌ప గడపగడపలోనూ జగన్ పట్ల సానుభూతి వెల్లువెత్తింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలలోనూ జనం వైసీపీని గెలిపించారు.  అంతేకాక , రాష్ట్రంలోనూ వైసీపీ అధికారంలోకి రావ‌డానికి వివేకా హ‌త్య కారణంగా వచ్చిన సానుభూతి దోహదపడింది.  అయితే, ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మారిపోయాయి. వైఎస్ వివేకా హ‌త్య‌కేసులో ప్ర‌ధాన ముద్దాయి క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అని సీబీఐ దర్యాప్తు దాదాపు తేల్చేసింది. వివేకా హత్య కేసు వ్యవహారంలో అవినాష్ రెడ్డిని జగన్ తన అధికారాన్ని ఉపయోగించి కాపాడుతున్నారని.. స్వయానా జగన్ సోదరి షర్మిల, వివేకా కుమార్తె సునీతాలు ఆరోపణలు చేయడమే కాకుండా, ఈ సారి ఎన్నికలలో జగన్ కు ఓటు వేయద్దని పిలుపు కూడా ఇచ్చారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీకి ప్ర‌జ‌లెవ‌రూ ఓటు వేయొద్ద‌ని ష‌ర్మిల‌, సునీతారెడ్డిలు  వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పిలుపునిచ్చారు.  అంతే కాకుండా వారు జగన్ పై ప్రత్యక్ష రాజకీయ పోరుకు రెడీ అయిపోయారు.   పులివెందుల‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  జగన్ కు ప్రత్యర్థిగా వివేకా కుమార్తె సునీతారెడ్డి లేదా వివేకా స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నది. అలాగే క‌డ‌ప లోక్ సభ స్ధానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా వైఎస్ ష‌ర్మిల బ‌రిలోకి దిగ‌నున్నట్లు చెబుతున్నారు. ఇదే జ‌రిగితే పులివెందుల‌లో జ‌గ‌న్ కు, క‌డ‌ప లోక్ సభ స్థానంలో  అవినాశ్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. మ‌రోవైపు వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్రంలో అరాచ‌క పాల‌న కొన‌సాగుతోందనీ,  ముఖ్యంగా ఉమ్మ‌డి క‌డ‌ప  జిల్లాలో అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయిందనీ జనం ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు  తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేస్తుండటంతో  ఉమ్మ‌డి జిల్లాలోని ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్యర్థులకు సానుకూల వాతావరణం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ ఫైట్ కారణంగా వైసీపీ ఓట్లు భారీగా చీలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిస్థితి చూస్తే.. బద్వేలు నియోజ‌కవ‌ర్గం బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. కానీ, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త నాలుగు ద‌ఫాలుగా తెలుగుదేశం  ఆశించిన స్థాయిలో ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక పోతున్నది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్‌ వెంక‌ట సుబ్బ‌య్య పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆయ‌న ఆక‌స్మిక‌ మ‌ర‌ణంతో 2021 జరిగిన ఉప ఎన్నిక‌ల్లో డాక్ట‌ర్‌ దాస‌రి సుధ వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక ఇప్పుడు అంటే 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మ‌రోసారి దాస‌రి సుధ‌కే వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. కూట‌మి నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. అయితే, ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థికి విజ‌యావ‌కాశాలు ఉన్నాయి.  వైసీపీలో నెల‌కొన్న వ‌ర్గ విబేధాలు, వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ప్రజలలో ఆగ్రహం, జగన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అన్నీ కలిసివచ్చి  కూట‌మి అభ్య‌ర్థి విజయానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు.   వైసీపీ హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి పూజ్యం కావడంతో  జగన్ సర్కార్ పై జనాగ్రహం  తీవ్రంగా వ్యక్తం అవుతోంది. రైల్వే కోడూర్ నియోజ‌క‌వ‌ర్గం రైల్వే కోడూర్ నియోజ‌క‌వ‌ర్గంలో 2014, 2019 ఎన్నిక‌ల్లో కొరముట్ల శ్రీనివాసులు వైసీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. మ‌రోసారి ఆయనే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు.  ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూట‌మి అభ్య‌ర్థిని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.   