అవి విష వృక్షాలు.. ప్రాణాలకు ముప్పు!
వరసగా పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరిత హారం కార్యక్రమం ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, హరిత హారం ప్రాజెక్టుకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలో పచ్చదనాన్నిపెంచాలనే లక్ష్యంతో 2015 లో ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు స్వహస్తాలతో చిలుకూరు బాలాజీ సన్నిధిలో ప్రారంభించిన హరిత హరం పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి వరకూ కొనసాగించింది. ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని మరీ కోట్లలో మొక్కలు నాటారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయ్యింది.
అవును అధికారిక లెక్కల ప్రకారమే 2023 జూన్ నాటికి తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం రూ. 10,822 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 273.33 కోట్ల మొక్కలు నాటింది. అయితే ముఖ్యమంత్రి మానస పుత్రికగా ప్రచారం చేసుకున్న హరిత హారం ప్రాజక్ట్ ఆశించిన లక్ష్యం నెరవేరిందా? అంటే అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం పదేళ్ళ కాలంలో 13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. 1,00,691 కిలో మీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు విస్తరించాయి. ఈ లెక్కలు చక్కగా ఉన్నాయి. అందుకే, అప్పుడే కాదు.. ఇప్పటికీ బీఆర్ఎస్ తెలంగాణ హరిత హారాన్ని తమ పదేళ్ళ పాలన సాధించిన విజయ హారం గా పేర్కొంటున్నారు.
రెండు మూడు రోజుల క్రితం ముగిసిన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనూ, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని దీనివల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 7 శాతం పెరిగిందని చెప్పారు. అయితే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లుగా ప్రశాంత రెడ్డి ప్రసంగం పూర్తి కాకముందే స్పీకర్ గడ్డం ప్రసాద్ హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో ప్రజలకు పక్షులు, ఇతర జీవరాసులకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ చెట్లు వృక్ష ధర్మానికి విరుద్ధంగా, ఆక్సిజన్ గ్రహించి, కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయని, వాతావరణాన్ని విష పూరితం చేస్తున్నాయని స్పీకర్ వివరించారు. ఈ కారణంగా పక్షులు, ఇతర జీవుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని వివరించారు.
అదలా ఉంటే, తాజాగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, హరిత విధ్వంసంలో కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోటీ పడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కోసం భారాస 25 లక్షల చెట్లను నరికి వేయడంతో పాటుగా, హరితహారం ముసుగులో కోనోకార్పస్‌ను విష వృక్షాలను కానుకగా ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో ‘కంచ గచ్చిబౌలిలో ఏకంగా 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేసి పర్యావరణానికి పాతర వేస్తోందని అరోపించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని ఆనుకుని చాలా వృక్ష జాతులు, పక్షిజాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయని బండి సంజయ్ చెబుతున్నారు.
సంజయ్ ఆరోపణల విషయం ఎలా ఉన్నా.. స్పీకర్ సూచనను ప్రభుతం సీరియస్ తీసుకుని కోనోకార్పస్ విష వృక్షాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ శాస్త్ర వేత్తలు, ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు.