తెలంగాణ పై మళ్ళీ అదే వాదన !

తెలంగాణా "మిగులు ఆదాయా''న్ని (సర్ ప్లస్) తెలుగు సోదరులు మింగారా? మళ్ళీ అదే వాదన ! - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]   పాడిందే పాడటం కొందరికి వదిలించుకోడానికి వీలుకాని అలవాటు. అలాగే, తెలంగాణా "మిగులు'' ["సర్ ప్లస్'']ను రాష్ట్రంలోని మిగతా రెండు ప్రాంతాలవారూ మింగేసి తెలంగాణాకు తొంటిచెయ్యి చూపుయాన్నారన్న అపవాదును మరోసారి కొందరు తెరపైకి తెస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ఫలితంగానే తెలంగాణాలోని తెలుగుప్రాంతాలూ, ఆంధ్రలోని తెలుగుప్రాంతాలూ కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి తెలుగుజాతంతా సమైక్యం కావడం సాధ్యమయింది. ఇది చారిత్రిక సత్యం. ఈ రెండు తెలుగుప్రాంతాల విలీనీకరణ సందర్భంగా, అప్పటికి మొగలాయిల (ముస్లీం) పరాయిపాలనలో విద్యకు, ఆరోగ్యానికి, సామాజికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికీ మాతృభాషగా తెలుగు వాడకానికి నోచుకోని ఫలితంగా బ్రిటిషాంధ్రటో పోల్చినప్పుడు తెలంగాణా వెనుకబడి ఉన్నందున దానికి రక్షణలు కల్పిస్తూ విశాలాంధ్ర ఏర్పాటుకు ముందు "పెద్దమనుషుల ఒప్పందం'' కుదిరింది. దానికి తగినట్టుగా నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయప్రాంతాల నాయకుల మధ్య "మాట'' ప్రకారం ఆ రక్షణలు క్రమంగా అమలులోకి వచ్చాయి; ఒప్పందం అమలులో క్షేత్రస్థాయిలో కొన్ని ఒడిదుడుకులూ జరిగి ఉండవచ్చు. కాని అవి క్రమంగా తొలగిపోతూ వస్తున్నాయి. అయితే "పెద్దమనుషుల ఒప్పందం'' పైన సంతకాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరుప్రాంతాలకు చెందిన మంత్రులూ, కడచిన 56 ఏళ్ళుగానూ ఉన్నందున, ఒకవేళ "ఒప్పందం' అమలులో ఒడిదుడుకులు జరుగుతున్నప్పుడు, వాటిని పసికట్టి తొలగించవలసిన బాధ్యత ఉభయప్రాంతాల మంత్రులకూ ఉండాలి.   దేశానికి స్వాతంత్ర్య (1947 ఆగస్టు) ప్రకటన జరిగిన తరువాత రెండేళ్ళ దాకా [1950 జూన్ వరకు] తెలుగువారి తెలంగాణా ప్రాంతం నిజాం పాలకుల నిరంకుశ రాజ్యంలో భాగంగానే ఉంటూ వచ్చింది. ఎటుతిరిగీ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాల చాటున ప్రవేశించిన యూనియన్ సైన్యాల రాకతో ఈ ప్రాంతానికి పూర్తిగా నిజాం పాలననుంచి రాజకీయ విమోచనం లభించింది. 1952 జనవరిలో దేశపు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా మొదటిసారిగా ఎన్నికల కోలాహలం చెలరేగింది.అందులో కాంగ్రెస్ ఒక పక్షంగాను, జయసూర్య నాయకత్వంలో కమ్యూనిస్టులు "ప్రజాతంత్ర ప్రజాస్వామ్య ఐక్యసంఘటన'' (పి.డి.ఎఫ్.)గా ఏర్పడి సంయుక్త ప్రతిపక్షంగా ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో 1952 మార్చిలో హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 1956 అక్టోబర్ ఆఖరిదాకా కొనసాగింది. కాగా 1955లో ఒకే భాషాసంస్కృతులు గల జాతి ప్రాతిపదికగా ఐక్య రాష్ట్రం ఏర్పడాలని తెలుగుప్రాంతాలన్నిటా ఆందోళన సాగింది. ఫలితంగా కేంద్రం ఈ సమస్యపైన ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఫజల్ ఆలీ కమీషన్ ను ఏర్పరచింది. ఈ కమీషన్ అభిప్రాయ సేకరణ తర్వాత నివేదిక సమర్పిస్తూ "భట్టిప్రోలు పంచాయితీ'' ధోరణిలో రెండు పరిష్కారాలు పరస్పరవిరుద్ధంగా సూచించింది. (1) తెలుగుప్రాంతాలన్నింటి ప్రగతికోసం, భవిష్యత్తులో వాటి భద్రతకోసం అవి విశాలాంధ్రగా ఏర్పడడం అన్నివిధాలా మంచి పరిష్కారమవుతుంది. (2) కాని, తెలంగాణా ప్రాంతంలో కొందరి అభిప్రాయం ప్రకారం "తెలంగాణా ప్రాంతం వెనుకబడినదిగా ఉండుటచే'' [మందుముల నరసింగరావు: "50 సంవత్సరాల హైదరాబా''దు] ప్రత్యేక రాష్ట్రంగా ఉండవచ్చునని కోరుకుంటున్నారు, అని కమీషన్ తెల్పింది. అలా కొందరు నాయకులు [వారిలో ప్రముఖులు బడా భూస్వాములయిన కొండా వెంకటరెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి] వెలిబుచ్చిన కోరిక నెరవేరనప్పుడు 1956లో "తెలంగాణా ప్రత్యేక రక్షణలు'' ఆధారంగా ఏర్పడిందే "ఆంధ్రప్రదేశ్''. నిజానికి అప్పటికి, అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరేళ్ళ నాటికి విశాలాంధ్రలో అంతర్భాగమైన ఒక్క తెలంగాణా ప్రాంతమేగాక యావత్తు దేశంలోనూ అంతవరకూ భూస్వామ్యవ్యవస్థ కారణంగానూ, బ్రిటిష్ వాడి పరాయి పాలనవల్లనూ అనేక వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మన ఇరుగుపొరుగైన మైసూర్, మహారాష్ట్రలు కూడా ఉన్నాయి. కాని హైదరాబాద్ (స్టేట్) రాష్ట్ర శాసనసభలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు ఐక్య కర్నాటక, సంయుక్త మహారాష్ట్రల ఏర్పాటుకు పూర్తీ మద్ధతు పలుకగా [అప్పటికి ఆ ప్రాంతాలూ బాగా వెనుకబడి ఉన్నవే] తెలుగు మాట్లాడే తెలుగు ప్రజాప్రతినిధులయిన సభ్యులు కొందరిలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ భిన్నాభిప్రాయానికి నాయకత్వం అనేక దశాబ్దాల తరబడిగా తెలంగాణా ప్రజాబాహుళ్యాన్ని పీల్చి పిప్పి చేసిన నిజాం, అతనికి తోడుగా భూస్వామ్య, బడాజాగీర్ధారీ, 'దోర'లకు సంబంధించిన ప్రతినిధులే కావడంవల్ల స్వార్థ ప్రయోజనాల కోసం విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ పరిస్థితి కర్నాటక, సంయుక్త మహారాష్ట్రలకు లేదు. అందుకే, ఈ భూస్వామ్యవర్గ నాయకులే [తెలంగాణా సాయుధ పోరాట అగ్రగాములలో ఒకరైన భీమిరెడ్డి నరసింహారెడ్డి అన్నట్టుగా] "తెలుగుజాతి ఐక్యతకు వ్యతిరేకులుగాని తెలంగాణా ప్రజలు మాత్రం కార''నీ అప్పటికీ, ఇప్పటికీ రుజువవుతున్న సత్యం! అందుకే ఆలోచనాపరుడైన ఆనాటి శాసనసభ్యుడు ఎల్.