సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
posted on Feb 15, 2014 @ 10:36AM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించిన కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగలడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే ముందుగా కేంద్రం అనుమతి తీసుకోవాలని కేంద్ర న్యాయ శాఖ చెప్పింది. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు అసెంబ్లీలో బిల్లు పెడుతున్నట్లు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు సభలో గందరగోళం సృష్టించాయి. గవర్నర్ సూచనపై ఓటింగ్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేశాయి.
బిల్లును ప్రవేశపెట్టే తీర్మానానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. దీనికి 42 మంది వ్యతిరేకంగా, 27 మంది అనుకూలంగా ఓటు వేశారు. దీంతో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నందున బిల్లును అనుమతించడం లేదని స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టలేకపోవడంతో ఆయన మనస్తాపం చెందారు. తమ ప్రధాన లక్ష్యాన్నే చేరుకోలేనప్పుడు ఇక అధికారంలో ఉండటం అర్థ రహితమని భావించిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు.