బీజేపీని క్షమాపణ కోరిన షిండే

  హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే తమను హిందూ ఉగ్రవాదులుగా వర్ణించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ నేతలు, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పకపోయినట్లయితే, కీలకమయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేస్తామని హెచ్చరించిన నేపద్యంలో తొలుత కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ, హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే చెప్పినట్లు బీజేపీ సంఘవిద్రోహ పనులకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ భావించట్లేదని, ఈ విషయంపై షిండే కూడా ఇప్పటికే చాలాసార్లు తన వివరణ ఇచ్చారని, త్వరలోనే ఆయన బీజేపీ నాయకురాలు సుష్మ స్వరాజ్ తో స్వయంగా మాట్లాడతారని అన్నారు.   ఈ విషయంలో పార్టీ తనను సమర్దించట్లేదని షిండేకు అర్ధమయిన తరువాత ఆయన కూడా బీజేపీను క్షమాపణలు కోరారు. అఖిల పక్షం తరువాత అత్యుత్సాహం ప్రదర్శించి ‘నెల రోజుల్లో తెలంగాణా సంగతి తేల్చి పారేస్తా’ అని ప్రకటించి షిండే మొదటిసారి స్వయంగా చిక్కులో పడి పార్టీని కూడా చాలా చిక్కుల్లో పెట్టారు. బీజేపీని హిందూ ఉగ్రవాదులంటూ మళ్ళీ మరోమారు నోరుజారి షిండే తనకీ, పార్టీకి ఇబ్బందులు కోరి తెచ్చుకొన్నారు. బహుశః మరో మారు ఇటువంటి తప్పు చేస్తే, పార్టీ ఆయనను ఉపేక్షించకకపోవచ్చును. ఈ వివాదానికి ఇంతటితో తెరపడినా, కాంగ్రెస్ పార్టీని అగస్టా హెలికాఫ్టర్ కుంభకోణంతో పార్లమెంటులో నిలదీసేందుకు బీజేపీ ఆయుధాలు సిద్దం చేసుకొంటోంది.

ఆత్మహత్య చేసుకొంటానంటూ కడపలో వివేకా హడావుడి

  ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, వ్యవసాయశాఖ మంత్రిగా పదవిని కూడా పొందిన వైయస్. వివేకానందరెడ్డి తన వ్యవసాయ శాఖకి, అది ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి మేలు చేసారో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం కడప డిసిసిబి కార్యాలయం వద్ద నిలబడి, వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తున్నారు.   పోలింగ్ అధికారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేయడంతో, ఈ రోజు ఉదయం జరుగవలసిన డిసిసిబి ఎన్నికను ప్రభుత్వం వాయిదావేసింది. కడప సహకార ఎన్నికలలో పూర్తిగా పైచేయి సాదించిన జగన్ మోహన్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నేతలే పోలింగు అధికారిని ఎత్తుకుపోయి ఎన్నికలు జరగకుండా అడ్డుకొంటున్నారని ఆరోపిస్తున్నారు.   దానికి తోడూ కమలాపురం కాంగ్రెస్ యం.యల్.ఏ. వీర శివారెడ్డి కుమారుడు కూడా పోటీలో ఉండటంతో, ఆయన ఉదయం డిసిసిబి కార్యాలయానికి వచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన పైకి చెప్పులు విసరడం, ఆయన వారిపై, తోటి కాంగ్రెస్ మంత్రులపై నది రోడ్డు మీద చిందులు వేయడం వంటి సంఘటనలతో, ఉదయం నుండి అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   ఇప్పుడు, మంత్రి వైయస్. వివేకానంద రెడ్డి కూడా వారికి తోడయి వెంటనే ఎన్నికలు నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని కిరణ్ కుమార్ రెడ్డికి హెచ్చరిక జారీ చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. డిసిసిబి ఎన్నికలలో తనకనుకూలంగా తీర్పు రానందున ఎన్నికల అధికారి లేరనే సాకుతో ఎన్నికలను వాయిదా వేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసయిన సరే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు తను ఆత్మహత్యకు కూడా సిద్దమేనని మంత్రి వివేకానంద రెడ్డి ప్రకటించారు.   అయితే, ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. బహుశః ఆయన ఒత్తిడికి తలొగ్గి అర్ధరాత్రయినా సరే, ఈ రోజే డిసిసిబి అధ్యక్ష పదవికి ఎన్నిక జరిపించే అవకాశం ఉంది.   ఈ సంఘటనతో, ఇంతవరకు ఆయనకూ, జగన్ మోహన్ రెడ్డికి అసలుపడదంటూ, వివేకానంద రెడ్డి అనుచరులు చేస్తున్న ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించి, ఇక నేదో రేపో జగన్ మోహన్ రెడ్డి వైపు ఫిరాయించేందుకు సిద్దం అయ్యారని భావించవలసి ఉంటుంది.

వారు పాపులు కారు: విజయమ్మ

  ఈ రోజు హైదరాబాదులోజరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఆయన అనుచరులు తమ పరిధిని దాటి మాట్లాడుతున్నారని అన్నారు. తన కూతురు షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ లపై లేనిపోని అభాండాలు వేస్తూ వారి పరువు బజారు కీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తన కూతురు, అల్లుడు ఈ పాపమూ చేయలేదని ఆమె అన్నారు. తెలంగాణాలో ఎక్కడా కూడా తన అల్లుడు చర్చిలు నిర్మించేందుకు ఎటువంటి భూములు కొనుగోలు చేయలేదని, రక్షణ స్టీల్స్, రక్షణ టీవీ చానల్ కు తన అల్లుడు అనిల్ కుమార్ కు ఎటువంటి సంబందం లేకపోయినా, వాటితో తమను ముడిపెట్టి తమపై చంద్రబాబు బురద జల్లుతున్నారని ఆమె ఆరోపించారు.   అయితే, తమ సహనానికి ఒక హద్దు ఉంటుందని, ఈ విధంగా నిరంతరం బురద జల్లుతుంటే త్వరలోనే చంద్రబాబుపై పరువు నష్టం దావా వేయక తప్పదని ఆమె హెచ్చరించారు. కానీ, ఇప్పటికే అనేక కేసులతో సతమతమవుతున్న ఆమె కుటుంబ సభ్యులు మళ్ళీ మరో కొత్తకేసు మొదలు పెట్టే దైర్యం చేయరనే ధీమాతోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లయితే, ఒకవేళ ఆమె నిజంగా పరువు నష్టం దావా వేసినట్లయితే అప్పుడు వారు కూడా ఇబ్బందుల్లో పడకతప్పదు. గనుక, చంద్రబాబుతో సహా ఆ పార్టీలో అందరూ కూడా వారు చేస్తున్న ఆరోపణలలో నిజానిజాలు తెలుసుకొన్న తరువాతనే చేయడం మేలు. లేకుంటే ‘ఉభయ కుశులోపరి’ అన్నట్లు అటు వైయస్సార్ కాంగ్రెస్ ఇటు తెదేపా అందరూ కూడా తమ పాదయాత్రలు పక్కన పెట్టి కోర్టు యాత్రలు మొదలు పెట్టవలసి వస్తుంది.

శివమెత్తిన వీర శివారెడ్డి

  కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కడప జిల్లా సహకార బ్యాంక్ ఎన్నికలలో తన కుమారుడిని గెలిపించుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆయన ప్రయత్నాలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గండి కొట్టడంతో ఆయన తీవ్రనిరాశకు గురయ్యారు. ఈ రోజు సహకార బ్యాంక్ అధ్యక్షపదవికి ఎన్నికలు జరుగుతునందున స్వయంగా అక్కడి పరిస్థితులను ‘పర్యవేక్షించడానికి’ వచ్చినప్పుడు కొందరు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కారుపై చెప్పులు విసరడంతో వీర శివారెడ్డి కారుదిగి నడిరోడ్డు మీద వీరంగం వేసారు. దాదాపు అరగంట వరకు సాగిన ఆయన ప్రదర్శనలో వైయస్.వివేకానంద రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పీట వేసి మంత్రిపదవి అప్పగించినందునే, జగన్ పార్టీ పెట్టేంతవరకు వెళ్ళగలిగాడని, అతనికి వెనక నుండి వివేకానంద రెడ్డి మద్దతుగా నిలుస్తునందునే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా సహకార ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిందని ఆయన ఆరోపించారు. వీరేగాక, కడపకు చెందిన మంత్రులు డీయల్.రవీంద్ర రెడ్డి, రామచంద్రయ్యలు ఇద్దరూ కూడా పార్టీకి వ్యతిరేఖంగా పనిచేసి కడపలో పార్టీ ఓటమికి (తన కొడుకు ఓటమికి) కారకులయ్యారని ఆయన ఆరోపించారు. అందుకు కారకులయిన ఆ ముగ్గురు మంత్రుల గురించి తానూ త్వరలో కాంగ్రెస్ అధిష్టానంకు పిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

తెరాసకు దూరం జరుగుతున్న బీజేపీ

  తెలంగాణా జేయేసీలోభాగస్వామిగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ, ఇంతవరకు తెరాసతో అయిష్టంగానే కాపురం చేస్తున్నపటికీ, జాతీయపార్టీ అయిన తన మీద కూడా కేసీఆర్ కర్ర పెత్తనం చేయడం సహించలేకపోతోంది. కానీ, ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా తెలంగాణాలో తన ప్రాభల్యం పెంచుకొనే ఆలోచనతో తెరాసను, దాని అధినేత కేసీఆర్ ను భరించక తప్పట్లేదు.   పేరుకి అది తెలంగాణా జేయేసీ అయినా, అది కేవలం తెరాస చెట్టుకు మొలిచిన మరో కొమ్మగానే కేసీఆర్ భావిస్తునందున, భాగస్వామ్య పార్టీలను ఆయన ఎన్నడూ ఖాతరు చేయలేదు. ఇంతవరకు ఆయన కర్ర పెత్తనం సహించిన భారతీయ జనతా పార్టీ, ఆయన ఏకపక్షంగా తమ పార్టీకే చెందిన మహమూద్ ఆలీని యం.యల్సీ.అభ్యర్దిగా ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహంతో ఆయనకు ఎదురు తిరిగింది.   అసలు కేసీఆర్ కు తెలంగాణా సాదించాలనే కోరిక, తాపత్రయం ఉన్నట్లు లేదని, అందువల్లే ఆలీని తమ పార్టీ అభ్యర్దిగా ప్రకటించి, తెలంగాణాను వ్యతిరేకిస్తున్న మజ్లిస్ పార్టీ మద్దతు కోరుతున్నాడని బీజేపీ విమర్శించింది. తెలంగాణా సాధనకు అవసరమయితే తమ పార్టీ అద్వర్యంలోనడిచే యన్.డీ.యే. కూటమిలో చేరుతామని ప్రకటిస్తున్న కేసీఆర్, మరో వైపు తెలంగాణాను వ్యతిరేకించే మజ్లిస్ పార్టీతో కలిసి ఏవిదంగా పని చేస్తారని బీజేపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో మరొకమాట మాట్లాడుతూ కేసీఆర్ తమతో ‘డబల్ గేం’ ఆడుతున్నాడని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కేసీఆర్ తమను సంప్రదించకుండానే అభ్యర్ధిని ప్రకటించి, మళ్ళీ అతనిని గెలిపించుకోవడానికి తిరిగి తమ మద్దతే కోరడాన్నిబీజేపీ తప్పు పట్టింది.   కేసీఆర్ అవకాశవాద, ద్వంద వైఖరిని, అతని కర్ర పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నభారతీయ జనతా పార్టీ, అతని వంటి రాజకీయ నాయకుడితో స్నేహం, ఎన్నికల పొత్తులు తమ పార్టీకి మేలు చేయకపోగా మరింత నష్టం తెచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.   ఇక, కేసీఆర్ కూడా రాబోయే ఎన్నికలలోబీజేపీతో ఎన్నికల పొత్తులు గురించి ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడుతూ, మొత్తం అన్నిస్థానాలకు తమ పార్టీ అభ్యర్డులనే ఖరారుచేసే ఆలోచనలో ఉన్నందున, త్వరలోనే బీజేపీకూడా తన దారి తానూ చూసుకోక మానదు. ఉద్యమాల వల్ల తెలంగాణాలో కొంచెం బలం పుంజుకొన్నభారతీయ జనతా పార్టీ బహుశః రాబోయే ఎన్నికలలో ఒంటరిపోరుకే సిద్దపడవచ్చును.

