పవన్ కళ్యాణ్ ట్విట్టర్ పోస్ట్.. ఎంపీలకు సూటి ప్రశ్న

  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం మరోసారి ఏపీ ఎంపీలను ఉద్దేశించి ట్విట్టర్ లో ప్రశ్నలు సంధించారు. "ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుకు సవరణ సమయంలో లోక్ సభలో ఎంతమంది ఎంపీలు ఉన్నారని.. నాకున్న సమాచారం ప్రకారం ఐదుగురు ఎంపీలే చర్చలో పాల్గొన్నారు...మిగిలిన ఎంపీలు ఏం చేశారు" అని ప్రశ్నిస్తూ ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే రెండు రోజుల నుండి పవన్ కళ్యాణ్ కు, ఏపీ ఎంపీల మధ్యం కోల్డ్ వార్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఏపీ ప్రత్యేక హోదా పై ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని.. ప్రత్యేక హోదా గురించి ఎందుకు నిలదీయడం లేదని.. ఎంపీలంతా వ్యాపారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. దీంతో ఎంపీలంతా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ గా మీరేం చేస్తున్నారు అంటూ ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలి.

చంద్రబాబు జపాన్ టూర్.. పలు కీలక ఒప్పందాలు

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారన్నది అందరికి తెలిసిన వాస్తవమే. అసలే రాష్టం విడిపోయిన తరువాత ఆర్ధిక పరంగా కొంత లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులను తీసుకురావడానికి చాలా కృషి  చేస్తున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో సింగపూర్ పర్యటన కూడా చేశారు.. అక్కడ ఎంతో మంది ప్రముఖులు.. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలతో సమావేశమయి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్ కూడా తన వంతుగా ఏపీ అభివృద్దిలో పాటుపడటానికి గతంలో అమెరికా వెళ్లి అనేక మందిని ఏపీలో పెట్టు బడులు పెట్టడానికి ఒప్పించారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ఏపీలోకి పెట్టుబడిదారులను తీసుకురావడానికి జపాన్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు జపాన్‌లో పర్యటించిన చంద్రబాబు బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. అనేక ప్రముఖ సంస్థలతో భేటీ అయి ఏపీ లో కూడా పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు.   * జేజీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మసియుకి సటోతో చంద్రబాబు బృందం భేటీ అయి పెట్రో కెమికల్‌ కారిడార్‌లో పెట్టుబడులు పట్టాలని కోరారు. అయితే జేజీసీ కార్పొరేషన్‌ రిఫైనరీ, క్రాకర్‌ యూనిట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలపై  ఆసక్తి కనబర్చింది. * సుమిటొమో, మిత్సుబ్యాకింగ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతోనూ చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఏపీకి వచ్చి విశ్వవిద్యాలయాలతో కలిసి కన్సెల్‌టెన్సీ సంస్థలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. * తోషిబా కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరారు. విద్యుత్‌ నిర్వహణపై తోషిబా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. * జపాన్‌ వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి యొసిజే టకజీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ రాజధాని నిర్మాణంలో పాల్గొంటామని యొసిజే హామీ ఇచ్చారు. * జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. అనంతరం వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్‌ఉత్పత్తిలో పేరొందిన జేఎప్‌ఈ ఏపీలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి కనబర్చింది.     చివరిరోజు కొమమురా సంస్థ ప్రతినిధులను ఏపీ సీఎం చంద్రబాబు కలిసి చర్చించారు. కెమెరాలు, లెన్స్‌లు, ఆప్టిక్స్‌ కంపెనీగా పేరొందిన కొమమురా కంపెనీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చే సుకోవాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. జపాన్ పర్యటనలో ఈ రోజు చివరిరోజు కాబట్టి పర్యటన అనంతరం చంద్రబాబు బృందం ఢిల్లీ బయలుదేరనుంది.

సండ్రకు థర్డ్ డిగ్రీ వద్దు

  ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నా సండ్ర వెంకట వీరయ్యను విచారణ నిమిత్తం ఈరోజు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ అధికారులు సండ్రను రెండు రోజుల పాటు విచారించనున్నారు. అయితే సండ్రను విచారించడానికి ఏసీబీ అధికారులకు కోర్టు కొన్ని సూచనలు చేసింది. సండ్ర ప్రజాప్రతినిధి కాబట్టి అతనికి థర్డ్ డిగ్రీ లాంటివి ఉపయోగించవద్దని.. అతని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపాలని.. అంతేకాక సండ్రకు ఆరోగ్యం బాలేదు కనుకు విచారణ సందర్భంగా ఒక డాక్టర్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. గురువారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు.. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు విచారించవచ్చని.. విచారణ చేస్తున్నప్పుడు వేధింపులకు గురిచేయవద్దని తెలిపింది. కాగా ఈ కేసులో సండ్రకు ముందు నోటీసులు జారీ చేసినా అప్పుడు విచారణలో పాల్గొనలేదు. రెండోసారి సెక్షన్ 41(ఏ) ప్రకారం మళ్లీ సండ్రకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే..

పవన్ కళ్యాణ్ కి అవంతీ బంపర్ ఆఫర్

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు తమ బాధ్యతలు విస్మరించి తమ వ్యాపారాల మీదనే శ్రద్ద పెడుతున్నారని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకి వారు కూడా అంతే ధీటుగా బదులిస్తున్నారు. తెదేపా అనకాపల్లి లోక్ సభ సభ్యుడు అవంతీ శ్రీనివాస్ అయితే పవన్ కళ్యాణ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చేరు. ఒకవేళ పవన్ కళ్యాణ్ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయదలచుకొంటే తను తన లోక్ సభ పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని, కావాలంటే ఆయన అక్కడి నుండి పోటీ చేసి లోక్ సభకు వెళ్లవచ్చునని ఆఫర్ ఇచ్చేరు. మరి పవన్ కళ్యాణ్ ఆయన ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ ని స్వీకరిస్తారో లేదో?

నేడు డిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, మంత్రులు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ దేశ పర్యటన ఈరోజుతో ముగుస్తుంది. అక్కడి నుండి ఆయన నేరుగా డిల్లీ చేరుకొంటారు. ఆయన కొందరు కేంద్రమంత్రులను కలిసి వారితో పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతారు. రాష్ట్ర మంత్రులు అచ్చెం నాయుడు, మాణిక్యాల రావు తదితరులు కూడా ఈరోజు డిల్లీ వెళ్ళబోతున్నట్లు సమాచారం. వారందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రమంత్రులను రాజమండ్రిలో జరగనున్న గోదావరి పుష్కరాలకు రావలసిందిగా ఆహ్వానిస్తారు. మళ్ళీ చాలా రోజుల విరామం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళుతుండటంతో ఆయన డిల్లీ పర్యటనపై సర్వత్రా చాలా ఆసక్తి నెలకొని ఉంది.

