కోల్ కతా అగ్నిప్రమాదం లో 20 మృతి

        కోల్‌కతాలోని సూర్య సేన్ మార్కెట్‌లో ఓ గోదాంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కవగా దుకాణాల యజమానులు, పనిచేసేవారు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నించారు. సుమారు 20 అగ్నిమాపక యంత్రాలతో మూడు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాద స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంభాలకు రెండు లక్షల చొప్పున, గాయపడిన వారికి యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, మార్కెట్‌లో కాయకష్టం చేసి.. అలసిపోయి.. నిద్ర పోయిన కూలీలను అగ్నిజ్వాలలు బలిగొన్నాయి. ప్లాస్టిక్ వస్తువులు, కాగితాలు, వస్త్రాలకు నిప్పంటుకొని పొగలు సుడులు తిరగడంతో ఊపిరాడక.. తప్పించుకునే దారి కానరాక అక్కడ నిద్రించిన వారిలో ఎక్కువ మంది సజీవదహనమయ్యారు.    

అప్పుడే కేసు ముగించొద్దంటున్న జగన్ లాయర్లు?

  జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ ఉద్దేశ్యపూర్వకంగానే దర్యాప్తు పూర్తిచేయకుండా సాగదీస్తోందని, కనీసం ఇంతవరకు ఒక్క చార్జ్ షీటు కూడా కోర్టులో దాఖలు చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, సిబిఐ రెండూ కలిసి కుట్రపన్ని జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో ఇరికించారని, ఇంకెంత కాలం దర్యాప్తు చేస్తారని ప్రశ్నిస్తూ వచ్చిన జగన్ తరపు న్యాయవాదులు, ఈ రోజు జగన్ అక్రమాస్తుల కేసులో కోర్టులో అభియోగం నమోదు చేయడానికి సిబిఐ సంసిద్దత తెలిపినప్పుడు, వారు దానిని తీవ్రంగా వ్యతిరేఖించడం విశేషం.   కేసు దర్యాప్తు జరుగుతున్నఈ తరుణంలో అభియోగాలు నమోదు చేస్తే నష్టం కలుగుతుందని మాత్రం చెప్పారు. అది ఏవిధంగా నష్టమో మాత్రం వారు చెప్పలేదు. అందువల్ల, కోర్టు జగన్ కేసును వచ్చే నెల 13వ తేదికి వాయిదావేసింది.   బహుశః జగన్ కేసులో ఇప్పుడ సిబిఐ కోర్టులో అభియోగాలు నమోదు చేసినట్లయితే, కేసు విచారణ మొదలయి, జగన్ పై మోపబడిన అనేక అభియోగాలలో ఏ ఒక్కటి నిరూపింపబడినా కూడా జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తగా శిక్షలు ఎదుర్కోవలసి ఉంటుందని వారి ఆలోచన (భయం) కావచ్చును.   అయితే, ఈ రోజు కాకపొతే రేపయినా కోర్టులో అభియోగాల నమోదు తప్పదన్నపుడు మరి జగన్ తరపున వాదిస్తున్నన్యాయవాదులు ఎందుకు వద్దంటున్నారు? సిబిఐ ఉద్దేశ్యపూర్వకంగానే దర్యాప్తు పూర్తిచేయకుండా సాగదీస్తోందని ఆరోపిస్తున్న వారు, ఇప్పుడు సిబిఐని దర్యాప్తు పూర్తిచేయమని (కొనసాగించమని) కోరడంలో అంతర్యం ఏమిటి? ఈ ప్రశ్నకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు న్యాయ నిపుణులు  మాత్రమే సరయిన జవాబు ఈయగలరు.

జమ్మూలో హైదరాబాద్ యువకుడు అరెస్ట్

  హైదరాబాదు బాంబు ప్రేలుళ్ళు జరిగి ఇప్పటికి సరిగా వారం రోజులయినప్పటికీ, పోలీసులకు ఎటువంటి కీలక ఆధారం దొరకలేదు. ఒకవేళ దొరికినా అటువంటి సమాచారాన్ని మీడియాకు బహిర్గతం చేయడం అవివేకం అవుతుంది గనుక, దర్యాప్తు బృందాలు కీలక ప్రకటన ఏది చేయకపోవడంతో వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు (బుధవారం) జమ్మూలోని రంబాన్‌ అనే ప్రాంతంలో హైదరాబాదుకు చెందిన సలావుద్దీన్ అనే వ్యక్తిని అక్కడి పోలీసులు అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాంబు ప్రేలుళ్ళలో అనుమానితుడయిన అతను గతనెల 25 నుంచి నగరం నుంచి మాయమయినట్లు పోలీసులు చెపుతున్నారు.   ప్రస్తుత పరిస్థితుల్లో, హైదరాబాదు నుండి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు వచ్చిన యువతపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు దీనివల్ల అర్ధం అవుతోంది. కనుక, సాధారణ ప్రజలు సైతం ఈ సమయంలో అక్కడికి వెళ్లేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని బయలుదేరడం మంచిది. సరయిన కారణాలు, సరయిన గుర్తింపు కార్డులు, సరయిన స్థానిక పరిచయాలు లేకుండా సరిహద్దు రాష్ట్రాలకు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు వెళ్ళడం హైదరాబాదు యువతకు ఊహించని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది.

మా పార్టీకి అంత సీన్ లేదు: రామచంద్రయ్య

  ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలోకలిపేసి, రాష్ట్ర దేవాదాయ మంత్రి పదవితో పునీతం అయిన తరువాత కూడా, కాంగ్రెస్ పార్టీ తమతో ఇంకా ‘మైల’పాటిస్తూ దూరంగా ఉంచుతోందని మంత్రి సి.రామచంద్రయ్యగారు అప్పుడప్పుడు ఆరోపిస్తుంటారు. చిరంజీవి చొరవతో కిరణ్ కుమార్ రెడ్డి తనకో మంత్రి పదవి పడేసినంత మాత్రాన్న తనకు కొత్తగా పెరిగిన గౌరవం ఏమి లేదని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిన తరువాత కూడా తనకు, తన అనుచరులకు పార్టీలో తగినంత ప్రాధాన్యం ఈయట్లేదనే బాధ కూడా ఆయనలో ఉంది. అది అప్పుడప్పుడు అయన మాటలలో బయటపడుతుంటుంది.   మొన్న జరిగిన సహకార ఎన్నికలలో, తనను తన అనుచరులను పులుసులో కరివేపాకులా పక్కన పడేసి, అంతా తానయి చక్కబెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి పట్ల రామచంద్రుల వారికి కొంచెం ఆగ్రహం కలగడం సహజమే. అందుకే, ఈ సహకార ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి ‘టముకు’ వేసుకొంటున్న ఘన విజయమేమి తమ పార్టీ సాధించలేదని, అందువల్ల మరీ అంత సంతోషపడి ఉప్పొంగిపోవలసిన అవసరం కూడా లేదని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకు సాగిఉంటే ఇంతకంటే ఘన విజయం ‘నిజంగానే’ సాదించగలిగేవాళ్ళమని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఈ విషయంలో ప్రతిపక్షాలవారు దెప్పడం మరిచిపోయినా, ఆయన క్యాబినెట్ సహచరుడయిన సి.రామచంద్రయ్య శ్రమనుకోకుండా కిరణ్ నెత్తిన నాలుగు అక్షింతలు వేసి ఉన్న మాటను నలుగురికీ తెలియజెప్పారు.

