ప్లాస్టిక్ బియ్యం.. జర జాగ్రత్త
posted on Jul 9, 2015 @ 5:40PM
చైనా దేశం టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందిన దేశమని మనకు తెలుసు. అంతేకాదు నకిలీ ప్రొడెక్టుల ఉత్పత్తులలోనూ చైనా ముందుంటుంది. అందుకే చైనా పేరు చెబితే ప్రముఖ సంస్థలు కూడా తమ ఉత్పుత్తులకు నకిలీతో ఎసరు పెడుదుందని వణికిపోతాయి. అలాంటి చైనా దేశం ఇప్పుడు ఏకంగా మనిషి తిండిని కూడా నకిలీ చేసేసింది. మనం రోజూ తినే బియ్యాన్ని తలపించేలా నకిలీ బియ్యాన్ని తయారుచేస్తుంది చైనా దేశం. దీనిపై సుగ్రీవ దూబే అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చైనా దేశం తయారు చేసే నకిలీ బియ్యం ఆ దేశం నుండి మన దేశం మార్కెట్లలోకి వస్తున్నాయని.. ఈ నకిలీ బియ్యాన్ని అసలు బియ్యంలో కలిపి అమ్ముతున్నారని.. ఈ బియ్యం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కొరియన్ టైమ్స్ అనే పత్రిక వెల్లడించింది. బంగాళదుంపలు, చిలగడదుంపలు, ప్లాస్టిక్ కలిపి.. ప్రాణాంతకమైన ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని తయారుచేస్తున్నారని.. చైనాలోని తయువాన్, షాంక్సీ తదితర ప్రావిన్సుల్లో విక్రయిస్తున్నారని కొరియన్ టైమ్స్ అనే పత్రిక తెలిపింది.