మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్

  ఆప్ పార్టీలోని మరో ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. భూకబ్జా ఛీటింగ్ కేసులో ఎమ్మెల్యే మనోజ్ కుమార్ ని ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అయితే దీనిపై మనోజ్ కుమార్ మాట్లాడుతూ సంవత్సర కాలం కిందటే ఈ కేసు నమోదైందని అప్పుడు పోలీసులు అంతగా పట్టించుకోలేదని కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టే అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వానికి.. భద్రతా వ్యవస్థకు ఉన్న అసఖ్యత కారణంగానే నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. అయితే ఢిల్లీ పోలీసులు మనోజు కుమార్ ను అరెస్ట్ చేసిన వెంటనే గుండెలో నొప్పి, తల నొప్పి అని చెప్పడంతో అతనిని వెంటనే చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు వరుసగా అరెస్ట్ అవడంతో అసలు ఇంకా ఆపార్టీలో ఎవరైనా మిగులుతారా అనే సందేహాలు వస్తున్నాయి అందరికి. ఇప్పటికే ఆప్ పార్టీలోని నాలుగైదుమంది నేతలు ఏదో ఒక వివాదంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంకా ఎంతమంది బయటపడతారో చూడాలి.

హరీష్‌రావు విగ్రహం పెట్టిస్తా.. రేవంత్ రెడ్డి

  ఓటు నోటు కేసులో జైలు నుండి విడుదలైన తరువాత తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ మైకు పట్టారు. తనదైన శైలిలో మళ్లీ ప్రతిపక్షనేతలకు ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి హరీష్‌రావు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో ఎక్కడైనా పాలమూరు ఎత్తిపోతలపై చర్చ ఉందా? జూన్‌ 18న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అయినా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంటే ఒక్క పాలమూరు జిల్లా బంద్‌కే ఎందుకు పిలుపునిచ్చారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు అనుమతి కోసం హరీష్‌రావు బలిదానం చేస్తే ఆయన నిలువెత్తు విగ్రహం పెట్టిస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు ప్రాజెక్టు కోసం బంద్‌లు కాదు, పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

ముగిసిన సండ్ర కస్టడీ

  ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య కస్టడీ ముగిసింది. రెండు రోజుల విచారణ జరిపిన ఏసీబీ అధికారులు సండ్రను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనంతరం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయితే విచారణలో ఏసీబీ అధికారులు సండ్ర పై పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఏ ఏ ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడారు అని ఏసీబీ అధికారులు అడుగగా సండ్ర మాత్రం ‘‘నేను ఎమ్మెల్యేను.. ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిని.. నాకు ప్రతిరోజు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. అందులో సగంమందిని చూస్తేగానీ గుర్తుపట్టలేని పరిస్థితి’’ అంటూ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం 70 ప్రశ్నలకు పైగా సండ్రను అడగగా సండ్ర మాత్రం ఎక్కడా తడబడకుండా ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సండ్ర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసందే.

ఢీల్లీ లో బిజీ బిజీగా చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు జపాన్ పర్యటన అనంతరం నిన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు ఢిల్లీలో కేంద్రమంత్రులతో వరుస సమావేశాలతో బిజీబిజీ గా ఉన్నారు. ఉదయం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా విద్యుత్ కార్మికుల గురించి.. ఏపీకి చెందిన 1,253 మంది విద్యుత్‌ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రివీల్‌ చేసిందని దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని మాట్లాడినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్‌జవదేకర్‌తో సీఎం భేటీ అయ్యారు. ఏపీ రాజధాని నిర్మాణానికి అటవీభూములు ఇవ్వాలని సీఎం జవదేకర్ ను కోరినట్టు సమాచారం. తరువాత కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. కేంద్రజలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో పలు అంశాలపై చర్చించనున్నారు. చంద్రబాబుతో పాటు సుజనాచౌదరి, అశోకగజపతిరాజు, ఏపీ ప్రభుత్వ అధికారి కంభంపాటి రామ్మెహన్ రావు, ఎంపీలు కేశీనేని నాని, కొనకళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.

'బాహుబలి' కి మేక'బలి'

  ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న బాహుబలి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారత సినీ చరిత్రలోనే గొప్ప సినిమాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకోసం అటు అభిమానులు కానీ.. ఇటు చిత్ర పరిశ్రమ కానీ ఎంతో ఎదురుచూసింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులు రకరకాలుగా తమ అభిమానాన్ని చూపించారు. మాములుగా అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే కటౌట్లతో.. పూలదండలు.. పాలాభిషేకాలు చేస్తారు. కానీ ఇది బాహుబలి సినిమా కాబట్టి అదే రేంజ్ లో అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. సినిమా హిట్టవ్వాలని థియేటర్ల దగ్గర ఏకంగా బాహుబలి కోసం మేకబలి ఇచ్చారు. అటు భీమవరంలో అయితే ఏకంగా 2000 బైక్లతో ముందు రెండు ఏనుగులు.. 50 గుర్రాలతో ఊరేగింపుగా వెళ్లారట.

రెండు రాష్ట్రాలకు గవర్నర్ సలహా

  రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా సమస్య ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఇది ఎవరో ఇచ్చిన సలహా కాదు.. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అయిన నరసింహన్ ఇచ్చిన సలహా.. అసలేందుకు ఈ సలహా ఇచ్చారో చూద్దాం..ఓటుకు నోటు కేసులో రెండు రాష్ట్రాల సీఎంలు ఒకరిమీద మాటల యుద్దాలు చేసుకోవడమేమో కానీ ఈ వ్యవహారంలో గవర్నర్ నరసింహన్ కు మాత్రం ఇద్దుర కలిసి చుక్కలు చూపించారన్నది మాత్రం వాస్తవం. ఈ కేసు విషయంలో గవర్నర్ మాత్రం అనేక రాజకీయ నేతలనుండి పలురకాల విమర్శలు వినాల్సివచ్చింది. కేసు నేపథ్యంలో సెక్షన్ 8 పై ఇరు రాష్ట్రాలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాపం దీనివల్ల గవర్నర్ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆగోల అయిపోయింది.. షెడ్యూల్ 10 తెరమీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎస్ షెడ్యూల్ 10 సంస్థలకు సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ సీఎస్ వేసిన పిటిషన్ వాదన తప్పని ఆంధ్రప్రదేశ్ సీఎస్, అడ్వోకేట్ జనరల్ గురువారం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారట. అసలే సెక్షన్ 8 వివాదంతో ఇసుగెత్తిపోయిన గవర్నర్ ఈ విషయంపై స్పందించి మీ రెండు రాష్ట్రాలు కూర్చొని చర్చించుకోవచ్చు కదా.. ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారట.

కేసీఆరే అన్యాయం చేస్తున్నారు.. సోమిరెడ్డి

  టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆరే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని.. మళ్లీ ఆంధ్రావాళ్లు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని అన్నారు. తెదేపా పార్టీని దెబ్బతీయాలనుకోవడం కేసీఆర్ వల్ల కాదని.. అది అసాధ్యమని.. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పదే పదే ఆంధ్రోళ్లు ఆంధ్రోళ్లు అనడం సరికాదని.. తన మాట తీరు మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. కాగా ప్రాణహిత చేవెళ్ల గురించి మాట్లాడుతూ కేసీఆర్.. హరీశ్ రావు కలిసి ప్రాజెక్టు డిజైన్ మార్చడం సరికాదని.. ఇద్దరు కలిసి ప్రాజెక్టు రూపకల్పనను మార్చారని ఎద్దేవ చేశారు. అంతేకాక జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు సరికాదని సోమిరెడ్డి చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ

  రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మిగులు బడ్జెట్ బానే ఉంది. విభజన తరువాత తెలంగాణకు మిగులు బడ్జెట్ తో దేశంలోనే ధనిక రాష్ట్రం గుజరాత్ తరువాత తెలంగాణ ఏకైక మిగులు రాష్ట్రంగా మిగిలింది. కానీ ఇప్పుడు చూడబోతే తెలంగాణ రాష్ట్రానికి ఆర్ధిక కష్టాలు వచ్చినట్టు తెలుస్తోంది. పరిస్థితి ఎక్కడివరకూ వచ్చిందంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాల్సిన గోదావరి పుష్కరాలకు.. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘రంజాన్‌ కానుక’లక కూడా సొమ్ముల్లేవు. అసలు తెలంగాణకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సీఎం కేసీఆర్ మిగులు బడ్జెట్ ఉంది కదా అని రైతుల రుణమాఫీలు.. ఉద్యోగుల వేతనాలు పెంపు.. అంటూ లెక్కాపత్రం లేకుండా కోట్లకు కోట్లు ఖర్చుచేసేశారు. దీనికి తోడు బ్రూవరేజెస్‌ కార్పొరేషన్‌ చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రూ.1260 కోట్లను రిజర్వు బ్యాంకు చెప్పాపెట్టకుండా లాగేసుకోవడంతో తెలంగాణకు కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో తెలంగాణ ఆర్ధిక శాఖ అన్ని బిల్లుల చెల్లింపుకు ఇవ్వాల్సిన నిధుల విడుదలను ఆపేసింది. ఆఖరికి... కోటి రూపాయలను విడుదల చేయాల్సి వచ్చినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ఐటీ శాఖకు మళ్లించిన 1260 కోట్ల రూపాయలను అడ్వాన్సు రూపంలోనైనా ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నా కేంద్రం మాత్రం చూద్దాం చేద్దాం అంటూ మాటలు చెపుతుంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు రోజుకు ఐదారుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి అలసిపోతున్నారు తప్ప కేంద్రం మాత్రం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. మొత్తానికి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత ప్రకారం మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎలాంటి లోటు లేదు కాబట్టి అభివృద్ధిపథంలో ముందుకు కొనసాగుతుందని భావించాం.. కానీ రాష్ట్రం విడిపోయిన ఏడాదికే టీ ఖజానా ఖాళీ అయి.. నిధులకోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