మరో ఉగ్ర హెచ్చరిక

  హైదరాబాదులో బాంబు ప్రేలుళ్ళ తరువాత, ఉగ్రవాదముఠాలు సరి కొత్త పందాలో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇదివరకు ఎక్కడయినా ప్రేలుళ్ళు జరిపిన వెంటనే అది తమ ఘన కార్యమేనని ప్రకటించుకొనే వారు. కానీ, ఈసారి మాత్రం ప్రేలుళ్ళు జరిగిన తరువాత ప్రభుత్వానికో, పోలీసులకో లేక మీడియాకో తమ ఘన కార్యం గురించి తెలిపే బదులు, రెండు మూడు రోజుల తరువాత, ప్రతిపక్షనేత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి లేఖను పంపారు.   బహుశః కసాబ్, అఫ్జల్ గురుల ఉరి తరువాత, భారత ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల కటిన వైఖరి అవలంబించడమే దానికి కారణం అయి ఉండవచ్చును. అందువల్ల, సదరు ఉగ్రవాదులు తమ ప్రకటన విడుదల చేస్తూనే, తమ ఉనికిని గోప్యంగా ఉంచుకోవడమే మేలని వారు భావిస్తునట్లు ఉన్నారు.  ప్రేలుళ్ళు జరిపిన తరువాత తమ సభ్యులు సంఘటనా స్థలం నుండి సురక్షిత ప్రాంతాలకి చేరుకోన్నారని రూడీ చేసుకొన్నతరువాతనే లేఖలు పంపడం గమనించి నట్లయితే, వారు ఈ మద్యన తమ ఉనికిని ఎవరూ గుర్తించకుండా చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు అర్ధం అవుతుంది. వారు పంపే లేఖలు కూడా మీడియాకో, సంబందిత అధికారులకో కాకుండా వేరెవరికో పంపడం కూడా వారి జాగ్రత్తలలో భాగమే అయిఉండవచ్చును.    ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నహరిద్వార్ రైల్వే స్టేషన్, కాఠ్‌గోదామ్ రైల్వే స్టేషన్లను, హరిద్వార్‌లోని హర్‌కీ పారీ స్నాన ఘట్టం వంటి మత, పర్యాటక స్థలాలను పేల్చేస్తామని, హరిద్వార్ రైల్వే స్టేషన్ మాజీ సూపరింటెండెంట్ అమరీందర్ సింగ్‌కు జైషే మహమ్మద్ పేరుతో నిన్నఒక హెచ్చరిక లేఖ వచ్చింది. పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురు ఉరితీతకు ప్రతీకారం తీర్చుకొంటామని ఆలేఖలో వారు హెచ్చరించారు.   అయితే, అమరీందర్ సింగ్‌ తనకు గతంలో కూడా ఇటువంటి లేఖలు చాలానే వచ్చేవని, కాని అవి లష్కర్ ఉగ్రవాద ముఠాల నుండి వచ్చేవని, కానీ, జైషే మహమ్మద్ పేరుతో హెచ్చరిక లేఖ అందుకోవడం ఇదే మొదటిసారని అని మీడియాకి తెలిపారు. కానీ, ప్రస్తుతం అందిన లేఖలో చేతివ్రాతను పరిశీలిస్తే, అది పాత లేఖలతో సరిపోలుతోందని ఆయన చెప్పడం విశేషం. అంటే, జైష్ పేరు మీద వచ్చిన లేఖ కూడా లష్కర్ నుండే వచ్చి ఉండవచ్చునని భావించవచ్చును.   అంటే, ఆ రెండు సంస్థలు భారత్ పై దాడికి ఇప్పుడు చేతులు కలిపినట్లు అర్ధం అవుతోంది. అదే నిజమయితే, మనకు పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు.ఇప్పటికయినా మన ప్రభుత్వాలు రాజకీయాలను కొంచెం పక్కన పెట్టి, దేశ భద్రతపై దృష్తి సారిస్తే మంచిది.

రైల్వే బడ్జెట్‌ 2013-14: రాష్ట్రానికి కేటాయించినవి ఏమిటి

      కేంద్ర రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మంగళవారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కొన్ని తాయిలాలు ప్రకటించారు.  - విజయవాడలో కొత్త రైల్ నీరు బాటిలింగ్ ప్లాంట్  - కర్నూలులో రైల్వే వాగన్ వర్క్ షాప్  - విశాఖ స్టేషన్లో ప్రత్యేక సదుపాయాలు, విశాఖలో పర్యాటకులకు ఢిల్లీ తరహా ఏర్పాట్లు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ లాంజ్  - కాజీపేటలో నైపుణ్యాల శిక్షణా కేంద్రం - రైల్వేల్లో ఆర్థిక నిర్వహణ కోసం సికింద్రాబాదులో ప్రత్యేక శిక్షణా కేంద్రం  - సికింద్రాబాదులో రైల్వేల సమీకృత అభివృద్ధి శిక్షణా కేంద్రం కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులు కంభం - ప్రొద్దుటూరు మణుగూరు - రామగుండం కొండపల్లి - కొత్తగూడెం రాయ్‌పూర్ - కాచిగూడ డోర్నకల్ - మిర్యాలగూడ(డబ్లింగ్ ప్రతిపాదన) చిక్‌బల్లాపూర్ - పుట్టపర్తి మంచిర్యాల - అదిలాబాద్ మదనపల్లి - శ్రీనివాసపురం  

రైల్వే బడ్జెట్‌ 2013-14 హైలైట్స్

      దేశాన్ని ఏకం చేయడంలో రైల్వేలదే కీలక పాత్రని, దేశాభివృద్ధిలో భారతీయ రైల్వే పాత్ర గణనీయమైందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ పేర్కొన్నారు. రూ. 5.19 లక్షల కోట్లతో 2013-14 రైల్వే బడ్జెట్‌ను మంగళవారం మధ్యాహ్నం బన్సాల్ లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రజల ఆకాంక్షను బడ్జెట్ ప్రతిబింభిస్తుందన్నారు. కొత్త ప్రాజెక్టులు, రైళ్ల డిమాండ్లు ఎన్నో ఉన్నాయని బన్సాల్ తెలిపారు. రైల్వే బడ్జెట్‌లో ముఖ్యాంశాలు : * విజయవాడ సహా ఆరు చోట్ల మంచినీటి ప్లాంట్లు. * విశాఖలో పర్యాటకుల కోసం లగ్జరీ లాంజ్. * సికింద్రాబాద్‌లో ఎక్సిక్లూజివ్ సెంట్రలైజ్డ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్. * కర్నూలులో రైల్వే వర్క్ షాప్. * కాజీపేట సహా 25 ప్రదేశాల్లో శిక్షణా కేంద్రాలు. * కాలం చెల్లిన 17 రైల్వే బ్రిడ్జ్‌ల స్థానంలో ఈ ఏడాది కొత్తగా వంతెనలు నిర్మిస్తాం. * మహిళా ప్రయాణికుల భద్రత కోసం మరో ఎనిమిది కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. * మెట్రో నగరాల లోకల్ రైళ్లలో మహిళా బోగీల్లో మహిళా పోలీసులు. * ఆర్‌పీఎఫ్‌లో ఇకపై 10 శాతం మహిళలు. * ఎంపిక చేసిన రైళ్లలో అత్యంత విశాలవంతమైన కోచ్‌లు. * ప్రధాన రైళ్లలో ఉచిత వైఫై సౌకర్యం. * టికెట్ బుకింగ్ ఆధార్‌తో అనుసంధానం * వికలాంగులు, వృద్ధుల కోసం 179 ఎక్స్‌లేటర్లు, 400 లిఫ్టులు. * రైల్వే స్టేటస్‌ను చెప్పే ఎస్ఎమ్ఎస్ వ్యవస్థ * నాణ్యమైన, శుభ్రమైన ఆహారం కోసం చర్యలు. * కేంద్రీకృత కేటరింగ్ వ్యవస్థకై టోల్‌ఫ్రీ నెంబర్‌ను మొదలు పెట్టాం. * విద్యార్థులకు భారత చరిత్రను వివరించేందుకు రైల్వేలు ప్రయత్నం. * చారిత్రక ప్రదేశాల పర్యటనకు ఆజాద్ ఎక్స్‌ప్రెస్. * ఆజాద్ ఎక్స్‌ప్రెస్‌లో విద్యార్థుల చార్జీల్లో రాయితీ. * సరిహద్దులో రైల్వేలైన్లు అత్యంత ప్రాధాన్యం. * రాజస్థాన్ - భిల్వాడలో మెమో కోచ్ ఫ్యాక్టరీ. * రాయబరేలీలో కోచ్ ఫ్యాక్టరీ, ఇప్పాత్ నిగమ్‌తో ఒప్పదం. * రైల్వేలో ఈ ఏడాది లక్షన్నర ఉద్యోగాలు భర్తీ. * రైల్వేలో సౌర, పవన విద్యుత్ వినియోగానికి ప్రాధాన్యత. * రైల్వేల్లో ఇకపై గ్రీన్ ఎనర్జీ. * ఒలింపిక్ పతక విజేత లకు, ద్రోణాచార్య కోచ్‌లకు రైల్వేల్లో ప్రత్యేక పాస్‌లు. * స్వాతంత్య్ర సమర యోధుల పాసులు మూడేళ్లకోసారి రెన్యువల్. * ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాం. * ప్రభుత్వాన్ని ఈ ఏడాది అదపసే నిధులు అడగడం లేదు. * ప్రధానంగా 361 పెండింగ్ ప్రాజక్టులకు నిధులు విడుదల చేస్తాం. * ఈ ఏడాది ప్రయాణికులపై చార్జీల మోత లేదు. * రైల్వేకు ఉపాధి హామీ అనుసందానం. * సూపర్ ఫాస్ట్ రైళ్లలో రిజర్వేషన్, క్యాన్సలేషన్ చార్జీల పెంపు. * సరుకు రవాణా చార్జీలు ఐదు శాతం పెంపు. * ఇండిపెండెంట్ టారిఫ్ రెగ్యులేటరీ అథారిటీ ప్రతిపాదన. * ఈ ఏడాది 12 వందల కి.మీ విద్యుదీకరణ * 2013-14లో 500 కి.మీ కొత్త లైన్లు, 750 కి.మీ డబ్లింగ్ లక్ష్యం. * పుణ్యక్షేత్రాల కోసం కొత్త రైళ్లు. * కొత్తగా 27 ప్యాసింజర్ రైళ్లు, 67 ఎక్స్‌ప్రెస్ రైళ్లు.