గ్యాస్ పై కిరణ్‌ కు సింధియా షాక్

        ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సింధియా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను కలిసారని, రాష్ట్రానికి అదనపు గ్యాస్ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే గ్యాస్ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, అందుచేత ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని ఆయన వివరించారు. ఎవరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా సింధియా సూచించారు. గుజరాత్..ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఒప్పందం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఒక ప్రశ్నకు సమాధానంగా సింధియా చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వగలమని సింథియా వివరించారు.

బ్రదర్ అనిల్ న్యాయ పోరాటం

        వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పై ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన పోరాటం చేస్తామని జగన్ సలహాదారు సోమయాజలు చెప్పారు. ప్రతి కుంభకోణంతో అనిల్ కి లింక్ పెట్టి మాట్లాడుతున్నారని, అలా ఆరోపణలు చేసిన వారిపై ఆయన న్యాయ పోరాటం చేసే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. పరువునష్ట దావా కూడ వేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి బ్రదర్ అనిల్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే బ్రదర్ అనిల్ తనపై వచ్చిన విమర్శలపై వివరణ ఇవ్వకపోవడం, ఆయన తరపున వేరేవారు మాట్లాడడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. నిజంగానే అనిల్ న్యాయపోరాటం చేస్తారా లేక పత్రిక ప్రకటనల వరకే పరిమితమౌతారో చూడాలి.

విశాఖ సీటు పై మళ్లీ మొదలైన రగడ

        విశాఖపట్నం నుంచి లోక్ సభకు తానే పోటి చెస్తానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే పురంధేశ్వరిని నర్సాపురం నుంచి పోటికి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి చెప్పారు. గతంలో సుబ్బరారెడ్డి విశాఖపట్నం నుంచి పోటీ చేసి విజయం కూడా సాధించారు. ఆ తర్వాత ఈ సీటును పురందేశ్వరికి కేటాయించగా ఆమె విజయం సాధించారు. సుబ్బరామిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవికాలం కూడా ముగియవస్తున్న నేపద్యంలో ఆయన విశాఖపట్నంలో పోటీచేయాలని బావిస్తున్నారు. గత ఏడాది నెల్లూరు కు జరిగిన లోక్ సభ ఉప ఎన్నికలో కూడా పార్టీ కోరిక మేరకు పోటీచేసి ఓడిపోయారు. అప్పుడే విశాఖ సీటు తనకు ఇవ్వాలన్న కండిషన్ పెట్టారని ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో తానే విశాఖ నుంచి పోటీచేస్తానని ఆయన మళ్లీ ప్రకటించారు. అయితే విశాఖపట్నం నుంచి మారడానికి పురంధేశ్వరి ఇష్టపడడంలేదు. ఇంతకు ముందు విశాఖపట్నం సీటు నుంచి పోటీ చేసే విషయంపై పురంధేశ్వరికి, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆఖరికి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి.

నాకూ ముఖ్యమంత్రి కావాలనే కోరికలేదు: అసదుద్దీన్

  నిన్న జానారెడ్డి, మొన్న బొత్స సత్యనారాయణ అంతకు మునుపు లెక్కలేనంత మంది ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నట్లు స్వయంగా ప్రకటించుకొన్నారు. ఇప్పుడు తాజాగా మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ‘తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరికలేదు’ అనే చిన్న స్టేట్మెంటుతో తానూ కూడా పదవికి ముఖ్యమంత్రి అర్హుడినేనని, నేడు కాకపోయినా రేపయినా ముఖ్యమంత్రి అవ్వాలనే మనసులో కోరికను బయటపెట్టారు.   ఇటీవల ఒక ప్రైవేట్ టీవీ చానల్ వారితో ఇంటర్వ్యు లో పాల్గొన్నఆయన, రాష్ట్రం రెండుగా విడిపోతే భారతీయ జనతా పార్టీ బలపడుతుందని తాము భావించబట్టే, సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుతూ అప్పటి పరిస్థితులను బట్టి ఎవరితో పొత్తులు పెట్టుకొవాలో నిర్నయించుకొంటామని అన్నారు. ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు ప్రత్యేక మిత్రత్వం కానీ, శత్రుత్వంగానీ లేదని, మిగిలిన పార్టీల మాదిరిగానే దానితోను వ్యవహరిస్తామని అన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడుతూ, ఆయన ఒక సమర్డుడయిన నాయకుడని, గత ఎన్నికలలో భారతీయ పార్టీ సారద్యం వహిస్తున్న యన్.డీ.యే.కూటమి వైపు ఆయన మొగ్గు చూపిన కారణంగానే తెలుగు దేశం పార్టీకి తాము దూరమవ్వల్సివచ్చిందని అన్నారు. ఒకవేళ చంద్రబాబు నుండి సరయినరీతిలో స్పందన వస్తే, రానున్న ఎన్నికలలో పోత్తులకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆయన సూచించారు.   రాష్ట్రంలో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును స్వంతం చేసుకోవాలంటే ఏ రాజకీయ పార్టీకయినా మజ్లిస్ పార్టీతో పొత్తులు తప్పవు. వైయస్స్సార్ కాంగ్రెస్ మజ్లిస్ తో స్నేహం కోసం చాల కాలంగానే ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ ఇస్తున్న ఓపెన్ ఆఫర్ను ఎవరు ముందుగా స్వీకరిస్తారో వేచి చూడాలి.

విశ్వరూపం-2 షూటింగ్ కూడా పూర్తయిపోయిందా?

  పలు వివాదాలు ఎదుర్కొని అతికష్టం మీద విడుదలయిన ‘విశ్వరూపం’ సినిమా విజయవంతమయిన సందర్భంగా ఇటీవల హైదరాబాదులో జరిగిన సక్సస్ మీట్ లో ఆ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించి, అందులో నటించిన కమల్ హస్సన్ ఈ ఏడాదిలోనే విశ్వరూపం సీక్క్వేల్ ‘విశ్వరూపం-2’ అనే సినిమాను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఎప్పటిలోగా విడుదల ఉంటుందో ఆయన చెప్పలేదు. కానీ, మీడియాలో ఆ సినిమా షూటింగ్ మొత్తం విశ్వరూపంతో బాటే పూర్తయిపోయిందని, కొద్దిగా మిగిలిపోయిన సన్నివేశాల షూటింగ్ కూడా పూర్తయిపోగానే, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల ప్రకారం అయితే, ‘విశ్వరూపం-2’ ఈ వేసవి శలవులకే విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ, కమల్ హస్సన్ ఈ వార్తలను ఇంతవరకు దృవీకరించలేదు అలాగని ఖండించలేదు కూడా.

బ్రదర్ అనిల్ రెండో మ్యారేజ్..బైబిల్‌ను ధిక్కరించాడా?

        వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలా భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా బ్రదర్ అనిల్ వ్యవహారం క్రైస్తవులకు తలనొప్పిగా మారిందని తెలంగాణ క్రైస్తవ సంఘాల అధ్యక్షుడు మట్టయ్య విమర్శించాడు. క్రైస్తవ ప్రచారం చేస్తున్న అనిల్ స్వయంగా బైబిల్ ను దిక్కరించాడని అన్నారు. బైబిల్ వ్యాఖ్య ప్రకారం ఏ వ్యక్తి తన భార్య బతికి ఉండగా రెండో పెళ్ళి చేసుకోకూడదని, అనిల్ రెండో పెళ్ళి చేసుకున్నారని ఆరోపించారు. రక్షణ టీవి, మణికొండ చర్చి స్థలాలను తెలంగాణకు చెందిన పేద క్రైస్తవులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాస్తులు, హెలికాఫ్టర్‌ కుంభకోణం, బయ్యారం, మణికొండలో దళితులు, బీసీల భూముల కబ్జా, క్రైస్తవ ఛానల్‌ రక్షణ టీవిని అవినీతి డబ్బుతో నడిపిస్తున్నారని తెలిసి క్రైస్తవులు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

అమర్ సింగ్ ఆరోగ్యం విషమం

        సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ దుబాయ్ పర్యటనలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దుబాయ్ విమానాశ్రయంలో సృహ తప్పి కిందపడిపోయారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం స్థిమితంగానే ఉన్నారని వారు వివరించారు. అమర్‌సింగ్ కొన్నేళ్ల క్రితం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో మూత్రపిండాల సమస్యలకు చికిత్స పొందారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. హెల్త్ చెక్ఆప్ కోసం దుబాయ్ వెళ్ళిన అమర్ స్వదేశానికి తిరిగి వస్తున్న టైంలో ఉన్నట్టుండి అనారోగ్యం కుదిపేసింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కృత నేతగా గుర్తింపు ఉన్న అమర్ ఆ మధ్య యూపీలో సొంతంగా ఒక పార్టీని ఏర్పరిచారు. అయితే అది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి రిటరవుతున్నానని అమర్ ప్రకటించారు.  

పాదయాత్రలకు ఈసి గ్రీన్ సిగ్నల్

        తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా..మీకోసం’యాత్ర, వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అమల్లోకొచ్చిన ఎన్నికల కోడ్ తో వీరి యాత్రలు ఆగిపోతాయని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి కోసం కమిషన్ ఎన్నికల కోడ్ నియమాలనే సడలించింది. పాదయాత్రలో ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని స్పష్టం చేసిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు వారిని ఆయాజిల్లాల్లోనే ఉండటానికి అనమతి నిచ్చింది. ప్రస్తుతం షర్మిల, బాబుల పాదయాత్రలు గుంటూరు, ప్రకాశంల పరిసరాల్లో సాగుతున్నాయి. గుంటూరుజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో బస చేయాలని కమిషన్ సూచించింది. వీరి పాదయాత్రల తీరును సమీక్షించడానికి  జిల్లాస్థాయి అధికారిని నియమించారు.

టిడిపిని వీడిన నేతలు 420లా!

        టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో స్పందిస్తుంటారు. తాజాగా టిడిపి వదిలిపోతున్న నాయకులపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజీకియ జీవితం ప్రారంభించిన కొందరు నేతలు, తమ స్వార్ధం కోసం ఇతర పార్టీలోకి వెళ్ళడం పై ఆయన మండిపడ్డారు. ఇలాంటి నేతలను ఏమనాలి..మోసగాళ్ళా..దగా కోర్లా..నిజాయితీ లేనివాళ్ళా లేక 420లా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మరీ స్వార్ధం కోసం పార్టీని వదిలిపోతున్న నేతలు లోకేష్ అడిగిన ప్రశ్న కి ఏం సమాధానం చెబుతారో వేచిచూడాలి.

