శాసనసభ చిట్టచివరి సమావేశాలు
posted on Feb 9, 2014 @ 6:25PM
సోమవారం నుండి నాలుగు రోజులపాటు రాష్ట్ర శాసనసభ ఓట్-ఆన్-అకౌవుంట్ బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ సమావేశాలకు ముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది. ఆ తరువాత ఆర్ధిక మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ఓట్-ఆన్-అకౌవుంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. మధ్యలో ఒకరోజు విరామం తరువాత 12,13 తేదీలలో సభ మళ్ళీ సమావేశమయ్యి బడ్జెట్ పై చర్చించి, ఆమోదిస్తారు. ఇవే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో నిర్వహించబోయే ఆఖరు సమావేశాలు. ఒకవేళ పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినట్లయితే ఇవే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే చిట్ట చివరి సమావేశాలవుతాయి. మామూలు పరిస్థితుల్లో ఇటువంటప్పుడు శాసనసభ్యులలో, మంత్రులలో చాలా భావోద్వేగం నెలకొని ఉంటుంది. కానీ, రాష్ట్ర విభజన నేపద్యంలో కాంగ్రెస్ నేతలందరూ రెండుగా చీలిపోయిన కారణంగా ఒకరినొకరు ద్వేషించుకొంటూ ఈ తంతు ముగించనున్నారు.
ఇంతకాలం ఒకే కుటుంబంగా మెలిగిన కాంగ్రెస్ వాదులు ఈవిధంగా విడిపోవలసిరావడం నిజమయిన ఏ కాంగ్రెస్ వాదికయినా చాలా బాధ కలిగించక మానదు. అయితే అందుకు వేరేవరినో కాక తమ అధిష్టాన దేవతనే తప్పుపట్టవలసి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం పుణ్యమాని ప్రజలే కాదు ఆ పార్టీ నేతలు కూడా రెండుగా విడిపోయారు. కనీసం చివరిసారిగా జరిగే ఈ సమావేశాలలోనయినా సజావుగా సాగుతాయనే నమ్మకం లేదు. సాగితే సంతోషమే.