కాంగ్రెస్ తన గోతిలో తానే పడిందా?

  అఖిలపక్ష సమావేశం పెట్టి చంద్రబాబును ఇరుకున బెట్టేమని చంకలు కొట్టుకొంటున్న కాంగ్రేసుకి నిన్న ఆయన ఆదిలాబాద్ జిల్లాలోచెప్పిన జవాబుతో కంగుతినే పరిస్తితి వచ్చింది. చంద్రబాబు ఏమన్నారంటే “నేను ఎప్పుడూ, ఇప్పుడూ కూడా తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడలేదు. అసలు, తెలంగాణాపై అఖిల పక్ష సమావేశం నిర్వహించమని నేనే స్వయంగా కాంగ్రేసుకి లేఖ వ్రాసాను. కానీ ఇంతకాలం తాత్సారంచేసి దానిని ఒక అస్త్రంగా చేసుకొని తమ తెలంగాణా యమ్పీలను లొంగదీసుకోవడమేగాకుండా, ఇప్పుడు వారేదో స్వయంగా ఆలోచించి అఖిలపక్ష నిర్ణయం తీసుకొన్నట్లు గొప్పగా చెప్పుకొంటున్నారు. మేము అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా పై మాపార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్తాము. అప్పుడు, తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది ఎవరో వాళనే నిర్నయించుకోమనండి చూద్దాము.”   ఇంకా అఖిల పక్షానికి రెండు వారాలు పైగా గడువుండగానే ఇలాగ చెప్పిన చంద్రబాబు, బంతిని కాంగ్రేసు కోర్టులోకి నేట్టేరు. అఖిలపక్ష సమావేశానికి, కాంగ్రేసు పార్టీ ఒక్కోపార్టీ నుండి ఎంతమందిని ఆహ్వానిస్తుందనేది, తెలంగాణా విషయంలో కాంగ్రేసు యొక్క చిత్తశుద్ధిని బయటపెట్టబోతోంది. ఒక వేళ, అది గనుక పార్టీకి ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది చొప్పున పంపించమని కోరినట్లయితే, తద్వారా తెలంగాణా విషయమై పార్టీలు బిన్నభి ప్రాయలు వ్యక్తం చేశాయని వంక చూపించి తెలంగాణాపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా కాలయాపనచేసే ఆలోచనలో ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతుంది.   అందువల్ల తప్పనిసరిగా, తెలంగాణా నేతలు కోరుతున్నట్లు ఒక్కో పార్టీ నుంచి ఒక్కొకరినే ఆహ్వానించవలసి ఉంటుంది. అప్పుడు, అన్నిపార్టీలు తెలంగాణా విషయమై తమతమ అభిప్రాయాలు ఖరాఖండీగా ప్రకటించవలసివస్తుంది. చంద్రబాబు దూకుడు చూస్తుంటే అఖిలపక్ష సమావేశంలోనే ‘జై తెలంగాణా!’ అనబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంతవరకూ, తే.దే.పా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ లపై నిందవేసి తెలివిగా తప్పించుకొంటున్న కాంగ్రేసుకి అప్పుడు ఆదారి మూసుకుపోవడమేగాక, వెంటనే తెలంగాణా విషయం పై ఏదో ఒక ప్రకటన చేయక తప్పని పరిస్తితి వస్తుంది. పైగా తెలంగాణా నేతలనుండి ఒత్తిడి కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది. అప్పుడు, కాంగ్రెస్ తెలంగాణా విషయంలో కాలపయనచేసే ప్రతిఒక్కరోజూ కూడా తెలంగాణాలో దాని ఉనికికి ప్రశ్నార్ధంగా మార్చబోతుంది. అసలుకే మోసం వచ్చే పరిస్తితులు చేజేతులా తెచ్చుకోవాలో లేక ఎదో ఒక సానుకూల ప్రకటన చేసేసి వెంటనే ఎన్నికలకి వెళ్లిపోవడమో చేయాల్సి ఉంటుంది కాంగ్రేసుకి. కాంగ్రేసుకి ఇది ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ లాగ తయారవుతుంది. ఇంకా చెప్పాలంటే తే.దే.పా.కోసం తవ్విన గోతిలో తనేపడేట్లు ఉందిప్పుడు కాంగ్రెస్ పరిస్తితి.

తెలంగాణా ఫై జగన్ దారెటు ?

  ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా ఫై అఖిల పక్ష సమావేశం జరగనున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయం ఫై అంతటా ఉత్కంట నెలకొని ఉంది. తెలంగాణా ఫై ఏదో ఒక నిర్ణయం తేల్చి చెప్పాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఆ పార్టీకి తలెత్తింది. తమ పార్టీ తెలంగాణా ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుందని, ప్రత్యెక రాష్ట్రాన్ని అడ్డుకోదని, ఆ పార్టీ నేతలు ఇంత కాలం చెపుతూ వచ్చారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని కూడా వారన్నారు. అయితే, తమ పార్టీకి తెలంగాణా విషయంలో ఓ స్పష్టమైన వైఖరి ఉందని ఈ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు అంటున్నారు. సీమంధ్ర నేతలు మాత్రం ఈ విషయంలో స్పష్టంగా ఓ ప్రకటన చేయలేకపోతున్నారు. అఖిల పక్ష భేటీలో తమ పార్టీ ఓ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందని, ఆ పార్టీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పాల్సిన పని లేదని కూడా ఆయన అన్నారు. కేంద్రమే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను ఇచ్చేదీ, తెచ్చేదీ కాదని ఆయన అన్నారు. ఈ రోజు జరగనున్న పార్టీ సమావేశంలో ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

టి.అఖిలపక్షంతో ఇబ్బందుల్లో చంద్రబాబు ?

    తెలంగాణా ఫై అఖిల పక్షం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్రంలో ప్రతి పక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఇబ్బందుల్లో పడింది. తెలంగాణ ఫై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలున్నాయని, అందు వల్ల కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోదని ఇంత కాలం భావిస్తూ వచ్చిన చంద్ర బాబు, ఇప్పుడు అదే జరగడంతో ఈ విషయంలో తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. టిడిపి తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం తమ నేత తెలంగాణా కు అనుగుణంగా నిర్ణయం తీసుకొంటారని చెబుతున్నారు. తమ పార్టీలోని మూడు ప్రాంతాల నేతలు సమావేశం అయి ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ పార్టీ నేతలంతా,తమ ప్రాంతాలకు తగినట్లుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ తరుణం లో మూడు ప్రాంతాల నేతలు ఒక్క చోట కూర్చుంటే ఏకాభిప్రాయం ఎలా సాధ్యపడుతుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఒక వేళ ఈ సమావేశానికి ఒక్కరినే పంపించాల్సి వస్తే, బాబు ఆంధ్ర నాయకున్ని పంపిస్తారా లేక తెలంగాణా నేతను పంపిస్తారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్ధకం గానే మారింది. చాలా కాలం సమైఖ్య వాణిని వినిపించిన తెలుగు దేశం ప్రస్తుతం తీసుకొనే నిర్ణయం ఫై అంతటా సస్పెన్స్ నెలకొని ఉంది. ఏది ఏమైనా, చంద్ర బాబు నాయుడు కు కీలక సమయం వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. 

పురందేశ్వరి ఫై షర్మిలా పోటీ ?

    వచ్చే ఎన్నికల్లో ఎన్ టి ఆర్ కుమార్తె, కేంద్ర మంత్రి పురందేశ్వరి ఫై పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జగన్ సోదరి షర్మిలా బలంగా భావిస్తోన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కడప నుండి పోటీ చేయాలని షర్మిలా భావించినప్పటికీ, ఆ స్థానం నుండి అవినాష్ రెడ్డిని పోటీకి దింపాలని జగన్ మోహన్ రెడ్డి దాదాపు తుది నిర్ణయం తీసుకోవడంతో షర్మిలా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుండి మంత్రి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె తిరిగి ఇక్కడ నుండే పోటీకి దిగే పక్షంలో ఆమెఫై పోటీకి దిగాలని షర్మిలా భావించారు. అయితే, అక్కడ నుండి పోటీ చేయాలని టి.సుబ్బరామి రెడ్డి కూడా పార్టీ అధిష్టానంఫై వత్తిడి తెస్తుండడంతో పురందేశ్వరి స్థానం ఒంగోలుకు మారే అవకాశం ఉంది. ఒక వేళ పురందేశ్వరి ఒంగోలు నుండి పోటీ చేయడం ఖరారు అయితే, షర్మిలా కూడా తన స్థానాన్ని ఒంగోలుకే మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుండి ఈ ఇద్దరు మహిళా నేతలు పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

గాలికి ఈడి షాక్: 884 కోట్ల ఆస్తుల జప్తు

    అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కి ఈ డి గట్టి షాక్ ఇచ్చింది. 884 కోట్ల రూపాయల మేర అక్రమ మైనింగ్ కు పాల్పడ్డాడని తీర్మానించిన ఈ డి దానికి సమానమైన ఆస్తులను బ్రహ్మణీ స్టీల్స్ నుండి జప్తు చేసింది. సిబిఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీట్ ఆధారంగా ఈ డి ఈ జప్తులను చేసింది. అక్రమ మైనింగ్ తో పాటు, ఫెమా నిభందనలు ఉల్లంఘించడం కూడా ఈ డి తీసుకొన్న ఈ చర్యకు కారణంగా తెలుస్తోంది. బ్రహ్మణీ స్టీల్స్ కు చెందిన 88 కోట్ల 41 లక్షల 30 వేల షేర్లు, హెలికాప్టర్ జప్తు చేయబడిన వాటిలో ఉన్నాయి. ఈ ప్లాంటుకు చెందిన భూములు, అనేక రకాల యంత్ర సామగ్రి అమ్మడం, వేరొక చోటకు తరలించడం, లీజుకు ఇవ్వడం చేయరాదని ఈ డి ఆదేశించింది. ఓబులాపురం కేసులో బెంగుళూరు జోనల్ యూనిట్ ఈ డి అధికారులు దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. కేసు విచారణ అంచలంచలుగా కొనసాగుతుందని ఈ డి అధికారులు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ కి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఆస్తుల జప్తుతో గాలి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఒక సమయంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి ప్రస్తుత సంక్షోభం నుండి ఎలా గట్టేక్కుతాడో వేచి చూడాల్సిందే.   

‘అఖిలపక్షం’ ఫై గాలి ఆసక్తికర వ్యాఖ్యలు

    డిసెంబర్ 28 న తెలంగాణా ఫై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించడం అందరికీ సంతోషమే. అయితే, ఈ అంశం ఫై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. ఎఫ్ డి ఐ లఫై ఓటింగ్ లో ఓడిపోతామన్న భయంతోనే ఈ తేదీని ప్రకటించారనీ, ఈ నిర్ణయం వల్ల ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఎలాంటి ముందడుగు ఉందనేది ఆయన మాటల్లోని సారాంశం. శ్రీ కృష్ణ కమిటి వేసి హడావుడి చేసినట్లే, ప్రస్తుత తేది ఉందనీ ఆయన అన్నారు. ఒక్క సారి గతాన్ని పరిశీలిస్తే, ముద్దు కృష్ణమ నాయుడు మాటల్లో ఎంతో నిజం ఉందని అర్ధమవుతుంది. తెలంగాణా ఫై రాష్ట్రపతి ప్రసంగంలో చోటు, శ్రీ కృష్ణ కమిటి వేసి చివరకు దానిని కూడా పక్కన పెట్టడం, ఇంకా ఒకటీ, అరా ప్రయత్నాలు కూడా చేసి చివరకు ఏకాభిప్రాయమే శరణ్యం అనడం వంటివి చూస్తుంటే, నాయుడు మాటల్లో ఎంతో నిజం ఉందని అనిపిస్తోంది. ఏది ఏమైనా గాలి మాటలు నిజం కాకూడదని, ఈ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఓ స్పష్టత వస్తుందని ఆశిద్దాం.

గాలి, జగన్ లకు 19 వరకు రిమాండ్ పొడిగింపు

  అలుపెరగని ‘బెయిలు పోరాటం’ చేస్తున్న జగన్ మరియు గాలి జనార్ధన్ రెడ్డీల రిమాండ్ గడువు ఈ రోజు ముగియడంతో వారిద్దరినీ మళ్లీ సిబీఐ కోర్టు ముందు ప్రవేశపెట్టవలసి వచ్చింది. గత సెప్టెంబరులో జైలు బయట కాలు పెట్టిన వారిద్దరూ మళ్లీ ఇదే బయటకి రావడం. జైలులో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్నపటికీ, నేడు వీరికేసులను విచారిస్తున్న సిబీఐ జడ్జి శ్రీ దుర్గ ప్రసాద్ మూడు రోజులు శలవు మీద వెళ్ళడంతో, వీరందరినీ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం లేని గగన్ మహల్ సిబీఐ కోర్టులో ప్రవేశ పెట్టవలసి రావడంతో, అందరూ జైలు బయట కాలుపెట్టే అవకాశం పొందేరు. జగాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అతని పార్టీ కార్య కర్తలు, పరిచయస్తులూ కూడా సిబీఐ కోర్టుకి తరలి వచ్చేరు.   వారితో బాటు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి, రాజగోపాల్, అయోధ్య రామిరెడ్డి, ఆలీఖాన్ తదితరుల రిమాండ్ గడువు ఈరోజే ముగియడంతో వారినికూడా ఈరోజే కోర్టు ముందు ప్రవేశ పెట్టవలసి రావడంతో, హైదరాబాదు పోలీసులకి, చంచలగూడ జైలు అధికారులకి కత్తి మీద సామే అయింది వారి తరలింపు ప్రక్రియ. చంచలగూడ జైలు నుండి నాంపల్లిలో గగన్ మహల్ లో ఉన్న సిబీఐ కోర్టు వరకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్తగా చర్యగా, ఆ దారిలో ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయవలసి వచ్చింది అంటే వాళ్ళు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్ గా తీసుకొన్నారో తెలుస్తోంది.   వీరే గాక, విజయ సాయిరెడ్డి, ఐ.యేయ.స్. ఆఫీసర్లు బి.పి.ఆచార్య, శ్రీలక్ష్మి, మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు కూడా ఈ రోజే కోర్టుకి హాజరుకావలసి ఉంది. అయితే, శ్రీలక్ష్మి అనారోగ్య కారణాలవల్ల హాజరు కావడం లేదని ముందే తెలియజేసారు. ఈ రోజు కోర్టుకి హాజరయిన నిందితులు అందరికీ జడ్జి డిసెంబర్ 19వరకు రిమాండ్ పొడిగించడంతో మళ్ళీ అందరు తిరుగు ప్రయాణం అయ్యి, జైలుకి భోజనాల సమయానికల్లా జేరుకోగలిగేరు. జగన్ మాత్రం ఒక గంటసేపు తన భార్య భారతితో కోర్టు ఆవరణలోనే మాట్లాడుకోవడానికి కోర్టు అనుమతి పొందారు.