ఏపీ ప్రభుత్వం లక్ష టాబ్లెట్ లు.. 100 కోట్లు

* లక్ష టాబ్లెట్ లు.. 100 కోట్లు * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ-మెయిలింగ్ సిస్టమ్ * వారం రోజులపాటు ట్రెయినింగ్ * స్కూళ్లకు కూడా టాబ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత సమర్ధుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఉన్న ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది.. ఐటీ రంగంలో హైదరాబాద్ అంత ముందుండటానికి వెనుక కారణం చంద్రాబాబే. ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా టెక్నాలజీని ఉపయోగించడానికి నడుంకట్టారు. దీనికోసం సుమారు 100 కోట్ల వ్యయంతో లక్ష టాబ్లెట్ లను కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెటింగ్, రెవిన్యూ, ఎక్సైజ్, ఇరిగేషన్, కమర్షియల్ టాక్సెస్, అగ్రికల్చర్ వంటి డిపార్ట్ మెంట్ లకు 32,000 టాబ్లెట్ లను ఇవ్వనుంది. మరో 6,700 టాబ్లెట్ లను ఆడిపార్ట్ మెంట్లలోని సీనియర్ ఉద్యోగులకు ఇవ్వనుంది. అయితే టాబ్లెట్ లు కొనడం దగ్గరనుండి వాటిని అఫీషియల్స్ కు అందజేయడం.. వారికి ఆన్ లైన్ సర్వీసు ప్రొవైడ్ చేయడం వంటి పూర్తి బాధ్యతలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ చూసుకుంటుంది. అయితే ఐటీ డిపార్ట్ మెంట్ 7,8 లేదా 9 అంగుళాలు, అడ్వాన్స్ డ్ ఫిచర్స్ కలిగిన టాబ్లెట్ ను కొనుగోలు చేయనుందని... వీటికి ఇంటర్నెట్ సర్వీసు ఉండటం ద్వారా ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకోవచ్చని ఒక సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. మొదటి విడతలో ప్రతి జిల్లాకు 2,000 టాబ్లెట్ లు ఇస్తామని, రెండో విడతలో భాగంగా ప్రతి మండలానికి 10 నుండి 20 టాబ్లెట్ లు ఇస్తామని అది కూడా కేడర్ ను బట్టి ఇస్తామని తెలిపారు. టాబ్లెట్ ఉపయోగించే విధానం, ఎలా ఆపరేట్ చేయాలి లాంటి డౌట్ లకు ఒక వారం రోజుల పాటు క్లాసులు కూడా నిర్వహిస్తామని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం ఈ-మెయిల్ సిస్టమ్ ద్వారా నడవాలని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. ఈ టాబ్లెట్ లను కేవలం ప్రభుత్వ కార్యలయాలకు మాత్రమే కాదు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు కూడా అందించాలని.. రాష్ట్రంలో మొత్తం 62,000 టాబ్లెట్ లను స్కూళ్లకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

పుష్కరాలకు రాంచరణ్ విమానాలు

    గోదావరి పుష్కరాలు మొదలవుతున్నాయి.. పదిరోజుల పాటు జరిగే ఈ పుష్కరాలలో పాల్గొనడానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అయితే పుష్కరాలేమో కానీ ప్రయాణికులకు మాత్రం ట్రావెలింగ్ లో కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా పుష్కరాలకు వెళ్లడానికి ప్లానింగ్ లో ఉన్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతోనే విమానంలో పుష్కరాలకు వెళ్లే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇంతకీ అంత ఆఫర్ చేసింది ఎవరు అనుకుంటున్నారా.. ట్రూ జెట్ విమాన సంస్ధ. హీరో రాంచరణ్ అంబాసిడర్ గా ఉన్న ట్రూ జెట్ విమాన సంస్ధ గోదావరి పుష్కరాలకు తమ సర్వీసులను అందించనున్నాయి. పుష్కరాల సందర్భంగా అక్కడ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ దృష్ట్యా అతి తక్కువ ఖర్చుకే విమాన సర్వీసులు ఇస్తున్నామని ట్రూ జెట్ విమాన సంస్ధ ఎండీ ఉమేష్ తెలిపారు. ఈ సర్వీసులు ఈ నెల 12వ తేదీ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నుండి రాజమండ్రి వరకు మొదలవుతాయని అన్నారు. అంతేకాక జులై 26వ తేదీ నుండి ఔరంగాబాద్, హుబ్లీ, తిరుపతి నుండి కూడా సర్వీసుల కల్పిస్తామని ఉమేష్ అన్నారు. తక్కువ ధర.. ఎక్కువ మంది ప్రయాణికులతో బిజినెస్ లో ఎదుగుదల సాధించవచ్చని నమ్ముతున్నానని.. వచ్చే మార్చి లోపు మరో పది నగరాలలో విస్తరించాలని.. మెట్రో నగరాలలో ఇప్పటికే విమానాలు రద్దీ బాగానే ఉన్నా ప్రాంతీయ ప్రాంతాల్లో ఇంకా వాటిని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆదిశగా మేము మా సర్వీసులను విస్తరింపచేయడానికి చూస్తున్నామని ఉమేష్ స్పష్టం చేశారు.

ఎవరికి భయపడను.. డీఎస్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రోజు డీఎస్ తెరాస పార్టీలోకి చేరారు. గత వారం క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన డీఎస్ ఈరోజు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ డీఎస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలా పార్టీలోకి చేరారో లేదో అప్పుడే కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ వాదులందరిని ఏకతాటిపై నడిపి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం నిరాహార దీక్ష చేశారు అని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలని.. తెలంగాణ ప్రజలు సోనియా రుణం తీర్చుకోలేరని అన్నారు. తాను పార్టీ వీడుతున్నందుకు చాలా మంది విమర్శిస్తున్నారు.. "అలాంటివి తానేమి పట్టించుకోనని.. ఎవరికి భయపడేది లేదని.. తానేదో పదవులు ఆశించి టీఆర్ఎస్ లోకి రాలేదని.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో తాను కూడా పాటుపడటానికే" అని చెప్పారు. డీఎస్‌తో పాటు ఏవీ సత్యనారాయణ, డి. సురేందర్, ఆర్. సత్యం, బోయినపల్లి కృష్ణమూర్తి, సతీశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు.

రేవంత్ కు అవే సాకులు.. సండ్రకు అవే సాకులు

  రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయకుండా చేయడానికి తెలంగాణ ఏసీబీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిందో మనందరికీ తెలుసు. విచారణ కీలక దశలో ఉందని.. సాక్ష్యులను బెదిరిస్తారని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఏవేవో సాకులు చెప్పి బెయిల్ రాకుండా చేద్దామని విశ్వ ప్రయత్నం చేసింది. కానీ రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చి హైకోర్టు ఏసీబీకి షాకిచ్చింది. ఇప్పుడు సండ్ర విషయంలో కూడా ఏసీబీ అదే చేస్తుంది. ఈరోజు ఈకేసులో నాలుగో నిందితుడైన సండ్ర బెయిల్ విషయంపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. దానిలో ఈ కేసులో సాక్ష్యాలను సండ్ర తారుమారు చేసారని అనుమానంగా ఉందని.. ఆదిశలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారని.. కేసు కీలక దశలో ఉంది కాబట్టి సండ్రకు బెయిల్ ఇవ్వద్దని ఏసీబీ కౌంటర్ లో పేర్కొంది. మొత్తానికి రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయడానికి ఎలాంటి కుంటి సాకులైతే చెప్పిందో అలాంటి కుంటి సాకులనే సండ్రకు చెప్పి బెయిల్ రాకుండా చేయడానికి చూస్తుంది ఏసీబీ. పాపం ఈసారైనా ఏసీబీ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.

హీరో ఇంటిలో ఏనుగుదంతాలు.. ఉద్యమకారుల ఆందోళనలు

  ఏనుగు దంతాలు ఇంటిలో పెట్టుకున్నాడన్న ఆరోపణలతో మళయాల హీరో జయరామ్ కు కష్టాలు ఎదురయ్యాయి. ఆయన మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వన్యప్రాణుల హక్కుల ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. వివరాలు ప్రకారం.. జయరామ్ కు ఒక పెంపుడు ఏనుగు ఉండేది.. అనారోగ్యం కారణంగా అది మరణించడంతో ఏనుగు దంతాలను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. దీనికి అప్పుడు కేరళ అటవీ శాఖ కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ విషయం బయటపడటంతో జయరామ్ కు ఒక న్యాయం, మిగిలిన వారికి మరో న్యాయమా అంటూ వన్య ప్రాణుల హక్కుల ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తం కావడంతో ఈ విషయం లో జోక్యం చేసుకోవాల్సిందిగా కేరళ ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

తలసానికి పోటీగా పవన్ కళ్యాణ్ యోచన?

  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని చెప్పి ఎట్టకేలకూ రెండు రోజుల క్రితం మీడియా ముందు మాట్లాడారు. ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. వీహెచ్ తనను ఎప్పుడు ప్రశ్నిస్తాడు అని విమర్శించిన నేపథ్యంలో దానికి స్పందిస్తూ సరైన కోసం ఎదురుచూస్తున్నానని సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ కల్యాణ్ సనత్ నగర్ నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని వార్తులు జోరుగా సాగుతున్నాయి. అందులోనూ ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా ప్రస్తావించారు. దీంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా టీడీపీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన తలసాని రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. ఒకవేళ తలసాని రాజీనామాను స్పీకర్ ఆమోదించాక ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి తలసాని పోటీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే సనత్ నగర్ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

రాజకీయ నేతల జంపింగ్ జపాంగ్స్

మాన్ సూన్ వచ్చేసింది.. చిన్నగా వర్షాలు కూడా పడుతుండటంతో కప్పలు కూడా ఇక్కడి నుండి అక్కడికి జంప్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ మాన్ సూన్.. కప్పల గొడవేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది ఇప్పుడు ఆ కప్పలనూ చూస్తుంటే మన రాజకీయనాయకులే గుర్తొస్తున్నారు. ఈ పార్టీలో నుండి ఆపార్టీలోకి అంటూ కప్పల కంటే ఫాస్ట్ గా తెగ జంపింగ్ల మీద జంపింగ్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ జంపింగ్ లు మరీ ఎక్కువైపోయాయి. పార్టీ మీద గౌరవం.. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని వెన్నంటి ఉండే నమ్మకమైన నాయకులను బూతద్దంలో వెతికినా ఎక్కడో ఒకరిద్దరు ఉంటారేమో కానీ అలాంటి వాళ్లు ఇప్పుడు దొరకడం కష్టమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి జంపిగ్ రాయుళ్లు ఎక్కువైపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో సమాధానం లేని ప్రశ్న.. అందుకే ఆపార్టీలోనే ఉంటూ గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం కంటే పార్టీ మారితే ఏదో ఒక పదవి కట్టబెడతారుకదా అన్న ఆలోచనతో నాయకులంతా పార్టీ ఫిరాయించే పనిలో పడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బొత్స సత్యనారాయణ, కేకే, డిఎస్ పార్టీ మారిపోయారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే కొంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి. వారిలో గాదె వెంకటరెడ్డి, శైలజానాథ్, ఉండవల్లి అరుణకుమార్, దేవినేని నెహ్రూ, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉన్నట్టు సమాచారం.     గాదె వెకంటరెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేత. ఈయన రాజకీయ ప్రవేశం చేయకముందు న్యాయవాదిగా, వ్యాపారం రంగంలో పనిచేసేవారు. ఒకటి కాదు రెండు కాదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తి గాదె వెంకటరెడ్డి. అలాంటి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వెంకటరెడ్డి కూడా పార్టీ మారే యోచన చేస్తుండటం ఓ రకంగా కాంగ్రెస్ కు జీర్ణించుకోలేని విషయమే.     ప్రభుత్వ వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ శైలజనాథ్‌ 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శింగనమల నుంచి కాంగ్రెస్‌ టికెట్టును దక్కించుకుని విజయం సాధించారు. 2009లోనూ అతికష్టం మీద మూడు వేల మెజార్టీతో బయట పడ్డారు. రెండోసారి విజయం సాధించాక వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్‌ పదవిని దక్కించుకున్నారు. తరువాత వైఎస్ఆర్ చనిపోయిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనకు ప్రాథమిక విద్యాశాఖను కట్టబెట్టారు. మంత్రి పదవితో ఆయన జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్రనే పోషించారు. తరువాత కేంద్రం రాష్ట్ర విభజన చేసిన తరువాత కూడా కాంగ్రెస్ ఉనికి పోయిన ఇన్ని రోజులు ఆపార్టీలోనే ఉన్నారు. పాపం ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటామనుకున్నారేమో పార్టీ మారే యోచనలో ఉన్నారట.       మరో కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వైకాపాలోకి జంప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్ మంచి మాటకారి. ఉండవల్లి 2004, 2009 లో రాజమండ్రి నియోజక వర్గం నుండి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆపార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ట్రాన్స్ లేటర్ గా కూడా పనిచేశారు. అలాంటి మంచి వక్త, వాదనా పటిమ కలిగిన అరుణ్ కుమార్ ను తమ పార్టీలోకి రావడానికి వైకాపా కూడా ఆకట్టుకుంటుందన్నది సమాచారం.   అంతేకాక దేవినేని నెహ్రూ కూడా కాంగ్రెస్ పార్టీను వీడి వైకాపాలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. దేవినేని నెహ్రూ కంకిపాడు నియోజక వర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన బలమైన రాజకీయ నాయకుడు. ఇప్పుడు వైకాపాలోకి నెహ్రూ చేరడం వల్ల కృష్ణా జిల్లాలో  పార్టీ నిర్వహణ సులభం అవుతుందని భావిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు నెహ్రూ రాకను గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మరో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వ్యతిరేకిస్తున్నారు. వీటిని పరిష్కరించుకుంటారా?లేదా? వీరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వస్తారా?లేదా అన్నది తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు.   డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా వైకాపాలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈయన 2004లో తాడికొండ నియాజక వర్గం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత పార్టీ తరపున ఎన్నో పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడ కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేకపోడంతో కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి మారనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమైన నేతలందరూ కట్టకట్టుకొని ఒకేసారి వేరే పార్టీలోకి చేరిపోతున్నారు. అసలే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు కోలుకోలేని దెబ్బగొట్టారు. ఇప్పుడు పార్టీలోని నేతలందరూ వేరే పార్టీలోకి చేరడం వల్ల ఇంకా పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో అసలు భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

