అదరగొట్టిన ఆసీస్ అమ్మాయిలు

        ఆస్ట్రేలియా అమ్మాయిలు ఆరోసారి వరల్డ్ కప్ సొంతంచేసుకున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ లో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టి ఆరోసారి ప్రపంచ విజేతలుగా నిలిచారు. ఆదివారం ముంబై లో జరిగిన ఫైనల్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 259 పరుగులు చేసింది. జెస్ కామెరూన్ 76 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించగా, హేన్స్ 52 పరుగులుకు తోడు జోడి ఫీల్డ్స్ 38 బంతుల్లో 36 నాటౌట్, లానింగ్ 31, పెర్రీ 22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 25 నాటౌట్ గా నిలిచి జట్టును ఆదుకున్నారు. క్వింటినె మూడు వికెట్లు తీసింది.   259 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ కి క్యూ కట్టారు. 41పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆసీస్ మీడియం పేసర్ పెర్రీ వరుసగా మూడు వికెట్లు తీసి విండీస్‌ను చావు దెబ్బతీసింది. విండీస్ ను145 పరుగులకు ఆలౌట్ చేసి సూపర్ సిక్స్ దశలో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకు౦ది.

ప్రధానిని చేయమన్న మాయావతి

  అనేక కుంభకోణాలలో సిబిఐ విచారణలు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మరియు మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నిన్న నాగపూర్ లో జరిగిన పార్టీ ర్యాలీలో తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో మీరు మన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించించాలి. అప్పుడే నేను ప్రధాన మంత్రిగా ఎర్రకోట నుండి జాతినుద్దేశించి ప్రసంగించగలను. నా కల సాకారం అవ్వాలంటే దానికి మీ అందరి మద్దతు చాల అవసరం ఉంది. రానున్న ఎన్నికలలో మీరంతా కలిసికట్టుగా కష్టపడి పనిచేసి మన పార్టీని గెలిపించితే, అధికారం మన స్వంతం కావడం ఖాయం. ఇతర పార్టీలు వేసే ఎరలకు ఆశపడకుండా అందరూ కలిసి కష్టపడి మన పార్టీని గెలిపించుకోవాలి.”   ఇటువంటి స్వార్దపరులయిన నేతలు కూడా దేశంలో అత్యున్నతమయిన ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్నారంటే అందుకు కారణం రెండు ప్రధాన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు క్రమంగా తమ ప్రాభల్యం కోల్పోతూ, తమ మనుగడకోసం ప్రాంతీయ పార్టీలపై ఆధారపడవలసి రావడమే అని చెప్పవచ్చును. రోజుకో కొత్త కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంటే, సరయిన దిశానిర్దేశం లేక భారతీయ జనతా పార్టీ చతికిలబడింది. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశంలో మూడో పార్టీ లేకపోవడం వల్ల, క్రమంగా కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరుగుతూ వచ్చి, చివరికి జాతీయ పార్టీలను శాసించే స్థాయి నుండి, వాటిని వెనక్కు నెట్టి తామే చక్రం తిప్పే స్థాయికి ఎదిగాయి. తత్ఫలితమే, లాలూ, మాయావతి, చౌహాన్ వంటి ప్రాంతీయ నేతలు తాము కూడా ప్రధాన మంత్రి పదవికి అర్హులమేనని భావించేలా చేస్తున్నాయి.   ప్రాంతీయ పార్టీ నేతలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పకూడదని నియమేమీ లేకపోయినా, అవినీతికి మారుపేరుగా నిలిచి, రాష్ట్రాలను అన్ని విధాలుగా భ్రష్టుపట్టించిన రాజకీయ నేతలు, కేంద్రంలో కీలక బాధ్యతలు చేపడితే ఇక దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతారో ఊహించడమే కష్టం. కనుక ప్రధానమంత్రి వంటి కీలక పదవులకు నిష్కళంక చరితులను ఎన్నుకోవడం ఆవశ్యకం అవుతుంది.    

ఇదేమి న్యాయం కేసీఆర్ చిన్నానా? రేణుక

  ఇంతవరకు తెలంగాణా ఉద్యమంలో తెరాస అధ్యక్షడు కేసీఆర్ అయన కుటుంబం సభ్యులనూ ప్రశ్నించేవరెవరూ లేరనేచేప్పాలి. తెలంగాణా ఉద్యమానికి కేసీఆర్ ఏకఛత్రాధిపత్యం వహిస్తుండగా, ఆయన కుమారుడు కేటీఅర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావు ఆయన సైన్యాధికారువలె పనిచేస్తున్నారు. అయితే, త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలు, వారి కుటుంబములో నివురు గప్పిన నిప్పుల దాగిఉన్న కలహాలను బయట పెట్టింది.   ఈ ఎన్నికలలో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నకేసీఅర్ అన్నగారు మధుసూధనరావు, తన తమ్ముడు తనను పక్కనపెట్టి నిన్నగాక మొన్నవచ్చిన స్వామిగౌడ్ ను ఈఎన్నికలలో చంకనెత్తుకోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. అదేవిధంగా అయన కుమార్తె రేణుక కూడా చిన్నాన కేసీఆర్ మీద కోపంతో రగిలిపోతున్నారు. నిన్నవారిరువురూ మీడియా వారితో మాట్లాడుతూ స్థానికుడయిన స్వంత అన్నను కాదని, స్థానికేతరుడు, అవినీతుపరుడు అయిన స్వామిగౌడ్ కు మద్దతు ప్రకటించడం తప్పు పట్టారు.   “అనేక కేసులో ఇరుకొని, అనేక అక్రమాలకి పాల్పడిన స్వామిగౌడ్ కు కేసీఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియదు. స్థానికుడయిన నాన్నగారిని కాదని స్థానికేతరుడయిన స్వామిగౌడ్ కు ఏకారణంగా మద్దతు ఇస్తున్నారో ఆయనే చెప్పాలి. నేను స్వామిగౌడ్ అవినీతి గురించి ప్రజలకి చెప్పి,ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతుతో మా నాన్నగారిని తప్పక ఈ ఎన్నికలలో గెలిపించుకొంటాను.”

షర్మిలా పై విహెచ్ ఫైర్

        వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. తమ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించే నైతిక హక్కు షర్మిలకు లేదన్నారు. నిత్యం ప్రజా సంక్షేం గురించి ఆలోచించే తమ పార్టీ ముఖ్య నేతలను ఏమైనా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జగన్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కూడా విహెచ్ సూచనలు చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా ప్రజల్లో తిరగాలను సూచించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వలే కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరుగాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలహీనపడుతోందన్నారు. బొత్స, కిరణ్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీపై ప్రజలకు విశ్వాసం పోతోందన్నారు. నిన్న గాక మొన్న వచ్చిన పార్టీ, రాజకీయాలు తెలియని షర్మిల ప్రజల్లో తిరుగుతున్నారని బొత్స, కిరణ్‌లకు గుర్తు చేశారు. రాహుల్ రాష్ట్ర పర్యటన కంటే ముందుగానే పార్టీని బలోపేతం చేయాలన్నారు.

'ఆంధ్రా'లో కెసిఆర్ పుట్టినరోజు

        తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు వేడుకలు తెలంగాణలో జరిపితే వెరైటి ఏముంటుందని అనుకున్నారో..ఏమో! సమైఖ్యవాదం వినిపిస్తున్న సమైక్యాంద్ర విద్యార్ధి జెఎసి ఆయన పుట్టిన రోజును విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో జరిపింది.   కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి సమైక్యాంద్రకు మద్దతు ఇవ్వాలని కోరారు.  ప్రత్యేక ఉద్యమం చేస్తున్న కెసిఆర్ కి సమైక్యాంద్ర జెఎసి ఇలా కనువిప్పు కార్యక్రమం చెప్పట్టడం విశేషమే. ఈ రోజు కెసిఆర్ 60వ ఏటలోకి ప్రవేశించారు. కెసిఆర్ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని సమైఖ్యవాదులు కోరుకోవడం గొప్పవిషయం గా చెప్పుకోవాలి.  

ఉద్యమాన్ని నడపాలంటే మిగిలిన మార్గాలేమిటి?