పాతబస్తీలో టెన్షన్

    బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగి రేపటితో 20 సంవత్సరాలు పూర్తి అవుతాయి. దీనితో పాత బస్తీ లో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో, ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపు పాతబస్తీ లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఆ ప్రాంతంలోని స్థానికులతో సహా వ్యాపారులు భయపడుతున్నారు. దీనితో ఈ ప్రాంతంలో స్కూళ్ళు, కళాశాలలతో సహా వ్యాపార సంస్థలూ రేపు స్వచ్చందంగా మూతపడే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. గత ఏడాది డిసెంబర్ 6 న ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకపోయినా , ఈ ఏడాది జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇటీవల భాగ్య లక్ష్మి ఆలయ కమిటీకి, ఎంఐఎం పార్టీ కార్యకర్తలకు మధ్య విభేదాలు తలెత్తి అవి అల్లర్లకు దారి తీయడమే ఈ అనుమానాలకు కారణం. పోలీసుల అనుమతి లేకుండా, ఈ ప్రాంతంలో ఎలాంటి సభలూ, సమావేశాలు నిర్వహించకూడదని నగర పోలీసు కమీషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. రేపు పాతబస్తీలో 144 వ సెక్షన్ అమల్లో ఉంటుందని కమీషనర్ ప్రకటించారు.

జయసుధకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ?

    సికింద్రాబాద్ శాసనసభ్యురాలు, సినీ నటి జయ సుధ తన పార్టీలో చేరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య తన విధేయతలను మార్చిన ఈ నటి ప్రస్తుతం జగన్ నుండి ఆహ్వానానికి ఎదురు చూస్తోంది.జగన్ పార్టీకి శాసనసభ్యుల అవసరం అధికంగా ఉన్న సమయంలో ముఖ్య మంత్రి పని తీరు బాగుందని ప్రకటిస్తూ, కాంగ్రెస్ లో ఉండిపోయిన జయ సుధ ను ప్రస్తుతం జగన్ తన పార్టీలోకి అనుమతిస్తాడా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకం గా మిగిలింది. రాజకీయ హేమాహేమీలంతా జగన్ పార్టీలో చేరుతున్న సమయంలో ఆ పార్టీ నుండి తనకు ఆహ్వానం లభించే విషయంలో జయ సుధ కు కూడా కాస్త సందేహాలే ఉన్నాయి. తనకు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత వై ఎస్ అని, ఆయనంటే తనకు అభిమానమని ప్రకటించే ఈ నటి ప్రస్తుతం జగన్ పార్టీ నుండి ఆహ్వానం కోసం ఎదురు చూస్తోంది. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నానని విచారం వ్యక్తం చేసిన జయ సుధ, జగన్ పార్టీలో చేరేందుకు మధ్య వర్తులను పంపించి వారి నుండి సమాధానం కోసం ఎదురు చూస్తోంది.

