సీమాంధ్ర నేతలు టెర్రరిస్టులు....

      సీమాంధ్ర నాయకులపై తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీమాంధ్ర నాయకులు పార్లమెంటును తగలబెడతమని టెర్రరిస్ట్ లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుక్షణం అడ్డుపడాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆటంకాలు సృష్టించాలని చూస్తున్న సీమాంధ్ర నాయకులపై దేశద్రోహుల కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిజిపి.ప్రసాదరావు సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నాయకులపై కేసులు నమోదు చేసిన ప్రసాదరావు...సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు సుమోటో కేసు పెట్టడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతి తెలంగాణ ప్రజలు పక్షాన నిలిచారని అన్నారు. తెలంగాణకు అడ్డుపడితే తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో ఊహించుకోవాలని అన్నారు.

ఇక రాజీనామాల పర్వం మొదలు

  విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి ముఖ్యమంత్రి, మరి కొందరు మంత్రులు, యంపీలు ధిక్కార స్వరం వినిపిస్తూనే తమ వల్ల అధిష్టానానికి కానీ, రాష్ట్ర విభజన ప్రక్రియకు గానీ ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకొంటూ ఇంతవరకు తీసుకువచ్చారు. అందుకోసం వారు రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలు, కోర్టు కేసులు, రాష్ట్రపతికి అభ్యర్ధనలు, దీక్షలు, మీడియా సమావేశాలు, బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానాలు చివరికి డిల్లీలో కూడా ధర్నాలు చేసారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నేటికీ అందరూ తమ తమ పదవులలోనే కొనసాగుతున్నారు.   అయితే ఇప్పుడు ‘నిజమయిన రాజీనామాల’ సమయం ఆసన్నమయింది. ఇక విభజన బిల్లు నేడో రేపో పార్లమెంటులో ప్రవేశపెట్టబడబోతోంది గనుక సీమాంధ్ర ప్రజలలో ఉన్న ఆవేదనను, కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేఖతను పూర్తిగా ‘క్లెయిం’ చేసుకొనే సమయం రానే వచ్చింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆరుగురు కాంగ్రెస్ యంపీలు పార్టీ నుండి బహిష్కరించబడ్డారు. వారందరికీ సీమాంధ్ర ప్రజల పుష్కలమయిన సానుభూతి!   ఇక ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ కాలపరిమితి కూడా త్వరలోనే ముగిసిపోతుంది. ఇంకా పదవులు పట్టుకొని వ్రేలాడటం కంటే, రాజీనామాలు చేసి బయటపడి త్యాగమూర్తుల లిస్టులో తమ పేర్లు నమోదు చేయించుకొంటేనే రానున్న ఎన్నికలలో ఓట్లు రాలే అవకాశం ఉంటుంది గనుక, ఇక నేడో రేపో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేకమంది మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేసేస్తారు.   రాష్ట్ర విభజనకు ఇంతగా సహకరించిన తరువాత కూడా వీరందరూ సీమాంధ్ర ప్రజల నుండి సానుభూతిని, జేజేలను అందుకోగలగడమే కాంగ్రెస్ రాజకీయాలకు పరాకాష్టగా ఒప్పుకోకతప్పదు. ప్రజలు ఏ కాంగ్రెస్ పార్టీని చ్చీ కొడుతున్నారో ఆ పార్టీకే ఓట్లు వేయించాలనుకోవడం కాంగ్రెస్ రాజకీయ చతురతకు అద్దం పడుతోంది.

బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఈయదు: అద్వానీ

బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ బీజేపీ మద్దతు కోరేందుకు తనను కలిసిన తెదేపా తెలంగాణా నేతలతో మాట్లాడుతూ, “నా 40 సం.ల రాజకీయ అనుభవంలో ఎన్నడూ కూడా పార్లమెంటులో ఇంత దారుణమయిన పరిస్థితులు చూడలేదు. అందుకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే తప్పుపట్టవలసి ఉంటుంది. ఇటువంటి లోపభూయిష్టమయిన బిల్లుకి బీజేపీ మద్దతు ఇవ్వలేదు. రానున్న ఎన్నికల తరువాత కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి రాగానే బిల్లులో లోపాలనట్టినీ సరిచేసి మేమే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తాము,” అని చెప్పారు.   మరో సీనియర్ నేత వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీకి న్యాయశాఖ చెప్పేవరకు కూడా ఆ బిల్లుని రాజ్యసభలో పెట్టకూడదని తెలియదంటే నమ్మలేము. దానికి తెలంగాణా ఏర్పాటుపై చిత్తశుద్ది లేనందునే ఇటువని నాటకాలు ఆడుతోంది. చివరికి మా పార్టీపై నెపం పెట్టి తప్పుకోవాలని చూస్తోందని” అన్నారు.   ఆ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత రవిశంకర్ ఈరోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా బిల్లుపై కాంగ్రెస్ ఏవిధంగా నాటకమాడుతోందో వివరించి చెప్పారు. “ఆ పార్టీకి నిజంగా తెలంగాణా ఏర్పాటు పట్ల చిత్తశుద్ది లేదు. అందుకే ఉభయసభలలో కొందరు కాంగ్రెస్ యంపీలు విభజనకు అనుకూలంగా, మరి కొందరు వ్యతిరేఖంగా ఆందోళన చేస్తున్నా వారిని అదుపు చేయకుండా చోద్యం చూస్తోంది. ఆవిధంగా చేయడం ద్వారా సభలో బిల్లుని ఆమోదించడానికి తాము చాలా చిత్తశుద్ధితో వ్యవహరించామని తెలంగాణా ప్రజలకు, రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొన్నామని సీమాంధ్ర ప్రజలకు నమ్మబలికి రెండు చోట్ల ఓట్లు దండుకోవాలని చూస్తోంది. అందుకే తనకు అత్యంత విధేయులయిన యంపీలే బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేఖంగా ఆందోళన చేస్తూ సభని స్థంభింపజేస్తున్నప్పటికీ అది చోద్యం చూస్తూ కూర్చొంది. పార్లమెంటు సమావేశాలు మొదలయ్యి నేటికి అప్పుడే వారం రోజులయియినా ఉభయ సభలు ఒక్కరోజు కూడా నిర్వహించలేని పరిస్థితి స్వయంగా కాంగ్రెస్ కల్పించింది. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల మీద నిందవేసి తప్పుకోనేందుకే కాంగ్రెస్ ఈ నాటకమంతా ఆడుతోందని మేము భావిస్తున్నాము. ఆ పార్టీకి చిత్తశుద్ధి లేనప్పుడు అందుకు ఇతరులను నిందించడం చాలా తప్పు,” అని అన్నారు.

కాంగ్రెస్ కోర్ కమిటీ భేటి...'టి' బిల్లు లోక్‌సభలోనా!

      ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. సుమారు 30 నిముషాలపాటు ఈ భేటీ జరిగింది. కేంద్రమంత్రులు సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, ఏకే ఆంటోనీతో పాటు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ తదితరులు హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణ బిల్లును లోక్‌సభలోనా, లేక రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, ఎప్పుడు ప్రవేశ పెట్టాలి అన్నదానిపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ కోర్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌ను ఆమె నివాసం వద్ద కలిశారు. దీని బట్టి చూస్తుంటే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ఎంత గట్టి పట్టుదలతో ఉందో తెలుస్తుంది. బుధవారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ కాబట్టి గురువారం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలను కూడా కేంద్రం ఒప్పించే ప్రయత్నంలో ఉంది.

జేపీ చొక్కా పట్టుకున్న తెలంగాణవాదులు

      ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ న్యాయవాదులు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారు. జేపీ డౌన్ డౌన్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. జేపీ చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే జేపీ బిల్లును అడ్డుకుంటామని అంటున్నారని తెలంగాణ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నష్టం చేసే సవరణలే ఆయన అడుగుతున్నారని అందుకే ఆయనను అడ్డుకున్నామని తెలిపారు.

కాంగ్రెస్ రెబెల్ ఎంపీలపై బహిష్కరణ వేటు

  కాంగ్రెస్ అధిష్టానం తన ఆరుగురు సీమాంధ్ర యంపీలు-లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, హర్షకుమార్, సాయి ప్రతాప్ మరియు సబ్బంహరి పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకి పాల్పడినందుకు పార్టీ నుండి వెంటనే బహిష్కరింస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి జనార్ధన్ ద్వివేది కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి ఇదివరకే కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి కూడా రాజీనామా చేసినపుడు, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ వారిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదం. త్వరలో లోక్ సభ, లేదా రాజ్య సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టినపుడు వారెలాగూ బిల్లుకి అనుకూలంగా ఓటు వేస్తారనే నమ్మకం లేదు. అటువంటప్పుడు వారిపై బహిష్కరణ వేటు వేయడం ద్వారా ఓటింగ్ సమయంలో సభ నుండి సస్పెండ్ చేసి బయటకి పంపేయవచ్చును. కాంగ్రెస్ పార్టీ తన యంపీలను కూడా అదుపు చేయకుండా వారినడ్డుపెట్టుకొని సభ జరగకుండా నాటకాలు ఆడుతోందని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటంతో ఎట్టకేలకు వారిపై చర్యలు తీసుకోక తప్పలేదు. కానీ, తన నిర్ణయాన్ని నిరసిస్తూ, వ్యతిరేఖిస్తూ డిల్లీలో తన కళ్ళెదుటే దీక్షలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ,ఆయన బార్య బొత్స ఝాన్సీ, కేంద్రమంత్రులు కావూరి, చిరంజీవి తదితరులపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోనవసరం లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పడం విశేషం.    ఈ బహిష్కరణ ద్వారా వారికి కీడు కంటే మేలే ఎక్కువ జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో ముగిసిపోయే యూపీఏలో వారు కొనసాగకపోయినా వారికి వచ్చే నష్టమేమీ ఉండబోదు. కానీ, ఈ బహిష్కరణ ద్వారా సీమాంధ్ర ప్రజల నుండి వారికి బోలెడంత సానుభూతి ఆయాచితంగా దొరుకుతుంది. ఒకవేళ ఇది కూడా కాంగ్రెస్ విభజన వ్యూహంలో భాగమే అయితే పార్లమెంటు సమావేశాలు ముగియగానే, రాష్ట్ర విభజన బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేసిన మరికొంత మంది యంపీలను, కేంద్ర మంత్రులను కూడా పార్టీ నుండి బహిష్కరించినా ఆశ్చర్యం లేదు. వీరందరూ కలిసి కిరణ్ కుమార్ రెడ్డి లేదా మరొకరు పెట్టబోయే కొత్త గొడుగు క్రింద చేరి ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకోవచ్చును.      

బీజేపీ అందుకే సవరణలు కోరుతోందా?

  రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్ర శాసనసభ నుండి డిల్లీకి చేరుకోగానే అంతవరకు బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తానని చెపుతూ వచ్చిన బీజేపీ ముందు సమన్యాయం పల్లవి ఎత్తుకొంది. ఆ తరువాత సీమాంధ్రకు అన్ని విధాల న్యాయం జరిగేలా ఉంటేనే తాము బిల్లుకి మద్దతు ఇస్తామని చెప్పడమే గాక, అందుకోసం తాము కొన్ని సవరణలు, ప్రతిపాదనలు సూచిస్తామని వాటిని కాంగ్రెస్ అంగీకరిస్తేనే మద్దతు అని మరో కొత్త మెలిక కూడా పెట్టారు. రాష్ట్ర విభజన బిల్లుకి మద్దతు ఈయడం వలన తమకు ఎటువంటి రాజకీయ ప్రయోజనమూ కలుగాకపోగా తన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని తెలంగాణాలో బలపరిచినట్లవుతుందని బీజేపీకి జ్ఞానోదయం కలగడమే ఒక కారణమయితే, బిల్లుని వ్యతిరేఖిస్తున్న తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన మరో కారణంగా కనిపిస్తోంది. అదీగాక కాంగ్రెస్ అధిష్టానం బిల్లు ఆమోదం కొరకు ఒకవైపు తన మద్దతు కోరుతూనే మరో వైపు అదే బిల్లుతో తనను రాజకీయంగా దెబ్బతీయాలని చూడటం బీజేపీకి ఆగ్రహం కలిగిస్తోంది.   అందుకే బీజేపీ కూడా అందుకు పైఎత్తుగా సవరణలు సూచించింది. సీమాంధ్రకు ఎంత ఆర్ధిక ప్యాకేజీ ఏవిధంగా ఇవ్వబోతోందో రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని బీజేపీ డిమాండ్ చేయడమే కాకుండా తను స్వయంగా నిర్దిష్టంగా కొన్ని సూచనలు కూడా చేసింది. ఒకవేళ బీజేపీ సూచించినట్లు సీమాంధ్రకు ఇవ్వదలచిన ఆర్ధిక ప్యాకేజీ వివరాలను బిల్లులో పొందుపరిస్తే, దానిపై లోక్ సభలో చర్చించి, ఆమోదం పొందకుండా నేరుగా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ సూచనలను, పట్టించుకోకుండా బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టబోయి సరిగ్గా అదే కారణంతో రాజ్యసభ చైర్మన్ చేతిలో భంగపడింది.   ఇప్పుడు బిల్లుని లోక్ సభలో ప్రవేశపెడితే ఇంత తక్కువ వ్యవధిలో ఆర్ధిక అంశాలపై చర్చ ముగిసే అవకాశం లేదు. చర్చ జరగకుండా బిల్లు ఆమోదించడము కష్టమే. పైగా స్వయంగా సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలే సభ జరగకుండా అడ్డుపడుతున్నారు. సీమాంధ్రలో తన పార్టీని పణంగా పెట్టి కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో, ఒకవేళ బిల్లుని ఆమోదింపజేయలేకపోతే తెలంగాణా లో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంఖాయం.   ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్ స్వయంగా బీజేపీ సీనియర్ నేత అద్వానీకి ఫోన్ చేసి బీజేపీ మద్దతు కోరేందుకు రేపు విందుకు రమ్మని ఆహ్వానించారు. అయితే బీజేపీ సూచిస్తున్న సవరణలను బిల్లులో చేర్చకపోతే మద్దతు ఇచ్చే అవకాశం లేదు. చేర్చితే ఈ వారం రోజులలో వివిధ ఇతర బిల్లులతో పాటు రాష్ట్ర విభజన బిల్లుపై లోక్ సభలో చర్చించి, ఆమోదించడం కష్టమే. బీజేపీ వేలుతో బీజేపీ కళ్ళు పొడవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తే, బీజేపీ కూడా సరిగ్గా కాంగ్రెస్ తన కళ్ళు తాను పొడుచుకొనేలా ఎత్తులు వేసింది.