గత ఐదేళ్లగా జగన్ పాలన పట్ల ప్రజలలో పేరుకుపోయిన ఆగ్రహం, వివేకా హత్య కారణంగా వెల్లువెత్తుతున్న యాంటీ సెంటిమెంట్, కూటమి బలం కలిసి ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయానికి ప్రతిబంధకాలుగా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం అభ్య‌ర్థి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పై విజ‌యం సాధించారు. ఈ సారి కూడా ఈ ఇద్దరే ప్రత్యర్థులుగా పోటీలో ఉన్నారు. రెండు సార్లు ఓటమి తరువాత కూడా పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజాసమస్యలపై గళమెత్తుతూ, ప్రజల తలలో నాలుకగా వ్యవహరించారు. దీంతో ఈ సారి ఓటర్ల సానుభూతి పుట్టాకే అనుకూలంగా ఉందని అంటున్నారు.  వరుసగా రెండు సార్లు గెలిపించినా నియోజకవర్గ అభివృద్ది విషయంలో ర‌ఘురామిరెడ్డి తీవ్ర నిర్లక్ష్యం గా వ్యవహరించార్న ఆగ్రహం ప్రజలలో వ్యక్తం అవుతోంది. జగన్ పాలనలో నియోజకవర్గం అన్ని రంగాలలో, అన్నివిధాలుగా వెనుకబడిపోయిందని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.  ప్రజాగ్రహానికి తోడు నియోజకవర్గ వైసీపీలో చాపకింద నీరుగా విస్తరిస్తున్న వర్గ విభేదాలు కూడా ఈ సారి రఘురామరెడ్డి విజయానికి ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉందని అంటున్నారు.  దవీనికి తోడు తెలుగుదేశం పార్టీకి జ‌న‌సే, బీజేపీ మ‌ద్ద‌తుగా నిలవడం కూడా మైదుకూరులో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు.   కమలాపురం నియోజ‌క‌వ‌ర్గం క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి పి. రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం అభ్య‌ర్థి  పుత్తా నరసింహ రెడ్డిపై విజ‌యం సాధించారు. 2024 ఎన్నిక‌ల్లోనూ వైసీపీ అధిష్టానం మళ్లీ ర‌వీంద్ర‌నాథ్ రెడ్డినే ఇక్కడ నుంచి పోటీకి దింపుతోంది.  అయితే ఇప్పుడు ర‌వీంద్ర‌నాథ్ రెడ్డిపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి హ‌యాంలో నియోజ‌క‌వ‌ర్గంలో  అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈసారి కమలాపురం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా న‌ర‌సింహా రెడ్డి కుమారుడు  చైత‌న్య రెడ్డి బ‌రిలోకి దిగుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా యువ‌త‌లో చైత‌న్య రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు జ‌న‌సేన‌, బీజేపీ ఓటు బ్యాంకుకూడా తోడు కావడంతో  చైత‌న్య రెడ్డి గెలుపు జెండా ఎగురవేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.  రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేడా వెంకట మల్లికార్జునరెడ్డి విజ‌యం సాధించాడు. ఈసారి ఆయ‌న్ను త‌ప్పించి   క‌డ‌ప జ‌డ్పీ చైర్మ‌న్ ఆకేపాటి అమ‌ర్ నాథ్ రెడ్డికి వైసీపీ అధిష్టానం ఇక్కడ నుంచి పోటీకి దింపింది. దీంతో మేడా వ‌ర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గ  వైసీపీలో వ‌ర్గ‌ విబేధాలు తార స్థాయికి చేరాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా ఎవ‌రు బ‌రిలో నిలిచినా గట్టి పోటీ ఇస్తారనీ, జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కూటమి అభ్యర్థికి సానుకూల అంశంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జమ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మూలే సుధీర్‌ రెడ్డి విజ‌యం సాధించాడు. వైసీపీ అధిష్టానం సుధీర్‌రెడ్డికే మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించింది. జగన్ సర్కార్ పై యాంటి ఇంకంబెన్సీకీ తోడు అభివృద్ధి జరగకపోవడంతపో నియోజ‌క‌వ‌ర్గంలో వైపీసీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఐదేళ్లుగా రాష్ట్రంలో,  నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధికారంలో ఉన్నా అభివృద్ధిలో  వెనుకబ డిపోవడం ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి అభ్య‌ర్థిఎవరన్నది నిర్థారణ కాకపోయినప్పటికీ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. కూటమి పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ ఫర్ సవ్యంగా సాగితే వైసీపీకి ఇక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలే మెండుగా ఉన్నాయి.  పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం  పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ అధినేత‌, సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం.  