బాలకృష్ణుడితో కత్తులు దూస్తున్న కొడాలి నాని

      నిన్నగాక మొన్నటి వరకు నందమూరి కుటుంభానికి వీరవిధేయుడిగా గర్వంగా తనని పరిచయం చేసుకొనే గుడివాడ తే.దే.పా.శాసన సభ్యుడు కొడాలి నాని ఉన్నటుండి పార్టీ మార్చగానే మరిచిపోకుండా వెన్వెంటనే తన విధేయత కూడా మార్చుకొన్నాడు. అంతటితో ఆగితే పరవాలేదు. గాని, ఇన్నాళ్ళుగా ఏ కుటుంభానికి జై కొడుతూవచ్చేడో వాళ్ళపైనే తిట్లు లంకించుకొని వీరంగం ఆడేస్తున్నాడు. నిజం చెప్పాలంటే, అతనిని నందమూరి వంశం ఏనాడు అవమానపరచలేదు, సరి కదా అతనికి పార్టీలో తగిన హోదా కల్పించి గౌరవించింది. కేవలం తమ కుటుంబాన్ని అభిమానించే వాడని అభిమానంతోనే ఆ గౌరవం ఇచ్చారు అతనికి. అయినా, స్తానిక నేతలతో ఇమడలేక అతను పార్టీ విడిచి వెళ్ళిపోయాడు. అందుకు అతనిని ఎవరు కూడా తప్పుబట్టరు. అయితే, జగన్ అండ చూసుకొని తప్పుగా మాట్లాడటమే ఆతను చేసిన పెద్ద తప్పు. రాజకీయం గా ఏమి మాట్లాడిన ఎవరికీ అభ్యంతరం ఉండదు. గాని వ్యక్తిగతంగా విమర్శలకు దిగడమే ఆటను చేసిన పెద్ద తప్పు. అందుకే, కొంచెం ఆవేశాపరుడిగా పేరుబడ్డ బాలకృష్ణ అతని సంగతి తెలిసిన వెంటనే తనదయిన శైలిలో ఘాటుగా “అవును! గుడివాడ నా అబ్బ సొత్తే! మా పార్టీ సొత్తే! మా పార్టీ పేరు చెప్పుకోకుండా ఇక్కడ ఎవరు గెలువలేరు,” అని జవాబు ఇచ్చేసరికి పాపం నానికి ఎక్కడో కాలింది. నాని ఇప్పటికైనా కొంచెంతగ్గి ఉంటే అతనికే గౌరవం మిగిలేది. గాని ఆతను వెంటనే మరో అడుగు ముందుకు వేసి ఈ సారి బాలకృష్ణకే ‘బస్తీ మే సవాల్’ అంటూ ఎన్నికలలో అతని మీద పోటికి సిద్దం అని ప్రకటించేయడమే గాక, ఒక వేళ తను గాని అతని చేతిలో ఓడిపోతే రాష్ట్రం విడిచి వెళ్ళిపోతానని ‘ఇంద్రసేనారెడ్డి’ లా తొడచరిచి మరీ గుడివాడ నుండి సమరానికి సై అంటున్నాడు. గుడివాడే కాదు హోల్ సేల్ మొత్తం రాష్ట్రం లో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్దం అని మరో సవాలు కూడా విసిరి నందమూరి సింహం నోట్లో తలబెట్టేందుకు తయారయ్యాడు . ఏమిటీ...ఇదంతా జైల్లో చిప్ప కూడు తింటున్న జగన్ బాబు అండ చూసుకోనే...!

షర్మిలా ‘పాదయాత్ర’ రహస్యం ఏమిటి ?

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలా ‘పాదయాత్ర’ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి ? అలుపనేది లేకుండా ఆమె మూడు వేలకిలోమీటర్ల పాదయాత్ర ను నిరవధికంగా ఎలా చేస్తుంది ? ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. కండరాలు, కీళ్ళ నొప్పనేది లేకుండా ఆమె ఇంత సుదీర్ఘ యాత్ర చేయడానికి అసలు కారణం ఆమె ధరించిన హైటెక్ షూసే. జర్మనీలో తయారు చేయబడిన ఈ షూస్ ధరించడం వల్ల, ఎంత దూరం నడచినా, అలుపనేది ఉండదు. అంతే కాదు. ఇవి ధరించడం వల్ల పాదాల మీద వత్తిడి అనేది అస్సలు ఉండదు. వీటి వల్ల పాదాలకు తగిన భద్రత కూడా కలుగుతుంది. వీటి వల్లే షర్మిలా విరామం లేకుండా ఈ యాత్ర చేయగలుగుతుంది.

చెన్నారెడ్డి కి నివాళులర్పించని కిరణ్ ?

    రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 16 వ వర్ధంతికి నివాళులర్పించడానికి ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమయం దొరకలేదా లేక కావాలని ఆ కార్యక్రమానికి హాజరు కాలేదా?   తాను ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానించానని శాసనసభ్యుడు, ప్రకృతి వైపరీత్యాల కమిటీ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో అన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న తాను స్వయంగా పిలిచినా కిరణ్ రాకపోవడాన్ని శశిధర్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, శాసనసభ కార్యక్రమాల వల్ల కిరణ్ ఇందిరా పార్కు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని కిరణ్ శిబిరం వెల్లడించింది. రాష్ట్రంలో ముఖ్య మంత్రి పదవి నుండి కిరణ్ ను తొలగించాలని శశిధర్ రెడ్డి ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారని కిరణ్ శిబిరం అభిప్రాయంతో ఉంది. శశిధర్ రెడ్డితో విభేదాలుండడం వల్లే కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని భావిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్, పిసిసి అధ్యక్షుడు, అనేక మంది మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కిరణ్ ఒక్కడే  హాజరు కాకపోవడం కచ్చితంగా హై కమాండ్ దాకా వెళ్లి ఉంటుందనేది మాత్రం స్పష్టం. రాజకీయంగా అభిప్రాయబేధాలెలా ఉన్నా, ముఖ్య మంత్రి స్థాయి వంటి వ్యక్తి మరో ముఖ్యమంత్రి వర్ధంతి  కార్యక్రమానికి  నగరంలో ఉండి కూడా హాజరు కాకపోవడం మాత్రం పలు విమర్శలకు తావిస్తోంది.  

