టైమ్ మీరు చెప్పినా సరే.. జూపల్లి

  పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఎన్టీఆర్ భవన్ లో చర్చించుకుందామని జూపల్లి కృష్ణారావు టీడీపీ నేతలపై సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే సవాల్ మాత్రం విసిరారు కాని చర్చకు మాత్రం రాలేదు. ఇదే విషయంపై టీ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా జూపల్లి పై ఘాటు విమర్శలే చేశారు. ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి ఎన్టీఆర్ భవన్ కు వస్తానని జూపల్లి సవాల్ విసిరారు.. వస్తానని ముఖం చాటేశారని ఎద్దేవ చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో జూపల్లి కోసం 3 గంటల పాటు ఎదురు చూశానని.. జూపల్లి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీంతో జూపల్లి తాను చర్చకు సిద్ధమేనంటూ.. టైమ్ మీరు డిసైడ్ చేసి చెప్పినా సరే చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే సోమవారం, బుధవారం, గురువారం మూడురోజుల్లో ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి తాను సిద్ధమని చెప్పారు. కాగా.. అసెంబ్లీ కమిటీ హాలులో చర్చిద్దామని, చర్చను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయిద్దామని, ప్రజలు, పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా ఉంటారని జూపల్లి సవాల్ విసిరారు. చూద్దాం ఈసారైనా జూపల్లి మాట మీద నిలబడతారో లేదో.

ఓటుకు నోటు కేసు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకూ నోటీసులు!

  ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ అధికారులు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారణ చేసిన సంగతి తెలిసిందే. సండ్రను విచారణ చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సండ్ర బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ రోజు విచారణకు రానుంది. మరో వైపు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు హాజరుకానున్నారు. ఎందుకంటే ఏసీబీ న్యాయస్థానం జూలై 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కానీ... జూలై 1న హైకోర్టు ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ముగ్గురు నిందితులు ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు. 

హర్షకుమార్ అరెస్ట్, రాజమండ్రి జైలుకి తరలింపు

  అమలాపురం మాజీ కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ క్రైస్తవుల శ్మశానవాటిక కోసం ప్రభుత్వం 30 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో మొదలుపెట్టిన నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేసారు. ఆ సందర్భంగా ఆయన పోలీసులు తన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే తన వద్ద ఉన్న రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించారు. తను ఒట్టినే బెదిరించడంలేదని తెలిపేందుకు ఆయన గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కానీ పోలీసులు ఆయన వద్ద ఉన్న తుపాకిని స్వాధీనం చేసుకొని ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆత్మహత్యాప్రయత్నం చేసినందుకు, బహిరంగ ప్రదేశంలో గాలిలోకి కాల్పులు జరిపినందుకు పోలీసులు ఆయనని 3వ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఆయనకు ఈనెల 23వరకు రిమాండ్ విదించారు. పోలీసులు ఆయనని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.

ట్రూ జెట్ విమాన సేవలని ప్రారంభించిన రామ్ చరణ్ తేజ్

  ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ కి చెందిన ‘ట్రూ జెట్’ విమాన సర్వీసులు నిన్నటి నుండి ప్రారంభం అయ్యాయి. నిన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి కేటిఆర్, టర్బో మేఘా సంస్థ డైరెక్టర్లు ప్రేమ కుమార్, వి. ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రూ జెట్ విమాన సర్వీసులను రామ్ చరణ్ తేజ్ జెండా ఊపి ప్రారంభించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జూలై 12 నుండి 25 వరకు హైదరాబాద్ నుండి రాజమండ్రికి ట్రూ జెట్ ప్రత్యేక విమాన సర్వీసులు నడపబోతోంది. ఈ నెల 26నుండి ఔరంగాబాద్, మరికొన్ని ప్రాంతాలకు కు ట్రూ జెట్ సర్వీసులు నడుపబోతోంది.

వైకాపాలో చేరట్లేదు: డొక్కా

  మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవదానికి సిద్దపడిన తరువాత అనూహ్యంగా ఆఖరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకొన్నారు. ఆయన రాజకీయ గురువుగారైన నరసరావు పేట యంపీ రాయపాటి సాంభశివరావు ఆయనని వైకాపాలోకి వెళ్ళవద్దని సూచించడంతో ఆయన తన ఆలోచనను విరమించుకొంటున్నట్లు ప్రకటించారు.చాలా సౌమ్యుడిగా పేరున్న ఆయన అంబటి రాంబాబుకి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి మాట ఇచ్చి తప్పు తున్నందుకు పత్రికా ముఖంగా క్షమాపణలు చెప్పడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో తను సరయిన నిర్ణయం తీసుకోలేకపోతున్నానని కనుక మరి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండదలచానని తెలిపారు.    ప్రజలలో మంచి పేరున్న వాడు, రాజకీయ అనుభవజ్ఞుడు, దళితుడు అయిన ఆయనని తెదేపాలోకి తీసుకొంటే బాగుంటుందని రాయపాటి తెదేపా అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. అందుకు తెదేపా అధిష్టానం, జిల్లా నేతలు కూడా చాలా సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కనుక నేడు కాకపోయినా ఏదో ఒకనాడు ఆయన తెదేపాలో చేరవచ్చని అందరూ భావిస్తున్నారు.

డీఎస్ మారడం వల్ల ఏం నష్టంలేదు

  డీఎస్ లాంటి వారు పార్టీ మారిన ఎలాంటి నష్టం లేదని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డినే కొనసాగుతారని.. అతనిని మార్చే ఉద్దేశం లేదని స్ఫష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్ని సేకరించ లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని దానికోసం త్వరలోనే గ్రామ స్ధాయిలో కమిటీలను నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకుందని, ఈ నెలాఖరుకల్లా ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురంలో పర్యటిస్తారని ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు రాహుల్ సమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు.

కేసీఆర్ ను విమర్శించిన కూతురు కవిత

  రాజకీయాల్లో ఒక పార్టీపై మరో పార్టీ.. ఒక నేత పై మరో నేత విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అది కామన్.. కానీ అదే పార్టీలో ఉంటూ ఆ పార్టీ పైనే అసంతృప్తి వ్యక్తం చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. అది కూడా ఒక పార్టీ అధినేత.. రాష్ట్రానికి సీఎం కేబినేట్ పై ఆసీఎం కూతురు అసంతృప్తి వ్యక్తం చేయడం ఆశ్చర్యం. ఇంతకీ ఎవరా సీఎం.. ఎవరా కూతురు అనుకుంటున్నారా.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై తన కూతురైన కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. కవిత యంగ్ ఫిక్కీ లేడీసీ ఆర్గనైజేషన్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించిన 'ఉమెన్ లీడింగ్ ద ప్యూచర్ ఆఫ్ ఇండియా' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ కేబినెట్‌లో మహిళకు ప్రాతనిధ్యం లేకపోవడం తనను కూడా బాధిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిలో తను కూడా ఉన్నానని అన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కని విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవలే మందకృష్ణ కూడా కేసీఆర్ పై విమర్శలు చేశారు. అంతేకాదు మహిళలతో కలిసి భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. ఏది ఏమైనా ఈవిషయంలో ప్రతి పక్షాలనుండి విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ ఇప్పుడు కూతురు కవితి నుండి కూడా విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం.

సమ్మె చేస్తున్నా పట్టించుకునే వారు లేరు

  సీఎం కేసీఆర్ దగ్గర నుండి అధికార పార్టీ నేతలందరూ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలి.. అందుకోసం కృషి చేయాలి అని మాటలు చెప్పినోళ్లే తప్ప చెప్పనోళ్లు లేరు. మరి ఇప్పుడు హైదరాబాద్ నగర పరిస్థితి చూస్తుంటే బంగారు తెలంగాణ ఏమో కానీ కనీసం మాములు తెలంగాణ చేస్తే చాలు అని అనిపిస్తుంది. గత ఐదురోజులుగా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేయడం వల్ల హైదరాబాద్ నగరం కాస్త చెత్త నగరంగా మారిపోయింది. ఎక్కడ చూసిన కుప్పలుకుప్పలు చెత్తతో నగరంగా అద్వానంగా తయారైంది. ఐదురోజుల నుండి కార్మికులు సమ్మె చేస్తున్న కనీసం పట్టించుకునే తీరిక ఎవరికి లేకుండా పోయింది. అప్పుడెప్పుడో స్వచ్ఛ భారత్ పేరుతో ఏదో అధికారులంతా పేరుకోసం చీపురు పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ ఒక్కరోజు చేస్తే అయిపోతుందా.. అది కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేతులు గ్లౌజులు.. కాళ్లకు బూట్లు వేసుకొని మరీ స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు. అలాంటిది నిరంతరం చెత్తలో పనిచేసే జీహెచ్ఎంసీ కార్మికులు తమ కావాల్సిన పరికరాలు.. వేతనంలో పెంపుదల అడిగితే మాత్రం అవి గొంతెమ్మ కోర్కెలు అంటున్నారు.   మరోవైపు ఇదే విషయంపై తెలంగాణ టిడిపి అధ్యక్షులు సి.కృష్ణయాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదు రోజులుగా నగరంలో జిహెచ్‌ఎంసి సిబ్బంది సమ్మెబాట పట్టారని..ముందుగానే వారి సమస్యలను ప్రభుత్వంతోపాటు జిహెచ్‌ఎంసి కమీషనర్ దృష్టికి తీసుకువచ్చినప్పటికి పట్టించుకోలేదని, కనీసం సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాతనైనా కార్మికులతో చర్చలు జరపక కమీషనర్ సమస్యను పెంచి పోషించారని అన్నారు. ఇలాగే ఉంటే నగరంలో చెత్త వలన ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. నగరంలో నలుగురు మంత్రులు ఉన్న ఎవరూ పట్టించుకోని స్థితిలో ఉన్నారని.. ఇక జిహెచ్‌ఎంసి కమిషనర్ ఎలాగూ కార్మికుల సమస్యలు పట్టని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కనీసం సీఎం కేసీఆర్ అయినా ఈ సమ్మె విషయంలో కల్పించుకొని సమస్యను పరిష్కరించాలని సూచించారు.

బాహుబలి చూడనున్న కేసీఆర్

  ప్రస్తుతం నిన్నటి నుండి ఎక్కడ చూసిన బాహుబలి గురించే చర్చలు ఎక్కువయ్యాయి. ఈ సినిమాకి వచ్చిన హైప్ అంతా ఇంతాకాదు మరీ. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నిన్నటితో ఆ ఎదురుచూపులకు తెర పడింది. ఈ బాహుబలి ఎఫెక్ట్ అటు అభిమానులపైనే కాదు ఇటు పొలిటీషియన్స్ పై కూడా పడిందని అర్థమవుతోంది. ఎందుకంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బాహుబలి సినిమాను చూడాలని నిర్ణయించుకున్నారట. దీనికోసం నిర్మాత దిల్ రాజు ఈ రోజు రాత్రి వారికోసం ప్రత్యేక షో ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ సినిమాను చూడటానికి కేసీఆర్ తోపాటు పలువురు రాజకీయ నేతలు కూడా రానున్నారట. భారత సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోవడమే దీనికి కారణం. ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు కానీ.. అటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కానీ ఈ సినిమా ఒక అద్భుతమని.. జక్కన్న రాజమౌళి మీద ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు. మరీ సీఎం కేసీఆర్ గారు సినిమా చూసి ఏం జడ్జ్ మెంట్ ఇస్తారో చూద్దాం..