వీరప్పన్ అనుచరుల ఊరిపై సుప్రీంకోర్ట్ స్టే

      వీరప్పన్ అనుచరుల ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. వీరప్పన్ నలుగురు అనుచరులకు ఈరోజు అమలు కావాల్సిన ఉరి శిక్ష నిలిచిపోయింది. వీరప్పన్ అనుచరులు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం వరకు ఉరిశిక్షను అమలు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్‌పై తదుపరి విచారణ బుధవారం 20వ తేదీ కొనసాగనున్నట్లు కోర్టు పేర్కొంది. నిందితులు జ్ఞానప్రకాశ్, సైమన్, మీ సేకర్ మాదయ్య, బిలవెంద్రన్‌లు కర్నాటకలోని పాలర్ ప్రాంతంలో మందుపాతర పేల్చి 22 మంది పోలీసులను బలిగొన్న కేసులో వారికి మరణశిక్ష అమలు చేయాలని 2004లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్

        స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లకు కోర్టు అవకాశం కల్పించింది. అయితే కొత్త జనాభా ఎన్నికల ప్రకారం కాకుండా, రెండువేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరపవచ్చని కోర్టు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టిడిపి ఆహ్వానించింది. ఆపార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం అయ్యిందన్నారు. ఈసీ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

స్వామి గౌడ్ తాపత్రయం అధికారం కోసం కాదుట!