ధర్మానకు ధర్మల్ ఇరకాటం

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎంతో అత్మీయుడిగా మెలిగిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంతకాలంగా ఆయన కొత్త పార్టీ పెడతారేమోనని ఓపికగా ఎదురుచూశారు. అయితే అది ఇంకా ఎటూ తేలకపోవడంతో చివరికి దైర్యం చేసి మొన్న శ్రీకాకుళంలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైకాపా కండువా కప్పుకొన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో కాకరపల్లి గ్రామం వద్ద స్థాపించబోయే ఒక ధర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ఆ గ్రామ ప్రజలు ఉద్యమించినపుడు, పోలీసు కాల్పులలో ముగ్గురు రైతులు చనిపోయారు. అప్పుడు ధర్మాన ప్రసాదరావు వారికి అండగా నిలబడలేదు. పైగా ప్రాజెక్టు వస్తే స్థానికులకు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని, అందువలన దానిని వ్యతిరేఖించడం అర్ధ రహితమని వాదించి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆ ప్రాజెక్టులో ఆయన కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నందునే ఆయన దానికి మద్దతు పలుకుతున్నారని ప్రతిపక్షాల నేతలు ఆరోపించినా ఆయన వాటిని పట్టించుకోలేదు. అయితే, ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలిచి, వారి తరపున ప్రభుత్వంతో పోరాడుతానని హామీ ఇచ్చారు. ఆయన తన హామీ నిలబెట్టుకొంటారో లేదో తెలియదు. కానీ, ఆయన ఆ ప్రాజెక్టుని వ్యతిరేఖిస్తున్నపుడు కొత్తగా వైకాపాలో చేరిన ధర్మాన ప్రసాదరావు దానికి ఇదివరకులా మద్దతు పలుకలేరు. రానున్న ఎన్నికలలో ఒకవేళ స్థానిక తెదేపా, కాంగ్రెస్ నేతలు మళ్ళీ అక్కడి ప్రజలతో కలిసి ఉద్యమిస్తే వైకాపా కూడా వారితో కలిసి ఆ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ఉద్యమించవలసి వస్తుంది. అప్పుడు ధర్మాన ప్రసాదరావు కూడా వారితో కలిసి ఉద్యమించాల్సి ఉంటుంది. పార్టీ నిర్ణయాన్ని కాదని ఆయన ప్రాజెక్టు స్థాపనకు మొగ్గు చూపలేరు. ఒకవేళ ధిక్కరిస్తే మరో కొత్త పార్టీ వెతుకోవలసి ఉంటుంది.

తెలంగాణ బిల్లుకు రెడ్ సిగ్నల్

      రాష్ట్ర విభజన రాజకీయాలు దేశ రాజధానిలో అనూహ్యమలుపులతో..ప్రతి క్షణం ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర విభజన బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకున్న కాంగ్రెస్ అధిష్టాన వ్యూహానికి సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ బ్రేక్ వేసినట్లు కనిపిస్తో౦ది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు...ముఖ్యమైన అంశాన్ని రాజ్య సభలో ప్రవేశపెట్టడం పై ఆయన అభ్య౦తరం వ్యక్తం చేశారు.   ఇది ఆర్థిక నిర్ణయాలతో ముడిపడి ఉన్న బిల్లు. అందువల్ల తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టాలని అంటున్నారు కదా... అని కేంద్ర హోంశాఖ అధికారులను హమీద్ అన్సారీ ప్రశ్నించారు. పూర్తిస్థాయి ద్రవ్య బిల్లులను మాత్రమే తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టాలనే నిబంధన ఉందని కేంద్రం బదులిచ్చింది. దీనిపై హమీద్ అన్సారీ సంతృప్తి చెందలేదు. బిల్లును ముందుగా తమ సభకు పంపించాలనుకుంటే... దాంతోపాటు న్యాయసలహా కూడా జత చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో విభజన రాజకీయాలు అనుకొని మలుపు తిరిగింది.  రాష్ట్రపతి నుంచి విభజన బిల్లుకి అనుమతి వచ్చినప్పటికీ..ఉపరాష్ట్రపతి దానికి రెడ్ సిగ్నల్ వేయడంతో బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతరా? లేదా?...ముందుగా ఏ సభలో ప్రవేశపెడతారు అన్న దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

టి బిల్లుకు ప్రణబ్ ఓకే: రేపు రాజ్యసభకు

      తెలంగాణ ముసాయిదా బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రేపు 12-30 గంటలకు రాజ్యసభలో కేంద్రప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీతో కేంద్రమంత్రులు రాజీవ్ శుక్లా, సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్, కమల్‌నాథ్‌లు చర్చలు జరుపుతున్నారు. టి. బిల్లుకు బీజేపీ మద్దతు అవసరం అయిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లా చర్చలు జరుపుతున్నారు.   బిల్లు పార్లమెంటుకు రాబోతున్న నేపథ్యంలో బ్రిటిష్ కాలంనాటి విభజించు పాలించు వాసనలు పార్లమెంటులో, రాష్ట్రపతి భవన్ లో కొనసాగుతున్నాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రపతి సంతకం లేకుండా అఖిలపక్షంలో బిల్లు ప్రతులు పెడితే రాష్ట్రపతి ఎందుకు జోక్యం చేసుకోలేదని పయ్యావుల ప్రశ్నించారు. మా ప్రాంత ప్రజల కష్టాల గురించి పట్టించుకోనప్పుడు ఏం చేసేందుకైనా వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం: మమతా

      పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాము విభజనకు వ్యతిరేకమని, సమైక్యానికే మద్దతు తెలుపుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించే తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ తెలిపారు. గతంలో వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మమతా బెనర్జీ ని కలిసి సమైక్యానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈరోజు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మమతాతో భేటి అయ్యే అవకాశం వుంది. ఆయన తెలంగాణ తో పాటు ఇతర రాజకీయాలపై మాట్లాడే అవకాశం వుంది.

గవర్నర్ ని కలిసిన ముఖ్యమంత్రి

  ఈ రోజు శాసనసభలో ఆర్ధికమంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత సభ రేపటికి వాయిదా పడింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్నికలిసి ఆయనతో దాదాపు అర్ధగంటసేపు సమావేశమయ్యారు. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టగానే ఆయన రాజీనామా చేయబోతున్నారని ఆయన సన్నిహితులు ఇదివరకే మీడియాకు చెప్పడంతో, బహుశః ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కి అందించేందుకే వెళ్లి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. కానీ, అటువంటిదేమీ లేదని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత, ఆయన మర్యాదపూర్వకంగా కలిసారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మీడియా ఊహాగానాలకు బ్రేకులు వేసే ప్రయత్నాలు చేసారు. ఎప్పుడు ఉల్లాసంగా కనబడే ముఖ్యమంత్రి గవర్నర్ ని కలిసి తిరిగి వెళ్ళేటపుడు చాలా ముభావంగా ఉండటంతో బహుశః ఆయన రాజీనామా లేఖ ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏమయినప్పటికీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా దాదాపు ఖరారు అయిపోయినట్లే కనిపిస్తోంది. ఆయన ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం.

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆనం: ముఖ్యాంశాలు

      శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ నేతల ఆందోళనల మధ్య ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సభలో 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.1,83,129 కోట్లతో 2014-15 వార్షిక బడ్జెట్‌ను మంత్రి ఆనం ప్రతిపాదించారు. వరుసగా నాలుగో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని మంత్రి ఆనం తెలిపారు.పరిపాలన పరంగా అత్యుత్తమ రాష్ట్రంగా ఇండియా టుడే అవార్డు లభించిందన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 20,346 కొత్త ఉద్యోగాలు మంజూరు చేశాం. 98,652 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బడ్జెట్ పై అధ్యయానికి రేపు ఉభయసభలకు సెలవు ఇచ్చారు.   బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు: * ప్రణాళిక వ్యయం : రూ.67,950 కోట్లు * ప్రణాళికేతర వ్యయం :రూ. 1,15,179 కోట్లు * రెవెన్యూ నిధులు అంచనా : రూ. 474 కోట్లు * ద్రవ్యలోటు అంచనా: రూ. 25,402 కోట్లు  

తెలంగాణ ముసాయిదా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!

      రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విభజన బిల్లుకు ఆమోద ముద్ర వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర పర్యటనలో వున్న ఆయన వద్దకు కేంద్రం బిల్లు పంపించగా...ఆయన వెంటనే ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. మంగళవారమే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్దం చేసినట్లు సమాచారం. అదే విధంగా బిజెపి దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలోనే రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంటు ఆమోద ముద్ర పడే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లుకు శుక్రవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే, దానిని ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది.

ఫిబ్రవరి 12న కిరణ్ రాజీనామా?

  అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా డిల్లీలో ధర్నా చేసినప్పటికీ అది ఆయన అభిప్రాయ ప్రకటనగానే భావిస్తున్నందున ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోనవసరం లేదని పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి పదవిలో కొనసాగాలనుకొంటే కొనసాగవచ్చని పరోక్షంగా సూచించారు. కానీ అదేసమయంలో, రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన బిల్లునే యధాతధంగా పార్లమెంటులో ప్రకటించి, ఆయన కళ్ళను ఆయన వేలుతోనే పొడిచే ప్రయత్నం చేసింది. తామందరం కలిసి బిల్లుని ఇంత తీవ్రంగా వ్యతిరేఖించినా కూడా తమ అధిష్టానం ముందుకే సాగుతుండటంతో, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన రోజు (12) నే రాజీనామా చేద్దామని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితుడయిన లగడపాటి చెప్పారు. మరో కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఈ విషయాన్ని దృవీకరించారు. కానీ, ఆ సమయంలో శాసనసభ సమావేశాలు జరుగుతుంటాయి గనుక అవి ముగిసిన తరువాతనే ఆయన గవర్నర్ ను కలిసి తన రాజీనామ పత్రం అందజేసి, శాసనసభ రద్దుకు సిఫారసు చేయవచ్చును. అయితే ఈ విషయం ముందే ఊహించి కాంగ్రెస్ అధిష్టానం ఆయన స్థానంలో వేరే ఎవరినయినా నియమిస్తుందా? లేక రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతుందా? అనేది తేలవలసి ఉంటుంది.   ఇంత కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసి కొత్త పార్టీ స్థాపిస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, లగడపాటి తదితరులు ఆయన  రాజీనామా చేయబోతున్నారనే వార్తలను ద్రువీకరిస్తున్న ఈసమయంలో, ముఖ్యమంత్రి సన్నిహితులయిన మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు ఆయన కొత్త పార్టీ స్థాపించకపోవచ్చని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరో యంపీ సబ్బంహరి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కొత్తపార్టీ గురించి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ రాష్ట్రవిభజన జరిగితే ముఖ్యమంత్రి కొత్త పార్టీ స్థాపించవచ్చని, విభజన జరుగకపోయినట్లయితే స్థాపించకపోవచ్చని తను భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కొత్త పార్టీ స్థాపించకపోతే అధిష్టానం దృష్టిలో చులకనయిఅపోయిన తరువాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? కొనసాగదలిస్తే ప్రజలకు ఏమని సంజాయిషీ ఇచ్చుకొంటారు? ఏవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని కోరగలరు?       

శాసనసభ చిట్టచివరి సమావేశాలు

  సోమవారం నుండి నాలుగు రోజులపాటు రాష్ట్ర శాసనసభ ఓట్-ఆన్-అకౌవుంట్ బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ సమావేశాలకు ముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది. ఆ తరువాత ఆర్ధిక మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ఓట్-ఆన్-అకౌవుంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. మధ్యలో ఒకరోజు విరామం తరువాత 12,13 తేదీలలో సభ మళ్ళీ సమావేశమయ్యి బడ్జెట్ పై చర్చించి, ఆమోదిస్తారు. ఇవే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో నిర్వహించబోయే ఆఖరు సమావేశాలు. ఒకవేళ పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినట్లయితే ఇవే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే చిట్ట చివరి సమావేశాలవుతాయి. మామూలు పరిస్థితుల్లో ఇటువంటప్పుడు శాసనసభ్యులలో, మంత్రులలో చాలా భావోద్వేగం నెలకొని ఉంటుంది. కానీ, రాష్ట్ర విభజన నేపద్యంలో కాంగ్రెస్ నేతలందరూ రెండుగా చీలిపోయిన కారణంగా ఒకరినొకరు ద్వేషించుకొంటూ ఈ తంతు ముగించనున్నారు.   ఇంతకాలం ఒకే కుటుంబంగా మెలిగిన కాంగ్రెస్ వాదులు ఈవిధంగా విడిపోవలసిరావడం నిజమయిన ఏ కాంగ్రెస్ వాదికయినా చాలా బాధ కలిగించక మానదు. అయితే అందుకు వేరేవరినో కాక తమ అధిష్టాన దేవతనే తప్పుపట్టవలసి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం పుణ్యమాని ప్రజలే కాదు ఆ పార్టీ నేతలు కూడా రెండుగా విడిపోయారు. కనీసం చివరిసారిగా జరిగే ఈ సమావేశాలలోనయినా సజావుగా సాగుతాయనే నమ్మకం లేదు. సాగితే సంతోషమే.

తెదేపా-బీజేపీ పొత్తుల ప్రకటన ఇక లాంఛనమే

  చంద్రబాబు రాజకీయ దక్షత, జాతీయ స్థాయిలో ఆయనకున్న రాజకీయ పరిచయాలు పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందనే బలమయిన నమ్మకం బీజేపీ అధిష్టానానికి ఉన్నందునే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి తెలంగాణా నేతల అభ్యంతరాలు పట్టించుకోకుండా తెదేపాతో పొత్తుకి మొగ్గుచూపుతోంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ఓడించేందుకు అన్నిపార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.   తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నందున, తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చే విషయంలో ఆ పార్టీ వైఖరిలో చాలా స్పష్టమయిన మార్పు కనబడుతోంది. నిన్న దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ఇరువురూ కలిసి బీజేపీ కార్యాలయానికి వెళ్లి ఆపార్టీ నేత వెంకయ్య నాయుడు కలిసి తెలంగాణా బిల్లుకి మద్దతు కోరినప్పుడు, కాంగ్రెస్ పార్టీ సీమంద్రా ప్రాంతానికి ఏవిధంగా న్యాయం చేయబోతోందని ప్రశ్నించారు. ఈరోజు ఆపార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తేనే టీ-బిల్లుకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారిరువురి మాటలు మారిన బీజేపీ వైఖరికి అద్దం పడుతున్నాయి. ఇక చంద్రబాబు కూడా ఈ రోజు తన పార్టీ నేతలతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు దాదాపు ఖరారయిందనట్లు చెప్పారు.అందువల్ల ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల ప్రకటన ఇక లాంచనప్రాయమేనని చెప్పవచ్చును.

రాహుల్ కోసం ప్రత్యర్ధి మద్దతు కోరుతున్న కాంగ్రెస్

  తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడే బీజేపీ అసలు రంగు బయటపడుతుందని దిగ్విజయ్ సింగ్ వ్యాక్యానించారు. అయితే, బిల్లులో ఏముందో కూడా తెలుసుకోకుండా బిల్లుకి మద్దతు ఇస్తామని ఏవిధంగా హామీ ఈయగలమనే బీజేపీ ప్రశ్నకూడా సమంజసమే.   అత్యంత పారదర్శకంగా జరుగవలసిన రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగా తన వైఖరి, తన ఆలోచనలు, తన నిర్ణయాలు ప్రకటించకుండా గోప్యత పాటిస్తూ ప్రతిపక్షాల వైఖరి చెప్పమని కోరుతూ వాటిని ఇరుకున బెట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే దేశంలో నేడు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని మెచ్చుకోలేకపోతున్నాయి. అందుకే నేడు ఆ పార్టీ తన రాజకీయ ప్రత్యర్ధుల గుమ్మం ముందు నిలబడి వారి సాయం అర్ధించవలసి వస్తోంది. స్వంత పార్టీ వారే బిల్లుకి మద్దతు ఈయబోమని చెపుతున్నపుడు తన రాజకీయ ప్రత్యర్దులను కాంగ్రెస్ అధిష్టానం ఏమొహం పెట్టుకొని మద్దతు అడగ గలుగుతోందో దానికే తెలియాలి. రాహుల్ గాంధీని ప్రధానికుర్చీలో కూర్చోబెట్టేందుకు, రాష్ట్రం నుండి అవసరమయిన యంపీ సీట్లు పొందేందుకే రాష్ట్ర విభజనకు పూనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకు తన రాజకీయ ప్రత్యర్ధి బీజేపీ మద్దతు కోరడం మరీ సిగ్గు చేటు.   చివరికి తన స్వంత పార్టీ నేతలచేతే చ్చీ కొటించుకొంటున్నా దాని వైఖరిలో మార్పు కలగలేదు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో సహా పార్టీ నేతలందరూ డిల్లీలో తన కంటెదురుగా ధర్నా చేసినా దానిని అవమానంగా భావించకపోగా నిర్లజ్జగా సమర్ధించుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికే చెల్లు. తన ఈ ఆశయం నెరవేర్చుకోవడం కోసం స్వంత పార్టీ నేతలని, వారి రాజకీయ భవిష్యత్తుని కూడా బలిపెట్టేందుకు సిద్దపడిన కాంగ్రెస్ అధిష్టానం, అసలేమీ జరగనట్లుగా సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు బిల్లుకి మద్దతు ఇస్తారని భావిస్తున్నానని దిగ్విజయ్ సింగ్ పలకడం సిగ్గుచేటు.   కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వలన నేడు ఆ పార్టీ నేతలు ప్రజల ముందు తలెత్తుకొని తిరుగలేకపోతున్నారు. ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సాహసించడం లేదు. చెట్టుకొకరు, పుట్టకొకరు చొప్పున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెల్లాచెదురయిపోతున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం తన ఆశయం మరువలేదు. తన పంతం వీడలేదు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లుగా మొండిగా ముందుకు పోతోంది. వినాశకాలే విపరీత బుద్ది అన్నారు పెద్దలు. అందుకే కాంగ్రెస్ తన స్వంత పార్టీనే పణంగాపెట్టి ఈ విభజన జూదం ఆడుతోంది. తను ఏ అంశంతో కేంద్రంలో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని భావిస్తోందో, అదే అంశం ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారబోతోంది.

రేణుకా చౌదరి గోబ్యాక్

      ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద ఎంపీ రేణుకా చౌదరికి చేదు అనుభవనం ఎదురైంది. భద్రాచలం డివిజన్, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపకూడదంటూ ఏపీభవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ ధర్నాకు దిగారు. వీరికి ఎంపీ రేణుకాచౌదరి మద్దతు తెలిపేందుకు అక్కడి వెళ్లగా, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు అభ్యంతరం తెలిపారు. రేణుకాచౌదరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులపై రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తర్వాత ఇరువురు శాంతిచడంతో రేణుకాచౌదరి ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరి మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ తెలంగాణదే అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క గ్రామాన్ని ఒదులుకోబోమని రేణుకాచౌదరి తెలిపారు.ఖమ్మం జిల్లాలో భద్రచలానికి ప్రత్యేక స్థానం ఉందని, భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవడం తమ లక్ష్యమని రేణుకా చౌదరి చెప్పారు. రామాలయం ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె స్పష్టం చేశారు.