జగన్ మేనమామ రవీంద్రనాథ్ కి రిమాండ్

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి సహకార ఎన్నికల్లో ఫోర్జరీకి పాల్పడిన కేసులో కడప కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ రోజు ఉదయం ఆయన కోర్టులో లొంగిపోయారు. రవీంద్రనాథ్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు దానిని వాయిదా వేసింది. కాగా అంతకుముందు రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఉదయం కడప జిల్లా కోర్టు ఎదుట లొంగిపోయారు. సహకార ఎన్నికల్లో ఫోర్జరీకి పాల్పడ్డారని రవీంద్రనాథ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ఛీటింగ్, ఫోర్జరీ కేసు నమోదయింది. దాంతో ఆయన అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు.  

కత్తులు పై కాంగ్రెస్ ఫైర్: బాబు ఎదురు దాడి

  గత146 రోజులుగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు, తరచూ సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం పార్టీవరకే పరిమితమయిన ఆయన విమర్శలు క్రమంగా వ్యక్తిగత విమర్శలకి కూడా విస్త్రుతించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్ లపై గత కొద్దికాలంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.   ఆయన తమ కుటుంబ సభ్యులపై చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవధ్యక్షురాలు విజయమ్మ ఆయనపై పరువు నష్టం దావా వేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.   మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గుంటూరులో తన పాదయాత్ర లో గీత కార్మికులను, రైతులను ‘కత్తులు కొడవళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీని నరకండి’అంటూ నోరుజారడంతో కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించడమే కాకుండా, బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.   అయితే తానూ ఆవేశంలో ఏదో నోరుజారానని ఒప్పుకొని ఉంటే, ఆయన చంద్రబాబే కాదు గనుక, కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడి చేస్తూ “రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నేను ఆవేశంగా మాట్లాడిన మాటలను పట్టుకొని నా మీదే కేసులు పెడతామని బెదిరిస్తారా? మీ బెదిరింపులకి భయపడను. రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం అవసరమయితే జైలుకి కూడా వెళ్లేందుకూ నేను సిద్ధమే. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి చూస్తాను,” అంటూ సవాలు విసిరారు.   కాంగ్రెస్ వారు ఆపని ఎలాగూ చేయరని తెలుసు గనుక ఆయన వారిని ఆ విధంగా సవాలు చేస్తున్నపటికీ, ఇకనయినా ఆయన తన అత్యుత్సాహాన్ని కొంచెం తగ్గించుకొని ప్రతిపక్ష నాయకుడిగా కొంచెం హుందాతనం ప్రదర్శించడం మంచిది.

హైదరాబాద్ పేలుళ్ళు: మతరాజకీయాల పై ధర్మాగ్రహం!