గన్నవరం టు హైదరాబాద్ విమాన సర్వీసులు

  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిని తుళ్ళూరులో నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాటి నుండే అనేక పెద్ద పెద్ద వ్యాపారసంస్థలు, బ్యాంకులు అక్కడ తమ కార్యాలయాలు తెరిచేందుకు సిద్దమయిపోయాయి. ఇప్పుడు అక్కడికి దేశ విదేశాల నుండి నిత్యం అనేకమంది ఏదో ఒకపని మీద వచ్చిపోతూనే ఉన్నారు. అది గమనించిన ఎయిర్ ఇండియా సంస్థ రాజధానికి సమీపంలోనున్న గన్నవరం విమానాశ్రయం నుండి హైదరాబాద్ కి ఏటిఆర్ మోడల్ విమానాన్ని నడపాలని నిశ్చయించుకొంది. ఈ విమానం హైదరాబాద్ లో ఉదయం 6.30 గంటలకి బయల్దేరి 7.30కి గన్నవరం చేరుకొంటుంది. మళ్ళీ అక్కడి నుండి 8గంటలకు బయల్దేరి 9గంటలకి చేరుకొంటుంది.

ఈరోజు కేంద్రమంత్రులతో సమావేశం కానున్న చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు డిల్లీలో కేంద్రమంత్రులు రాజ్ నాద్ సింగ్, ఉమా భారతి, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ లతో సమావేశమవుతారు. మొదట ఉదయం 9.30గంటలకు విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి బొగ్గు సరఫరా, జపాన్ సంస్థలు రాష్ట్రంలో స్థాపించబోయే విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి అనుమతులు మొదలయిన అంశాల గురించి చర్చిస్తారని సమాచారం. తరువాత అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో సమావేశమయినప్పుడు రాష్ట్రంలో కొత్తగా పెట్టబోయే సంస్థలకు పర్యావరణ శాఖ అనుమతుల గురించి చర్చించుతారు. తరువాత కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమా భారతితో సమావేశమయినప్పుడు తెలంగాణాతో ఏర్పడుతున్న జలవివాదాల గురించి చర్చిస్తారు. చివరిగా ఈ రోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ ని కలిసి ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8 అమలు మొదలయిన అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చింతమనేనిపై ఉపముఖ్యమంత్రి కెఈ ఆగ్రహం

  తెదేపా దెందులూరు ఎమ్మేల్యే మరియు ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్, అనుచరులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షి ఆమెతో వచ్చిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణ మూర్తి ఖండించారు. ఈ ఘటనపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని కోరారు. విధి నిర్వహణలో ఉన్న తహసిల్దార్, రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారందరిపై కటిన చర్యలు తీసుకొంటామని అన్నారు. ఆంద్రప్రదేశ్ మానవ హక్కుల కమీషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చింతమనేనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకే ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కి లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందుఇటువంటి కేసులేవీ తనను ఏమీ చేయలేవని చెప్పిన చింతమనేని ముఖ్యమంత్రి కూడా తనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో జరిగిన సంఘటనకు చింతిస్తున్నానని తహసిల్దార్ వనజాక్షికి క్షమాపణలు తెలిపారు.