వ్యాపంపై సీబీఐ విచారణకు ఓకె!

  మధ్యప్రదేశ్ లో గత 15 సం.లుగా వ్యాపం కుంభకోణంలో అనేకమంది అరెస్టులు, అనుమానస్పద మరణాలు సాగుతున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దానిపై సీబీఐ విచారణకు నిరాకరిస్తూ వచ్చింది. కానీ నానాటికీ ఈ అనుమానస్పద మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో సుప్రీంకోర్టు దీనిపై రేపు విచారణ చేప్పట్టబోతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో సహా ఉత్తరాదిన అనేక ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఎట్టకేలకు ఆయన ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ నిన్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాసారు. ఒకవేళ ఆయన వ్రాసి ఉండక పోతే రేపు సుప్రీంకోర్టే స్వయంగా కేంద్రాన్ని ఆదేశించేదేమో?

నేడు డీ.యస్. తెరాసలో చేరిక

  మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఈరోజు మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి తెరాసలో చేరబోతున్నారు. ఆయన జిల్లా (నిజామాబాద్) కి చెందిన పలువురు జడ్పీటీసీ, యంపీటీసిలు, కార్పొరేటర్లు తడిఅతరులు ఆయనతో కలిసి ఈరోజు మధ్యాహ్నం తెలంగాణా భవన్ లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు. పార్టీ అధిష్టానం తనకు రెండసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే బాధతో కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని త్రెంచుకొని డి.శ్రీనివాస్ తెరాసలోకి వెళుతున్నారు. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినందునే ఆయన తెరాసలో చేరేందుకు సిద్దపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తను ఎటువంటి పదవులు ఆశించి తెరాసలో చేరడం లేదని ఆయన చెపుతున్నారు.

జపాన్ ప్రధానితో బాబు..అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం

  జపాన్ ప్రధాని షింజో అబే తో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.ఎపి కొత్త రాజదాని అమరావతి నిర్మాణానికి జరిగే శంకుస్థాపన ఉత్సవంలో పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రదానిని కోరారు. తిరుమల శ్రీవెంకటేశ్వరుని శేషవస్త్రం, ప్రసాదం, మెమెంటోని చంద్రబాబు ఆయనకు బహుకరించారు.రాజధాని నిర్మాణంలో , పరిశ్రమల స్థాపనలోను ఎపికి సహకరించాలని ఆయనకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాజధాని కి మౌలిక వసతుల ఏర్పాటులో, సాంకేతిక పరిజ్ఞానం అందించడం లో జపాన్ సహకరిస్తుందని ఆ దేశ ప్రధాని హామీ ఇచ్చారు.అమరవాతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని జపాన్‌ ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కూడా ఆహ్వాన లేఖ వస్తుందన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన షింజో అబే వీలు చూసుకుని వస్తానని చంద్రబాబుకు తెలిపారు.