Read more!

పాతబస్తీలో టెన్షన్

 

 

బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగి రేపటితో 20 సంవత్సరాలు పూర్తి అవుతాయి. దీనితో పాత బస్తీ లో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో, ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపు పాతబస్తీ లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఆ ప్రాంతంలోని స్థానికులతో సహా వ్యాపారులు భయపడుతున్నారు. దీనితో ఈ ప్రాంతంలో స్కూళ్ళు, కళాశాలలతో సహా వ్యాపార సంస్థలూ రేపు స్వచ్చందంగా మూతపడే అవకాశం ఉంది.



ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. గత ఏడాది డిసెంబర్ 6 న ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకపోయినా , ఈ ఏడాది జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇటీవల భాగ్య లక్ష్మి ఆలయ కమిటీకి, ఎంఐఎం పార్టీ కార్యకర్తలకు మధ్య విభేదాలు తలెత్తి అవి అల్లర్లకు దారి తీయడమే ఈ అనుమానాలకు కారణం. పోలీసుల అనుమతి లేకుండా, ఈ ప్రాంతంలో ఎలాంటి సభలూ, సమావేశాలు నిర్వహించకూడదని నగర పోలీసు కమీషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. రేపు పాతబస్తీలో 144 వ సెక్షన్ అమల్లో ఉంటుందని కమీషనర్ ప్రకటించారు.