ఎన్. రెడ్డి ఫజల్ ఆలీ కమీషన్ నివేదికను ప్రస్తావిస్తూ "ఈ కమీషన్ కూడా అటు పూర్తిగా విశాలాంధ్రకు మద్ధతు తెల్పకుండాను, ఇటు ప్రత్యేక తెలంగాణాకు వందశాతం అనుకూలంగా సిఫారసు చేయకపోవటం కూడా పరిస్థితిని క్లిష్టం చేసిందని చెప్పాలి'' అని వ్యాఖ్యానించవలసి వచ్చింది [02-04-1956] సరిగ్గా ఈ అస్తుబిస్తు పరిస్థితులలోనే, తెలంగాణా గతంలో ఎప్పుడూ 'సర్ ప్లస్'' (మిగులు బడ్జెట్ తో) ప్రాంతం ఉండేదనీ, కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఈ 'సర్ ప్లస్' కాస్తా తెలంగాణాకు దక్కనివ్వకుండా కోస్తాలో ఖర్చుపెట్టారన్న అపవాదును కొందరు సోదర తెలంగాణా మిత్రులు ముందుకు నెడుతూ వచ్చారు. ఇంతకూ ఆ "కొందరు'' మాత్రమే పదేపదే పేర్కొంటున్న "తెలంగాణాకు ఉంటూ వచ్చిన సర్ ప్లస్ ఆదాయం'' ఎలా పేరుకుంది? ఎందుకు పేరుకుంది? అందుకు కారకులెవరు? ఒకవైపున తెలంగాణా ప్రాంతం నిజాంపాలన మూలంగా "దారుణమైన వెనుకబాటు తనా''న్ని అనుభవిస్తూ వచ్చిందని చెబుతున్నవారు, ఆ వెనుకబాటుతనాన్ని తొలగించడానికి నిధులు ఉపయోగించి ఉన్న పక్షంలో "సర్ ప్లస్'' బడ్జెట్ మిగిలేది కాదుగదా! ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి "ఆంధ్రప్రాంతం ఆదాయం తరుగులో'' ఉంది కాబట్టి, తెలంగాణాకి జమకూడుతూ వచ్చిన మిగులు ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దరిమిలా కోస్తావాళ్ళు మింగేశారన్న ఆరోపణ సరైనది కాదు! ఎందుకంటే వెనుకబాటుతనానికి రెండు ముఖాలుంటాయి : (1) ఉన్న మిగులును ఎలాంటి ప్రజాసంక్షేమ పథకాలకు ఖర్చు చేయకుండా ఉన్నందువల్ల, లేదా (2) సంబంధిత ప్రాంతంలో ప్రజాహిత పథకాలను అమలు జరగకుండా స్వార్థప్రయోజనాలను ఆశించే పాలకుల వల్లనూ. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, అంటే, 1956 నుంచి 2008 వరకూ కడచిన గత 56 సంవత్సరాలలోనూ విశాలాంధ్ర ఏర్పడిన తరువాత సోదర తెలంగాణా ప్రాంతంలో దాదాపు అన్నిరంగాలలోనూ [విద్య, వైద్య, పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల, వాహనాల పెరుగుదలలో, పారిశ్రామిక, వ్యవసాయక వగైరా రంగాలలో] సుమారు 130 శాతంనుంచి 300 శాతం దాకా అభివృద్ధి నమోదైనదని సాధికారిక గణాంకాలు నిరూపిస్తున్నాయి! వాటిని కాదని ప్రత్యామ్నాయ వాదనలతో వాస్తవాలతో వేర్పాటువాదులు ఇంతవరకూ ముందుకు రాలేదు. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొందరు వేర్పాటువాదులు "మాకు లెక్కలువద్దు, ప్రత్యేక రాష్ట్రం'' మాత్రమే కావాలన్న మొండివాదనకు గజ్జెకట్టారు! ఏ ప్రజాహితమైన పనులమీదా ఖర్చు చేయనప్పుడు, "రూపాయి ఖర్చుకాకూడదు, బిద్దమాత్రం దుత్తల్లే ఉండాలి'' అన్నట్టుగా "మిగులు బడ్జెట్'' మిగులుగానే ఉండక తప్పదుకదా! స్కూళ్ళు, కాలేజీలు, ఆస్పత్రులు, తదితర ప్రజాహిత పథకాలను నిజాం ప్రభువులు గ్రామసీమల అభివృద్ధికోసం ఖర్చుపెట్టకుండా ఉన్నందుననే ఆ మిగులు తేలింది; కాని తన భోగవిలాసాలకు మాత్రం కొదవలేదు!ఖర్చు చేయనప్పుడు ఒక చోట మిగులు మరొక చోట కొరతకు కారణమవుతుంది! 1956 నుంచి 2008 వరకూ తేలిన "అభివృద్ధి'' గణాంకాల ప్రకారం చూసినప్పుడు, తెలంగాణా "మిగులును'' కోస్తాఆంధ్రలో వాడేసుకున్న మాటే నిజమయితే, సోదర తెలంగాణలో 130 శాతంనుంచి సుమారు 300 శాతం దాకా అభివృద్ధి ఎలా సాధ్యమో "సర్ ప్లస్'' వాదులు వివరించగలగాలి! తెలంగాణా నాయకులలో ఒకరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మందుముల నరసింగరావు హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను రెండవ ప్రపంచయుద్ధానికి ముందూ, ఆ తరువాతా (1939 నుంచి 1948 దాకా) పరిస్థితిని చర్చిస్తూ హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు క్రమంగా ఎలాంటి సంకతంలోకి వెళ్ళాయో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు "తారుమారైపోయిన హైదరాబాద్ స్థితిగతుల''ను తన "50 సంవత్సరాల హైదరాబాదు'' గ్రంథంలో [''ఎమెస్కో'' ప్రచురణ : 2012] యిలా వివరించారు: యుద్ధానికి ముందు "గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ బడ్జెట్ మిగులుగానే ఉండేది. రాష్ట్రప్రభుత్వ ఆదాయపు పద్దులలో అంతవరకూ ఎలాంటి మార్పూ లేదు కూడా. కాని - దిగుమతి, ఎగుమతి వ్యాపారం సన్నగిల్లడం, రాకపోకల సౌకర్యాలు తగ్గటం వలన పరిస్థితులు కూడా చాలా తారుమారైనవి. (తెలంగాణాకు) బర్మానుంచి బియ్యం రావటంలేదు. కొన్ని జిల్లాల్లో క్షామపరిస్థితులు ఏర్పడటం వలన, రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నవి. తిండిగింజలలోటు ఏర్పడింది. ధరలు రోజుకు రోజు పెరుగుచుండెను. వస్తువులు మాయం కావటం ఆరంభమైనవి. దొంగబజారు, నిలవపెట్టడం, అక్రమ లాభాలు సంపాదించడమనే పరిభాష మొదటి పర్యాయం హైదరాబాద్ రాష్ట్రంలో వాడుకలోకి వచ్చేసినది. ఆ పరిభాష అలాగే ఇప్పటివరకూ (యుద్ధానంతరం వరకూ) నిలిచిపోయినది''! అంతేగాదు, అంతవరకూ హైదరాబాద్ రాష్ట్రంలో "ఆదాయంపైన పన్ను అనే విధానేమే లేద''నీ, బ్రిటిష్ పరిపాలిత సికింద్రాబాద్ భాగంలో మాత్రం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రెసిడెంట్, ఆదాయంపైన పన్ను వేశాడనీ, కాని హైదరాబాదులో మాత్రం ఆ పని చేయడం సులభం కాలేదనీ కూడా మందుముల రాశారు. ఈ సందర్భంలోనే ఆయన మన దేశీయ పాలకులను గురించి ఒక 'చెణుకు' విసిరారు " "మన దేశీయ  పాలకులు 20వ శతాబ్దంలో జీవిస్తూ 18వ శతాబ్దపు పరిభాషలో ఆలోచిస్తూ ఉంటార''ని! అక్షరసత్యం మరోమాటలో చెప్పాలంటే ఆదాయపుపన్ను లేని సమయంలో సమకూడిన "రెవెన్యూ మిగులు''ను చూసారు. ఇటీవల మరొక గమ్మత్తు రాజకీయాన్ని కొందరు వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు ఆశ్రయించారు! ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద ఆర్ధిక, ప్రణాళికా శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమర్ధుడైన అధికారి బి.పి.ఆర్. విఠల్ కూడా తెలంగాణా "సర్ ప్లస్'' ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఖర్చుచేసిన పధ్ధతి గురించి తప్పుపట్టారని వేర్పాటువాదులు కొందరు ఉదాహరిస్తున్నారు. ఇందుకోసం, రాష్ట్ర సమైక్యతను సమర్థిస్తున్న విఠల్ కుమారుడైన ఆచార్య సంజయ్ బారును విమర్శించడం కోసం తండ్రీ-కొడుకుల వాదనల మధ్య తగాదా పెట్టాలని వేర్పాటువాదులు చూశారు. కాని బి.పి.ఆర్.. విఠల్ ఒకనాటి తెలంగాణా మిగులు (సర్ ప్లస్) ఆదాయం గురించి దఫదఫాలుగా "సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్'' అని ప్రచురించిన ["A state in periodic crisises : Andhra Pradesh''] గ్రంథంలో చర్చించన తీరువేరు, వేర్పాటువాదులు ఆ పేరిట చేస్తున్న వాదన వేరు! తెలంగాణా ప్రాంతంలోని సొంత ఆదాయవనరులకు సంబంధించిన "మిగులు''ను ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించలేదన్న ఫిర్యాదును ప్రస్తావిస్తూ విఠల్ చేసిన వ్యాఖ్య ఇక్కడ పరిశీలిచదగినది: "ఈ మిగులు రెవెన్యూలను అంచనా కట్టె పద్ధతీ, సదరు మిగుళ్ళను ప్రభుత్వం ఉపయోగించిన పద్ధతీ ఈ రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయాలలో దఫదఫాలుగా తలెత్తుతూ వస్తున్న సమస్యలు. అయితే, ఈ ప్రాంతీయ రాజకీయాలను అలావుంచి ఈ మొత్తం రెవెన్యూ మిగులు సమస్యను బడ్జెట్ రూపకల్పనకూ, రాజకీయాలకూ మధ్య ఒక సంబంధిత సమస్యగా అధ్యయనం చేయడానికి తగిన కేస్ స్టడీ'' కాగలదు! ఇంకా స్పష్టం చేయాలంటే - ఆర్ధిక సంబంధితమైన పాలనా వ్యవహారాలపైన శాసనవేదిక (లెజిస్లేచర్) అడుపాజ్ఞాలకు సంబంధించిన సమస్యగా దానిని అధ్యయనం చేయదగిన అంశం'' అని కూడా విఠల్ పేర్కొన్నారు! అంతేగాదు, ప్రాంతీయ రాజకీయాలనుంచి వివాదాలు తలెత్తి ఉండవచ్చు, కాని అంతమాత్రాన ద్రవ్య (ఆర్ధిక) పాలనకు చెందిన సమస్యల ప్రాధాన్యతనుంచి దృష్టి మళ్ళరాదనీ, ఇంతకూ మౌలికమైన సమస్యకు పునాది రాజకీయ ఒప్పందమనీ, ఇది రాజకీయ ఉద్యమం వల్ల మరింత జటిలమవుతుందనీ విఠల్ పేర్కొన్నాడు. అధికారిగా ఆయన అంతకుమించి రాజకీయ నిరుద్యోగుల మాదిరిగా ముందుకు వెళ్ళలేడు! ఈ సమస్య చిలికి చిలికి గాలివానలాగా కేంద్రానికి, రాష్ట్రానికీ మధ్య సమస్యగా తలెత్తుతుందనీ, చివరికి దీనికి పరిష్కారమల్లా రాజ్యాంగ సవరణ మాత్రమేనానీ విఠల్ చెప్పారు. అందుకే ఒక రాజ్యంగబద్ధ సంస్థగా ఆంధ్రప్రదేశ్ శాసనసభే తెలంగాణా ప్రాంతీయ కమిటీని నాడు సాధికారికంగానే ఏర్పాటు చేసిందనీ, ఈ కమిటీ ఉన్నతకాలం, చట్టరీత్యా తనకు సంక్రమించిన అధికారాల పరిథిలో, ప్రభుత్వం చేసే ఖర్చుపైన చాలా శక్తిమంతంగా అర్థవంతంగా ఆజమాయిషీ చేస్తూ వచ్చిందని కూడా విఠల్ అన్నారు! ఈ కమిటీ ప్రస్తావించే సమస్యల వెనక రాజకీయ పూర్వరంగం ఉన్నప్పటికీ తెలంగాణా ప్రాంతీయ కమిటీ మాత్రం తన విశ్లేషణలో గాని, సమస్యను వివరించడంలో గానీ పక్కా వృత్తి సంస్థగానే వ్యవహరిస్తుందని విఠల్ అన్నారు! ఈ సమస్యను వివరిస్తూ విఠల్ గారు ఆరోపణలు చేసేవారినందరినీ ఒకగాటున కట్టకుండా ఏకీకరణ మూలంగా తెలంగాణా "రెవెన్యూ మిగులు''ను కోస్తాఆంధ్రులు వాడుకుంటారన్న ఆందోళనను "కొంతమంది తెలంగాణా నాయకులు'' వ్యక్తం చేశారని స్పష్టం చేయడం గమనార్హం. ఆ "కొందరు'' నాయకులు "అందరి నాయకుల''నీ కాదు, వారు మొత్తం తెలంగాణా ప్రజాబాహుళ్యం అభిప్రాయాలను ప్రతిబిందిస్తున్నారనీ అర్థం కాదు! ఇంతకూ ఆ 'సర్ ప్లస్'' ఆదాయం ఏది? తెలంగాణలో వసూలయ్యే భావిస్తూ, ఎక్సైజ్ (ఆబ్కారీ) ఆదాయమూ. ఇది ఏడాదికి రూ.5 కోట్లు, ఆనాటికి రాష్ట్రాల పునర్వవస్థీకరణ (ఫజల్ ఆలీ) కమిటీ రాష్ట్రంగా ఏర్పడిన "ఆంధ్రరాష్ట్రం కొంతమేర ఆర్ధిక సమస్యను ఎదుర్కొంటూ వచ్చింద''నీ చెప్పిందేకాని ఆ "కొంత'' ఎంతో స్పష్టం చేయకుండా వదిలేసి కూర్చుంది! అలాగే మద్రాసునుంచి విడిపోయి ఏర్పడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో "తలసరి ఆదాయం తక్కువ''ని చెప్పిందేగాని, ఆ "తక్కువ'' ఎంతో గణాంకంలో తెలపకుండా చల్లగా జారుకుంది! కాని అనుమానాలు మిగిల్చి రెండు ప్రాంతాల మధ్య మనస్సులను చెడగొట్టడానికి ప్రయత్నించింది, ఇక "పెద్దమనుషుల ఒప్పందా''న్ని అమలు జరిపించుకునే బాధ్యతనుంచి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని తెలంగాణా మంత్రులు తప్పుకుని పదవులను మాత్రం అనుభవిస్తూ వచ్చారు! - [ మరిన్ని వివరాలు వచ్చే వ్యాసంలో]

హైదరాబాదులో బాంబు పేలుళ్లు: 15 మృతి

    ఈ రోజు (గురువారం) సాయంత్రం సుమారు 7గంటలకి హైదరాబాదులో అత్యంత రద్దీ ప్రాంతమయిన దిల్ షుక్ నగర్ వద్ద గల కోణార్క్ మరియు వేంకటాద్రి సినిమాహాళ్ళ వద్ద ఒకే నిమిషం వ్యవధిలో రెండు శక్తివంతమయిన వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 22మంది చనిపోయినట్లు సమాచారం. మరో 50 మంది తీవ్ర గాయాలతో ఉస్మానియా, కమల, యశోద, ఒమ్నీఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం, రెండు సైకిళ్ళపై ఉంచిన టిఫిన్ బాక్సులలో బాంబులు ఒక దాని తరువాత మరొకటి కేవలం నిమిషం వ్యవధిలో ప్రేలడంతో వెంకటాద్రి సినిమా హాలు వద్ద 10 మంది, కోణార్క్ సినిమా హాలు వద్ద 12 మంది అక్కడిక్కడే చనిపోయారని తెలిపారు. బాంబు ప్రేలుళ్ళతో భయబ్రాంతులయిన జనం ఒక్కసారిగా చల్లాచదురయి నలువైపులా పరుగులు తీయడంతో ఆ తొక్కిసలాటలో అనేకమంది గాయపడ్డారు. విచారకరమయిన విషయం ఏమిటంటే, రెండు రోజుల క్రితమే ఇటువంటి సంఘటన ఏదో ఒకటి జరగబోతోందని కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ తో సహా మరికొన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసాయి.మరి మన రాష్ట్రం ఆ హెచ్చరికలను పట్టించుకోలేదో లేక తగినంత అప్రమత్తత ప్రదర్శించలేకపోయిందో తెలియదు కానీ, మొత్తం మీద అమాయకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.   ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ యధావిధిగా ‘ఇది పిరికి పందల చర్య’ అంటూ ఖండిచేసి, ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడంతో తన కర్తవ్యం పూర్తిచేసుకొన్నారు. హోం శాఖా సహాయ మంత్రి ఆర్.కే.సింగ్ ప్రత్యెక విమానంలో హైదరాబాదు బయలు దేరారు. హోం మంత్రి షిండే ఇది ఇండియన్ ముజాహిద్ సంస్థ చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.   డీ.జీ.పీ. దినేష్ రెడ్డి, బాంబ్ డిస్పోస్ స్క్వాడ్, పోలీసులు, ఇంటలిజెన్స్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కొందరు మంత్రులు, స్థానిక శాసన సభ్యులు, నగర మేయర్ తదితరులు హుటాహుటిన ఘటనా స్థలానికి జేరుకొని స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.   రాష్ట్రంలో, దేశంలో అంతటా హై-ఎలర్ట్ ప్రకటించి, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేసి తనికీలు నిర్వహిస్తున్నారు. ఘటన జరిగి ఇప్పటికి 3గంటలు గడిచినా, ఇంతవరకు ఏ సంస్థ కూడా ప్రేలుళ్ళకు బాధ్యతా వహిస్తూ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

ధర్మాన కూడా కావూరి రూటే

  సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ, వాటి ప్రభావం మాత్రం రాజకీయ నాయకుల మీద బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంత కాలం దిక్కార స్వరం వినిపిస్తూ, పార్టీని విమర్శిస్తున్న నేతల గొంతుల్లోంచి, ఇప్పుడు పార్టీకి అనుకూలమయిన మాటలు వినిపిస్తున్నాయి. తమకు పదవులు వెంట్రుక ముక్కతో సమానం అంటూ, రాజీనామాలు విసిరికొట్టిన వారే ఇప్పుడు వాటిని ఆమోదించవద్దని పార్టీ కాళ్ళు పట్టుకొని మరీ వేడుకొంటున్నారు. ఇంత కాలం రాజీనామాల పేరుతో, తమ బాధ్యతల నుండి తప్పించుకు తిరుగుతూ జీత భత్యాలు మాత్రం బహు చక్కగా స్వీకరించిన వారు మళ్ళీ సచివాలయాన్ని వెతుకొనివస్తున్నారు.   ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు ఈ రోజు తన రాజీనామాను ఉపసంహరించుకొని, పార్లమెంటు సమావేశాలకు హాజరు కాగ, ఇక్కడ రాష్ట్రంలో రెవెన్యు మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు కూడా ఈరోజే సచివాలయంలో తన విధులకు హాజరవడం కాకతాళీయంగా జరిగింది.   బహుశః రాహుల్ గాంధీ యువమంత్రమే వారిని భయపెట్టి విధులకు హాజరయ్యేలా చేసింది అని చెప్పవచ్చును. క్రిందటి నెలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణాపై తీవ్రంగా కసరత్తు చేస్తున్న తరుణంలో, రాజీనామాలు చేస్తామని బెదిరించిన కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకి “పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి, మీరు పోతే కొత్తవారితో పార్టీని ముందుకు తీసుకుపోతాము,” అని గట్టిగా చెప్పడం కూడా అనేక మంది నేతలకు కనువిప్పు కలిగించిందని చెప్పవచ్చును. కాంగ్రెస్ సంస్కృతికి అలవాటుపడిన ప్రాణాలు వేరే చోట ఇమడలేవనే సంగతి, సదరు నేతలే కాక, పార్టీ అధిష్టానానికి కూడా అర్ధం అయినందువల్లే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు కనబడుతున్నాయి.