దిల్ షుక్ నగర్ దుర్ఘటనలు : మతరాజకీయాలపై గౌరవ న్యాయమూర్తుల ధర్మాగ్రహం! - ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]   "మానవజాతి ప్రగతిపథం వైపు సాగించిన ప్రతి ఒక్క అడుగూ మానవ రక్తతర్పణతోనే సాగింది. ఇంతగా నరరక్తం ప్రవాహం కట్టడానికి అన్ని మతాల ధర్మాచార్యులూ సమానంగా బాధ్యులే! ఏ ఒక్క మతమూ, ఏ ఒక్క మతాచార్యుడూ గర్వించవలసింది ఏమీలేదు''!                                                                            -  మహా పండిత రాహుల్ సాంకృత్వాయన్   [ముప్పై భాషలలో పండితుడైన త్రిపీఠికాచార్య "దర్శన్-దిగ్దర్శన్'' "ప్రాక్పశ్చిమ దర్శనాలు'' గ్రంథంలో విశ్వోత్పత్తినుంచి మానవ పరిణామక్రమ విశ్వదర్శనం]   ఎన్నైనా చెప్పండి, దొంగబుద్ధి దొంగబుద్ధే! దొంగతనానికి అలవాటుపడినవాడు తను చిక్కుబడబోయే సమయానికి వాడే ఎదురుబొంకుగా "దొంగ, దొంగ! పట్టుకోండి, పట్టుకోండి'' అంటూ అరుస్తాడు! అందుకే "రొయ్యల బుద్ధి'' సామెత కూడా పుట్టుకొచ్చి వుంటుంది. అందరూ చూడ్డానికి శ్రీవైష్ణవులేనట, పాపం ఆవగింజంత 'హింస' ఎరగనివాళ్ళు, జీడిగింజంత మాంసంముక్క ఎరగనివాళ్ళు, కాని రొయ్యల బుట్టమాత్రం ఖాళీ అయిపోయిందట! నేడు మన దేశంలోని ఇరువర్గాలకు చెందిన మతఛాందసులు [శాంతిచిహ్నాలయిన అది ఇస్లామ్ కు, లౌకికవాదంపై ఆధారపడిన ఆదిహైందవ ధర్మానికీ విరుద్ధమైన ఇస్లామ్ మతఛాందసులు, సెక్యులర్ వ్యతిరేకులయిన హిందుత్వ ఛాందసులూ] వందలాది సంవత్సరాలుగా విభిన్న జాతుల మధ్య విలసిల్లుతూ వచ్చిన లౌకిక ధర్మాలన్నింటికి చిచ్చుపెడుతూ సామాజిక జీవనాన్ని అల్లకల్లోలానికి గురిచేస్తున్నారు. ఈ "గురి''లో భాగమే హైదరాబాద్ జంటనగరాలలోని దిల్ షుక్ నగర్ లో [21-02-2013] జరిగిన దారుణమైన బాంబుపేలుళ్ళు. వాటిఫలితంగా ఎందరో బలికావడమూ. చాలాకాలంగా సాగుతున్న అమానుషమైన ఈ గొలుసుకట్టు పరిణామాలన్నీ దేశంలోని ఇరువర్గాల మతఛాందసులు రాజకీయపార్టీలుగానూ, దేశంలోని రెండు ప్రధాన రాజకీయపక్షాలు పదవులు ఆధారంగా 'వోటు'కోసం మతాన్ని ఆశ్రయించినందునా జరుగుతున్నాయని ఇప్పటికి కడచిన ఈ పక్షాల చరిత్రంతా నిరూపిస్తోంది. ఈ విషమ పరిణామాలను దేశంలోని న్యాయవ్యవస్థ. న్యాయమూర్తులూ గమనించకపోవడం లేదు. 'అగ్ర'వాదులకూ, 'ఉగ్ర'వాదులకూ బీజాలు ఎక్కడున్నాయో కూడా ఇంతకు ముందెప్పటికంటే కూడా అనుభవం మీద న్యాయమూర్తులు గ్రహించగలగడం విషాదపరిణామాల మధ్య విజ్ఞతాపూర్వకమైన గుర్తింపుగా మనం భావించాలి.   "లౌకికవాదం: మైనారిటీల హక్కులు, రాజ్యాంగచట్టం'' అన్న అంశంపైన "నల్సార్ న్యాయవిద్యాలయం''లో జరిగిన [23-02-2013] జాతీయస్థాయి చర్చాగోష్ఠిని ప్రారంభిస్తూ సుప్రీంకోర్టు గౌరవన్యాయమూర్తి ఇటీవల వరకూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టీస్ ఎం.బి.లోకూర్ విలువైన సందేశం యిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారతదేశంలో ఉన్నది మత ప్రసక్తిలేని రాజ్యాంగమైనందున ఈ విలక్షణమైన లౌకికవ్యవస్థను రక్షించుకోవలసిన బాధ్యత దేశప్రజలందరిపైనా ఉందని జస్టీస్ లోకూర్ అన్నారు. ఎందుకంటే, మతం, ప్రార్థనలు, నమాజులు భిన్నత్వంలో ఎకత్వంతో కొనసాగే నిత్యనైమిత్తికాలు మాత్రమే. వ్యక్తిగతమైన మనోనిబ్బరం కోసం మానసిక శాంతికోసం రాగద్వేషాలకు, ఉద్రేకాలకు దూరంగా ఆచరించే సంప్రదాయాలు మాత్రమే. అందుకే, ఈ గుర్తింపుగల భారతరాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన రాజ్యాంగ నిర్ణయసభవారు 1947లోనే అనంతశయనం అయ్యంగార్ మతసంస్థలకు రాజకీయ పక్షాలూ, రాజకీయపార్టీలకు మతసంస్థలూ దూరంగా ఉండాలని, ఈ రెండు వ్యవస్థలమధ్య ఎలాంటి పొత్తూ పొంతన ఉండడానికి వీల్లేదని శాసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు! కాని కాలక్రమంలో రాజకీయాధికార పక్షాలకూ, మతసంస్థలకూ తలల్లో పురుగు తొలిచి, కేవలం సీట్లకోసం, వోట్లకోసం ఒకరి పరిథిలోకి మరొకరు మెడలుదూర్చి దేశంలోని ప్రతీ సమస్యను మతద్వేషాలు చూసి, అందుకు అనుగుణంగా రాజకీయపక్షాలను, మతరాజకీయాన్ని మలుచుకుంటూ వచ్చి, జనజీవితాన్నే కకావికలుచేసి, సభ్యప్రపంచంలో భారతదేశానికి తలవంపులు తెచ్చిపెడుతున్నారు. ఈ పరిణామాల మధ్యనే జస్టీస్ లోకూర్ మరొకసారి రాజ్యాంగ లక్ష్యాన్ని గుర్తుచేయవలసి వచ్చింది. మతతత్వ ధోరణుల మూలంగానే సమాజంలో వైషమ్యాలు పెరుగుతున్నాయని, ఈ పరిణామాన్ని గుర్తించి విద్యార్థిలోకానికి ప్రాథమికస్థాయిలోనే పరమత సహనం గురించి, మతప్రసక్తి లేని లౌకికవాదం గురించీ అవగాహన కల్పించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేగాదు, "మతాలపేరిట రాజకీయాలు నడిపిస్తే ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమే''నని అదే సభలో ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ ఖాద్రీ హెచ్చరించారు. దేశంలో మతాలమధ్య చిచ్చుపెట్టిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వ్యూహం గురించి ముంబై ఐ.ఐ.టి. ప్రొఫెసర్ రాం పునియా గుర్తు చేశారు.   ఎందుకంటే, 1857 నాటి ప్రథమ భారత స్వాంతంత్ర్య సంగ్రామానికి తొలి పూజలందించిన హిందూ-ముస్లీం సమైక్యతా శక్తిని ఆగ్రహాన్ని చవిచూసిన సామ్రాజ్యవాదుపాలకులు భిన్నమతాల, భిన్న సంస్కృతులమధ్య దేశంలో నెలకొన్న ఐక్యతను ఛిన్నాభిన్నం చేస్తే తప్ప తమ పాలనను  కొనసాగించడం అసాధ్యమని భావించి ప్రజల్ని విభజించి, పాలించడం కోసం మతాలమధ్య చిచ్చుపెట్టారు. జాతివ్యతిరేక చర్యను అందిపుచ్చుకున్నవాళ్ళు మన దేశీయపాలకులే అయినా, అదే "విభజించి-పాలించే''దుర్మార్గపునీతిని మాత్రం కాలక్రమంలో అటు కాంగ్రెస్ పాలకులూ, బిజెపి పాలకులూ వదులుకోలేకపోతున్నారు. ఏ రాజకీయపక్షం పదవిలో లేకపోతే ఆ పక్షం, ఎదుటి శత్రుపక్షంతో ఎన్నికలలో పోటీకోసం లబ్ధిపొందడానికి మతసంస్థల్ని ఆశ్రయిస్తున్నారు; ఈ 'సౌకర్యం' కనిపెట్టిన మతసంస్థలూ రాజకీయ పక్షాల్ని, పక్షాలనూ ఆశ్రయిస్తున్నాయి! అందుకనే, చాలామందికి గుర్తు ఉందొ లేదో గాని - ఆ మధ్యకాలంలో భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ గా పనిచేసి రాజకీయపక్షాల్ని ఎన్నికల సమయంలో పాటించవలసిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పక్షాలను చీల్చి చెండాడిన వాడు శేషన్! ఆ సమయంలో బిజెపి ముఠా అనుసరిస్తున్న 'హిందుత్వ' ఎజెండాకు గండికొట్టి తాత్కాలికంగానైనా 'గాడి'లోకి తీసుకువచ్చిన వాడాయన! కేవలం 'హిందుత్వ'రాజకీయంతో వ్యవహరిస్తున్న బిజెపికి, ఆ పార్టీ నాయకత్వం రాజకీయపక్షంగా పదవీ స్వీకార సందర్భంలో "లౌకికవాదానికి కట్టుబడి ఉంటామ''నీ, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని చేసిన ప్రతిజ్ఞను శేషన్ గుర్తుచేసి, ఆ ప్రతిజ్ఞను విస్మరిస్తే బిజెపికి ఎన్నికలసంఘం యిచ్చిన రాజకీయ గుర్తింపును రద్దుచేస్తానని హెచ్చరించడంతో నోరుమూయవలసి వచ్చింది.   అందువల్ల నేటి విషమపరిస్థితుల్లో తక్షణం జరగవలసినపని - మతసంస్థలుగా అవతారమెత్తి కాలక్రమంలో అవే రాజకీయపక్షాలుగా [అటు 'మిమ్'నూ, ఇటు బిజెపీని] నమోదై కొనసాగడాన్ని నిషేధించాలి; వాటి సభ్యులకు దేశ సామాన్య పౌరులమాదిరిగానే వోటు హక్కు ఇతర హక్కులూ ఉండాలి. ఎవరి మతసంప్రదాయాల్ని వారు పాటించుకునే హక్కును గుర్తించాలి. కాని రాజకీయపక్షంగా మతం చాటున తలఎత్తే హక్కు మాత్రం ఉండరాదు. అలాంటి అనుబంధసంస్థలన్నింటికీ ఈ నిబంధన వర్తించాలి. మతసంస్థ ఒక రాజకీయపక్షంగా ఈ దేశంలో వ్యవహరించడానికి అవకాశం లేకుండా పార్లమెంటు నిర్దిష్టమైన రాజ్యాంగసవరణ చేయాల్సిన సమయం వచ్చింది. అయితే అదే సందర్భంలో, నిషేధాలతోపాటు ఈ పితపబుద్ధులతో, సమాజాన్ని భ్రష్టుపట్టించే పక్షాలు తలెత్తడానికి మూలకారణమైన ఆర్థిక అసమానతల నిర్మూలనపైన పాలనావ్యవస్థ కేంద్రీకరించాలి. "సమాజంలో ఉగ్రవాదం హెచ్చరిల్లడానికి ఈ అసమానతలే కారణమ''ని రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టీస్ నూతి రామ్మోహన్ రావు [23-02-2013] దిల్ షుక్ నగర్ లో కిరాతకాన్ని ప్రస్తావిస్తూ పాలకవ్యవస్థకు గుర్తుచేశారు. అయితే ఈ అసమానతలు తొలగడానికి అవసరమైన ఆదేశం రాజ్యాంగంలోని 38-39వ అధికరణలు పాలనావ్యవస్థకు పూర్తీ అవకాశం కల్పించినప్పటికీ పాలకపక్షాలు ఎందుకని వాటిని తు.చ. అమలు జరపకుండా నాటకమాడుతున్నాయో కూడా న్యాయమూర్తులు గ్రహించగలగాలి. సర్వత్ర ధనికవర్గ రాజకీయాలు రాజ్యమేలుతున్న సమాజాలలో పాలకుల ఆచరణ 'పెదవులు'దాటదని, మాటలు కోటలు దాటినా, కాలు గడపదాటదనీ గ్రహించాలి.   