అందుకే నాపై కక్షగట్టారు.. సెబాస్టియన్

  ఓటుకు నోటు కేసులో నిందితుడైన సెబాస్టియన్ గురువారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ను పరోక్షంగా విమర్శించారు. కావాలనే ఓటుకు నోటు కేసులో సాక్షి ఛానల్ తనపై బురద చల్లే ప్రయత్న చేస్తుందని.. బైబిల్‌ పట్టుకుని రాజకీయ ప్రసంగాలు చేయరాదని ఒకసారి ఏబీఎన్‌ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పానని.. అందుకే నాపై కక్షగట్టి ఇలా కథనాలు రాస్తున్నారని అన్నారు. ఏదో వాయిస్ ను డబ్బింగ్‌ చేసి దానిని రికార్డ్ చేసి నా వాయిస్ అని చెప్పి టెలికాస్ట్‌ చేస్తోందని ఆయన విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని దెబ్బగొట్టలేరని.. మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని సెబాస్టియన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్లాస్టిక్ బియ్యం.. జర జాగ్రత్త

  చైనా దేశం టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందిన దేశమని మనకు తెలుసు. అంతేకాదు నకిలీ ప్రొడెక్టుల ఉత్పత్తులలోనూ చైనా ముందుంటుంది. అందుకే చైనా పేరు చెబితే ప్రముఖ సంస్థలు కూడా తమ ఉత్పుత్తులకు నకిలీతో ఎసరు పెడుదుందని వణికిపోతాయి. అలాంటి చైనా దేశం ఇప్పుడు ఏకంగా మనిషి తిండిని కూడా నకిలీ చేసేసింది. మనం రోజూ తినే బియ్యాన్ని తలపించేలా నకిలీ బియ్యాన్ని తయారుచేస్తుంది చైనా దేశం. దీనిపై సుగ్రీవ దూబే అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చైనా దేశం తయారు చేసే నకిలీ బియ్యం ఆ దేశం నుండి మన దేశం మార్కెట్లలోకి వస్తున్నాయని.. ఈ నకిలీ బియ్యాన్ని అసలు బియ్యంలో కలిపి అమ్ముతున్నారని.. ఈ బియ్యం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కొరియన్ టైమ్స్ అనే పత్రిక వెల్లడించింది. బంగాళదుంపలు, చిలగడదుంపలు, ప్లాస్టిక్‌ కలిపి.. ప్రాణాంతకమైన ఈ ప్లాస్టిక్‌ బియ్యాన్ని తయారుచేస్తున్నారని.. చైనాలోని తయువాన్‌, షాంక్సీ తదితర ప్రావిన్సుల్లో విక్రయిస్తున్నారని కొరియన్ టైమ్స్ అనే పత్రిక తెలిపింది.

పవన్ కళ్యాణ్ vs కేశినేని నాని

  ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత ప్రశ్నించారు. అంత వరకూ బానే ఉంది చాలా రోజుల తరువాత ప్రెస్ మీట్ లో మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఎమైందో ఎమో కానీ ఏపీ ఎంపీలను అసలు పార్లమెంట్ లో ఏంచేస్తున్నారు అంటూ నిందిచారు. అందులోనూ ప్రత్యేకంగా కేశినేని నానిని ఉద్దేశించి మరీ విమర్శించారు. అసలే కేశినేని నానికి ఆవేశం ఎక్కువ.. దీనికి తోడు పవన్ కళ్యాణ్ అంత మాటన్న తరువాత ఊరుకుంటాడా... పవన్ కళ్యాణ్ ని పనిలో పనిగా చిరంజీవిని కూడా దులేపాశాడు. కేశినేని నాని పవన్ కళ్యాణ్ ని ఎలా దులిపేశాడో చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను ఓసారి చూడండి.

అప్పుడు జగన్.. ఇప్పుడు టీ సర్కార్

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టు పై జగన్ ఆరోపించడం అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆరోపించడం మొదలుపెట్టింది. గతంలోనే జగన్ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించడమే కాకుండా దాన్ని అడ్డుకోవడానకి చాలా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకత చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. "పట్టిసీమ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టమని, ఈ ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లకుండా ఆదేశించాలని, వాటాలు తేలకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారని, గోదావరి మిగులు జలాలను ఉపయోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ కు ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రానికి కూడా అంతే ఉందని కేంద్రం, గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతల పథకం అక్రమమని.. విభజన చట్టానికి ఇది పూర్తి వ్యతిరేకమని లేఖలో పేర్కొన్నారు. అసలు గోదావరి నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా దానికి గోదావరి నది యాజమాన్యం అనుమతి తీసుకోవాలని.. అంతేకాక ఇద్దరు ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్, కేంద్ర జలసంఘం అనుమతి కూడా తీసుకోవాలని.. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించాలని చూస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది.   తాగునీటి అవసరాలకు సీఎం చంద్రబాబు ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నిచేపట్టారు. 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. అప్పుడు జగన్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంత వాసులకు నీటి కొరత లేకుండా చేయలని చూస్తున్న చంద్రబాబుకు కోరికను ఎలాగైనా నెరవేరకుండా చేయాలని చూస్తున్నారు అటు ప్రతిపక్షనేత అయిన జగన్.. ఇటు తెలంగాణ ప్రభుత్వం.