  సకల జనుల సమ్మెతో తన రాజకీయ జీవితానికి బలమయిన పునాదులు వేసుకొని అంచెలంచెలుగా ఎదిగిన స్వామిగౌడ్ ప్రస్తుతం తెరాస, తెలంగాణా జేయేసీలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కేసీఆర్ దయతో ఇప్పుడు తెరాస అభ్యర్ధిగా పట్టభద్రుల కోటాలో శాసనమండలికి పోటీ కూడా చేస్తున్నారు. ఆయన ఈ ఎన్నికలలో గెలవడం ద్వారా, తన రాజకీయ జీవితంలో మరో మెట్టు పైకెదగనున్నారు.   నిజం చెప్పాలంటే, కేసేఆర్ ఆయనను చాల తక్కువ అంచనా వేయడంవల్లనే శాసనమండలికి టికెట్ ఇచ్చారు. అయితే, ఆయన అందుకు చిన్నబుచ్చుకోకుండా దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొంటూ తన రాజకీయ జీవితంలో మరోమెట్టు పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో గెలిచిన తరువాత ఆయన రాజకీయ ఎదుగుదల ఏవిదంగా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి ఆయన పూర్తి రాజకీయ పరిపక్వత ప్రదర్శిస్తూ, అటు కాంగ్రెస్ పార్టీలోకో లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకో దూకి మంత్రివర్యులుగా పదవి చేపట్టినా ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా చెప్పుకోవాలంటే, రేపు కేసీఆర్ కన్నా ఉన్నత స్థాయికి ఎదిగే లక్షణాలు కూడా ఆయనలో పుష్కలంగా కనిపిస్తున్నాయి.   కానీ, ప్రస్తుతం మాత్రం స్వామిగౌడ్ తనదారిలో ఎదురయిన ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొంటూ ముందుకు సాగిపోతున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఆయన శాసనమండలికి కూడా పోటీ చేస్తుంటే అయనపై కొన్ని తీవ్రవిమర్శలు చెలరేగుతున్నాయి. ఎందరో అమాయక విద్యార్దులు బలయిన తెలంగాణా ఉద్యమాన్ని అడ్డంపెట్టుకొని, ఆయన ఈ విధంగా తన రాజకీయ జీవితాన్ని చక్కబెట్టుకోవడాన్ని చాలామంది ఆక్షేపిస్తున్నారు.   కానీ, ఆయన మాత్రం తనను తానూ సమర్దించుకొంటూ, తానూ రాజకీయంగా ఎదగాలనే తాపత్రయంతోనో, లేక పదవీ కాంక్షతోనో ఎన్నికలలో పోటీచేయడం లేదని, కేవలం సీమంద్రవాదులకు తన ఎన్నికతో గట్టిగా బుద్ధి చెప్పాలనే ఒకే ఒక్క ఆలోచనతోనే పోటీ చేస్తున్నానని ఒక వితండవాదం మొదలుపెట్టారు.   ఒకవేళ నిజంగా ఆయనకి అదే ఆశయమయితే, మరేవరినో నిలబెట్టి ఆయనను గెలిపించామని అడిగి ఉండాలి. కానీ, అధికారం వచ్చి ఒళ్లో వాలుతున్నపుడు ఎవరు మాత్రం వద్దంటారు? ఎవరు వదులుకొంటారు? అసలు తెలంగాణాలో జరుగుతున్న ఈఎన్నికలతో ఏ సంబందమూ లేని సీమంద్రులకి ఈ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్తాననడమే ఒక తప్పు కాగా, తెలంగాణా అమరవీరుల శవాలనే తన రాజకీయ సోపానాలుగా చేసుకొని పైకెదగాలనుకోవడం మరో పెద్ద తప్పు.   ఎప్పుడయితే, అయన తెలంగాణా అంశాన్ని పక్కనబెట్టి ఎన్నికలు, టికెట్లు అని ఆలోచనలు మొదలు పెట్టారో, అప్పుడే తెలంగాణా గుండెల మీద కాలుమోపి ఎదిగే ఆలోచన చేసినట్లే అనుకోక తప్పదు. సాక్షాత్ కేసీఆర్ సోదరుడు మధుసూదన్ రావే ఆయన అవినీతి భాగోతాలు గురించి చెప్తున్నపుడు, ఇక ఆయనకి వేరే వారి సర్టిఫికెట్లు ఎందుకు?   రాజకీయాలు ఆయనకీ కొత్తగావచ్చును, కానీ ప్రజలకు ఇటువంటి రాజకీయనాయకులను చూడటం మాత్రం కొత్త కాదు గనుక, ఇకనయినా, ఈ బుకాయింపులు, సంజాయిషీలు అనవసరం అని స్వామి గౌడ్ తెలుసుకోవాలి.

షర్మిలతో పెళ్లికి ముందు బ్రదర్ అనిల్ మతం మార్చారు!

        భారతీయ జనత పార్టీ అధికార ప్రతినిధి ఎన్.వి.ఎస్.ప్రభాకర్ బ్రదర్ అనిల్ పై దాడి కొనసాగిస్తున్నారు. మానవత్వమే మా మతమని చెబుతున్న వైఎస్ కుటుంబం..అనిల్ కి షర్మిలా తో పెళ్ళి చేసే ముందు ఆయన మతాన్ని మార్చారని, ఇదేనా మీ మానవత్వం అని ప్రభాకర్ ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు ఆయన కుమార్తె షర్మిలా ఆస్తుల విలువ రెండు కోట్ల లోపేనని..ఆ తరువాత షర్మిలా, బ్రదర్ అనిల్ లు వివిధ కంపెనీల్లో వందల కోట్ల పెట్టుబడులు ఎలా పెట్టాగలిగారని, అంతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ తన బినామీ బెన్ హర్ తో రక్షణ టీవి ఏర్పాటు చేయించి, అందులో కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే వందల కోట్లు ఎలా సమాకురాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్నవారి బండారాలన్ని౦టిని బయటపెడతానని చెప్పారు. అనిల్, షర్మిలాల అక్రమాస్తులను బయటకు తెచ్చేవరకూ రాజకీయపోరాటం చేస్తామని వెల్లడించారు.