భారత నగరాలలో ఉగ్రవాదుల బాంబుపేలుళ్ళకు కారణాలు వెతికేవాళ్ళు ఎక్కడ ఘటన జరిగిందో అక్కడ క్షుణ్ణంగా వెతక్కుండా, మెడలురిక్కించి గంటలోనే బీహార్, నేపాల్ సరిహద్దుల దాకా సాగతీయడం విచిత్రం. పైగా తరచుగా ఈ దుర్మార్గాలకు గుజరాత్, మహారాష్ట్ర (బొంబాయి), కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే ఎందుకు కేంద్రబిందువులు కావలసివస్తోంది? ఈ నాల్గురాష్ట్రాలపైన ఉగ్రవాదులు ఎందుకు కేంద్రీకరించావలసివస్తోంది? వీటిలో మూడు రాష్ట్రాలలో బిజెపి, బిజెపి-శివసేన మతరాజకీయాలు తీవ్రస్థాయిలో కొనసాగుతుండడమే ఉగ్రవాదులూ అయా మేరకు ఈ రాష్ట్రాలలోనే కేంద్రీకరించవలసి వస్తోందని భావించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో పాత రజకార్ మత సంస్థే ఆ తర్వాత మజ్లీస్ ఇత్తిహదుల్-ఇ-ముస్లిమీన్ రాజకీయసంస్థగా రూపాంతరం చెందింది. బాబ్రీమసీదు విధ్వంసకాండ, అందుకు ప్రతిగా ఆ పిమ్మట ముంబై కల్లోలాలు ఆ దరిమిలా గుజరాత్ లో మోడీ ప్రభుత్వం మైనారిటీలను పెద్దసంఖ్యలో ఊచకోత కోయటం, గుజరాత్ హోంమంత్రి పాండ్యా, జస్టీస్ కృష్ణయ్యర్ విచారణ సంఘం ముందు హాజరై, మైనారిటీల ఊచకోతకు బిజెపి మోడి ఎలా పోలీసులను అనుమతించిందీ ఆ ఆదేశానికి ఒక సాక్షిగా హీరేన్ పాండ్యా నివేదించడం, ఆ దరిమిలా పాండ్యా హత్యకు గురికావడం, ఆ హత్య తబిశీళ్ళు అహ్మదాబాద్ లో ఉండగా, అందుకు కారకులయిన హంతకుల్ని హైదరాబాద్ లో వెతకడానికి గుజరాత్ పోలీసుల్ని పంపడం - నాడొక పెద్ద ప్రహసనంగా సాగింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని ఉగ్రవాదుల పేరిట అందరూ కలిసి ఒక హంతక నగరంగానూ, హత్యల అడ్డాగానూ సంబంధిత మత రాజకీయశాక్తులు మార్చివేశారు! ఇటువంటి వాతావరణంలో శాసనవేదికల ఉసురు సహితం మతోగ్రవాదుల చేతుల్లోనే ఉంటుంది! ఇందుకు ఉదాహరణ కోసం ఎక్కడికో వెళ్ళి వెతకనక్కరలేదు.   ప్రపంచయుద్ధానికి ముందు, ఆ యుద్ధకాండకొక 'మిష'ను సృష్టించవలసివచ్చి, నరమేధానికి కీర్తివహించిన నాజీ హిట్లర్, జర్మన్ పార్లమెంట్ భవనాన్ని (రీచ్గ్ స్టాగ్)కి తన పార్టీవాళ్ళతోనే తగులబెట్టించి, ఆ దుర్మార్గాన్ని కమ్యూనిస్టులపైకి నెట్టాడు! అలాగే గుజరాత్ లో 2002  నాటి మైనారిటీలపై జరిగిన ఊచకోతకు తులతూగే విధంగా 1938లో జర్మనీలోని మైనారిటీ యూదు జాతీయులని ఊచకోతకోసి, వాళ్ళ వ్యాపారాలను, ఇల్లనూ ధ్వంసం చేసిన క్రిస్తాల్నాక్డ్ (KRISTALLNACHT) ఉదంతం చరిత్రకు తెలుసు! 1925 నాటి ఇండియాలో ప్రస్తుతపు "హిందుత్వ''వాదుల నాటి నాయకులకు హిట్లర్ ముఠాతో ఉన్న సంబంధాలను జిఫర్లాటో అనే ప్రసిద్ధ చరిత్రపరిశోధకుడు వెల్లడించాడు. ఆ హిట్లర్ ఆరాధకులు ఆధునిక భారతంలో బిజెపికి పూర్వ ప్రేరకులయిన "హిందూ మహాసభ'' 'జనసంఘ్', ఆర్.ఎస్.ఎస్. లలో కూడ పొదిగిలేరని ఎవరైనా చెప్పగలరా? అందుకే మతం మానవతావాదాన్ని మాత్రమే అభిమతంగా ఆరాధించగలిగితే నవభారతం నవమన్మోహితంగా వృద్ధి కాగల్గుతుంది.   అందుకే మానవత, లౌకికధర్మం, సమతాధర్మం ఇరుసులుగా ఎదిగిన హైందవాన్ని మాత్రమే స్వామి వివేకానందుడు అభిమానించి, ప్రవంచించి ప్రచారం చేశాడు. చివరికి తప్పుదారి పట్టిన హైందవానికి తిరిగి పూర్వవైభవం తీసుకురావడం కోసం హైందవంలో సంస్కరణభావాలు వ్యాప్తి చెంది తీవ్రతరం కానంతకాలం దేశంలోని మైనారిటీలు అన్యమతాలను ఆశ్రయించడంలో తప్పులేదని కూడా వివేకానందుడు ఒకదశలో వకాల్తా పట్టవలసివచ్చిందని మనలోని మూఢమతులు గుర్తించాలి! అందుకోసమే ఆయన - సమాజశాంతిని భంగపరుస్తున్న కొందరు మతాచార్యులను సహితం దేశసరిహద్దుల్ని దాటించాలని చాటిచెప్పేవరకూ నిద్రపోలేదు! అప్పటిదాకా ఎదుటి పక్షంపైన అన్యమత ద్వేశంతోనే కారాలు మిరియాలు నూరుతూ తనవద్దకు వచ్చేసరికి "మత రాజకీయాల సమయంకాద''ని శ్రీరంగనీతులు వల్లించడమూ మనలోని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం. నేడు రెండు మత రాజకీయ సంస్థలూ లేదా రాజకీయ మతసంస్థలూ 2014 ఎన్నికలు లక్ష్యంగానే సమాజశాంతిని భగ్నం చేస్తున్నాయి.   ఒకవైపున కేంద్ర హోంమంత్రి షిండే దిల్ షుక్ నగర్ బాంబుపేలుళ్ళకు కారకులు ఎవరని తొందరపడి నిర్థారణ చేయరాదని చెబుతూండగా, పేలుళ్ళ వెనక పాకిస్తాన్ హస్తముందని బిజెపి నాయకుడు అద్వానీ నిర్ణయించేశాడు. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద దాడులకు తరచుగా గురవుతున్న సమయంలోనే అద్వానీ ఈ ప్రకటన చేయడం రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణకు దోహదం చేయదు; ఇదిలా ఉండగా "ఉగ్రవాదులకు శిక్షణ యిస్తున్న పాకిస్తాన్ కే వెళ్ళి క్షేత్రస్థాయిలోనే ఉగ్రవాదాన్ని మట్టుపెట్టిరావాలని "హిందూ దేవాలయాల ప్రతిష్ఠాపాన పీఠాధిపతి'' ఒకరు (23-02-2013) మహా ఉచిత సలహా యిచ్చాడు! ఇక ఒక బిజెపి సీనియర్ నేతగారు "హైదరాబాద్ లో ఇంటింటికీ సర్వే జరిపి ఉగ్రవాదులను వారికి ఆశ్రయిస్తున్నవారిని'' పట్టుకోవాలని కోరారు! అయితే ఇన్నేళ్ళుగా సవాలక్ష కేసుల్లో ఇరుక్కుపోయిన, లేదా ఇరికించిన డజన్లకొలదీ మైనారిటీల యువకులలో హెచ్చుమందిపైన ఒక్క ఆరోపణా రుజువు కాకుండా న్యాస్తానాలు ఎందుకు విడుదల చేయవలసి వచ్చిందో, పోలీసుల్ని ఎందుకు శాఠించవలసి వచ్చిందో బుద్ధిజీవులు ఆలోచించాలి! మనిషికి అభిమతమయినది మతం. కాని ఆ అభిమతాన్ని మానవీయంగా మలుచుకోగలగాలి. ఏది ఏమైనా విచారణల, సోదాల, అరెస్టుల పేరిట మైనారిటీలను వేధించడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా నిరసించాలి. అలాగే ఇరువర్గాలలోని మతఛాందసుల చర్యలను సకాలంలో తుంచివేయాలి. ఈ క్రమంలో మిలిటెంట్ మైనారిటీకన్నా, మౌనంగా మన్నుతిన్న పింజేరుల్లా ఉండే మెజారిటీ దేశసమైక్యతకు, దాని పరిరక్షణకు అసలు పెద్దచెరువు అని గ్రహించాలి.   మైనారిటీలపై మతవిద్వేషంతో సాగిస్తున్న మత రాజకీయశక్తుల ప్రచార ఫలితంగా దేశంలో ఏర్పడుతూ వచ్చిన భయకంపిత వాతావరణం చివరికి దేశ పోలీసువర్గాలను కూడా ప్రభావితం చేస్తోంది. విద్వేష ప్రచారానికి పరోక్షంగా చట్టబద్ధ వాతావరణం సృష్టి అవుతోంది. ఇది రెండు మతాలకూ చెందిన సాధారణ పౌరుల్నికూడా ప్రభావితం చేసి అనిశ్చిత పరిస్థితుల్ని అశాంతిని కల్గిస్తోంది. 1993లో అమెరికాలోని నల్లజాతి యువకులపై జరిగిన విద్వేష ప్రచారం ఫలితంగా ఒక యువకుడు హత్యకు గురైన ఉదంతంపైన విచారణ జరిపిన స్టీఫెన్ లారెన్స్ ఇంక్వయిరీలో నివేదిక "యూనిఫారమ్ లో ఉన్న పోలీసులు'' కూడా విద్వేష ప్రచారానికి లోనవుతారని వెల్లడించింది.   అస్సాంనుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ మత విద్వేష ప్రచారాల మూలంగా 1983 నుంచీ మైనారిటీల ధన, మాన, ప్రాణాల్ని ఎలా కోల్పోయారో "కంయూనలిజం కంబాట్'' పత్రిక సంపాదకురాలు, జస్టీస్ కృష్ణయ్యర్ ఆధ్వర్యంలో ఏర్పడిన మానవహక్కుల పరిరక్షణా సంస్థ సభ్యురాలు, గుజరాత్ మారణకాండకు గురైన కుటుంబాల తరపున ఈ రాజకీయ న్యాయస్థానాలలో పోరు సల్పుతున్న తీస్తా సెతల్వాడ్ అనేక ఉదాహరణలు పేర్కొన్నారు: 1983లో నెల్లి (అస్సామ్) పరిసరాలలో ప్రేరేపితమైన మతఘర్షణలలో 3000 మంది సామాన్య ముస్లీం పౌరులు హతులయ్యారు; ఈ హత్యాకాండలో పోలీసులు కూడా పాలుపంచుకోవడం న్యాయస్థానాల దృష్టిని ఆకర్షించింది; 1984లో ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో పనిగట్టుకుని 3000మంది సిక్కు పౌరులను చంపారు; 1987లో హషింపురా (ఉత్తరప్రదేశ్)లో 51 మంది ముస్లీంపోరులను రాష్ట్రీయ సాయుధ కాన్ స్టాబ్యులరీ గురిపెట్టి చంపారు; 1989లో భాగల్పూర్ (బీహార్) లో తలపెట్టిన ఊచకోతకు వేలమంది బలి అయ్యారు; ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారానలను కాలిఫ్లవర్ పంటభూమిలో ఆగమేఘాలమీద పూడ్చిపెట్టారు; 1992-1993లో 1200 మందికి పైగా హతులయ్యారు; 2008 నాటి కందమహల్ (ఒడిషా)లో జరిపిన మతవిద్వేషంతో జరిగిన ఘాతుకానికి సుమారు 100 మంది క్రిస్టియన్ పౌరులు బలయ్యారు; ఇక 2002లో గుజరాత్ లో మైనారిటీలపై జరిపిన హత్యాకాండలో 2000 మందికి పైగానే బలయ్యారు; ఈ అన్ని దుర్ఘటనలను పరిశీలించి విచారించిన కోర్టులూ, జ్యుడిషియల్ కమీషన్లూ మైనారిటీలకు వ్యతిరేకంగా పాక్షిక ధోరణిలో దేశంలోని పోలీసులు కూడా వ్యవహరిస్తున్నందుకు తీవ్రంగా విమర్శించవలసి వచ్చింది! దేశంలో మతవిద్వేష వాతావరణాన్ని పనిగట్టుకుని ఒక వర్గం మతరాజకీయపక్షం అన్యమతాలపైన సృష్టిస్తున్న ఫలితంగా ప్రజల భద్రతకు పూచీపడవలసిన పోలీసుయంత్రాంగం కూడా ఎలా ప్రభావితమయ్యే ప్రమాదముందో నిరూపిస్తున్నాయి. రాజ్యాంగం హామీపడిన సెక్యులర్ వ్యవస్థను రక్షించుకోవడం ద్వారా మాత్రమే ఇండియాను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుకోగలుగుతాం. మనకు కావలసింది గాంధీలు మాత్రమే గాని ఉన్మాదులూ, మతోన్మాద గాడ్సేలూ, కాశిం రజ్వీలూ కాదు!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు షాక్

        ఎమ్మెల్సీ ఎన్నికలు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు కొంచెం తీపిని..కొంచెం చేదుని మిగిల్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల్ని ఆయన గెలిపి౦చుకోగలిగిన...నల్గొండ,ఖమ్మం, వరంగల్ జిల్లాల అభ్యర్ధిని మాత్రం గెలిపి౦చలేకపోయారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి అభ్యర్ధిగా బరిలోకి దిగిన స్వామ్మిగౌడ్ 48,470 ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నియోజకవర్గం నుంచి పోటి చేసిన పాతూరి సుధాకరరెడ్డి 9324 ఓట్లతో గెలిచారు. టిఆర్ఎస్ అభ్యర్ధి వరదారెడ్డి ఓటమి మాత్రం కెసిఆర్ కు మింగుడు పడడంలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణవాదానికి ఇది రిఫరెండమ్ అని టిఆర్ఎస్ ప్రకటించింది. అయితే ఏ ఉద్యమంలోనూ పాల్గొనని వరదారెడ్డి కి ఈ అవకాశం ఇవ్వడం పై ఉపాధ్యాయులు హర్షించలేదని విమర్శలున్నాయి. కాని టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దెబ్బతింది. నల్లగొండ,ఇతర జిల్లాల నుంచి  టిఆర్ఎస్ ఓడిపోవడంతో తెలంగాణవాదానికి రిఫరెండమ్ అని ప్రకటించిన టిఆర్ఎస్ ఎలాంటి అబిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందన్నది ఆసక్తికరం.

పేలుళ్ళకు వాడిన బాంబులు ఇక్కడ చేసినవె

        హైదరాబాద్ లో జంట పేలుళ్లకు ఉగ్రవాదులు వాడిన బాంబులు ఇక్కడ తాయారు చేసినవేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నిపుణులు నిర్ధారించారు. పేలుళ్ల అనంతరం సంఘటనా స్థలంలో సేకరించిన ఆనవాళ్లు, నమూనాలు ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఈ మేరకు నివేదిక ఇచ్చారు. బాంబు తయారీకి అమ్మోనియం నైట్రేట్‌ని, కిలోన్నర దాకా ఈ పేలుడు పదార్థాన్ని ఉపయోగించారట.  బాంబుకు దాదాపు 15 వాట్ల పవర్‌ను ఉపయోగించారు. దానికి ఒక డిజిటల్ డిలే టైమర్‌ను అమర్చారు. టైమర్ పనిచేయడానికి, డిటోనేటర్ పేలడానికి పవర్‌ను అందించేందుకు ఒక స్విచ్‌ను ఏర్పాటు చేశారు. స్విచ్ ఆన్‌చేయగానే నిమిషం వ్యవధిలో లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే పేలేలా టైమ్ సెట్‌చేశారు. ఇక బాంబు పేలుడు ప్రభావం ఎక్కువగా ఉండేందుకు ఒక ప్లెక్సీ క్లాత్‌లో భారీగా మేకులు, గుండుసుదులు ఉంచి బాంబు చుట్టూ కట్టారు. సైకిల్ వెనుక ఉండే స్టాండ్‌లో ఈ బాంబును అమర్చారు. బాంబు కనపడకుండా మరో రెగ్జిన్ కవర్‌ను చుట్టారు. బాంబ్ పేల్చినా వారు సమీపంలో వున్నవారినే కాకుండ దూరంగా వున్న వారిని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.   బాంబు ఒకటి పేలిన వెంటనే సమీపంలో ఉన్న వారు మరణించడమో, గాయపడటమో జరుగుతుంది. మిగినవారు ప్రాణభయంతో   పరుగులు తీస్తారు. కొంచెం దూరంలో ఉన్న ప్రజలు ఏం జరిగిందన్న ఆత్రుతతో అక్కడి నుంచి చూస్తారు. అలా వచ్చి చూసేవారిని కూడా టార్గెట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అంశాలన్నిటి పై ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక అందించనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్, గాదె విజయం

        శాసనమండలిలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి సింహాద్రి అప్పన్నపై ఆయన 900 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.   టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ బరిలోకి దిగిన స్వామిగౌడ్ విజయం సాధించారు. స్వామిగౌడ్  తొలి రౌండ్‌లోనే డెబ్బయి శాతం ఓట్లు సాధించారు. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి కూడా ఆయన ఆధిక్యతలో ఉన్నారు. మూడో రౌండ్‌లో స్వామిగౌడ్ విజయం సాధించారు.   14 జిల్లాల్లోని ఆరు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆయా జిల్లాల్లో కొనసాగుతోంది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపును కరీంనగర్ అంబేడ్కర్ భవనంలో చేపట్టారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విశాఖలో జరుగుతోంది. ఉభయ గోదావరి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఓట్లను నల్గొండలో లెక్కిస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

వ్యభిచారం కేసులో సీరియల్ నటి అరెస్ట్

        సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతులని వ్యభిచారం లోకి దించుతున్న నిర్మాత కార్యాలయం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీస్ మేనేజర్ తో పాటు ఓ బుల్లితెర నటి, మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన రాజు అలియాస్ రాజేష్ నిర్మాతనని చెప్పి శ్రీనగర్‌ కాలనీ సమీపంలోని ప్రగతినగర్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. శ్రీ వెంకటకృష్ణ ఫిలిమ్స్ పేరిట కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. తాము నిర్మించే సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అందమైన అమ్మాయి కావాలని ఏడాది కాలంగా ప్రకటనలిస్తున్నాడు. ఈ ప్రకటనకు ఆకర్షితులై తన కార్యాలయానికి వచ్చిన వారిని వ్యభిచారంలోకి దింపుతున్నాడు. బుల్లితెర నటి పుష్పాంజలి (22) ఇలాగే అతని ఉచ్చులో పడింది. స్వప్న (24) అనే మరో యువతి కూడా వేషం కోసం వచ్చి వ్యభిచారానికి అలవాటు పడింది. రాజేష్ వ్యవహారంపై సమాచారం అందుకున్న పో లీసులు ఆదివారం అతని కార్యాలయంపై దాడి చేశారు. పుష్పాంజలితో పాటు స్వప్న, విటుడు పవన్‌కుమార్, కార్యాలయం మేనేజర్ లోకేష్ లను అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ పరారయ్యాడు. అతను 25 మంది యువతులను వ్యభిచార కూపంలోకి లాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాంగ్రెస్ కు గొట్టిపాటి షాక్, జగన్ పార్టీలోకి

      కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ ఈ రోజు జగన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా గొట్టిపాటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. అయితే కిరణ్ బుజ్జగింపులతో వెనక్కి తగ్గుతూ వచ్చిన అతను ఆఖరికి జగన్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేవారంతా మొదట జగన్ ని చంచల్ గూడ జైలులో కలవడం, ఆ తరువాత విజయమ్మ సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనుండడం జరుగుతున్నాయి.  జగన్ తనకు నియోజకవర్గ టిక్కెట్ ఇచ్చే విషయమై హామీ ఇచ్చారని,  తాను జగన్ వైపు వెళ్తున్నాననే ఉద్దేశ్యంతోనే అధికార కాంగ్రెసు పార్టీ తన క్వారీల పైన దాడులు చేయిస్తోందని గొట్టిపాటి ఆరోపించారు. జగన్‌ను అన్యాయంగా, కుట్రపూరితంగా అవినీతి కేసులో ఇరికించి జైలులో పెట్టించారని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు.  

ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీ స్టారర్ మూవీ?

  కొద్ది రోజుల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ కోసం స్పయిన్ దేశం వెళ్ళినప్పుడు, అక్కడ శ్రీను వైట్ల దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటిస్తున్న‘బాద్షా’సినిమా షూటింగు కూడా జరుగుతుండటంతో అందరూ విదేశంలో కలుసుకోగలిగారు. వారందరూ కలిసి తీసుకొన్న ఫోటోలను ఇంటర్నెట్ లో కూడా పెట్టడంతో వారి అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.   అయితే యన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానులకు అంతకంటే ఆనందమయిన వార్త మరొకటి పూరీ జగన్నాథ్ చెప్పబోతున్నాడు. యన్టీఆర్, అల్లు అర్జున్ లను పక్కపక్కన చూసిన ఆయనకి వారిద్దరితో కలిపి ఒక మల్టీ స్టార్ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడమే తడువు, అతను వారిని అడగడం వారు మరో ఆలోచన లేకుండా పూరీకి ఒకే చెప్పేయడం జరిగిపోయాయి. అంటే త్వరలోనే ఇద్దరు పెద్ద హీరోలు యన్టీఆర్, అల్లు అర్జున్ వారికి జతగా మరో ఇద్దరో నలుగురో అందాల భామలతో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద సినిమా తీయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు.   ఇద్దరు అతిపెద్ద హీరోలను ఒప్పించగానే అతని పని అయిపోలేదు. అక్కడి నుండే అతని ‘కధ’ మొదలయింది. వారిద్దరికీ సరిపోయే విదంగా, వారి ఇమేజ్, వారి అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని మంచి కధను తయారు చేయడానికి ప్రముఖ సినీ కధా రచయితలు కోన వెంకట్ మరియు బీవీఎస్ రవికి పూరి బాధ్యత అప్పగించినట్లు సమాచారం.   అంతే కాదు, తన హీరోల స్థాయి, వారి అభిమానుల అంచనాలను అందుకొనే స్థాయిలో కధను తయారు చేసినట్లయితే, వారు ఇంతవరకు ఎన్నడూ తీసుకోనంత భారీ పారితోషికము కూడా ఇస్తానని చెప్పాడు.   ఇక, వీరందరినీ తట్టుకొనే భారీ పెట్టుబడిపెట్టగల నిర్మాత కోసం ఆయన ప్రస్తుతం వెతుకుతున్నాడు. ఒకే నిర్మాత అయితే అంత పెట్టుబడి పెట్టడం కష్టం గనుక, ఇద్దరు లేదా ముగ్గురు నిర్మాతలతో కలిపి ఈ సినిమా తీసేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే...

చంద్రబాబు కత్తులు,కొడవళ్ళు..కాంగ్రెస్ ఫైర్

      గుంటూరు పాదయాత్రలో చంద్రబాబు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా కత్తులు, కొడవళ్లతో తిరగబడాలని పిలుపు ఇవ్వడం పై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొందరు మురళి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని అన్నారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని, కత్తులు,కొడవళ్లతో రోడ్డెక్కాలని అని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకునే విషయంపై ఆలోచన చేస్తామని కోండ్రు హెచ్చరించారు. ఇదే వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ.. కాంగ్రెస్ ను చంపడం చంద్రబాబు జేజెమ్మ వల్ల కూడా కాదని ఆయన పేర్కొన్నారు.కత్తులు,కొడవళ్లు పట్టుకోమని తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి వాడవలసిన భాష ఇదేనా అని బొత్స ప్రశ్నించారు. గతంలో ఇలా చాలామంది మాట్లాడారని, వారంతా ఏమయ్యారో తెలుసుకోండని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బొత్స కోరారు.  

కాలు విరగొట్టుకొన్న అఘోరా గారు

  ‘అరుంధతి’ సినిమాలో ‘బొమ్మాళీ...నిన్నొదలా...’ అంటూ అఘోరాగా ప్రేక్షకులను తన నటనతో భయకంపితులను చేసిన బాలివుడ్ నటుడు సోనూ సూద్, ప్రస్తుతం కాళ్ళు విరగొట్టుకొని ముంబాయిలో కోకిల బెన్ ఆసుపత్రిలో మంచం మీద బందించబడిఉన్నాడు. ఇటీవల దుబాయ్ లో జరిగిన ఒక చారిటీ మ్యాచులో ముంబాయి హీరోస్ టీం తరపున ఆడుతున్నసమయంలో ఆయనకు కాలుకు తీవ్ర గాయాలవడంతో వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రిలో జేర్చి ప్రాధమిక వైద్యం చేయించిన తరువాత నేరుగా ముంబాయిలో కోకిల బెన్ ఆసుపత్రికి తరలించారు. అతని కాలుకి మొత్తం ఆరు చోట్ల విరిగినట్లు సమాచారం. వైద్యుల సలహా మేరకు అతను మరో ఆరు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. సోనూ సూద్ ప్రస్తుతం నాగార్జున యొక్క ‘భాయి’ సినిమాలో, రామ్ చరణ్ తేజ్ చేస్తున్న హిందీ సినిమా ‘జంజీర్’ ప్రతినాయక పాత్ర చేస్తున్నాడు. ఈ ప్రమాదం వలన ఆ రెండు సినిమా షూటింగులకు సోనూసూద్ కొంత విరామం ఈయకతప్పదు.

85వ అస్కార్ అవార్డుల విజేతలు లిస్ట్ ఇదే

      లాస్ఏంజిల్స్‌లో జరుగుతున్న ఈ 85వ అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. భారతీయ నేపథ్యంలో వచ్చిన 'లైఫ్ ఆఫ్ పై' సినిమాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ దర్శకుడు ఇతర విభాగాల్లో 'లైఫ్ ఆఫ్ పై' కు అవార్డులు దక్కాయి. 85వ అస్కార్ అవార్డుల విజేతలు:   ఉత్తమ దర్శకుడు: ఆంగ్ లీ (లైఫ్ ఆఫ్ లీ) ఉత్తమ నటి : జెన్నీఫర్ లారెన్స్ (సిల్మర్ లైనింగ్ ఫ్లేబుక్) ఉత్తమ నటుడు: డేనియల్ డే లెవిస్ (లింకన్) ఉత్తమ సహాయ నటి: హన్నే హాథ్‌వే (లెస్ మిజరబుల్) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: లైఫ్ ఆఫ్ పై ఉత్తమ సినిమాటోగ్రఫీ : క్లాడియో మిరాండ (లైఫ్ ఆఫ్ పై) ఉత్తమ దర్శకుడు : అంగ్ లీ (లైఫ్ ఆఫ్ పై) ఉత్తమ ఒరిజినల్ స్కోర్: మైకెల్ డాన్నా (లైఫ్ ఆఫ్ పై) ఉత్తమ యానిమేషన్ చిత్రం: బ్రేవ్ ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: పేపర్ మ్యాన్ ఉత్తమ సహాయ నటుడు : క్రిస్టోఫో వాజ్ (డిజాంగో అన్ చైన్డ్) ఉత్తమ షార్ట్ ఫిల్మ్: కర్ఫ్యూ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: సెర్చింగ్ ఫర్ షుగర్ మేన్ ఉత్తమ విదేశీ భాషా చిత్రం: అమోర్ (ఆస్ట్రియా) ఉత్తమ లఘు డాక్యుమెంటరీ చిత్రం: ఇనోసెంటీ ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ : జాక్వెలైన్ డుర్రాన్ (అన్నా కరేనికా) ఉత్తమ ఎడిటింగ్: ఆర్గో