డామిట్ కధ అడ్డం తిరిగిందేమిటి?

    నిన్న అర్థరాత్రి వరకు జరిగిన శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాలు కూడా ఊహించని విదంగా ఎస్సీ. ఎస్టీ బిల్లుపై ఇర్రుకొని బయట పాడేందుకు నానా తంటాలు పడ్డాయి. రోజంతా వాడిగా వేడిగా సాగిన సమావేశాలతో సభలో సభ్యులు ప్రజలకోసం చలికాలంలో కూడా చెమటలు కక్కుతూ మరీ తమ ఉపన్యాసాలతో సభని హోరేత్తించేసారు. ఇక బిల్లు సభ ఆమోదం పొందడమే తరువాయి అనుకొంటుండగా, తె.దే.ప. బిల్లులో 12వ క్లాజుపై సవరణ ప్రతిపాదించడంతో అసలు డ్రామా మొదలయింది. అంతవరకూ ఆ బిల్లు తెచ్చిన కీర్తి తన ఖాతాలో జమ చేసుకోవాలనుకొని తహతహలాడిన కాంగ్రెస్, తె.దే.పా. ప్రతిపాదనతో ఒక్కసారిగా సభలో కంగుతింది. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తె.దే.ప. ప్రతిపాదనని యెంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, సభాద్యక్షుడు నాదెండ్ల మనోహర్ తె.దే.ప. కోరిన విదంగా బిల్లుపై ఓటింగ్ కి అనుమతించడంతో ముఖ్య మంత్రి మరోసారి కంగుతిన్నట్లు కనిపించేరు. తీవ్ర ఉద్రిక్తతకిలోనయిన ఆయన స్పీకర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు కూడా. కాని సభలో ఓటింగ్ తప్పలేదు. తాము ప్రతిపాదించిన సవరణలకు మద్దతుగా సభలో అన్ని ప్రతిపక్ష పార్టీలు నిలబడేసరికి తె.దే.పా. కాంగ్రెసును ఓడించడం ఇక చాల తేలిక అని భావించింది. గాని, వై.యస్.ఆర్. కాంగ్రేసుకు చెందిన విజయమ్మ కొంచెం తతపటాయిన్చుతూ తె.దే.పా. ప్రతిపాదనకి మద్దతుగా లేచినిలబడగానే సభలో కొంచెం గందరగోళం ఏర్పడింది. దానితో మొదట తీసిన లెక్కని పక్కని బెట్టి స్పీకర్ మళ్ళీ మరోసారి వోటింగ్ నిర్వహించినప్పుడు తె.దే.ప. ప్రతిపాదనకి అనుగుణంగా 47 ఓట్లు, దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రేసు సభ్యులు వేసిన 69 ఓట్లూ పోలవడంతో సభలో తె.దే.ప. ప్రతిపాదన వీగిపోయింది. దీనితో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది ముఖ్యమంత్రికి. కాంగ్రెస్ ని ఇరికిన్చామనుకొన్న తే.దే.పా. మరియు విపక్షాలు కాంగ్రేసు చేత యస్సీ ఎస్టీ వ్యతిరేకులుగా ముద్ర వేయించుకొని దొరికిపోయారు.  

అసెంబ్లీలో నానేటి సేసేది?

      “నాకు కంపూటరు రాకనే గదా మా తమ్ముడ్ని యిదేసం తీసుకేల్నాను. అయినా సొమ్ములు పోనాయి మరి నానేటి సేసేది? నానేటి గావాల్న జేసినాన ఇదంతా?” అని మన ప్రస్తుత పి.సి.సి. అద్యక్షుల వారు బొత్స సత్యనారాయణ గారు ఆనాడు వోక్స్ వ్యాగన్ కార్ల ఫ్యాక్టరీల వ్యహరంలో బాధ పడినట్లే, మళ్ళీ నేడు అయన శాసనసభలో తనని మాట్లాడనీయనప్పుడు అంతే ఇదిగా బాధ పడ్డారు పాపం.   శాసన సభలో ఎవరికివారు ఓ! ఒకటే ఇదిగా యస్సీ ఎస్టీ బిల్లు గురించి తమ జ్ఞానాన్ని ఇటు ప్రభుత్వానికి తద్వారా అటు ప్రజలకి తమ ఊకదంపుడు ఉపన్యాసాలతో తెగ పంచి పెట్టేస్తుంటే, చక్రం తిప్పగల నేర్పున్న తనకి ‘ఒక్క ముక్కయిన చెప్పు పాపం!’ అని శాసన సభలో అవకాశం కల్పించనందుకు మన బొత్స సత్యనారాయణగారు అలిగినట్లు టివి ఛానళ్ళు ఒకటే హోరెత్తిం చేయడమేగాక, అప్పుడే ఆయనకి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్య ఉన్న విభేదాల సీరియల్ కధల గురించీ చెప్పుకోస్తూ ఇప్పుడు కూడా కావాలనే అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండక పోవచ్చని కనిపెట్టేసి, ఇప్పుడు బొత్స ఏ విదంగా స్పందిస్తాడు? బ్రేక్ తరువాత చూడండి అంటూ మరో సస్పెన్స్ సీరియల్ మొదలుపెట్టాయి.

