తెదేపా-బీజేపీ పొత్తుల ప్రకటన ఇక లాంఛనమే
posted on Feb 8, 2014 @ 8:01PM
చంద్రబాబు రాజకీయ దక్షత, జాతీయ స్థాయిలో ఆయనకున్న రాజకీయ పరిచయాలు పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందనే బలమయిన నమ్మకం బీజేపీ అధిష్టానానికి ఉన్నందునే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి తెలంగాణా నేతల అభ్యంతరాలు పట్టించుకోకుండా తెదేపాతో పొత్తుకి మొగ్గుచూపుతోంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ఓడించేందుకు అన్నిపార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నందున, తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చే విషయంలో ఆ పార్టీ వైఖరిలో చాలా స్పష్టమయిన మార్పు కనబడుతోంది. నిన్న దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ఇరువురూ కలిసి బీజేపీ కార్యాలయానికి వెళ్లి ఆపార్టీ నేత వెంకయ్య నాయుడు కలిసి తెలంగాణా బిల్లుకి మద్దతు కోరినప్పుడు, కాంగ్రెస్ పార్టీ సీమంద్రా ప్రాంతానికి ఏవిధంగా న్యాయం చేయబోతోందని ప్రశ్నించారు. ఈరోజు ఆపార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తేనే టీ-బిల్లుకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారిరువురి మాటలు మారిన బీజేపీ వైఖరికి అద్దం పడుతున్నాయి. ఇక చంద్రబాబు కూడా ఈ రోజు తన పార్టీ నేతలతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు దాదాపు ఖరారయిందనట్లు చెప్పారు.అందువల్ల ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల ప్రకటన ఇక లాంచనప్రాయమేనని చెప్పవచ్చును.