గ‌త రెండు ద‌ఫాలులో వైఎస్ జ‌గ‌న్ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక పులివెందుల అంటేనే వైఎస్ అడ్డా. ఒక్క పులివెందుల అని ఏమిటి మొత్తం ఉమ్మడి కడప జిల్లాయే వైఎస్ కుటుంబం అడ్డాగా చెబుతారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైఎస్ కుటుంబంలో విభేదాలు, సొంత చెల్లెలే జగన్ కు వ్యతిరేకంగా గళమెత్తడం వంటి అంశాల కారణంగా ఇక్కడ జగన్ కు గతంలోలా విజయం నల్లేరు మీద బండి నడక అయితే కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలోలా భారీ మెజారిటీకి అసలు అవకాశమే లేదని చెబుతున్నారు.  అన్నిటికీ మించి ఈ సారి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్య‌ర్థిగా బీటెక్ ర‌వి పోటీ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హ‌త్య వ్య‌వ‌హారంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. మ‌రోవైపు ష‌ర్మిల‌, వివేకా కుమార్తె సునీతారెడ్డిలు జ‌గ‌న్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఇద్దరు కూడా జగన్ కు జగన్ పార్టీకీ ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.  అంతే కాకుండా పులివెందుల నుంచి వివేకా కుమార్తె సునీతారెడ్డి పోటీచేసే అవ‌కాశాలు ఉన్నాయి. సునీతారెడ్డి లేదా వివేకా స‌తీమ‌ణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నది అదే జ‌రిగితే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పులివెందులలో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ప‌రిస్థితుల్లో తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు, శ్రేణులు ఐక్యంగా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి  ఎదురీత తప్పదని అంటున్నారు.    ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజ‌యం సాధించారు. మ‌రోసారి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. కూట‌మి నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థి వ‌ర‌ద‌రాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లే ఇక్కడ కూడా జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దానికితోడు నియోజకవర్గ వైసీపీలో వ‌ర్గ విబేధాలు తార స్థాయికి చేరాయి. తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి పార్టీల మధ్య ఓట్ల బదలీ సజావుగా సాగితే  తెలుగుదేశం విజయం నల్లేరుమీద బండినడకే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  కడప నియోజ‌క‌వ‌ర్గం డ‌ప నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి అంజాద్ భాషా విజ‌యం సాధించాడు. జ‌గ‌న్ కేబినెట్ లో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు.  మ‌రోసారి వైసీపీ అధిష్టానం అంజాద్ బాషాకే క‌డ‌ప‌ టికెట్ కేటాయించింది.  కూట‌మి నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థి  మాధ‌వి రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో స‌భ్యులు, క‌డ‌ప పార్ల‌మెంట్ తెలుగుదేశం అధ్య‌క్షుడు శ్రీ‌నివాస రెడ్డి స‌తీమ‌ణి మాధ‌విరెడ్డి. నియోజ‌క‌వ‌ర్గంలో శ్రీ‌నివాస రెడ్డి, మాధ‌విరెడ్డిలు విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. మాధ‌విరెడ్డి గ‌త కొన్ని నెల‌లుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కీల‌క భూమిక పోషిస్తూ.. వైసీపీ అరాచ‌క పాల‌న‌ను  ప్ర‌జ‌ల్లో ఎండగడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గట్ట‌డంలో మాధ‌విరెడ్డి ఇప్ప‌టికే విజ‌యంసాధించారు. దీనికితోడు జ‌న‌సేన‌, బీజేపీ శ్రేణుల‌ను క‌లుపుకొని పోతున్నారు.  కడపలో కూటమి నుంచి అధికార వైసీపీ గట్టి పోటీ ఎదుర్కోనడం తథ్యమని అంటున్నారు. రాయచోటి నియోజ‌క‌వ‌ర్గం రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి విజ‌యం సాధించారు. వైసీపీ అధిష్టానం మ‌రోసారి గడికోట శ్రీకాంత్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థి  మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత, నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు శ్రీకాంత్ రెడ్డికి ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయచోటిలో ఈ సారి హోరాహోరీ తధ్యమని అంటున్నారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి పాత్ర?

స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు వెల్లడౌతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇద్దరు పోలీసు అధికారులను అదుపులోనికి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే ప్రణీత్ రావును అరెస్టు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తాను ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలను చెరిపివేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే  ఎస్ఐబీలోని కంప్యూటర్ల హార్డ్ డిస్కులను తొలగించి వికారాబాద్ అడవులలో పారేసినట్లు ప్రణీత్ రావు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రణీత్ రావును వికారాబాద్ అడవులలోకి తీసుకువెళ్లి  హార్డ్‌డిస్కుల శకలాలు  స్వాధీనం చేసుకునేందుకు పోలీసులుసమాయత్తమౌతున్నారు. కోర్టు అనుమతితో ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. తొలి రోజు ఆదివారం రహస్య ప్రదేశంలో విచారించినా, రెండో రోజు మాత్రం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లోనే విచారించారు. . రెండో రోజైన సోమవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎస్ఐబీలో పని చేసి, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా పని చేస్తున్న ఒక పోలీసు అధికారిని పోలీసులు సోమవారం విచారించారు.   ఇప్పుడు తాజాగా వరంగల్ పోలీసు కమిషనరేట్ లో పని చేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులను సిట్ అదుపులోనికి తీసుకోవడంతో ఇక డొండ కదులుతోందని అంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేసీఆర్ కేబినెట్ లో కీలకంగా పని చేసిన ఎర్రబెల్లి దయాకరరావుకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ పోలీసు కమిషనరేట్ లోని ఇద్దరు పోలీసు అధికారులను సిట్ అదులోనికి తీసుకోవడం ఆ అనుమానాలను బలపరిచేదిగా ఉంది. మొత్తం మీద రానున్న రోజులలో ప్రణీత్ రావు విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చీపురుపల్లి నుంచి పోటీకి గంటా ఓకే!