గుడివాడ ఎవడబ్బ సొత్తు కాదు: బాలకృష్ణ

    హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రవేశం మొదలు ఆయన ఇక్కడి నుంచి పోటి చేస్తారని, అటు ఆయన అభిమానుల్లో కాకుండా సినీ,రాజకీయవర్గాల్లోనూ పెద్దగా చర్చ ఉండేది. కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, నేను ఈ జిల్లా నుంచే పోటి చేస్తానంటూ తెలిపారు. ప్రత్యేకించి ఎ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేదీ త్వరలోనే ప్రకటిస్తానాని బాలయ్య తెలిపారు. పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించే వారిని తాను హెచ్చరిస్తున్నానని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదన్నారు. అధిష్టానంపై ఎవరో కారుకూతలు కూస్తున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని రంగాలకు, వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. పార్టీ ద్వారా ఎదిగి అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తారా అని నిప్పులు చెరిగారు. గుడివాడ టిడిపి కంచుకోట అని, ఒకరు వెళ్లిపోయినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, కార్యకర్తలు తిరిగి వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించుకునేందుకు పాటుపడాలని కోరారు. పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. టిడిపి గుర్తుతో పదవి పొంది ఇప్పుడు విమర్శిస్తారా అని ఘాటుగా, ఒకింత ఆవేశంతో ప్రశ్నించారు. కొందరు బూటకపు ప్రకటనలతో రైతుల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీని వీడాలనుకున్న వారు సైలెంట్‌గా వెళ్లి పోవచ్చునని చెప్పారు.

చిరంజీవి వర్సెస్ సీఎం కిరణ్

    కాంగ్రెసు పార్టీలో ఇప్పుడు బిల్లు పోరు సాగుతోంది! తమ పార్టీకి దూరమవుతున్న ఎస్సీ, ఎస్టీలను దగ్గర చేసుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును సభలో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఘనత 'తమ'దిగా కాకుండా 'తన'దిగా చెప్పుకునే ప్రయత్నాలు రాష్ట్ర కాంగ్రెసు నేతలు చేస్తున్నారు. ఈ క్రెడిట్ నాదంటే నాదే అంటూ సీఎం కిరణ్, కేంద్ర మంత్రి చిరంజీవి, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. అసలు క్రెడిట్ సోనియాదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయ ణ ముక్తాయిస్తున్నారు.  సీఎం కిరణ్.. మాత్రం ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ అట్టడుగు వర్గాల కష్టనష్టాలను కళ్లారా చూశానని, ఆ అనుభవం నుంచే ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయిస్తున్న నిధులు దారి మళ్లకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని భావించానని చెప్పారు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టబద్ధతని వివరించారు. కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. పీఆర్పీని విలీనం చేసేప్పుడే ఎస్సీ, ఎస్టీ నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని.. సోనియాకి సూచించానని దానికి అక్షర రూపమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత అని స్పష్టం చేశారు. ఇలా ఎవరికి వారు చట్టబద్ధత ప్లాన్ తమదంటే తమదని చెబుతుంటే.. బొత్స సత్యనారాయణ మాత్రం ఇదంతా సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ క్రెడిట్‌గా పేర్కొంటున్నారు.  

ఏదో చేద్దామనుకున్నాను... ఏమీ చేయలేకపోతున్నా

    ‘‘ఏదో చేద్దామనుకున్నాను. కానీ ఏమీ చేయలేకపోతున్నాను. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. కానీ అసంతృప్తితోనే ఉన్నాను. నా నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఎంత ప్రయత్నించినా పనులు చేపట్టలేకపోయా. కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా వేయించలేక పోయాను’’ అని ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్యే జయసుధ ఆవేదన చెందుతున్నారు. నేతల్లో వ్యక్తిగత లాభం గురించే తప్ప వ్యవస్థను బాగుచేయాలన్న ఆలోచన కనిపించడం లేదని చెప్పుకొచ్చారు.   మొదట జగన్ పార్టీకి మద్దతు పలికి ఆయన దీక్షలకు హాజరయిన జయసుధ ఆ తరువాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సేవ చేయలేనిది ఏ పార్టీలో ఉంటే ఏం..కనీసం సేవ చేసే అవకాశం అయినా లభిస్తే ఏదో పార్టీలోకి మారినా ప్రయోజనం ఉంటుంది అని అన్నారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో ఉన్న క్రైస్తవుల ఓట్లను చూసి జయసుధను వైఎస్ రాజకీయాల్లోకి దింపారు. అక్కడ ఆ మతం అభ్యర్థి అయితే సులభంగా గెలవగలరని వైఎస్ ఊహించారు. మతానికి తోడు జయసుధ గ్లామర్ కూడా విజయానికి బాటలు వేసింది. సీనియర్ నటి అయిన జయసుధ మాటలు వింటుంటే రాజకీయాలలో అంత తృప్తిగా లేరని తెలుస్తూనే ఉంది.

కెవిపి కి మళ్ళీ పూర్వ వైభవం ?

      దివంగత వైఎస్ హయాంలో చక్రం తిప్పిన కేవిపి రామచంద్రరావు కు మళ్ళీ పాత రోజులు రానున్నాయా ? దీనికి సమాధానం అవుననే అనిపిస్తోంది. పార్టీలో రాహుల్ గాంధీ బాధ్యతలు మరింతగా పెరగడంతో, కెవిపి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి పూర్వ వైభవం పొందనున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దిగ్విజయ్ సింగ్ తిరిగి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో కెవిపి పార్టీలో ముఖ్య పాత్ర పోషించడానికి ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా కెవిపి ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయన పునరాగమనానికి అనువుగా ఉన్నాయి. ఒక వేళ రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంటూ జరిగితే, సి ఎం పదవి రేసులో ఉన్న మర్రి శశిధర్రెడ్డి, డి శ్రీనివాస్ లు ఆయనతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కెవిపి సన్నిహితుడుగా ముద్ర పడ్డ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఇటీవల సోనియా గాంధీ ని కలిసిన అనంతరం తిరిగి కెవిపి తో చర్చలు జరిపారు. వీరితోపాటు, లగడపాటి రాజ గోపాల్, కోమటిరెడ్డి, తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా కెవిపి తో చర్చలు జరుపుతుండటం చూస్తుంటే, ఆయనకు పూర్వ వైభవం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తన పునరాగమనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కెవిపి ఇప్పటికే చేసుకున్నారని, ఇక చక్రం తిప్పడమే తరువాయి అని వార్తలు వస్తున్నాయి. కెవిపి లాంటి సీనియర్ లు పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తే, పార్టీని వదలి వెళ్లాలనుకునే వాళ్ళకు ఆత్మ విశ్వాసం కలుగుతుందని కొంత మంది నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వై ఎస్ అనుయాయులు పార్టీని వదలి వెళ్ళకుండా చూసి, గోడ దూకుడు కార్యక్రమాలు ఆగాలనుకొంటే కెవిపి రామచంద్ర రావు కు పార్టీలో ముఖ్య పాత్ర ఇవ్వడం అవసరమని కోమటిరెడ్డి వంటి నేతలు దిగ్విజయ్ సింగ్ కు సూచించినట్లు తెలుస్తోంది.

విజయమ్మ తీరుఫై క్రిస్టియన్ల ఆగ్రహం

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత్రి వై ఎస్ విజయమ్మ క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందని ఈ మతానికి చెందిన వివిధ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   సాధారణంగా క్రిస్టియన్ లు విగ్రహారాధన, హారతులు వంటి వాటికి దూరంగా ఉంటారని, విజయమ్మ మాత్రం బైబిల్ చేతులో పట్టుకుని ఇలాంటి పనులు చేస్తోందని ఈ మత నాయకులు బిషప్ ఆర్ హర్రీ సెబాస్టియన్, జెరుసలెం ముత్తయ్య, సి ఎ డానిఎల్ లు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మ ఆసలైన క్రిస్టియన్ అయితే నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకుంటారని వారు ప్రశ్నించారు. వై ఎస్ కుటుంబం తమకు ఇబ్బందిగా మారిందని వారు అన్నారు. దివంగత వై ఎస్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో కూడా క్రిస్టియన్ లకు ఒరిగిందేమీ లేదని ఈ నాయకులు అన్నారు. తమ మతస్తులు ఇబ్బంది పడే ఉత్తర్వులను వై ఎస్ జారీ చేసారని వారన్నారు. వై ఎస్ జారీ చేసిన కొన్ని జీవోల వల్ల సుమారు 600 మంది క్రిస్టియన్లు జైలు పాలయ్యారని వారు వెల్లడించారు. జగన్ కూడా క్రిస్టియన్ లకు చేసిందేమీ లేదనీ, భవిష్యత్తులో చేసే అవకాశం కూడా లేదని వారన్నారు. రాజకీయనాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం ఇతర మతస్తుల మనోభావాలు గాయపడేలా ప్రకటనలు చేయడం మానుకోవాలని వారు సూచించారు. లేని పక్షంలో తీవ్రంగా ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు.