చేతులెత్తేస్తున్న బ్యాంకులు!

సామాన్యుడికి రుణాలు మంజూరు కావాలంటే సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతాయి. రైతులకు రుణమాఫీ చేయాలంటే రిజర్వ్‌ బ్యాంక్‌ చిరాకుపడిపోతుంది. పోనీ ఏదో వారి జాగ్రత్తలో వాళ్లు ఉంటున్నారా అనుకోవడానికి లేదు. డబ్బు ఉన్నవారికి మరింత డబ్బుని అందించేందుకు సిద్ధంగా ఉంటాయి బ్యాంకులు. అవతలి వ్యక్తులు బలవంతులో, మోసగాళ్లో కావడం చేత ఇలా మంజూరు చేసిన రుణాలకు తరచూ నీళ్లు వదిలేసుకుంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకప్పుడు ఇలాంటి రుణాలను కప్పిపుచ్చుకునేవి. కానీ రిజర్వ్‌ బ్యాంక్ ప్రస్తుత గవర్నరు రఘురామ్‌కు ఈ పరిస్థితి ఆందోళన కలిగించింది. బ్యాంకులు తమ రుణాలన నేర్పుగా కప్పిపుచ్చుకోవడానికి వీల్లేదనీ, తిరిగిరాని బకాయిల కోసం తగిన మొత్తాన్ని నష్టంగా చూపించాలనీ గత ఏడాది హెచ్చరికను జారీ చేశారు. దాంతో చాలాబ్యాంకులు తాము వసూలు చేసుకోలేకపోయిన బకాయిలను చూపించక తప్పలేదు. అలా రిజర్వ బ్యాంకుకు అందిన లెక్క మేరకు గత మూడేళ్లలో ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి బకాయిల కింద లక్షకోట్లక పైగా సొమ్మును నష్టపోయాయి. విద్యుత్‌, ఇనుమును ఉత్పత్తి చేసే బడా కంపెనీల వల్లే బ్యాంకులు అధికమొత్తంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు! ఇప్పటివరకూ సదరు బ్యాంకులు ఇచ్చిన రుణాలలో లక్షల కోట్లు విలువ చేసే మరిన్ని రుణాలను కూడా రాబోయే రోజుల్లో మాఫీ చేయాల్సిన పరిస్థితి ఉంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, అలహాబాద్ బ్యాంక్‌, దేనా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ వంటి సంస్థల్లో అయితే ఇచ్చిన రుణాలలో దాదాపు పదో వంతు పనికిరానివిగా తేలిపోతున్నాయి. మరి కఠినమైన చర్యలకు పెట్టింది పేరైన రఘురామ్‌ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యల తీసుకుంటారో చూడాలి!

మరోసారి మేల్కొన్న శివాజీ..

అప్పుడెప్పుడో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సినీ నటుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు శివాజీ హడావుడి చేశారు. ఇప్పుడు మరోసారి మేల్కొన్నట్టున్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని.. మాట తప్పవద్దు..  ఆంధ్రులను ముంచొద్దు.. స్వార్ధ ప్రయోజనాల కోసం ఏపీని తాకట్టు పెట్టొద్దని వ్యాఖ్యానించారు. కేంద్రం కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎన్నికల ప్రతిచోటా బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతా అని హెచ్చరించారు. అంతేకాదు త్వరలో ఒక కేంద్రమంత్రి ఆస్తులపై కోర్టులో పిటిషన్ వేస్తానని కూడా చెప్పారు.

ఏపీలో మరో రచ్చకు రంగం సిద్దం..

ఏపీ రాష్ట్రం రోజుకో దీక్ష, ఉద్యమం అంటూ అట్టుడిపోతుంది. మొన్నటికి మొన్న ముద్రగడ దీక్ష అయిపోయింది. అది అయిపోయిందో లేదో..బీసీ సంఘాల గొడవలు మొదలయ్యాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో దీక్షకు రెడీ అవుతున్నారు మాజీ మంత్రి రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు  బైరెడ్డి రాజశేఖరరెడ్డి. రాయలసీమ చైత్యన్య యాత్ర పేరుతో ఈయన ఈనెల 14వ తేదీన పోరాటానికి సిద్దమయ్యారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. కాగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాయలసీమకు అన్యాయం జరుగుతుందని  ఆప్రాంత నేతలు ఎప్పటినుండో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకోమని.. రాయలసీమను అభివృద్ది చేయాలని.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినా.. రాయలసీమకు మాత్రం స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని పలు డిమాండ్లు చేశారు. దీనిలో భాగంగానే అప్పట్లో మైసురా కూడా ప్రత్యేక రాయలసీమ అంటూ ఉద్యమం చేపడదామని చూశారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాయలసీమ చైత్యన్య యాత్ర పేరుతో పోరాటానికి రెడీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అయరావతి జపం తప్ప వేరే ఆలోచన లేదని.. అభివృద్ధి అంతా అమరావతికి మళ్లిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని.. త్వరలో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతుందని ఆయన అంటున్నారు. మొత్తానికి వరుస దీక్షలు, ఉద్యమాలతో ఏపీ ప్రభుత్వానికి పెద్ద చిక్కులే వచ్చి పడుతున్నాయి. ఉన్న కాస్త సమయం కాస్త వారిని బుజ్జగించడానికే సరిపోతుంది. మరి ఇప్పుడు బైరెడ్డి గారి పోరాటంలో ఏం డిమాండ్లు ఉన్నాయో.. ఆ డిమాండ్లకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

చైనాలో జికా.. డబ్ల్యూహెచ్‌ ఆందోళన..

ఇప్పటికే బ్రెజిల్.. లాటిన్ అమెరికాలను వణికిస్తున్న జికా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు చైనాలో కూడా జికా వైరస్ కేసు ఒకటి నమోదైంది. జియాంగ్జీ ప్రావిన్స్‌లోని గాంగ్జియన్ కౌంటీకి చెందిన వ్యక్తి ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చాడు. అయితే అనంతరం ఆయన అనారోగ్యానికి గురికారవంతో వైద్య పరీక్షలు చేయించుకోగా జికా వైరస్ సోకినట్టు తెలిసింది. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. దీంతో ఇప్పుడు  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతుంది. ఇప్పటికే ఆసియా ఖండంలో  నాలుగు జికా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో ఇంకా విస్తరించే ప్రమాదం ఉందని.. దీనికి అరికట్టాలని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

మాజీ ప్రధాని కన్నుమూత..

నేపాల్ మాజీ ప్రధాని సుశీల్‌కొయిరాలా (79) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున అంటే 12.50 గంటలకు మృతి చెందినట్టు నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌మాన్‌సింగ్ చెప్పారు. గతంలో ఛాతీ క్యాన్సర్‌కు అమెరికాలో విజయవంతంగా చికిత్స చేయించుకున్న కొయిరాలాకు న్యుమోనియా సోకింది. వాతావరణంలో మార్పులతో శ్వాసకోస సంబంధ సమస్య ఏర్పడిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు కబీర్‌నాథ్ యోగి చెప్పారు. దీంతో  ప్రధాని కేపీ శర్మ ఓలీ అధ్యక్షతన జరిగిన నేపాల్ క్యాబినెట్ అత్యవసర సమావేశం మూడురోజులు సంతాపదినాలుగా ప్రకటించింది.

రిజర్వేన్లు వద్దు.. సెల్ టవర్ ఎక్కిన విద్యార్ధి..

ఏపీలో రోజు రోజుకు కులాల రగడ పెరిగిపోతుంది. మొన్నటికి మొన్న ముద్రగడ కాపులను బీసీల్లో కలపాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు. ఏలాగూ ప్రభుత్వం దిగి వచ్చి ఆయన డిమాండ్లలకు ఒప్పుకోవడం పరిస్థితి కాస్త నెమ్మదించింది అనుకున్నారు. అయితే ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలవుతున్నాయి. కాపులను ఎట్టి పరిస్థితిల్లో బీసీల్లో చేర్చడానికి వీల్లేదంటూ బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగా నిన్న మురళీ గౌడ్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. ఇప్పుడు విజయవాడలో కూడా ఒక విద్యార్ధి కులాల ఆధారంగా రిజర్వేన్లు వద్దు అంటూ సెల్ టవర్ ఎక్కాడు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి అంటూ.. అధికారులతో తాను మాట్లాడాలి అంటూ డిమాండ్ చేస్తున్నాడు. దీంతో పోలీసులు అతనిపై కిందకి దించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇంకెన్ని ఆందోళనలు తలెత్తాయో చూడాలి.

కోహినూర్ వజ్రం పాకిస్థాన్ కు చెందినదా..?

అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికి చెందింది అంటే వెంటనే భారతదేశానికి చెందినది అని అంటుంటారు. కానీ ఇది వారి దేశానికి చెందినది అంటున్నాడు ఓ న్యాయవాది. మన పొరుగుదేశమైన పాకిస్థాన్ కు చెందిన జావేద్ ఇక్బాల్ జాఫ్రీ అనే న్యాయవాది.. కోహినూర్ వజ్రం పాకిస్థాన్‌దేనని అంటున్నాడు. దీనిపై పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర లాహోర్ కోర్టులో పిటషన్ కూడా వేశాడు. 'అప్పటి అవిభాజిత పంజాబ్ రాష్ర్టాన్ని పాలించిన మహారాజా రంజిత్‌సింగ్ మనవడు దిలీప్‌సింగ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ తీసుకెళ్లింది. ఇంకా చెప్పాలంటే ఎత్తుకెళ్లింది.. అప్పుడు ఎలాంటి చట్టాలు లేవు.. కాబట్టి న్యాయంగా ఆ వజ్రం పాకిస్థాన్‌కు చెందాల్సిందే' అని తన పిటిషన్లో పేర్కొన్నాడు. కోహినూర్‌పై తాను ఇప్పటివరకు బ్రిటన్ రాణికి, పాకిస్థాన్ ప్రభుత్వానికి 786 లేఖలు రాశానని కూడా పేర్కొన్నారు. మరి మనతో అన్ని విషయాల్లో పోటీ పడే పాకిస్థాన్ ఇప్పుడు కోహినూర్ వజ్రంలో కూడా పోటీ పడుతుంది. మరి దీనికి భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

బంగారం కొనుగోలుకు పాన్ కార్డ్.. బంగారు షాపులు బంద్..

నేడు దేశవ్యాప్తంగా బంగారు షాపుల బంద్ చేపట్టారు. రూ 2.లక్షల జ్యుయెలరీ కొనుగోళ్లకు పాన్ కార్డ్ తప్పనిసరి అని కేంద్రం నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. ఇది జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు కేంద్ర వైఖరికి నిరసనగా జ్యుయెలరీ అసోసియేషన్స్ బంద్ నిర్వహిస్తున్నారు. రూ 2.లక్షల జ్యూయెలరీ నిబంధనను 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు 120 కోట్ల జనాభాలో కేవలం 22 కోట్ల మందికే పాన్ కార్డ్ లు ఉన్నాయని, ఈ నిబంధన వలన 30 శాతం 30 శాతం తగ్గిపోయిన బిజినెస్ తగ్గిపోయిందన అంటున్నారు. కాగా మొత్తం 175 అసోసియేషన్స్ బంద్ లో పాల్గొన్నాయి.

చెంపదెబ్బకు 5 లక్షలు

ఇదేమీ దూకుడు సినిమాలో సన్నివేశం కాదు- చెంపదెబ్బకి ఇచ్చిన రియాక్షన్‌ చూసి బహుమతి ఇచ్చేయడానికి! కానీ బాలీవుడ్‌ నటుడు గోవిందాకి నిజజీవితంలో ఇలాంటి సన్నివేశమే ఎదురైంది. 2008లో గోవిందా ఒక షూటింగ్‌లో పాల్గొంటుండగా, ఆయన కుర్చీ వెనకాల చేరి ఒక అభిమాని గోల చేయడం మొదలుపెట్టాడు. దాంతో చిర్రెత్తుకు వచ్చిన గోవిందా సదరు అభిమాని చెంప మీద ఒక్కటి ఇచ్చాడు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాలలో బిత్తరపోయిన అభిమానులు నెమ్మదిగా పక్కకి తప్పుకుంటారు. కానీ సంతోష్ రాయ్ అనే ఆ అభిమాని మాత్రం ఊరుకోలేదు. గోవిందా తనకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ ముంబై హైకోర్టులో ఒక కేసు దాఖలు చేశాడు. ఆ కోర్టు కేసుని కొట్టవేసినా పట్టు వదలకుండా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు తీర్పు సంతోష్‌కి అనుకూలంగా రావడంతో, గోవిందా ఆ అభిమానికి క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారం కింద మరో 5 లక్షలు కూడా సమర్పించుకోవలసి వచ్చింది.

దృశ్యం సినిమా స్ఫూర్తితో హత్య!

మలయాళం, తెలుగు, తమిళం, కన్నడం, హిందీ... ఇలా అయిదు భాషల్లోనూ విజయం సాధించిన సినిమా దృశ్యం. అయితే ఒక బిహార్‌ యువకుడు తను చేసిన హత్యను కప్పిపుచ్చుకునేందుకు ఇదే సినిమాను ఇప్పుడు వాడుకున్నాడు. కానీ సినిమాకీ, నిజజీవితానికీ కావల్సినంత తేడా ఉంటుంది కాబట్టి పట్టుబడిపోయాడు. వివరాల్లోకి వెళ్తే- బిహార్‌కి చెందిన రజనీష్‌సింగ్‌, తాను ఒక గొప్పింటి బిడ్డనని చెప్పి ‘సృష్టి’ అనే అమ్మాయిని వలలో వేసుకున్నాడు. ఈ విషయం సృష్టికి తెలియడంతో ఆమె రజనీష్‌తో గొడవపడి తన ఊరికి వెళ్లేందుకు బయల్దేరింది. విషయం బయటకి పొక్కితే తన పరువు పోతుందని భావించిన రజనీష్‌ ఆమెను తన పిస్తోలుతో కాల్చి చంపేశాడు. ఆ హత్యను కప్పిపుచ్చుకునేందుకు మక్కీకి మక్కీ ‘దృశ్యం’ సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించుకున్నాడు. తన ఆచూకీ గురించి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు, తన సెల్‌ఫోన్‌ను ఒక ట్రక్కు మీదకి విసిరేశాడు. తన ద్విచక్ర వాహనాన్ని ఒక నదిలోకి వదిలేశాడు. అయితే రజనీష్‌ సినిమాప్లాన్‌ కాస్తా ఫ్లాప్‌ అయ్యింది. ట్రక్కు మీద పడిన ఫోన్‌ అక్కడికక్కడ పగిలిపోవడంతో సిగ్నల్స్‌ అక్కడే ఆగిపోయాయి. సృష్టి ప్రియుడైన రజనీష్‌ని పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో విచారించడంతో, అతను నిజం ఒప్పుకోక తప్పలేదు!

101 పరుగులకే చాప చుట్టేసిన టీం ఇండియా

  ఆస్ట్రేలియాలో ఇరగదీసిన టీం ఇండియా, శ్రీలంకతో టి20 మ్యాచ్ లో ఒక్కసారిగా పిల్లిలా మారిపోయింది. పుణెలో జరుగుతున్న మొదటి టి20 లో, అనుభవం లేని శ్రీలంక కుర్ర బౌలర్లకు వికెట్లు సమర్పించుకున్నారు భారత బ్యాట్స్ మెన్. కేవలం అశ్విన్ మాత్రమే 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతని స్కోర్ తప్పితే, మిగిలిన భారత బ్యాట్స్ మెన్ స్కోర్లు మొబైల్ నెంబర్ ను తలపించాయి. పిచ్ పై పచ్చికను ఎక్కువగా ఉంచి పేసర్లకు స్వర్గధామంలా డిజైన్ చేయడంతో, శ్రీలంక స్వింగ్ బౌలింగ్ ను అడ్డుకుని బ్యాట్స్ మెన్ నిలబడలేకపోయారు. కేవలం 101 పరుగులకే ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. శ్రీలంక బౌలర్లలో రజిత, శానక చెరో మూడు వికెట్లు, చమీర రెండు, సేననాయకే ఒక వికెట్ తీశారు. మరి భారత బౌలర్లు పిచ్ ను ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి..

ఈ చిరుతపులికి కోరలు లేవు కాబట్టి సరిపోయింది!

గత ఆదివారం బెంగళూరులోని ఒక పాఠశాలలోకి ప్రవేశించిన చిరుతపులి ఆ రోజంతా అధికారులకి చెమటలు పట్టించింది. తన దారికి ఎదురువచ్చిన అధికారుల మీదా, పర్యావరణవేత్తల మీదా చిరుతపులి తీవ్రంగా దాడి చేసేందుకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ ఆ చిరుతకు ఒక కన్ను సరిగా కనిపించడం లేదనీ, కోరలు కూడా సరిగా లేవనీ తేలింది. లేకపోతే, చిరుత దాడికి గురైన వారు మృత్యువాత పడక తప్పేది కాదు. బెంగళూరు శివార్లలో ఉన్న మరాఠహళ్లి అనే ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బెంగళూరులో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు పర్యావరణవేత్తలని కలచివేస్తున్నాయి. కేవలం చిరుతలే కాదు… ఏనుగులు, దేవాంగపిల్లులు, జింకలు, అరుదైన పక్షులు తరచూ బెంగళూరు పట్టణంలో ప్రవేశిస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకో, పట్టుకునేందుకు పట్టణవాసులు చేస్తున్న ప్రయత్నంలో తీవ్రంగా గాయపడుతున్నాయి. బెంగళూరు పట్టణం నిదానంగా విస్తరిస్తూ, తన చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆక్రమించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు మేధావులు. బెంగళూరు చుట్టుపక్కల ఉన్న అద్రంగి, ఉజ్జని వంటి అటవీ ప్రాంతాల నుంచి అప్పుడప్పుడూ పొరపాటున పట్టణంలో ప్రవేశిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టణవాసులు మాత్రం ఎప్పటిలాగే అటవీ జంతువులు తమ నివాస ప్రాంతాలలోకి చొచ్చుకువస్తున్నాయని వాపోతున్నారు! ఇంతకీ ఎవరు ఎవరి ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నట్లు?