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆదేశాలను శిరసావహించేందుకు గంటా సుముఖత వ్యక్తం చేశారు. తన సిట్టింగ్ సీటు భీమిలి నుంచీ కాకుండా విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి రంగంలోకి దిగాలన్న చంద్రబాబు ఆదేశాల మేరకు అక్కడ నుంచి పోటీ చేయడానికి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్సా సత్యనారాయణ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. గంటా శ్రీనివాసరావు అయితేనే బొత్సాకు దీటైన అభ్యర్థి అవుతారని భావించిన చంద్రబాబు.. అక్కడ పోటీకి రెడీ కావాల్సిందిగా గంటాను ఆదేశించారు. అయితే తొలుత చీపురుపల్లి నుంచి పోటీకి నిరాకరించిన గంటా శ్రీనివాసరావు, బీమిలి నుంచే మరోసారి పోటీ చేస్తానని అధిష్ఠానాన్ని కోరారు. చీపురుపల్లిలో  తన విజయావకాశాలపై కొంత సందేహం ఉండటంతో గంటా అందుకు నిరాకరించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చీపురుపల్లిలో విస్తృతంగా సర్వే చేయించిన చంద్రబాబు చీపురుపల్లిలో గంటా విజయం సునాయాసమే అని చెప్పి ఆయనను ఒప్పించినట్లు చెబుతున్నారు. సో.. చీపురుపల్లి నుంచి గంటా పోటీ ఖరారైన నేపథ్యంలో ఇక ఉత్తరాంధ్రలో అన్ని సీట్లకూ అభ్యర్థల ఎంపిక దాదాపు పూర్తయినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు భీమిలి నుంచి పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  విశాఖ జిల్లా మొత్తంలో ఇంకా భర్తీ కాని సీటు ఏదైనా ఉందంటే అది భీమిలి ఒక్కటే కావడంతో ఆ స్థానంలో పోటీ చేయడానికి పార్టీ టికెట్ కోసం కొర్రోతు బంగార్రాజు సహా పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. కొర్రోతు బంగార్రాజు నెల్లిమర స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేనకు కేటాయించడంతో ఇప్పుడు భీమిలి నుంచి పోటీలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే పార్టీ అధినేత  ఎవరిని భీమిలి నుంచి అభ్యర్థిగా ఎంపిక చేస్తారన్నది చూడాల్సిందే. 

ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికల కోడ్ వర్తించదా?

ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మీడియా సమావేశం ఏర్పాటు కేసి మరీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. ఈ ప్రకటనతో దేశం అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు. అయితే ఏపీలో మాత్రం ఎన్నికల కోడ్ అమలు అవుతున్న పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైసీపీ ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ కార్యకర్తలుగానే వ్యవహరిస్తున్నారు. వైసీపీ దాడులకు గురైన బాధితులు ఫిర్యాదులు చేస్తే.. పోలీసలు మాత్రం బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. దాడులు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. ఇక ఫ్లెక్సీల తొలగింపు విషయానికి వస్తే.. పోలీసువారి పహారాతో అధికారులు సెలక్టివ్ గా తెలుగుదేశం, జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారు. వైసీపీకి చెందిన ఫ్లెక్సీల జోలికి వెళ్లడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నా.. ఎన్నికల సంఘం కళ్లకు మాత్రం కనిపించడం లేదు.   అన్నిటికీ మించి అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాల కంటే జగన్ మోహన్ రెడ్డి సేవలో తరించడమే ముఖ్యమన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర సచివాలయ అధికారులు జగన్ సేవ కోసం ఎన్నికల కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తుందన్న బెదురు వారిలో కనిపించడం లేదు. ఎన్నికల సంఘం పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ రాదన్న ధీమాయో ఏమో.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఏపీ స్టేట్ పోర్టల్ నుంచి ముఖ్యమంత్రి జగన్, ఆయన కేబినెట్ మంత్రుల ఫొటోలను ఇంకా తొలగించలేదు.  అలాగే వైసీపీ  నవరత్నాల పథకాల లోగో, సంక్షేమ పథకాల వివరాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన   48 గంటల్లోగా అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి రాజకీయ పార్టీ నేతల ఫొటోలను తొలగించాలి. అలా తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఏపీలో మాత్రం అవేమీ జరగడం లేదు.  అంతే కాదు.. చివరికి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంపిణీ చేసే ప్యాడ్ లతో కూడా వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే కోడ్ ను ఉల్లంఘించి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆర్డీవో ఆ ప్యాడ్ లను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసి కూడా ఎమ్మెల్యే అనుచరుల బెదరింపులకు తలొగ్గి వాటిని ఉపంసంహరించుకున్నారని తెలిసింది.  ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం చేతులెత్తేసింది.   ఏపీకి ఎన్నికల కోడ్ వర్తించదా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. 

మంగళగిరిలో లోకేష్ మ్యాజిక్!.. అనుమానం లేదు విజయం చినబాబుదే!

