పనిలో చేరతారా? పని పట్టమంటారా?- దిల్లీ హైకోర్టు
posted on Feb 5, 2016 @ 1:44PM
దిల్లీలో పదవ రోజుకి చేరుకున్న నగరపాలక ఉద్యోగుల సమ్మె మీద దిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తి చేసింది. దిల్లీ నగరపాలక ఉద్యోగులు తమకు జీతాలు సరిగా చెల్లించడంలేదంటూ సమ్మెని చేపట్టిన సంగతి తెలిసిందే! దీని వల్ల దేశ రాజధాని కాస్తా చెత్తతో నిండిపోయింది. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త వలన దుర్గంధం మాట అటుంచితే ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఉద్యోగులు కానీ ఒక్క మెట్టు కూడా కిందకి దిగే సూచనలు కనిపించడం లేదు. ఇదంతా కూడా గత ప్రభుత్వాల వల్ల ఏర్పడిన సంక్షోభం అనీ, ఈ సమ్మె వెనుక కేంద్రంలో అధికారం సాగిస్తున్న బీజేపీ ఉందనీ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష బీజేపీ దుమ్మెత్తి పోస్తోంది. కానీ ఈ ఇద్దరి మధ్యా సామాన్య ప్రజలు నలిగిపోతున్నారంటూ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నగరంలో పారిశుధ్యానికి నగరపాలక ఉద్యోగులదే బాధ్యత అనీ, కాబట్టి తక్షణమే విధులలో చేరమని అల్టిమేటం జారీ చేసింది. తమ మాటని పక్కన పెట్టి ఎవరన్నా ఇంకా విధులలో చేరకుండా అలసత్వం వహిస్తే, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. మరి ఉద్యోగులు న్యాయస్థానం మాటైనా వింటారా లేకపోతే చట్టాన్ని సైతం ధిక్కరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే!