ప్రభుత్వానికి పన్నులు కట్టవద్దు – ముంబై హైకోర్టు
posted on Feb 4, 2016 @ 2:23PM
ప్రభుత్వ యంత్రాంగంలో పెరిగిపోతున్న అవినీతిని చూసి ముంబై హైకోర్టుకి కూడా ఒళ్లు మండింది. మాతంగ్ అనే కులస్తుల కోసం ప్రభుత్వం కేటాయించిన 385 కోట్లు గల్లంతైన కేసులో న్యాయస్థానం తీవ్రమైన ఈ విమర్శను చేసింది. ‘తాము ఎంతో కష్టపడి పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ము ఎవరెవరో దోచుకుంటుంటే ప్రజలు చూస్తూ ఎందుకు ఊరుకోవాలని’ హైకోర్టు అధికారులని ప్రశ్నించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు సహాయ నిరాకరణని చేపట్టవచ్చనీ, పన్నులు చెల్లించేందుకు తిరస్కరించవచ్చనీ సూచించింది. ఇంతకీ ఈ కుంభకోణంలో నిందితుడు రమేష్ కదమ్ అనే ఒక ప్రజాప్రతినిధే కావడం గమనార్హం. రమేష్ కదమ్‌ను గత ఏడాది అరెస్టు చేసి జైలుకి పంపారన్నమాటే కానీ ఆయనకు అక్కడ సకల సౌకర్యాలూ అందుతున్నాయన్నది సమాచారం. బహుశా ఆ సదుపాయాలన్నీ కూడా ప్రజలు కట్టిన పన్నులతోనే అందుతూ ఉండి ఉంటాయి!