మంగళగిరి.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏపీలో హాట్ సీట్ అనడంలో సందేహం లేదు. ఔను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టీ మంగళగిరి నియోజకవర్గంపైనే ఉంది.  నిన్న మొన్నటి వరకూ మంగళగిరిలో  ఏ పార్టీ పరిస్థితి ఏమిటి?  అన్న చర్చ జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అసలు పార్టీల పరిస్థితి ఏమిటన్న ముచ్చటే లేదు. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ విజయం పక్కా అన్నదే అందరి భావన.  వాస్తవానికి మంగళగిరి ఎప్పడూ తెలుగుదేశం పార్టీకి ఫేవరెట్ సీటు కాదు. నియోజకవర్గం ఆవిర్భావం తరువాత.. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించింది కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే. అదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకూ జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 1985 తరువాత మంగళగిరి నియోజవకర్గంలో తెలుగుదేశం గెలిచింది లేదు.   అలాంటి అంటే తెలుగుదేశంకు అంతగా అచ్చిరాని మంగళగిరి నియోజకర్గం నుంచి నారా లోకేష్   ప్రత్యక్ష రాజకీయ ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇచ్చారు. అవును తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం అధినేత తనయుడిగా గత ఎన్నికలలో లోకేష్ పోటీ చేయదలచుకుంటే పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గాన్ని ఎన్నికుని పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. లోకేష్ మాత్రం సవాల్ స్వీకరించేందుకే మొగ్గు చూపారు. పార్టీకి అంతగా అనుకూలం కాని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎన్నికుని ఆయన 2019 ఎన్నికలలో పోటీకి దిగారు. అలా దిగడం ద్వారా లోకేష్  ఎలాంటి పరిస్థితులనైనా, పోటీనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చాటారు. ఆ ఎన్నికలలో పరాజయం పాలైనా, వెనకడుగు వేయలేదు.  నియోజకవర్గాన్ని వదలలేదు. అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరు సాగించారు. మరో సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.  మామూలుగా అయితే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయాల హిస్టరీ చూసి, అక్కడ నుంచి ఒకసారి ఓటమి పాలై కూడా మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే టన్నలు కొద్దీ ధైర్యం ఉండాలి.  ప్రజలను ఆకట్టుకుని ఓడిన చోటే విజయకేతనం ఎగురవేయగలనన్న ధీమా ఉండాలి. మంగళగిరి నియోజకవర్గం నుంచే 2024 ఎన్నికలలో పోటీకి రెడీ అవ్వడం ద్వారా ఆ రెండూ తనలో పుష్కలంగా ఉన్నాయని లోకేష్ రుజువు చేసుకున్నారు.   ఓడిన చోటనే మళ్ళీ గెలిచి తానేంటో నిరూపిస్తానంటూ ముందుకు అడుగేశారు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.  ఇక లోకేష్ గత ఐదేళ్లుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమైన తీరు గమనించిన పరిశీలకులు ఇప్పుడు తెలుగుదేశం గెలుపు గ్యారంటీ స్థానాలలో మంగళగిరిని మొదటి స్థానంలో చెబుతున్నారు.  గత ఐదేళ్లుగా నారా లోకేష్ ఇక్కడ  పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.   పరిశీలకులైతే మంగళగిరిలో వైసీపీ అడ్రస్ గల్లంతేనని విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా వైసీపీ మంగళగిరిలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అభ్యర్థులను మార్చి మూడో అభ్యర్థిని తెరపైకి తీసుకురావడాన్ని చూపుతున్నారు.  స్వయంగా వైసీపీ అధినేత జగన్  దృష్టి పెట్టి గెలుపు గుర్రాలంటూ ఒకరిని  కాదని మరొకరిని మంగళగిరి అభ్యర్థిగా మార్చి మార్చి ప్రకటిస్తున్నా.. నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆకాశమే హద్దుగా హామీలు గుప్పిస్తున్నా  ఇక్కడ వైసీపీ నుంచి వలసలు వరదల్లా పెరుగుతున్నాయి.   మంగళగిరిని అగ్రస్థానంలో నిలపడమే  లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది.  వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు సైతం  పెద్దఎత్తున తెలుగుదేశంలో చేరుతున్నారు.  జగన్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన  వైసిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం బాట పడుతున్నారు. ఇక జనం అయితే ఎప్పుడో లోకేషే మా ఎమ్మెల్యే అన్న నిర్ణయానికి వచ్చేశారు.    