గూడెంలో చంద్రబాబు ప్రజాఘర్జన
posted on Feb 15, 2014 @ 12:05PM
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మళ్ళీ ‘ప్రజాగర్జన’ సభలు నిర్వహించనున్నారు. మొదటగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై మరొక రెండు మూడు రోజుల్లో పార్లమెంటు కీలకమయిన నిర్ణయం తీసుకోనున్నఈ తరుణంలో ఆయన ఈ సభ నిర్వహించడం ఆయన రాజకీయ చతురతకి అద్దం పడుతోంది. విభజన బిల్లుపై కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజల మనోభావాలు ప్రతిబింబిస్తూ ఆయన ప్రసంగం సాగవచ్చును గనుక, వారి నుండి మంచి స్పందనే ఉంటుంది. పైగా అదే జిల్లాకు చెందిన కొత్తపేట కాంగ్రెస్ శాసనసభ్యుడు బండారు సత్యానంద రావు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ను వీడి ఈ సభలోనే చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరనున్నారు కనుక, చంద్రబాబు చేసే ఆరోపణలు కేవలం ఆరోపణలు కాక వాస్తవాలని ద్రువీకరించినట్లవుతుంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరెవరితో కలిసి ఏవిధంగా కుట్రలు పన్నుతోందో ఈ సభలో సత్యానందరావు చేతనే చెప్పించిన తరువాత తెలుగుదేశం పార్టీకి కాక మరే ఇతర పార్టీకి ఓటేసినా అది తిరిగి కాంగ్రెస్ ఖాతాలోనే జమా అవుతుందని చంద్రబాబు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చును.