'ఉద్యమా'న్ని ముందుకు నడపాలంటే "మిగిలిన మార్గాలేమిటి?'': పాలుపోని కెసిఆర్ ప్రశ్న! - డాక్టర్ ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       ఆడలేక 'మద్దెలే వోటిద'ని వెనకటికో వాగాడంబరి కోశాడని తెలుగువాడి సామెత. ఆ సంప్రదాయంలో ఎదిగిన వేర్పాటువాది, పెద్దవలసదారైన కల్వకుంట్ల చందశేఖర రావు అనే వ్యక్తి "తెలంగాణా'' మకుటంతో ప్రాంతపు ఔత్సాహిక కళాకారులు, నిర్మాత తీయనున్న చలనచిత్రానికి "క్లాప్''కొట్టిన సందర్భంగా ఓ చిత్రమైన ప్రకటన చేశాడు : "ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఇంకా ఏమేమి ఆప్షన్స్ (అవకాశాలు/మార్గాలు) ఉన్నాయో వెతకాల''ని చెప్పాడు! అంటే, అతని ఉద్దేశ్యంలో రాజకీయ నిరుద్యోగిగా తాను తలపెట్టిన వేర్పాటు ఉద్యమానికి ఇప్పటివరకూ ఉన్న "ఆప్షన్స్'' అన్నీ వాడేసుకున్నానానీ, అయినా ప్రత్యేకరాష్ట్రం రాలీదనీ భావిస్తున్నట్టా? లేక తనకు తెలియని "ఆప్షన్స్''ను ప్రతిపాదించాలని ఇతరులను ఆయన కోరుకున్నట్టా, తెలియదు. లేదా, ఇన్నేళ్ళుగా 'ఉద్యమా'న్ని నిర్వహిస్తూ కూడా తనముందున్న "ఆప్షన్స్'' అన్నీ ఉడిగిపోయాయని ఆయన అంగీకరిస్తున్నట్టా? ఒక రాజకీయ నిరుద్యోగిగా తనకు తోచిన "ఆప్షన్స్'' అన్నీ వాడుకుంటూ వచ్చినవాడు ఎందుకింత పేలవంగా ఇతరులముందు సాగిలపడుతున్నట్టు?   కాంగ్రెస్ అధిష్ఠానవర్గంతో ఢిల్లీలో జరిపిన రహాస్యమంతనాలలో తన పార్టీ "తెలంగాణా రాష్ట్ర సమితి''ని కాంగ్రెస్ లొ "విలీనం'' చేయడానికి అతడు ఆమోదించి వచ్చిన తరువాత - "ఎబ్బెబ్బే, అదేంలేదు, కాకపొతే ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేస్తానని హామీ యిస్తే గంగలో కలిసిపోయినట్టుగా కాంగ్రెస్ లొ కలిసిపోతాన''ని చెప్పివచ్చాడు కాబట్టి పార్టీని అలా తాకట్టుపెట్టి రావడం వల్ల తెలంగాణాప్రజల్లో తాను చులకమై పోతూండడం గమనించిన కెసిఆర్ పళ్ళాబిగువకోసం ఇప్పుడు ''వేరే ఆప్షన్స్'' గురించి కొత్త 'టూమ్రీ'లువదులుతున్నాడు! ఆ అన్యమార్గాలేవో తనకు తెలియనివా? తెలియనివి కాదు; ఎందుకంటే "ఆప్షన్స్'' తెలియనివాడు ఇంతకాలం అబద్ధప్రచారాలతో తెలుగుజాతి ఐక్యతను బద్ధలుకొట్టడానికి ప్రయత్నించి ఉండేవాడు కాడు. బెదిరింపులు, అదిరింపులు అయిపోయాయి, దొంగ సత్యాగ్రహాలూ ముగిసాయి, ఉసిగొల్పిన యువత ఆత్మహత్యల పర్వమూ పనిచేయలేదు, యజ్ఞవాటికలొ బూడిద పేరుకుపోయినా ఫలితం దక్కలేదు, రోజుకొక తీరున క్రాపు, మేకప్పు దిద్దుకున్నా ముఖ్యమంత్రి పదవి దక్కదని తేలిపోయింది. ఆంధ్రజాతిలో అంతర్భాగామైన సోదర తెలంగాణా తెలుగుప్రజల్ని మభ్యపెడుతూ, రాష్ట్రం వస్తే తెలంగాణాలోని ఇతరప్రాంతాల తెలుగువారి భూముల్ని, ఇళ్లను, పరిశ్రమలను స్వాధీనం చేసుకుని పంచిపెడుతానని తెలుగుప్రాంతం నుంచి తెలుగువారిని వెళ్లగొడతామని, వెళ్ళకపోతే తనని పంపిస్తామని, ఇలా అడ్డగోలు ప్రచారం ద్వారా భారీఎత్తున ఈ వేర్పాటువాది తెలుగుప్రజల మధ్య విద్వేషాన్ని పెంచుతూ సొంత స్వార్థపూరిత ఉద్యమాన్ని పెంచుకుంటూ వచ్చాడు. ఇది పచ్చి బూతులతో అతడు నిర్మించిన "మల్టీనేషనల్ కుటుంబ'' ఉద్యమం! ఎందుకని ఇది అతని కుటుంబ ఉద్యమమని అనవలసి వస్తోందంటే, ఏ వేర్పాటు ఉద్యమానికి ఒక రాజకీయ నిరుద్యోగి సూత్రధారి అయ్యాడో, ఆ కెసిఆరే 1996 జూలై 18వ తేదీన పెద్దమనుషుల ఒప్పందం ఫలితంగా కుదిరిన ఆరుసూత్రాల పథకాన్ని వ్యతిరేకించి, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను రాష్ట్రంలో ఎక్కడ వేసిన లేదా ఎక్కడికి బదిలీ చేసినా సరే వెళ్ళి పనిచేయాలనీ, జోనల్ పద్ధతిని వ్యతిరేకించుతూ రాష్ట్ర శాసనసభలో బాహాటంగా ప్రకటించాడని మరచిపోరాదు!  ఈ వాస్తవాన్ని మరిచిపోయిన ఇతర స్వార్థపూరిత రాజకీయపక్షాలు, ముఖ్యంగా ఏ విశాలాంధ్ర ఏర్పాటుకు అశేష త్యాగాలతో తోడ్పాటునందిన్చారో ఆ కమ్యూనిస్టులూ "బంగారు లేడి వెంటపడిపోయిన'' (బంగారులేడి అంటూ ఉంటుందా అని కూడా ఆలోచించని) రాముడులాగా కె.సి.ఆర్. వెంట పడిపోయి తెలుగుజాతినివిచ్చిన్నం చేయడానికి నడుంకట్టారు. ఆనాడు శాసనసభ నిండు పేరోలగంలొ [18-07-1996] అంటే 16 ఏళ్ళనాడు ఈ కెసిఆర్ ఏమని చెప్పాడు? అతని మాటల్లోనే వినండి" "రాష్ట్రంలో నేడు నెలకొని ఉన్న ఆర్ధిక పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి, సరైన చర్యలు చేపట్టి, రాష్ట్రం యొక్క సత్వర అభివృద్ధికి సమగ్రాభివృద్ధికి దోహదపడాల్సిన సత్సంకల్పంతో, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారిని అభినందిస్తున్నాను. సమాజంలో ప్రగతిశీల భావాలు వస్తూ ఉంటే కొన్ని నష్టాలు వస్తూ ఉంటాయి. ఏ కార్యక్రమాన్ని నూటికి నూరుపాళ్ళు అమలు చేయడం కష్టం. సమాజంలో నైతిక పరివర్తన జరుగుతోంది. దీనిని సహృదయంతో అర్థం చేసుకుని, మద్యనిషేధం విషయంలో కూడా అర్థం చేసుకుని స్పందించాలని కోరుతున్నాను. ఉద్యోగులకు సంబంధించి ఆరుసూత్రాల పథకం, జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతీస్తున్నాయి. సర్ ప్లస్ స్టాఫ్ ను రాష్ట్రంలో ఎమూలకైనా వాడుకునేలా వీలుండాలి. కాని ఆ విధానం లేదు. మనకు మనం విధించుకున్న ఆటంకమే ఆరుసూత్రాలల జోనల్ విధానం. సిబ్బందిని వినియోగించుకోలేక పనిలేకపోయినా లక్షల, కోట్ల రూపాయలను నిరర్థకంగా ఖర్చుచేస్తూ వృధా చేస్తున్నాం! ఈ విధానంలో మార్పులు చేయాలి. డైనమిక్ గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిథులతోను, ఉద్యోగసంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఇక అప్పులు, వడ్డీలు ఎలా చెల్లిస్తాము? పట్టణప్రాంతాల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన భూములు, ప్రభుత్వ ఆస్తులు అన్యాల్రాంతం అయిపోతున్నాయి. వీటిని ఆక్రమించుకుని ధనవంతులు అవుతూంటే నిస్సహాయతగా ప్రభుత్వం చూస్తోంది. అప్పులు తీర్చడానికి పరిస్థితులు ఉంటే మున్డుకురావటానికి, కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి క్యాపిటల్ పెట్టి రెమ్యూనరేషన్ గా ప్రగతి సాధించడానికి వీలు ఉంటుంది. ప్రభుత్వం ఇటువంటి విలువైన ఆస్తులను వేలం వేసి అప్పులు తీర్చడానికి ఆస్కారం ఉంటుందేమో చూడాలి''! ఇదీ కెసిఆర్ తంతు! ఎప్పటికప్పుడు అబద్ధపు ప్రకటనలతో కాలక్షేపం చేస్తూ తెలంగాణా తెలుగుప్రజలను, దొరల, జాగిర్దార్ల, పటేల్ పత్వారీల దాష్టికాలనూ, నిరంకుశ నిజాం పాలనపైన విలువైన సాయుధపోరాటం సాగించిన ప్రజలను తిరిగి 'దోర'ల పాలనకోసం కెసిఆర్ తన మాటల్ని తానే మింగేసి తెచ్చినదే వేర్పాటు ఉద్యమం. స్థానిక రాజకీయ సమీకరణలను తారుమారు చేయగల మౌలిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ వేర్పాటు ఉద్యమ పార్టీ దాదాపు నామరూపాలు లేకుండా పోయింది! ఆ మధ్య జరిగిన ఉపఎన్నికల్లోనూ గుడ్లు తేలవేసింది! ఈ భాగోతం చాలక, "ఇదిగో ప్రత్యేకరాష్ట్రం నేడే వస్తుంది, కాడు రేపు వస్తుంది, కాడు ఎల్లుండి వచ్చేస్తోంది'' అంటూ ఎప్పటికప్పుడు సొంత వాయిదాలు ప్రకటిస్తూ తెలంగాణా ప్రజాను మోసగిస్తున్న వ్యక్తులు ఇటీవలి ఫలితాలనుంచి పాఠం నేర్చుకొనకుండా ఈసారి "ఎం.ఎల్.సి. ఫలితాలతో ఢిల్లీ దిమ్మతిరిగిపోవాలి  '' అంటూ ఉత్తరకుమారుల్లా  ప్రకటనలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అంటే, అట్టడుగున మాత్రం ఈ ప్రాంతంలోని తెలుగు ప్రజాబాహ్య్ల్యం ఈ రాజకీయ నిరుద్యోగి మాటల్ని నమ్మడం లేదని అర్థమవుతుంది కనుకనే తనను అవమానభారం నుంచి రక్షించుకోవటానికి "కొత్త ఆప్షన్స్'' కోసం వెతుకులాడుతున్నాడు! ఇది యిలా ఉండగా వేర్పాటు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి పనిచేస్తూ వచ్చిన "సంయుక్త కార్యాచరణ సంఘం''లొ కూడా చీలికలొచ్చాయి. ఈ సంఘం నాయకుడికి - వేర్పాటు పార్టీ నాయకుడికీ మధ్య పొత్తూ పొంతనా లేదు సరికదా, పరస్పరం పరోక్షంగా తిట్టుకోడం, కుమ్ముకోవాడమూ జరుగుతున్నాయి. పైగా అందరూ 'నగారా' వాయించేవాళ్ళే, ప్రత్యేకరాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న తనకు జె.ఎ.సి. వర్గం తనలోకి రానివ్వకుండా కెసిఆర్ అడ్డుకొంటున్నాడని ప్రాంత "నగారా సమితి'' అధ్యక్షుడు నాగం జనార్థన రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఏతా వాతా ఇప్పుడు జరుగుతున్నది తెలుగుజాతిని చీల్చబోయి వేర్పాటు ఉద్యమమే ఇప్పుడు చీలుబాటలలోకి జారుకుంటోంది. ఈ దిగ'జారుడు' పరిణామాన్ని తెలంగాణా ప్రజాబాహుళ్యం కనిపెట్టకుండా ఉండడంకోసం 'బొబ్బిలిదొర' వర్గం ఆడుతున్న పెద్దనాటకం - తాను అబద్ధపుప్రచారాలతో, శుష్క వాగ్దానాలతో, వంచనాశిల్పంతో, విద్వేష ప్రచారంతో ప్రోత్సహించిన మన తెలుగుబిడ్డల ఆత్మహత్యలకు ప్రభుత్వాలే కారణమని పదేపదే బొంకనేర్వటం! కాని తన స్వార్థపూరిత ఉద్యమాన్ని ప్రారంభించిన 'దోర'కు తెలుగుబిడ్డల ప్రేతాత్మలె రేపటి పీడకలలై పీడించినా ఎవరూ ఆశ్చర్యపోవలసిన పనిలేదు, కాంగ్రెస్ కు తన తనువునూ, ఉద్యమాన్ని తాకట్టుపెట్టి వచ్చినా సరే! అందుకే రాజకీయ నిరుద్యోగులు నిర్మించే 'ఉద్యమా'లకు గాలివాటం తప్ప దిశా, దశా ఉండవు!  

రాహుల్ రాష్ట్ర పర్యటన..తెలంగాణ పై నిర్ణయం!

        ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో కూడా తాను తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ విషయంలో పార్టీ నిర్ణయాన్ని పాలో అవ్వడమే తన వంతు అని కిరణ్ స్పష్టం చేశాడు. విధాన నిర్ణయాలు పార్టీయే తీసుకుంటుందని, పార్టీని కాదని ఏమీ చేయలేమన్నారు. పార్టీ టికెట్ ఇస్తేనే తాను ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు. రాహుల్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి …సమావేశ వివరాలను తెలిపారు. తమ సమావేశం గురించి మీడియాలో వచ్చిన వార్తలు కల్పనలేనని తేల్చేశారు. తాము పార్టీ బలోపేతం గురించి మాత్రమే రాహుల్ చర్చించామని కిరణ్ అన్నారు. ఇక పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వారి గురించి మాట్లాడుతూ… తమ పార్టీ నుంచి ఎంతమంది బయటకు వెళ్లినా ఢోకా లేదన్నారు. పాత వెళ్లిపోతే కొత్తవారు వస్తారన్నారు. తమకు 294 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాడానికి తగిన అభ్యర్థులున్నారన్నారు. రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తూ…విద్యుత్ ఉత్పత్తి కోసం కేజీ బేసిన్ నుంచి గ్యాస్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు మేలు చేసేందుకు ఏం చేయాలనే దానిలో సమాలోచనలు జరిపామన్నారు. రైల్వే బడ్జెట్ పై రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపామన్నారు. ఇక  ఈ సమావేశం గురించి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…త్వరలోనే రాహుల్ రాష్ట్రపర్యటనకు రానున్నారని తెలిపారు.

డోలాయమానంలో టీ- కాంగ్రెస్ యంపీలు

  తెలంగాణా కాంగ్రెస్ యంపీలు ముందు ప్రకటించినట్లుగా ఈరోజు సమావేశం కాలేకపోవడంతో వారిమధ్య ఉన్నఅభిప్రాయబేధాలు మరోమారు బయటపడ్డాయి. మిగిలినవారి సంగతెలా ఉన్నపటికీ, నిజామాబాద్ యం.పీ. మధుయాష్కి మాత్రం రాజీనామా విషయంలో ఒక స్పష్టతకొచ్చారు. అధిష్టానం తెలంగాణా అంశంపై వెనక్కి తగ్గేదిలేదని ఒక ప్రకటన చేసి, దానిపై కసరత్తు చేస్తున్న ఈ తరుణంలో రాజీనామా చేయవలసిన అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు.   అయితే, కొందరు యంపీలు మాత్రం ఆయనతో విభేదిస్తూ, సమావేశాలను బహిష్కరించడం ద్వారా అధిష్టానానికి మరోమారు తమ నిరసనను తెలియజేయాలని భావిస్తున్నారు. మరి కొందరు, తెలంగాణా అంశంపై అధిష్టానం ఎలాగు కసరత్తు మొదలు పెట్టింది కనుక సమావేశాలలోయధావిదిగా పాల్గొనడం మేలని భావిస్తున్నారు.   ఇంకొందరు చర్చల ప్రక్రియతో తెలంగాణా అంశాన్నిసాగదీస్తున్నఅధిష్టానాన్ని, ఇదివరకు యఫ్.డీ.ఐ.బిల్లుపై లొంగదీసినట్లుగా ఇటువంటి కీలకసమయంలోనే సభా కార్యక్రమాలను అడ్డుకొని రభస చేయడం ద్వారా లొంగదీయవచ్చని, ఈ సదవకాశాన్ని జారవిడుచుకొంటే, మధ్యంతర ఎన్నికల ఊహాగానాల నేపద్యంలో పార్లమెంటు మరోమారు సమావేశం అవడం కూడా అనుమానమేనని, అందువల్ల ఇదే ఆఖరి అవకాశంగా భావింఛి తమ ప్రయత్నం తాము చేయడం మేలని, లేకపోతే ప్రజలలో తిరగడం కష్టమయిపోతుందని వాదిస్తున్నారు. ఇప్పుడు గనుక తెలంగాణా అంశంపై గట్టిగా పట్టుపట్టకపోతే, బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత అధిష్టానం తెలంగాణా అంశాన్నిపక్కన బెట్టేసి, ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల జరగనున్న ఎన్నికల ఏర్పాటులో తమని ఇక పట్టించుకోదని వారు వాదిస్తున్నారు.   ఈ విధమయిన విభిన్న వాదనలతో అందరూ తలో దారి పట్టడంతో ఈరోజు జరుగవలసిన సమావేశం రద్దయింది. అందరూ ఒక నిర్ణయానికి రాలేకపోవడం వలన, తెరాస, తెలంగాణా-ఐ.కాసా. వంటి వారికి చులకనయిపోతున్నామని తెలిసినా ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు.

కిరణ్, బాబుల రుణానుబంధం

  తాను అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఫైలు మీదనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు వాగ్దానాలు చేస్తుంటే, రుణమాఫీ చేయడం ఎట్టి పరిస్థితుల్లోకూడా సాద్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుండ బద్దలు కొట్టినటు చెపుతున్నారు. కానీ, చంద్రబాబు ఈ రోజు కూడా తన పాదయాత్రలో రైతులు బ్రతికి బట్టకట్టాలంటే కేవలం రుణమాఫీయే మార్గం అని నొక్కి చెప్పారు. పరిశ్రమలకి, ఇతర రంగాలకి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నపుడు, వ్యవసాయానికి, రైతులకు ఎందుకు సాయం చేయలేరని ప్రశ్నించారు.   ఈ రోజు డిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద మీడియావారు ఈ విషయం ప్రస్తావించగా, ఆయన కొంచెం అసహనంతో రూ.1.16 లక్షల కోట్ల రుణాలను చంద్రబాబు ఏవిధంగా మాఫీ చేయలనుకొంటున్నారో కాస్త వివరిస్తే బాగుంటుందని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఆపేసి ఇస్తారా లేక ఒక్క రూపాయి కేజీ బియ్యం ఆపేసి ఇస్తారా లేక పెన్షన్లు ఈయడం ఆపేసి రుణమాఫీ చేస్తారా చెప్పమంటూ ఎదురు ప్రశ్నించారు.   ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయడం కష్టంగా భావిస్తోందని, అటువంటప్పుడు చంద్రబాబు ఏవిధంగా రైతుల రుణమాఫీ చేసేస్తానని వాగ్దానాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అయినా, చంద్రబాబుకి వాగ్దానాలు చేయడం తప్ప వాటిని నిలబెట్టుకోవడం అలవాటు లేదని, అందుకే నోటికి వచ్చిన వాగ్దానాలు చేసేస్తున్నారని ఆయన విమర్శించారు.   దీనికి ప్రతిగా రేపు చంద్రబాబు మరింత ఘాటుగా జావాబు ఈయవచ్చును. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పగలిగితే ప్రజలలో ఆయన మాటలపై నమ్మకం ఏర్పడుతుంది. కానీ, మన రాజకీయనాయకులలో ఎవరికీ కూడా అంతమంచి అలవాటు లేదు, ఉండదు కూడా.

రైతులు బతకాలంటే రుణమాఫీయే పరిష్కారం: బాబు

        చంద్రబాబు నాయుడు 'వస్తున్నా..మీకోసం' పాదయాత్రలో కొన్ని రోజుల క్రితం రెండు వేల కిలోమీటర్ల పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ రోజు అంగలకుదురులో ఎన్టీఆర్ కిషాన్ భవన్‌కు భూమిపూజ చేశారు. తాను వ్యవసాయం దండుగ అని ఎప్పుడు చెప్పలేదని, రైతుల పిల్లలు చదువుకోవాలని మాత్రమే చెప్పానని చంద్రబాబునాయుడు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు బతికి బట్టకట్టాలంటే రుణ మాఫీ మినహా మరే మార్గం లేదన్నారు. పరిశ్రమలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతుల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతోందని చంద్రబాబు ప్రశ్నించారు.   తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అల్మట్టి డ్యామ్ కేసులో వైయస్ కారణంగానే ఓడిపోయామన్నారు. అసమర్థుడైన బంధువును వైయస్ లాయర్‌గా పెట్టడం వల్లే అలా జరిగిందన్నారు. కాలువల్లోకి నీళ్లు రావడం లేదు. కానీ రైతుల కళ్లలో మాత్రం కన్నీళ్లొస్తున్నాయన్నారు. గడిచిన తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలో 14,500 మంది ఆత్మహత్య చేసుకుంటే, గత నాలుగేళ్ళలో మరింత ఎక్కువయ్యాయని, వైఎస్ మాటలు నమ్మిన రైతులు ఇబ్బందుల్లో పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

అక్బరుద్దీన్ ఓవైసీ విడుదల

        ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మధ్యాహ్నం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఎంఐఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కస్టడీలో ఉన్న అక్బర్‌కు శుక్రవారం కోర్టు మూడు షరతులతో బెయిల్ మంజూరు చూసిన విషయం తెలిసిందే. ఒకటి రూ. 10 వేలు, ఇద్దరు పూజీకత్తు, రెండోది పాస్‌పోర్టు కోర్టుకు సమర్పించాలని, మూడోది నిర్మల్ రావద్దని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అక్బర్ ఆదిలాబాద్ నుంచి బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో హైదరాబాద్‌కు రానున్నారు.

600కోట్లతో సినిమా చూపించిన 'సిమ్స్' సంస్థ

        త్రివిక్రమ్ 'జులాయి' సినిమాలో ప్రజల దగ్గర నుంచి 1500కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తాడు విలన్. చివరికి ఆ డబ్బును హీరో ప్రజలు వద్దకు చేరుస్తాడు. ఆ సినిమాను చూసి ఇన్స్ స్పైర్ అయ్యారో లేదో తెలియదు కాని వైజాగ్ లో సేమ్ సీన్ రీపీట్ అయ్యింది. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు పది వేల రూపాయలు వడ్డీ ఇస్తామని ఆశ చూపి ప్రజల నుంచి 600 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసి సిమ్స్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ చెల్లించడంతో మధ్య తరగతి ప్రజలు ఎగబడి తమ వద్ద ఉన్న సొమ్ముని ఈ సంస్థలో దాచుకున్నారు. ఇప్పుడు ఆ సంస్థ యజమానులు పత్తాలేరు. అనకాపల్లి, యలమంచిలిలలోని ఈ సంస్థ కార్యాలయాలపై డిపాజిట్దారులు దాడి చేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. డిపాజిట్ చేసివారి వత్తడితో అనకాపల్లిలో ఈ సంస్థ ఏజెంట్ సత్తిబాబు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చోడవరంలో సిమ్స్ కార్యాలయం వద్ద డిపాజిట్దారులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా, సంస్థ యజమాని సురేంద్ర గుప్త పోలీస్ ఉన్నతాధికారుల వద్ద లొంగిపోతారని చెబుతున్నారు. భాదితులకు న్యాయం చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. మరీ ఈ పేద ప్రజలకు ఏ హీరో న్యాయం  చేస్తాడో వేచి చూడాలి. 