అంతేనా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి వైసీపీనీ వీడి తెలుగుదేశం గూటికి చేరేందుకు వస్తున్న వారి సంఖ్య  మేడారం జాతరను తలపించేలా ఉందని పరిశీలకులు సైతం అంటున్నారంటే లోకేష్ నియోజకవర్గంపై ఎంతటి ప్రభావం చూపారో అర్ధం అవుతోంది.   మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని  నారా లోకేష్  చెబుతున్న మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.  తండోపతండాలుగా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోవడానికి జనం తరలి వస్తున్నారు. ఒరవడి ఇలాగే కొనసాగితే.. మంగళగిరిలో వైసీపీకి క్యాడర్ మిగిలే అవకాశాలూ అనుమానమేనని అంటున్నారు.  అయినా లోకేష్ క్షణం విశ్రమించడం లేదు. తటస్థులను మర్యాదపూర్వకంగా కలుస్తూ,  మంగళగిరి అభివృద్ధికి సంబంధించి తన వద్ద ఉన్న ప్రణాళికను వివరిస్తున్నారు.    తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మంగళగిరి ప్రజలంతా గర్వపడేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని ఆయన చెబుతున్న మాటలు విశ్వసిస్తున్నారు.  పరిశీలకులు మంగళగిరిలో లోకేష్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాభిమాన్ని చూసి నియోజకవర్గంలో లోకేష్ మ్యాజిక్ చేశారని విశ్లేషిస్తున్నారు.  

ఏపీలో తెలుగుదేశం కూటమిదే హవా!.. తేల్చేసిన మరో జాతీయ సర్వే!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమిదే అధికారమని మరో జాతీయ సర్వే సంస్థ తేల్చేసింది. ఏపీలో అధికార వైసీపీ ఈ సారి ఎన్నికలలో గణనీయంగా నష్టపోతున్నదని పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.  ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.   ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం సంచలనం సృష్టిస్తోంది. ఈ సర్వే   ఏపీలో రాబోయేది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమేనని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందన్ని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలలో పోటీ చేయనుంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 17 స్థానాలలో 14 స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అలాగే కూటమిభాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ వరుసగా రెండు, ఆరు స్థానాలలో పోటీ చేయనున్నాయి. జనసేన పోటీ చేసే రెండు స్థానాలలో ఒక స్థానంలో విజయం సాధిస్తుందనీ, ఇక బీజేపీ పోటీ చేసే ఆరు స్థానాలలో రెండింటిలో గెలుస్తుందనీ సర్వే పేర్కొంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పాతిక స్థానాలకు గానూ కేవలం ఎనిమిది స్థానాలలోనే విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.  అంటే కూటమి రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో  17 స్ధానాలను కేవసం చేసుకుంటుంది. అధికార వైసీపీ ఎనిమిది స్థానాలకు పరిమితమౌతుంది.   ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం 114 స్థానాలలో పోటీ చేస్తుండగా, బీజేపీ పది స్థానాలలో, జనసేన 21 స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి.  వైసీపీ 175 నియోజకవర్గాలలోనూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. రాష్ట్రంలో పోటీ ప్రధానంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్ జనగ్ నేతృత్వంవలోని వైసీపీ మధ్యే ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలని చూస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన షర్మిల ఏపీలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు శతధా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఆ తరువాత బలహీనపడి ఉనికి మాత్రంగా మిగిలిన సంగతి తెలిసిందే. కాగా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందనీ, ఆ పార్టీ గెయిన్ చేసే ఓట్లు వైసీపీకి నష్టం చేస్తాయనీ సర్వే అంచనా వేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలలో అధికార కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలలోనూ, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం ఒక స్థానంలోనూ గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.