కావూరి రాజీనామా కధ కంచికి

  తనను కాదని నిన్న మొన్న పార్టీలో చేరిన చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చారని అలిగి రాజీనామా చేసిన ఏలూరు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుకి అకస్మాత్తుగా జ్ఞానోదయం అయినట్లుంది. ఆయనను కాంగ్రెస్ పార్టీ బొట్టు పెట్టి పిలవకపోయినా ఈ రోజు ఆయనంతట ఆయనే స్వయంగా పార్లమెంటు సమావేశాలకు హాజరవడమే కాకుండా, అమ్మ సోనియమ్మను కలుసుకొని తన రాజీనామాకు సంజాయిషీలు కూడా ఇచ్చుకొన్నారు.   తనకి మంత్రి పదవి ఈయకపోతే, కాంగ్రెస్ కొంప కొల్లేరు చేస్తాను (కొల్లేరు సరసు ఉద్యమం మళ్ళీ మొదలుపెడతానని బెదిరింపు), విజయవాడ-హైదరాబాద్ రహదారులను దిగ్బంధం చేసేస్తానని బెదిరించిన ఆయనకు ఇంత అకస్మాత్తుగా జ్ఞానోదయం ఎందుకయిందని ఆలోచిస్తే, బహుశః ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో తానూ ఇంకా ఈ డ్రామా ఇలాగే కొనసాగిస్తే, కొత్తగా పార్టీ పగ్గాలు చెప్పటిన రాహుల్ గాంధీ తనకు బదులు మరో నాయకుడికి టికెట్ ఇచ్చేస్తే అప్పుడు తన కొంపే కోల్లెరవుతుందని గ్రహించినందునే ఆయన ఈ రోజు డిల్లీకి పరుగులు తీసి ఉంటారు.   యువకుడయిన రాహుల్ గాంధీ ఇటువంటి ముసలి నాయకులను వదిలించుకొని, యువతకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచిస్తునందున, తన రాజీనామాను కనుక ఆమోదించేస్తే నష్టపోయేది తనే తప్ప, కాంగ్రెస్ పార్టీ కాదని ఆయనకీ అర్ధమయి ఉంటుంది. అందువల్లే, తన అలకలు వీడి బుద్దిగా పార్లమెంటులో కూర్చొన్నారు మన కావురివారు. బహుశః తెలంగాణా కాంగ్రెస్ నేతలకు కూడా త్వరలోనే ఇటువంటి జ్ఞానోదయమే కలిగే అవకాశం ఉందని చెప్పవచ్చును.

తెలంగాణ వచ్చి తీరుతుంది

        ప్రత్యేక తెలంగాణ సాధనపై తాము వెనక్కు తగ్గలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందని, సంయమనం పాటిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.   తెలంగాణ సాధన కోసం టీ. జెఎసి తలపెట్టిన సడక్ బంద్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని ఆయన అన్నారు. సడక్ బంద్ ద్వారా తెలంగాణ జెఎసి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటోందని జానా రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి తీరుతామని జానారెడ్డి చెప్పారు. అయితే, ఎన్నికలు ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. పాతపద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని, ఈ విషయంలో అపోహలు వద్దని ఆయన అన్నారు. జానారెడ్డిముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పంచాయతీరాజ్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం.  

ఇంత జబర్దస్త్ గా కత్తెరేస్తే ఎలా? నందిని రెడ్డి

  తన సినీప్రస్థానం ‘ఎంచక్కగా అలా మొదలయిందని’ సంతోషపడిన నందినీ రెడ్డమ్మ, తొందరపడి వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పేసుకోకుండా, జాగ్రత్తగా ఆలోచించి ఒక ‘జబర్దస్త్’ సినిమా తీసి సెన్సార్ బోర్డు చేతిలో పెడితే, వారు ఆమె కష్టాన్ని గుర్తించక, తమ మొండి కత్తెరతో ఆమె ఏంతో అపురూపంగా తీసిన పాటలని, సన్నివేశాలను నిర్దాక్షిణ్యంగా ఎడాపెడా కత్తిరించి పడేసి ఆమె సినిమాను ‘U/A’ సర్టిఫికేట్ ప్రధానం చేసేసరికి ఆమెకు చాల కోపం వచ్చేసింది.   అన్ని కత్తెర్లు వేసినా ఇంకా తృప్తి కలగని సెన్సార్ బోర్డ్ వారికి ఆమె సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ‘అల్లా అల్లా’పాటలో ఆ ‘రెండు అల్లా పదాలను’ కూడా తీసి ‘హల్లా... గుల్లా...’ అనో మరొకటో వాడుకోమని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేసరికి నందిని శివమెత్తిపోయారు.   “అసలు సినిమా ఎలా తీయాలో, సినిమాలో ఏ ఏ పదాలు ఉండాలో, ఏవి ఉండకూడదో, పాటలు, డైలాగులు ఏవి ఉండచ్చో, ఏవి ఉండకూడదో వంటి వివరాలన్నీ వేసి ఒక పుస్తకం అచ్చేయించి మాకందరికీ పంచితే, దాని ప్రకారం సినిమాలు తీయగలిగిన వాళ్ళం తీస్తాము, అలా తీయలేని వాళ్ళం మూట ముల్లె సర్దుకొని పోతాము. అంటే తప్ప, ఇలా సెన్సార్ పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మా భావ ప్రకటన స్వేచ్చను హరించకండి. మీరు కత్తెర్లను ఇలాగే ఉపయోగిస్తే, ఏదో ఒకరోజు ఇక సినిమా పరిశ్రమ మూతపడక తప్పదు,” అంటూ ఆమె చిందులు వేసారు. సరే! ఇన్నికష్టాలుపడి తీసిన సినిమా ‘జబర్దస్త్’ గా ఆడితే ఈ బాధలన్ని ప్రసవ వేదనలా మరిచిపోవచ్చును. లేదంటే, సెన్సార్ బోర్డ్ చేతివాటం వల్లనే ఇలా అయిపొయింది అని ఆమె ఆవేదనపడక తప్పదు.   ఇటీవల ‘లవ్ పాయిజన్’ సినిమాకు కూడా సెన్సార్ బోర్డు సభ్యురాలు ఒకావిడ క్లియరెన్స్ ఈయకుండా అడ్డుపడిందంటూ ఆ సినిమా దర్శకుడు, సెన్సార్ బోర్డు కార్యాలయం ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. పీత కష్టాలు పీతవన్నట్లు, ఎవరి కష్టాలు వారికున్నాయి.   సెన్సార్ బోర్డ్ వారు పోనీలే అని సినిమాలను చూసి చూడకుండా వదిలేస్తే, ఆనక కోర్టు కేసులు, ధర్నాలు, ఆందోళనలు మొదలవుతాయి. సరే, తమ కత్తెర్లు ఎంత మొండి బారిపోయినా కష్టపడి కత్తెర్లు వేస్తే, ఇదిగో ఇలా నందిని వంటివారు శివాలెత్తిపోతుంటారు. చూడబోతే సెన్సార్ బోర్డ్ పని కత్తెర మీద సాములాగానే ఉందిప్పుడు.  

కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు

        బ్రిటీష్ రాణి ఎలిజబెత్-2 కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్. భారత్ పర్యటనలో ఉన్న ఆయన కోహినూర్ తమదేనని అన్నారు. 1850లో బ్రిటన్ రాణికి అప్పటి గవర్నర్ జనరల్ బహుమానంగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.   1997లో రాణి ఎలిజబెత్ భారత పర్యటనకు వచ్చినప్పటి నుంచి ఈ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చివేయాలనే వాదన వస్తోంది. 109 క్యారెట్ల కోహినూర్ వజ్రం ప్రపంచంలో ఉన్న అతి పెద్ద వజ్రాల్లో ఒకటి. ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని బ్రిటన్ ను భారత్ కోరినా ఇప్పటికీ ఫలితం లేదు. తాజాగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కూడా ఇవ్వమని చెబుతున్నారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ ఊచకోత బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సంఘటన అని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఈ ఊచకోత జరిగింది. జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించిన తొలి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మాత్రమే. సంఘటనకు క్షమాపణ చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.

