19న తెలంగాణ బిల్లు ఆమోదం..!!
posted on Feb 15, 2014 @ 11:25AM
లోక్ సభలో గందరగోళ పరిస్థితుల మధ్య నాటకీయంగా బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, దానిని ఆమోదింపజేసుకోనేందుకు కొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు సమాచారం. మూడు రోజులు సెలవుల అనంతరం సోమవారం ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపట్టనుంది. బడ్జెట్ సమావేశానికి సీమాంధ్ర ఎంపీలు అడ్డుతగిలినా..చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేసి తన ప్రసంగాన్ని ఆర్ధిక మంత్రి ముగించేయాలని చూస్తున్నారు.
ముఖ్యమైన బిల్లుల ఆమోదం అనంతరం 19న లోక్ సభలో తెలంగాణ బిల్లుపై చర్చించి వెంటనే ఆమోదింపజేసుకోనేందుకు కేంద్రం కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటాన్ అకౌంట్ సమావేశాలు ముగిసేలోపే ఉభయసభల్లో బిల్లును పాస్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా తమ నేతలకు ఈ మేరకు సూచనలు కూడా ఇచ్చారు.
ఈ నెల 19 లోగా పార్లమెంట్‌లో టీ బిల్లు ఆమోదం పొందుతుందని, దానికి అవసరమైన సహకారాన్ని అందరూ అందించాలని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ పై సిన్సియర్ గా వున్నారని, మజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. బిల్లు ఆమోదానికి తీవ్రంగా కృషి చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానని చెప్పినట్లు సమాచారం.