అక్బరుద్దీన్ విడుదలకు బ్రేక్

  ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ విడుదలను కోర్ట్ నిలిపివేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కస్టడీలో ఉన్న అక్బర్‌కు కోర్టు మూడు షరతులతో బెయిల్ మంజూరు చూసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారికి అన్ని పత్రాలు అందజేయవలసి ఉండగా పాస్‌పోర్టు ఇవ్వకపోవడంతో విడుదలకు బ్రేక్ పడింది. అక్బరుద్దీన్ విడుదల ఆదేశాలను కోర్టు ప్రస్తుతానికి నిలిపివేసింది. అక్బరుద్దీన్ బెయిల్ ఆర్డర్లు తీసుకు రావాల్సిన ఆయన తరఫు లాయర్లు జైలు వద్దకు రావడానికి మరో ఒకటి లేదా రెండు గంటలు పట్టే అవకాశముంది. ఈ రోజు మధ్యాహ్నం ఒకటి గంటల వరకే కోర్టు పని చేస్తుంది. దీంతో అక్బరుద్దీన్ విడుదల ఈ రోజు అవుతుందా? లేదా సోమవారం అవుతుందా? అనేది తెలియరాలేదు.

చాయిస్ ఈజ్ యువర్స్: రాహుల్ గాంధీ

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ, ఈ ఏడాదిలో జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలనీ, వచ్చే ఏడాది జరగనున్నసాధారణ ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తన పార్టీని బలపరిచే ప్రయత్నంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో, పీసీసీ మరియు శాసనసభా పక్ష నాయకులతో నిన్న,ఈరోజు డిల్లీలో సమావేశమవుతున్నారు. పార్టీని పూర్తీ స్థాయిలో ప్రక్షాళించే ప్రయత్నంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నట్లు తెలుస్తోంది.   1. ఇకనుండి పార్టీ అభ్యున్నతికి పాటుపడినవారికి సముచిత పదవులు, పార్టీకి నష్టం కలిగించేవారికి, లేదా పార్టీలో పనిచేయనివారికి శిక్షా విధానం అమలుచేయాలని భావిస్తున్నారు.   2. ఎన్నికలలో పార్టీ టికెట్స్ ఆశించేవారు తాము అందుకు అన్నివిధాల అర్హులమని తప్పనిసరిగా నిరూపించుకొనవలసి ఉంటుంది.   3. పార్టీలో వర్గాలు, ముఠా సంస్కృతిని పోషించేవారిపై క్రమశిక్షణా చర్యలు.   4.పార్టీలో నేతలు మరియు కార్యకర్తలు అందరూ కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పనిచేయడం కాకుండా, పార్టీని పటిష్టపరిచే విదంగా పనిచేయాలి. అందుకు ప్రతీ సభ్యుడు తనకు తానుగా కొన్నిబాధ్యతలను, లక్ష్యాలను నిర్దేశించుకొని తదనుగుణంగా పనిచేయాలి. నిరంతరంగా కొనసాగే ఈ ప్రక్రియను, ప్రతీ మూడు లేదా నాలుగు నెలలకొకసారి పార్టీ పరిశీలించి తమ బాధ్యతలను, లక్ష్యాలను నేరవేర్చినవారికి తదనుగుణంగా పదవులు ఇచ్చి గౌరవిస్తుంది.   5. పార్టీలో నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలుజేయాలి. హద్దులు దాటినవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పనిసరి.   రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆశయాలు వినడానికి చాల బాగున్నాయి. కానీ, క్రమశిక్షణ రాహిత్యానికి, విపరీతమయిన స్వేచ్చకు, ముఠాతత్వానికి అలవాటుపడి ముదిరిపోయున్న కాంగ్రెస్ నేతలను తనకనుగుణంగా మార్చుకోవడం, ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవడం కన్నాచాలా కష్టమయిన విషయం అని ఆయన త్వరలోనే గ్రహించవచ్చును. ఈ పరీక్షలో ఆయన నెగ్గితే, జవజీవాలు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఒక సమర్దుడయిన యువనాయకుడు దొరికినట్లే భావించవచ్చును. లేదంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు సాగుతున్న దారిలోనే కుంటుకొంటూ ముందుకు సాగవలసి ఉంటుంది.

చిరుకు చిన్నల్లుడు శిరీష్ ఝలక్

        కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ భారతీయ జనతా పార్టీలో చేరడం ఆసక్తి కలిగిస్తుంది. చిన్నకుమార్తె శ్రీజను వివాహమాడిన శిరీష్ భరద్వాజ్ భార్యతో విడిపోయిన తరువాత, అతనిపై అతని భార్య శ్రీజ వరకట్నం కోసం వేదిస్తున్నాడని పిర్యాదు చేయడంతో, పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తరువాత దాదాపు కనుమరుగు అయిపోయాడనుకొన్న శిరీష్, మళ్ళీ చాలా కాలం తరువాత వార్తల్లోకి ఎక్కాడు. శిరీష్ భరద్వాజ్ బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బహుశా ఇక తన కాపురం చక్కబడే అవకాశం లేదని గ్రహించిన ఆయన, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మామ చిరంజీవిని డీ కొట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమైన భారతీయజనతా పార్టీని ఎంచుకొని ఉండవచ్చును. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన శిరీష్ భరద్వాజ్ లెక్క సరైతే రేపు ఎన్నికలలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగేతే, తానూ మామకు వ్యతిరేఖంగా చక్రం తిప్పవచ్చుననే ఆలోచనతోనే భాజాపాను ఎన్నుకొని ఉండవచ్చునని అంటున్నారు.

