ఇంక్రిమెంట్ కోల్పోయిన గవర్నర్ నరసింహన్..
posted on Feb 5, 2016 @ 11:46AM
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇంక్రిమెంట్ కోల్పోయారంట.. అది కూడా తెలుగు చదవడం.. రాయడం రాకపోవడంవల్ల. ఇంతకీ గవర్నర్ ఎంత ఇంక్రిమెంట్ కోల్పోయారా అనుకుంటున్నారా రూ. 240 రూపాయలు. ఆ వివరాలేంటో చూద్దాం.. గవర్నర్ నరసింహన్ ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ల సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు ఇక్కడ పని చేసే సమయంలో తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి అని గతంలో ఏపీపీఎస్సీతో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేశారు. పీఎస్సీ పెట్టే పరీక్షల్లో తెలుగు రాయడం, చదవడం వచ్చా అంటే వచ్చు అని చెప్పానని.. కానీ వారు చదవమంటే చదవలేకపోయా.. ఆ తరువాత ఎలాగో కష్టపడి ఆరు నెలల్లో తెలుగు మాట్లాడటం వచ్చింది.. కానీ ఈలోపు నెలకు 40 రూపాయల ఇంక్రిమెంట్ చొప్పున ఆరు నెలల్లో 240 రూపాయలు నష్టపోయా అని అన్నారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ నవ్వారు.