మూడుసార్లు ఛాన్స్.. కలుసుకోని సీఎంలు

  తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు డుమ్మా కొట్టారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇద్దరు సీఎంలను ఆహ్వానించగా చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్న కారణంగా హాజరుకాలేకపోయారు. కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నా ఇఫ్తార్ విందులో పాల్గొనలేదు. అయితే ఓటు నోటు కేసు వ్యవహారం వల్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి ఇద్దరు సీఎంలు కలుసుకోవడానికి ఇప్పటికి మూడుసార్లు అవకాశం వచ్చినా వారు మాత్రం కలుసుకోలేదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణ విడిదిలో భాగంగా ఇక్కడకి రాగా అప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి చంద్రబాబు హాజరుకాలేదు. తరువాత ఆయన స్వయంగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లి కలిశారు. తరువాత గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతికి విందు ఏర్పాటు చేయగా.. అప్పుడు కూడా గవర్నర్ ఇద్దరు సీఎంలను ఆహ్వానించారు. కానీ అప్పుడు చంద్రబాబు మాత్రమే విందుకు హాజరయ్యారు.. కేసీఆర్ కు జ్వరం కారణంగా హాజరుకాలేకపోయారు. అప్పుడు కూడా ఇద్దరు సీఎంలు ఒకరినొకరు కలవలేకపోయారు. ఇప్పుడు కూడా మూడోసారి కలిసే ఛాన్స్ వచ్చినా చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి హాజరుకాలేదు.. కేసీఆర్ కూడా హాజరుకాలేదు. అయితే ఈసారి గవర్నర్ విందుకు ఏకంగా ఇద్దరు సీఎంలు డుమ్మా కొట్టారు. అసలు వీరు యాదృశ్చికంగానే కలుసుకునే ఛాన్స్ రావట్లేదా.. లేకపోతే కావాలనే కలుసుకోవట్లేదా అనే సందేహాలు మొదలయ్యాయి అందరిలో.

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

  తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. మహబూబ్ నగర్ జిల్లా తన నియోజక వర్గం కొడంగల్ లో ఉన్న తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయ్యారని.. కాంగ్రెస్ పార్టీ నేత కేవీపీ రామచంద్రరావు డైరెక్షన్ చేస్తుంటే కేసీఆర్ యాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కేవీపీని రోజూ కలుస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అని తిట్టే కేసీఆర్ కు కేవీపీ మాత్రం ఆంధ్రా కాదా.. ఆంధ్రాకు చెందిన కేవీపీతో కేసీఆర్ కు ఉన్న దోస్తీ ఏంటని అన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు కేవీపీని కలవడం నిజం కాదని అంటే తాను ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.   పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతూ కేసీఆర్ కనుక ఈ పాలమూరు ప్రాజెక్టును 2019 లో జరగబోయే ఎన్నికల నాటికి పూర్తి చేసినట్టయితే పాలమూరులో టీడీపీ పోటీచేయదని.. ఒకవేళ పూర్తిచేయలేకపోతే మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు టీడీపీ జెండా మోయడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. బంద్ ల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజలను రెచ్చగొడుతుందని.. బంద్ ల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడానికి వచ్చే అధికార పార్టీ కార్యకర్తలను ఊరుకోవద్దని వారిని చెట్లకు కట్టి వేయాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి డొక్కా గుడ్ బై?

   కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఒకవెలుగు వెలిగిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైకాపాలో చేరబోతున్నారని తాజా సమాచారం. ఆయన తన అనుచరులతో కలిసి సోమవారం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపా కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ వెళ్ళిపోవడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమీ బాగాలేదని దృవీకరించినట్లయింది. ఇప్పుడు డొక్కా కూడా వెళ్ళిపోతే మరో మారు దృవీకరించినట్లవుతుంది. ఆయన తరువాత ఇంకా ఎంతమంది కాంగ్రెస్ నేతలు బయటకి దూకేస్తారో చూడాలి.

కేసీఆర్ ను ఆహ్వానిస్తా.. చంద్రబాబు

  తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తనకు లేదని.. జరగబోయే గోదావరి పుష్కరాలకు కేసీఆర్ ను కూడా ఆహ్వానిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జపాన్ పర్యటన అనంతరం ఆయన నిన్న కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని.. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని.. కేసీఆర్ తో కూర్చొని మాట్లాడటానికి తానెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. నిన్నగాక మొన్న ‘నీకిక్కడేం పని’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారని, హైదరాబాద్ 10 ఏళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు. అయితే గవర్నర్‌ను బదిలీ చేయాలని కోరారా అని ప్రశ్నించగా, అసలు గవర్నర్ విషయం ఎందుకు ప్రస్తావన వస్తుందని ప్రశ్నించారు. సెక్షన్ 8 పై మాట్లాడానని అంతే కాని గవర్నర్ గురించి ఏం మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించి.. పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు.. కానీ ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి.. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని.. రాజధానిని నిర్మించుకోవాలి.. దానికోసం పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది.. ఇవన్నీ జరగాలంటే కొంత సమయం పడుతుంది.. ఇది ఒక్కరివల్ల అయ్యే పనికాదు అందరి సహకారం తీసుకొని వీలైనంత త్వరగా సమస్యల నుండి బయటపడాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కావడంపై దృష్టి కేంద్రీకరించకుండా జఠిలం చేసుకోవడానికి ఒక్క నిమిషం పట్టదు అని అన్నారు. తాను ఏపీ అభివృద్ధికి శాయశక్తుల కృషిచేస్తుంటే కొందరు మాత్రం దానిని అడ్డుపడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

నా ప్రశ్నలకు ఏసీబీ సమాధానం చెప్పలేదు.. సండ్ర

  ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో సండ్రను ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. వైద్య పరీక్షలు నిర్వహించారా అని సండ్రను ప్రశ్నించగా... దానికి తన ఆరోగ్యం బాగానే ఉందని సండ్ర చెప్పారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ఏసీబీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని..తన పైన ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదని చెప్పారు. కాని తాను కొన్ని ప్రశ్నలు ఏసీబీని అడిగానని.. తాను అడిగిన ప్రశ్నలకు ఏసీబీ సమాధానం చెప్పలేదని సండ్ర కోర్టుకు తెలిపారు. టీఆర్ఎస్ లో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అన్ని సీట్లు ఎలా గెలుచుకుందని.. గెలుచుకోవడానికి కారణం ఏంటని అడిగానని దానికి వారు సమాధానం చెప్పలేదని చెప్పారు.

మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్

  ఆప్ పార్టీలోని మరో ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. భూకబ్జా ఛీటింగ్ కేసులో ఎమ్మెల్యే మనోజ్ కుమార్ ని ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అయితే దీనిపై మనోజ్ కుమార్ మాట్లాడుతూ సంవత్సర కాలం కిందటే ఈ కేసు నమోదైందని అప్పుడు పోలీసులు అంతగా పట్టించుకోలేదని కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టే అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వానికి.. భద్రతా వ్యవస్థకు ఉన్న అసఖ్యత కారణంగానే నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. అయితే ఢిల్లీ పోలీసులు మనోజు కుమార్ ను అరెస్ట్ చేసిన వెంటనే గుండెలో నొప్పి, తల నొప్పి అని చెప్పడంతో అతనిని వెంటనే చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు వరుసగా అరెస్ట్ అవడంతో అసలు ఇంకా ఆపార్టీలో ఎవరైనా మిగులుతారా అనే సందేహాలు వస్తున్నాయి అందరికి. ఇప్పటికే ఆప్ పార్టీలోని నాలుగైదుమంది నేతలు ఏదో ఒక వివాదంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంకా ఎంతమంది బయటపడతారో చూడాలి.

హరీష్‌రావు విగ్రహం పెట్టిస్తా.. రేవంత్ రెడ్డి

  ఓటు నోటు కేసులో జైలు నుండి విడుదలైన తరువాత తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ మైకు పట్టారు. తనదైన శైలిలో మళ్లీ ప్రతిపక్షనేతలకు ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు వ్యతిరేకమని మంత్రి హరీష్‌రావు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో ఎక్కడైనా పాలమూరు ఎత్తిపోతలపై చర్చ ఉందా? జూన్‌ 18న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అయినా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంటే ఒక్క పాలమూరు జిల్లా బంద్‌కే ఎందుకు పిలుపునిచ్చారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు అనుమతి కోసం హరీష్‌రావు బలిదానం చేస్తే ఆయన నిలువెత్తు విగ్రహం పెట్టిస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు ప్రాజెక్టు కోసం బంద్‌లు కాదు, పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.