రష్యాలో ఉల్క భీభత్సం: 1000మందికి గాయాలు

        అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఓ భారీ ఉల్క ఒక్కసారిగా పేలిపోయి రష్యాలో బీభత్సం సృష్టించింది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 3 వేల భవనాలు, అనేక కార్లు దెబ్బతిన్నాయి. సుమారు 1000మందికి పైగా గాయపడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల్లో 200మంది చిన్నారులున్నారు.   "జనావాసాలపై భారీ శిలలు పడనందుకు దేవుడికి కృతజ్ఞతలు'' అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. నగరంలో అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా నగరంలో గ్యాస్ సరఫరాను నిలిపేశారు. దాదాపు 20వేల మందితో కూడిన సహాయక బృందాలు నగరానికి చేరుకున్నాయి.   బాధితులకు సాయం చేస్తూనే మరోపక్క గ్రహశకలాలు భూమిని తాకిన మూడు ప్రదేశాలను గుర్తించాయి. రెండు శిలలు ఇక్కడి చెబార్కుల్ చెరువు సమీపంలో పడిన ఆనవాళ్లు కనిపించాయి. ఇతర ప్రాంతాలను పరిశీలించడానికి మూడు యుద్ధ విమానాలనూ రంగంలోకి దించారు. ఉల్కాపాతం వల్ల రేడియేషన్ ప్రభావం, రసాయనిక చర్యల ముప్పును పరిశీలించడానికి ప్రత్యేక రక్షణ బృందాలను ఇక్కడకి తరలించారు. ఇక ఈ ఉల్కాపాతానికి సంబంధించిన వీడియోలను స్థానికులు కొందరు ఇంటర్‌నెట్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచ వినాశనం జరుగనుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఘరానా మొగుడికి ఝలక్ ఇచ్చిన ఘరానా అల్లుడు

  కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి అయిన చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజను వివాహమాడిన శిరీష్ భరద్వాజ్ భార్యతో విడిపోయిన తరువాత, అతనిపై అతని భార్య శ్రీజ వరకట్నం కోసం వేదిస్తున్నాడని పిర్యాదు చేయడంతో, పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తరువాత ఆ కేసు గురించి కానీ, మళ్ళీ వారివురూ కలిసే ఆలోచనచేస్తున్నట్లు గానీ ఎక్కడా ప్రస్తావన ఎక్కడా రాలేదు. వారి కుమార్తె ‘నిర్వర్తిత’, శ్రీజ ఇద్దరూ కూడా ప్రస్తుతం చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు.   దాదాపు కనుమరుగు అయిపోయాడనుకొన్న శిరీష్, మళ్ళీ చాలా కాలం తరువాత వార్తల్లోకి ఎక్కాడు. శిరీష్ భరద్వాజ్ ఈ మద్యనే బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బహుశః ఇక తన కాపురం చక్కబడే అవకాశం లేదని గ్రహించిన ఆయన, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మామ చిరంజీవిని డ్డీ కొట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమయిన భారతీయజనతా పార్టీను ఎంచుకొని ఉండవచ్చును. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన శిరీష్ భరద్వాజ్ లెక్క సరయితే రేపు ఎన్నికలలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగేతే, తానూ మామకు వ్యతిరేఖంగా చక్రం తిప్పవచ్చుననే ఆలోచనతోనే భాజాపాను ఎన్నుకొని ఉండవచ్చును. ఆయనకి అటువంటి ఆలోచన లేనట్లయితే, చార్టెడ్ ఎకౌంటెంట్ గా చాలా మంచి జీవితమే గడిపే అవకాశమే ఉంది. గానీ, వేరే ఆలోచనలు ఉన్నందునే ఆయన రాజకీయాలలోకి వచ్చిఉండవచ్చును. ఘరానా మొగుడికి ఘరానా అల్లుడు దొరికినట్లే కనిపిస్తోంది.  

1000 కిమీ లక్ష్యాన్ని చేదించనున్న ‘జగనన్నవదిలిన బాణం’

  దాదాపు రెండు నెలల క్రితం ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల ఈ 67 రోజుల్లో మొత్తం 972.4 కిమీ దూరం నడిచారు. కనుక, మరో రెండు రోజుల్లో ఆమె కూడా 1000 కిమీ మైలురాయిని నల్గొండ జిల్లాలో దాటనున్నారు. ఆమె ఈ నెల 18న గురజాల వద్ద గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తారు. జిల్లలో ఒకరోజు పాదయాత్ర కొనసాగించిన తరువాత, శాసన మండలి ఎన్నికల సందర్భంగా 19 సాయంత్రం నుండి 21 సాయంత్రం వరకు అమలులో ఉండే ఎన్నికల నియమావళి కారణంగా ఆమె తాత్కాలికంగా తన పాదయాత్రను ఆపవలసి ఉంటుంది. గుంటూరు జిల్లాలో దాదాపు 270కిమీ దూరం నడువనున్న ఆమె మొత్తం 13 నియోజక వర్గాలను పర్యటిస్తారు. జగనన్న వదిలిన బాణంగా తనను తానూ అభివర్ణించుకొన్న షర్మిల, ఇప్పుడు 1000కిమీ లక్ష్యం చేదించనున్నది.

సెన్సార్ బోర్డు ఎదుట విషం తాగిన డైరెక్టర్

        తాను దర్శకత్వం వహించిన సినిమాకు సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదనే మనస్తాపంతో డైరెక్టర్ దుర్గాప్రసాద్ సెన్సార్ బోర్డు ఎదుట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సినీ రంగంలో తీవ్ర కలకలం సృష్టించింది. దుర్గాప్రసాద్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘లవ్ పాయిజన్' అనే చిత్రాన్ని నిర్మించారు. చాలా రోజుల క్రితం సినిమాను సెన్సార్ బోర్డ్ కు పంపించిన సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన బోర్డు కార్యాలయం ముందు ఈ రోజు విష౦ తీసుకున్నారు. ఈ విషయం గమనించిన కొందరు వెంటనే అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.