అక్బరుద్దీన్‌ ను వెంటాడుతున్న కేసులు

      వివాదాస్పద వ్యాఖ్యల కేసులు అక్బరుద్దీన్‌ ను వెంటాడుతున్నాయి. నిర్మల్ లో నమోదైన కేసులో ఆదిలాబాద్ జైలులో 40 రోజులు ఉండి ఇటీవల బెయిల్ మీద విడుదలైన అక్బరుద్దీన్ కు తాజాగా బెంగుళూరు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 23న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కోర్టు సమన్లను బంజారాహిల్స్ పోలీసులు గురువారం అక్బరుద్దీన్కు అందజేశారు. అక్బర్ వ్యాఖ్యలపై దిలీప్‌కుమార్, ధరంపాల్‌ అనే న్యాయవాదులు ఇటీవల బెంగళూరు అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయవాది అక్బరుద్దీన్‌కు నోటీసులు జారీ చేశారు. తన మీద దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఒకే చోటుకు తీసుకురావాలని కూడా కోర్టును కోరారు. కానీ కోర్టు దానిని తిరస్కరించింది.

మంత్రి పొన్నాల ఎన్నిక కేసు 27కు వాయిదా

    ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక కేసు విచారణను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ నెల 27వ తేదికి వాయిదా వేసింది. ఈ రోజు(గురువారం) పొన్నాల లక్ష్మయ్య కోర్టుకు హాజరయ్యారు. ఆయన 2009 నాటి ఎన్నికపై వివరణ ఇచ్చారు. అనంతరం కోర్టు కేసును వాయిదా వేసింది. 2009 సాధారణ ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ప్రత్యర్థి, నాటి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పొన్నాల ఇప్పటికి మూడుసార్లు హైకోర్టుకు హాజరయ్యారు.

తెలంగాణ ఎంపీలు ధర్నా ఎందుకో?

  తెలంగాణా అంశంపై కాంగ్రెస్ వెనకడుగు వేసిన తరువాత, ఆ పార్టీకి చెందిన తెలంగాణ కాంగ్రెస్ యం.పీ.లు రాజీనామాలు చేసేస్తామని కొన్ని రోజులు హడావుడి చేసారు. అయితే, ఆఖరి నిమిషంలో రాజీనామాల విషయంలో తమ మద్య అభిప్రాయబేధాలు ఏర్పడాయనే సాకుతో ఆ తరువాత ఎవరూ కూడా తమ రాజీనామాలు ఆమోదించాలని అధిష్టానాన్ని గట్టిగా పట్టుబట్టలేదు. ఆ తరువాత, వారందరూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తాము పాల్గొనాలా వద్దా, లేక పాల్గొని సభను అడ్డుకోవాలా వంటి రకరకాలయిన ఆలోచనల చేస్తూ ఇంత కాలకాలక్షేపం చేసారూ.   తమ రాజీనామాల ఆమోదం కోసం పట్టుబట్టడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని గ్రహించిన వారందరూ, మధ్యే మార్గంగా పార్లమెంటు ముందు ఈ రోజు ధర్నాలు మొదలుపెట్టారు. తద్వారా, తమను తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరిస్తున్న తెరాస మరియు తెలంగాణా జేయేసీల దాడి నుండి తమను తాము కాపాడుకోవడమే కాకుండా, తాము కూడా తెలంగాణా కోసం పోరాడుతున్నామనే సందేశం ప్రజలలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా, ఒకవైపు తమ పదవులను కాపాడుకొంటూ తెలంగాణా అంశంపై పోరాడుతూనే, పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించకుండా తమ గోడు వినిపించే ప్రయత్నం చేయగలుగుతున్నారు.   నిజామాబాద్ యంపీ మధు యాష్కి తప్ప మిగిలిన యంపీలయిన మందా జగన్నాధం,గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, రాజయ్య,పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మరియు పాల్వాయి గోవర్ధనరెడ్డి ఈ రోజు పార్లమెంటు ఆవరణలో దర్నా చేశారు. వారి సమస్యను అర్ధం చేసుకొన్నకాంగ్రెస్ అధిష్టానం, ప్రస్తుతం వారిని ఉపేక్షించినప్పటికీ, వోటింగ్ ప్రక్రియ ఉన్నపుడు వారిని సభలోకి రప్పించగలదని గతంలో యఫ్.డీ.ఐ. వోటింగు సమయంలో నిరూపించింది. తమ అధిష్టానం ఇప్పుడు తెలంగాణా ఇవ్వదని స్పష్టం అయిన తరవాత కూడా, తెలంగాణ కాంగ్రెస్ యం.పీ.లు ఈ విధంగా ధర్నా చేయడం చూస్తుంటే, వారు తమ ప్రాంతాలలో తమ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నారని భావించవలసి ఉంటుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాంతీయవాదం

  సహకార ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే మళ్ళీ ఈరోజు శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రా ప్రాంతంలో ఈ ఎన్నికలు కేవలం మండలి ఎన్నికలుగానే పరిగణిస్తున్నపటికీ, సహకార ఎన్నికలలో వెనుకబడిన తెరాస, ఈఎన్నికలలో కూడా ఓటమి చవి చూసినట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్లు తెలంగాణా సెంటిమెంటు క్రమంగా బలహీనపడిపోతోందనే వాదనను ప్రజలు కూడా విస్వశిస్తే, అది తమ ఉనికికే ప్రమాదం అవుతుందని గ్రహించి, ఈఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా, దానికి ప్రాంతీయవాదం కూడా అద్ది గెలవాలని ప్రయత్నిస్తోంది.   ఈ ఎన్నికలలో తెరాస అభ్యర్దులను గెలిపించడం ద్వారానే, ప్రజలలో తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉందని నిరూపించగలమని, ఇది సమైక్యవాదులకు తెలంగాణా వాదులకు జరుగుతున్నయుద్ధంగా భావించాలని చెపుతూ తెలంగాణా ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోంది. అయితే, తెరాస ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నపటికీ, ఈ సారి వోటు వేస్తున్నవారు విద్యావంతులు మరియు ఉపాద్యాయులు అని మరిచి, వారిని భావోద్వేగాలతో లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తోంది.   ఉచితానుచితాలు తెలిసిన వారికి ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయో, ఎవరిని ఎన్నుకొంటే తమకు మేలు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారందరూ మనస్పూర్తిగా తెలంగాణా కోరుకొంటున్నపటికీ, తెరాసకి ఓటేయడం వలన మాత్రమే తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉంటుందని తెరాస చెపుతున్న మాటలు నమ్మేఅవకాశం లేదు. ఒకవేళ తెరాస అభ్యర్దులలో తమకి ఉపయోగపడే అభ్యర్ధి ఉన్నట్లయితే వారు అతనికే ఓటువేయవచ్చునేమో కానీ, కేవలం సెంటిమెంటును అడ్డం పెట్టుకొని ఓటేయమని అడిగితే, తెరాస అభ్యర్ధికి ఓటేసే అవకాశం లేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

        ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 14 జిల్లాలో ఆరు స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో 6.32 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. ఎన్నికల కోసం 1437 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల స్థానాలకు 64 మంది, ఉపాధ్యాయ స్థానాలకు 19 మంది పోటీపడుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ లైవ్ వెబ్‌కాస్టను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటరు గుర్తింపు కార్డులు లేని వారు ఫోటోతో ఉన్న 15 రకాల గుర్తింపు కార్డులను చూపి ఓటు వేయవచ్చు. ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఆరుగురు ఐఎఎస్ అధికారులను ఈసీ నియమించింది. ప్రత్యేక పోలీసు బలగాలు, మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. 25న ఉదయం 8 గంటలకు ఆరు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది.

చంద్రబాబు ను కలిసిన బాలకృష్ణ

      ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 21న ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక తిరిగి పాదయాత్రలు ప్రారంభమవుతాయి. దీంతో గుంటూరు జిల్లా వేమూరులో చంద్రబాబు పాదయాత్ర నిలిపివేసి బసచేస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఆయనను కలిశారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. రెండు గంటల పాటు ఆయనతో మాట్లాడిన అనంతరం బయటకు వచ్చి కొందరు ప్రముఖులతో మాట్లాడారు. మళ్లీ బాబు ఉన్న వాహనంలోకి వెళ్లి మధ్యాహ్నం ఒంటిగంటకు వేమూరు నుంచి బయలుదేరి వెళ్లారు. ఐదురోజుల క్రితం మెట్లు కూలిపోయి చంద్రబాబు కిందపడే సమయంలో అంగరక్షకులు రక్షించారు. ఇక పాదయాత్ర లో చంద్రబాబు కాళ్లనొప్పులు, షుగర్, బీపీలతో ఇబ్బంది పడుతున్నారు.

బీజేపీని క్షమాపణ కోరిన షిండే

  హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే తమను హిందూ ఉగ్రవాదులుగా వర్ణించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ పార్టీ నేతలు, ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పకపోయినట్లయితే, కీలకమయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేస్తామని హెచ్చరించిన నేపద్యంలో తొలుత కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ, హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే చెప్పినట్లు బీజేపీ సంఘవిద్రోహ పనులకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ భావించట్లేదని, ఈ విషయంపై షిండే కూడా ఇప్పటికే చాలాసార్లు తన వివరణ ఇచ్చారని, త్వరలోనే ఆయన బీజేపీ నాయకురాలు సుష్మ స్వరాజ్ తో స్వయంగా మాట్లాడతారని అన్నారు.   ఈ విషయంలో పార్టీ తనను సమర్దించట్లేదని షిండేకు అర్ధమయిన తరువాత ఆయన కూడా బీజేపీను క్షమాపణలు కోరారు. అఖిల పక్షం తరువాత అత్యుత్సాహం ప్రదర్శించి ‘నెల రోజుల్లో తెలంగాణా సంగతి తేల్చి పారేస్తా’ అని ప్రకటించి షిండే మొదటిసారి స్వయంగా చిక్కులో పడి పార్టీని కూడా చాలా చిక్కుల్లో పెట్టారు. బీజేపీని హిందూ ఉగ్రవాదులంటూ మళ్ళీ మరోమారు నోరుజారి షిండే తనకీ, పార్టీకి ఇబ్బందులు కోరి తెచ్చుకొన్నారు. బహుశః మరో మారు ఇటువంటి తప్పు చేస్తే, పార్టీ ఆయనను ఉపేక్షించకకపోవచ్చును. ఈ వివాదానికి ఇంతటితో తెరపడినా, కాంగ్రెస్ పార్టీని అగస్టా హెలికాఫ్టర్ కుంభకోణంతో పార్లమెంటులో నిలదీసేందుకు బీజేపీ ఆయుధాలు సిద్దం చేసుకొంటోంది.

ఆత్మహత్య చేసుకొంటానంటూ కడపలో వివేకా హడావుడి

  ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, వ్యవసాయశాఖ మంత్రిగా పదవిని కూడా పొందిన వైయస్. వివేకానందరెడ్డి తన వ్యవసాయ శాఖకి, అది ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి మేలు చేసారో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం కడప డిసిసిబి కార్యాలయం వద్ద నిలబడి, వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తున్నారు.   పోలింగ్ అధికారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేయడంతో, ఈ రోజు ఉదయం జరుగవలసిన డిసిసిబి ఎన్నికను ప్రభుత్వం వాయిదావేసింది. కడప సహకార ఎన్నికలలో పూర్తిగా పైచేయి సాదించిన జగన్ మోహన్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నేతలే పోలింగు అధికారిని ఎత్తుకుపోయి ఎన్నికలు జరగకుండా అడ్డుకొంటున్నారని ఆరోపిస్తున్నారు.   దానికి తోడూ కమలాపురం కాంగ్రెస్ యం.యల్.ఏ. వీర శివారెడ్డి కుమారుడు కూడా పోటీలో ఉండటంతో, ఆయన ఉదయం డిసిసిబి కార్యాలయానికి వచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన పైకి చెప్పులు విసరడం, ఆయన వారిపై, తోటి కాంగ్రెస్ మంత్రులపై నది రోడ్డు మీద చిందులు వేయడం వంటి సంఘటనలతో, ఉదయం నుండి అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   ఇప్పుడు, మంత్రి వైయస్. వివేకానంద రెడ్డి కూడా వారికి తోడయి వెంటనే ఎన్నికలు నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని కిరణ్ కుమార్ రెడ్డికి హెచ్చరిక జారీ చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. డిసిసిబి ఎన్నికలలో తనకనుకూలంగా తీర్పు రానందున ఎన్నికల అధికారి లేరనే సాకుతో ఎన్నికలను వాయిదా వేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసయిన సరే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు తను ఆత్మహత్యకు కూడా సిద్దమేనని మంత్రి వివేకానంద రెడ్డి ప్రకటించారు.   అయితే, ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. బహుశః ఆయన ఒత్తిడికి తలొగ్గి అర్ధరాత్రయినా సరే, ఈ రోజే డిసిసిబి అధ్యక్ష పదవికి ఎన్నిక జరిపించే అవకాశం ఉంది.   ఈ సంఘటనతో, ఇంతవరకు ఆయనకూ, జగన్ మోహన్ రెడ్డికి అసలుపడదంటూ, వివేకానంద రెడ్డి అనుచరులు చేస్తున్న ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించి, ఇక నేదో రేపో జగన్ మోహన్ రెడ్డి వైపు ఫిరాయించేందుకు సిద్దం అయ్యారని భావించవలసి ఉంటుంది.

వారు పాపులు కారు: విజయమ్మ

  ఈ రోజు హైదరాబాదులోజరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఆయన అనుచరులు తమ పరిధిని దాటి మాట్లాడుతున్నారని అన్నారు. తన కూతురు షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ లపై లేనిపోని అభాండాలు వేస్తూ వారి పరువు బజారు కీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తన కూతురు, అల్లుడు ఈ పాపమూ చేయలేదని ఆమె అన్నారు. తెలంగాణాలో ఎక్కడా కూడా తన అల్లుడు చర్చిలు నిర్మించేందుకు ఎటువంటి భూములు కొనుగోలు చేయలేదని, రక్షణ స్టీల్స్, రక్షణ టీవీ చానల్ కు తన అల్లుడు అనిల్ కుమార్ కు ఎటువంటి సంబందం లేకపోయినా, వాటితో తమను ముడిపెట్టి తమపై చంద్రబాబు బురద జల్లుతున్నారని ఆమె ఆరోపించారు.   అయితే, తమ సహనానికి ఒక హద్దు ఉంటుందని, ఈ విధంగా నిరంతరం బురద జల్లుతుంటే త్వరలోనే చంద్రబాబుపై పరువు నష్టం దావా వేయక తప్పదని ఆమె హెచ్చరించారు. కానీ, ఇప్పటికే అనేక కేసులతో సతమతమవుతున్న ఆమె కుటుంబ సభ్యులు మళ్ళీ మరో కొత్తకేసు మొదలు పెట్టే దైర్యం చేయరనే ధీమాతోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లయితే, ఒకవేళ ఆమె నిజంగా పరువు నష్టం దావా వేసినట్లయితే అప్పుడు వారు కూడా ఇబ్బందుల్లో పడకతప్పదు. గనుక, చంద్రబాబుతో సహా ఆ పార్టీలో అందరూ కూడా వారు చేస్తున్న ఆరోపణలలో నిజానిజాలు తెలుసుకొన్న తరువాతనే చేయడం మేలు. లేకుంటే ‘ఉభయ కుశులోపరి’ అన్నట్లు అటు వైయస్సార్ కాంగ్రెస్ ఇటు తెదేపా అందరూ కూడా తమ పాదయాత్రలు పక్కన పెట్టి కోర్టు యాత్రలు మొదలు పెట్టవలసి వస్తుంది.

శివమెత్తిన వీర శివారెడ్డి

  కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కడప జిల్లా సహకార బ్యాంక్ ఎన్నికలలో తన కుమారుడిని గెలిపించుకోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆయన ప్రయత్నాలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గండి కొట్టడంతో ఆయన తీవ్రనిరాశకు గురయ్యారు. ఈ రోజు సహకార బ్యాంక్ అధ్యక్షపదవికి ఎన్నికలు జరుగుతునందున స్వయంగా అక్కడి పరిస్థితులను ‘పర్యవేక్షించడానికి’ వచ్చినప్పుడు కొందరు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కారుపై చెప్పులు విసరడంతో వీర శివారెడ్డి కారుదిగి నడిరోడ్డు మీద వీరంగం వేసారు. దాదాపు అరగంట వరకు సాగిన ఆయన ప్రదర్శనలో వైయస్.వివేకానంద రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పీట వేసి మంత్రిపదవి అప్పగించినందునే, జగన్ పార్టీ పెట్టేంతవరకు వెళ్ళగలిగాడని, అతనికి వెనక నుండి వివేకానంద రెడ్డి మద్దతుగా నిలుస్తునందునే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా సహకార ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిందని ఆయన ఆరోపించారు. వీరేగాక, కడపకు చెందిన మంత్రులు డీయల్.రవీంద్ర రెడ్డి, రామచంద్రయ్యలు ఇద్దరూ కూడా పార్టీకి వ్యతిరేఖంగా పనిచేసి కడపలో పార్టీ ఓటమికి (తన కొడుకు ఓటమికి) కారకులయ్యారని ఆయన ఆరోపించారు. అందుకు కారకులయిన ఆ ముగ్గురు మంత్రుల గురించి తానూ త్వరలో కాంగ్రెస్ అధిష్టానంకు పిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

తెరాసకు దూరం జరుగుతున్న బీజేపీ

  తెలంగాణా జేయేసీలోభాగస్వామిగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ, ఇంతవరకు తెరాసతో అయిష్టంగానే కాపురం చేస్తున్నపటికీ, జాతీయపార్టీ అయిన తన మీద కూడా కేసీఆర్ కర్ర పెత్తనం చేయడం సహించలేకపోతోంది. కానీ, ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా తెలంగాణాలో తన ప్రాభల్యం పెంచుకొనే ఆలోచనతో తెరాసను, దాని అధినేత కేసీఆర్ ను భరించక తప్పట్లేదు.   పేరుకి అది తెలంగాణా జేయేసీ అయినా, అది కేవలం తెరాస చెట్టుకు మొలిచిన మరో కొమ్మగానే కేసీఆర్ భావిస్తునందున, భాగస్వామ్య పార్టీలను ఆయన ఎన్నడూ ఖాతరు చేయలేదు. ఇంతవరకు ఆయన కర్ర పెత్తనం సహించిన భారతీయ జనతా పార్టీ, ఆయన ఏకపక్షంగా తమ పార్టీకే చెందిన మహమూద్ ఆలీని యం.యల్సీ.అభ్యర్దిగా ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహంతో ఆయనకు ఎదురు తిరిగింది.   అసలు కేసీఆర్ కు తెలంగాణా సాదించాలనే కోరిక, తాపత్రయం ఉన్నట్లు లేదని, అందువల్లే ఆలీని తమ పార్టీ అభ్యర్దిగా ప్రకటించి, తెలంగాణాను వ్యతిరేకిస్తున్న మజ్లిస్ పార్టీ మద్దతు కోరుతున్నాడని బీజేపీ విమర్శించింది. తెలంగాణా సాధనకు అవసరమయితే తమ పార్టీ అద్వర్యంలోనడిచే యన్.డీ.యే. కూటమిలో చేరుతామని ప్రకటిస్తున్న కేసీఆర్, మరో వైపు తెలంగాణాను వ్యతిరేకించే మజ్లిస్ పార్టీతో కలిసి ఏవిదంగా పని చేస్తారని బీజేపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో మరొకమాట మాట్లాడుతూ కేసీఆర్ తమతో ‘డబల్ గేం’ ఆడుతున్నాడని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కేసీఆర్ తమను సంప్రదించకుండానే అభ్యర్ధిని ప్రకటించి, మళ్ళీ అతనిని గెలిపించుకోవడానికి తిరిగి తమ మద్దతే కోరడాన్నిబీజేపీ తప్పు పట్టింది.   కేసీఆర్ అవకాశవాద, ద్వంద వైఖరిని, అతని కర్ర పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నభారతీయ జనతా పార్టీ, అతని వంటి రాజకీయ నాయకుడితో స్నేహం, ఎన్నికల పొత్తులు తమ పార్టీకి మేలు చేయకపోగా మరింత నష్టం తెచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.   ఇక, కేసీఆర్ కూడా రాబోయే ఎన్నికలలోబీజేపీతో ఎన్నికల పొత్తులు గురించి ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడుతూ, మొత్తం అన్నిస్థానాలకు తమ పార్టీ అభ్యర్డులనే ఖరారుచేసే ఆలోచనలో ఉన్నందున, త్వరలోనే బీజేపీకూడా తన దారి తానూ చూసుకోక మానదు. ఉద్యమాల వల్ల తెలంగాణాలో కొంచెం బలం పుంజుకొన్నభారతీయ జనతా పార్టీ బహుశః రాబోయే ఎన్నికలలో ఒంటరిపోరుకే సిద్దపడవచ్చును.